పలచగా పంట దిట్టంగా దిగుబడి | Thin solid, the yield of the crop | Sakshi
Sakshi News home page

పలచగా పంట దిట్టంగా దిగుబడి

Published Mon, Jun 9 2014 12:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పలచగా పంట దిట్టంగా దిగుబడి - Sakshi

పలచగా పంట దిట్టంగా దిగుబడి

ఎకరానికి 28 క్వింటాళ్ల పత్తి దిగుబడి
 
ఏరువాక పౌర్ణమి వెన్నెల విరబూసినట్లు.. తొలకరికి వానల్లో మట్టి పరిమళం విస్తరించినట్టు.. వానాకాలం ముంగిట నిలిచిన రైతు సోదరులు ఈ ఏటి పంటల సాగు ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు. రైతు సోదరుల ఆశలు, ఆకాంక్షలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఫలవంతమవ్వాలని కోరుకుంటూ.. వినూత్నమైన ప్రత్యామ్నాయ పద్ధతుల్లో.. తక్కువ ఖర్చుతో పత్తి సాగు చేసి.. అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతు శాస్త్రవేత్త పొన్నుస్వామి అనుభవాలను ఈ వారం మీ కోసం..
 
పత్తి తెల్లబంగారం! క్రీస్తు పూర్వం నాటి నుంచే భారతదేశంలో సాగవుతోంది. బ్రిటన్ తన అవసరాల కోసం భారతదేశంలోని  గంగా మైదానం నుంచి దక్షిణాది కావేరి డెల్టా వరకు పత్తి సాగు విస్తరించింది. తెల్ల బంగారాన్ని ఓడలకెత్తి మాంచెస్టర్ నగర పరిశ్రమల వెలుగులకు తళుకులద్దింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు.. నేడు పత్తి దేశంలోనే అతి పెద్ద వాణిజ్య పంటగా విస్తరించింది. ఆదిలో కేవలం ముడిపత్తి మాత్రమే వ్యాపార సరుకు కాగా అనంతర కాలంలో విత్తనం కూడా భారీ వ్యాపార వనరైంది. అయితే, పగి లిన పత్తి కాయలు తెల్లబంగారం ముద్దలను ఆరబోసి నట్లు విరబూసి విరగకాసినా.. సాగు చేస్తున్న రైతన్న లు మాత్రం ఏలిన నాటి శని వెంట తరిమినట్లు గానే బతుకులీడుస్తున్నారు. పత్తి రైతుల ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తలయ్యాయి. కర్ణుడి చావుకు కారణాల మాదిరిగానే అన్నదాత వెన్ను విరగ డానికి కారణాలు అనేకం. రాజకీయ, ఆర్థిక కారణాల ను పక్కనబెట్టి సాగు సంగతులను పరిశీలిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వంటి పలు ప్రాంతాల్లో 10 క్వింటాళ్ల సగటు దిగుబడి కూడా ఘనమనే పరిస్థితి ఉంది. దీనికి భిన్నంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను అనుసరించి, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడ కుండానే ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులున్నారు. మెదక్ జిల్లా ముబారక్‌పూర్ రైతు పొన్నుస్వామి దాదాపు సేంద్రియ పద్ధతిలో గత సంవత్సరం 28 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధించారు. ఆయన అనుసరించిన యాజమాన్య పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు చేస్తున్న రైతు సోదరులకు ఈ వారం అందిస్తున్నాం..

 పంట ఏదైనా దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆశించిన ఫలితం అందుతుంది. పత్తి సాగు చేయాలనుకున్న భూమిని వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. దీని వలన నేలలోని చీడపీడల గుడ్లు, లార్వాలు బహిర్గతమై ఎండ వేడికి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే దుక్కి మెత్తగా దున్నుకోవాలి.

 కంపోస్టు ఎరువుకు పత్తి గింజల నూనె కలపాలి!

బాగా కుళ్లిన (డీకంపోజ్ చేసిన) ఎరువుకు, పత్తి గింజల నూనెను కలిపి వాడుకుంటే పత్తి పంట దిగుబడి చాలా బాగా వస్తున్నది. పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువును డీ కంపోజ్ బ్యాక్టీరియా సహాయంతో కంపోస్టుగా మార్చుకోవాలి. సుమారు 600 కిలోల ఎరువు ఎకరాకు సరిపోతుంది. ఎరువుకు నూనెను కలిపే పద్ధతి: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 170 లీటర్ల నీటిని నింపుకోవాలి. ఇందులో 15 లీటర్ల  నూనెను పోసుకోవాలి. దానికి ఒకటిన్నర లీటర్ల ఎమ ల్సీఫయర్‌ను కలపాలి. నూనె నీటిలో కరిగి కలిసిపోయేలా చేయడానికి ఎమల్సీఫయర్ ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని నేల మీద పరుపుగా పోసుకున్న ఎరువు మీద చల్లుకోవాలి. తొలుత అర అడుగు మందంలో ఎరువు పరుచుకొని, దాని మీద నూనె కలిసిన నీటిని చల్లుకోవాలి. తరువాత ఎరువు మరో పొరగా వేసుకోవాలి. ఈ విధంగా నూనె నీరు ఎరువు అయిపోయే వరకు వరుసలుగా పర్చుకోవాలి. అయితే.. నీరు కేవలం ఎరువును తడిపే విధంగా మాత్రమే చల్లాలి. జారుగా నీరు కారే విధంగా చేయరాదు. పూర్తిగా దిబ్బ కట్టుకున్న ఎరువు మీద ప్లాస్టిక్ కవర్ కప్పాలి. లేదా గడ్డిగాదం కప్పి ఉంచాలి. వారం తరువాత ఈ ఎరువును బస్తాలకు ఎత్తుకోవాలి. మొత్తం 600 కిలోల ఎరువును  50 కిలోల బస్తా చొప్పున 12 బస్తాలకు ఎత్తిపెట్టుకోవాలి. తొలి మోతాదుగా 3 బస్తాల ఎరువును, 25 కిలోల యూరియాను కలిపి గింజ పెట్టే సమయంలో వేసి.. గింజ నాటుకోవాలి. తరువాత విడతల వారీగా.. పాటు చేసే సమయంలో వేసుకోవాలి. ఎరువు వేసే సమయంలో నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క మొలిచి 2 నెలలయ్యే నాటికి మొత్తం ఎరువును అందించాలి.

 కానుగ, సీతాఫలం గింజల
 నూనెల పిచికారీతో పురుగులకు చెక్!


పత్తి పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి. వీటిని అదుపు చేయడానికి లీటరు నీటికి 1.5 మిల్లీ లీటర్ల కానుగ నూనెతోపాటు, అంతే మొత్తం ఎమల్సీఫయర్‌ను కలిపి పిచికారీ చే యాలి. ఇలా చేస్తే రసం పీల్చే పురుగు శక్తి నిర్వీర్యమై.. తరువాత చనిపోతుంది. అయితే, వేడి చేసి తీసే పద్ధతిలో తీసిన నూనె ఇందుకు పనికి రాదు. శీతల విధానం ద్వారా తీసిన నూనెను వాడుకోవాలి. పై పాటుగా మూడు ఆకుల దశలో లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల వేరుశనగ నూనెలో ఒక మిల్లీ లీటర్ చొప్పున ఎమల్సీఫయర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పల్లి నూనె తరువాత పత్తి నూనె, తవుడు నూనెలు వినియోగించుకోవాలి. ఎకరా చేనుకు లీటరుకు మించి నూనెను పిచికారీ చేయరాదు. కాయతొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, పచ్చదోమ, తెల్లదోమలను నిరోధించడానికి సీతాఫలం గింజల నూనెను ఇదే మోతాదులో పిచికారీ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి.  ఈ పద్ధతిలో పత్తి సాగు చేయదలచిన రైతు సోదరులు సూచనలు, సలహాల కోసం పొన్నుస్వామిని 9494982306 నంబరులో (సాయంకాలం 6 గంటల తరువాత మాత్రమే) సంప్రదించవచ్చు.

 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి డెస్క్
 
ఎకరంలో 4,320 మొక్కలు..!
 
నీటిపారుదల వనరు లేదా డ్రిప్పు సౌకర్యం ఉన్న వారు సాళ్ల మధ్య నాలుగున్నర అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగుల దూరం ఉండే విధంగా చాళ్లు తోలుకోవాలి. అచ్చుల వెంట ఏర్పడిన గుర్తుల వద్ద ఒక పత్తి గింజ, మరో పెసర గింజ విత్తుకోవాలి. పెసర విత్తనం కొద్దిపాటి తేమతోనే మొలకెత్తుతుంది. పెసర గింజ మొలకె త్తినప్పుడు నేల గుల్లబారి.. దాని తరువాత మొలిచే పత్తి విత్తనానికి దారిని ఏర్పరుస్తుంది. రైతులు విత్తనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సూటి రకాలైనా, సంకర జాతి రకాలైనా, బీటీ రకాలైనా పర్వాలేదు.ఇక వర్షాధారంగా పత్తి సాగు చేసే రైతులు.. వరుసల మధ్య నాలుగు అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగులు అచ్చు తోలుకొని విత్తనం నాటుకోవాలి. ఈ దూరంతో విత్తిన చేలో ఎకరానికి 4,320 మొక్కలు వస్తాయి. సగటు మొక్క పది అడుగుల వైశాల్యంలో విస్తరించే అవకాశం ఉంది. సగటున మొక్కకు 100 కాయలు, కాయకు 4 గ్రాముల చొప్పున పత్తి దిగుబడి వచ్చినా.. 17 క్వింటాళ్ల పత్తి పంట రైతు చేతికందుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వరుసల మధ్య దూరం 3 అడుగులు, మొక్క మొక్కకు మధ్య దూరం అడుగు చొప్పున పాటించమని సిఫారసు చేస్తున్నారు. దీని ప్రకారం ఎకరానికి 12,445 మొక్కలు పడతాయి. అయినా సగటు దిగుబడి 8 నుంచి 12 క్వింటాళ్లకు మించడం లేదు. మిగతా దిగుబడి ఏమైనట్లు? అని ప్రశ్న వేసుకుంటే దిగుబడి లోటును పూరించుకోవడం ఎలాగో బోధపడుతుంది.

పత్తి మొక్కకు సగటున 100 కాయలు రావాలి. ఒక కాయలో 4 నుంచి 5 గ్రాముల పత్తి వస్తుందనుకున్నా, మొత్తం 12,445 మొక్కలకు 62 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ మన ప్రాంతాల్లో సగటు దిగుబడి 8 నుంచి 12 క్వింటాళ్ల మధ్యనే ఉంది. మరి మిగతా దిగుబడి ఏమైనట్లు? మొక్కల సంఖ్య పెరగడంతో పోషకాలను, నీటిని తీసుకోవడంలో మొక్కల మధ్య పోటీ పెరుగుతుంది. దీని వలన ఎదుగుదల తగ్గుతుంది. మొక్కలు బలహీనంగా ఉండడం వలన చీడపీడల బారిన పడతాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోతుంది. వరుసలు, మొక్కల మధ్య దూరం పెంచడం వలన.. మొక్కల సంఖ్య తగ్గుతుంది. సాళ్ల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగులు ఉన్నప్పుడు 10 అడుగుల విస్తీర్ణంలో ఒక మొక్క ఉంటుంది. దీని వలన ఆ ప్రాంతంలోని పోషకాలను, నీటిని వినియోగించుకొని ఏపుగా ఎదిగి బాగా కాపునకు వస్తాయి. విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. వరుసలు, మొక్కల మధ్య దూరం పెరగడం వలన.. ఒక గింజ చొప్పున పెడితే ఒక ప్యాకెట్, 2 గింజల చొప్పున పెడితే 2 ప్యాకెట్లు సరిపోతాయి. 2 విత్తనాలు నాటుకొని బలంగా పెరిగిన మొక్కను ఉంచి రెండో దాన్ని తీసివేసుకోవచ్చు. ఒకే గింజ వాడడం వలన మొలక రాకపోయినట్లయితే మరోసారి విత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెండు గింజల పద్ధతే రైతుకు మేలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement