పాలు పితుకుతున్న మహిళా రైతు
‘ఇదిగో ఇటు చూడండి.. ఇది మంచి నీళ్ల సీసా. లీటర్ ధర అక్షరాల రూ. 20. ఇదిగో ఇది పాల సీసా.. లీటర్ పాలకు రైతుకు ఇచ్చే ధర రూ. 22, 23. నీళ్ల ధర, పాల సేకరణ ధర ఒకటే అయితే పాడి రైతు బతికేదెలా? ఆ కుటుంబం గడిచేదెలా?‘ అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన.
పాడి ఉన్న ఇంట సిరులు విరజిల్లునంట అనే సామెత పాతబడింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో ఐదోస్థానం. 47 లక్షల పశువులు (ఆవులు, గొర్రెలు, మేకలు), 64.62 లక్షల గేదెలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అంచనా. లక్షలాది మంది రైతులు పాడి పశువుల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం 133 లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో 69 శాతంతో ఆవు పాలు అగ్రస్థానంలో ఉండగా గేదె పాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ధరలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది.
2023 నాటికి పాల ఉత్పత్తి సుమారు 20 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కరవొచ్చినా కాటకం వచ్చినా ఇబ్బంది పడకుండా పాడి కాపాడుతుంది. ఏడాది పొడవునా అంతో ఇంతో ఆదాయం వస్తుందని పెద్దలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబుకు కరవుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది నానుడి. దానికి తగ్గట్టే నాలుగైదు ఏళ్లుగా మృగశిర కార్తె చిందేయడం మానేసింది. ముసలి ఎద్దు రంకె వేయడమూ ఆగింది. కరవు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. మరోపక్క పశువుల దాణా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తవుడు, చిట్టు, చెక్క ధరలు భారీగా పెరిగాయి. పాడి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ స్థాయిలో పాల సేకరణ ధరలు మాత్రం పెరగలేదు.
దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో రైతులు పాడిని వదిలేసుకుంటున్నారు. పశువు పోయాక పాడి బయటపడినట్టుగా– పాలు పోయించుకుంటున్న పాల సంఘాలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. సహకార డైరీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో మూతపడుతున్నాయి. హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలకు ఇది వరంగా మారింది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయి. 2015 మే నెలకు ముందు లీటర్ పాల ఉత్పత్తికి 26 రూపాయలు ఖర్చయ్యేది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధర రూ. 30 దాటి పోయింది. కానీ, పాల సేకరణ ధర మాత్రం రూ. 18 నుంచి 28 మధ్యే ఉంది. పాలలో వచ్చే వెన్న శాతాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. 2015 మే నెలకు ముందు పాల సేకరణ ధర రూ.32, 35 మధ్య ఉండేది. ఉత్పత్తి పెరిగిందన్న సాకుతో ధరను తగ్గించి పాడి రైతుల నోట మట్టికొడుతున్నారు. లీటర్ నీళ్ల ధర రూ.20గా ఉంటే పాల సేకరణ ధర 23, 24 రూపాయలకు మించడం లేదు (గేదె పాల ధర రూ.28 నుంచి 34 మధ్య ఉంటుంది).
అంతర్జాతీయ మార్కెట్‌లో మిగులు పేరిట పెద్ద కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. విధాన నిర్ణేతల లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, సన్నకారు పాడి రైతులు బడా కార్పొరేట్ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరాల్సి వస్తోంది. వ్యవసాయ సంక్షోభం, తీవ్ర కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ఆసరా ఉంటుందని పాడి పశువుల్ని పెట్టుకుంటే ఇప్పుడు వాటినీ పోషించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాల ఉత్పత్తికి వెన్నుముకగా ఉన్న చిన్న రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా పాడి రైతుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. పాల సేకరణ ధర పెంచడమో, లీటర్‌కు ఇంతని బోనస్ ఇవ్వడమో చేయాలి. పాడి రైతుల కష్టాలకు చలించిన చాలా రాష్ట్రాలు లీటర్‌కు నాలుగైదు రూపాయల బోనస్‌ను ప్రకటించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ.4, కర్ణాటకలో రూ.5, మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.5 ల బోనస్ ఇస్తోంది.
కర్ణాటకలో రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల సహకార పాల సంఘాలు చాలా బలీయంగా తయారయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాడి రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే ప్రతి రైతుకూ లీటర్‌కు 4 రూపాయల బోనస్ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 60, 65 లక్షల మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది. జగన్ ఇచ్చే బోనస్‌తో కలుపుకుని పాల సేకరణ ధర లీటర్‌కు రూ. 30 దాటుతుంది. చంద్రబాబు హయాంలో మూతపడిన చిత్తూరు, ప్రకాశం, విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్ డైరీ వంటి వాటినన్నింటినీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల పాడి రైతులు సంబరపడుతున్నారు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా పాల డైరీలన్నింటినీ సహకార రంగంలోకి తీసుకువస్తానని భరోసా ఇస్తున్నారు. డైరీలను సహకార రంగంలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు చచ్చినట్టు ప్రై వేటు డైరీలు కూడా పాల సేకరణ ధర పెంచకతప్పదు. సకాలంలో డబ్బులు ఇస్తాయి. విశ్వసనీయతా పెరుగుతుంది. పాల సంఘాలను కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో నడపగలిగితే ప్రైవేటు డైరీల ఆగడాలకు ముగుతాడు వేయడమే కాకుండా అటు పాడి రైతులకు ఇటు వినియోగదారులకు మేలు చేసినట్టవుతుంది. ఆ పని చేస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల రాష్ట్ర పాడి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.
– ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment