Disease control
-
లాక్డౌన్లో మనసులను కదిలించిన మంచితనాలు!
కత్తులు దూసే ద్వేషాన్నైనా భరించవచ్చు. కళ్లు తుడిచే ప్రేమను తట్టుకోవడం కష్టం. లాక్డౌన్.. మనిషి మీద మనిషి కి ఎంత ప్రేమ ఉంటుందో చూపించింది. ఆకలి తీర్చిన ప్రేమ. అడగకనే అన్నీ అమర్చిన ప్రేమ. ఊరికి చేర్చిన ప్రేమ. ఊపిరి పోసిన ప్రేమ! కళ్లు చెమరుస్తాయి ఇప్పటికీ.. లాక్డౌన్లో పరిమళించిన మానవత్వాన్ని గుర్తు చేసుకుంటే! నేటితో సరిగ్గా ఏడాది తొలిసారి మనం ‘లాక్డౌన్’ అనే మాటను విని!! 2020 మార్చి 25 నుంచి మే 31 వరకు 68 రోజుల పాటు నాలుగు విడతలుగా కొనసాగింపుల లాక్డౌన్. మళ్లొకసారి దేశంలోని 138 కోట్ల మంది జనాభా.. తలుపుల వెనక్కు వెళ్లవలసిన ‘వేవ్’ కనిపిస్తోంది! ఈ సందర్భంగా గత లాక్డౌన్లో మనసులను కదిలించిన కొన్ని మంచితనాలు ఇవి. వీటిల్లో కొన్ని మిమ్మల్ని కడుపారా ఏడిపించవచ్చు. కళ్లు తుడుచుకుంటే ఆ గుండె భారం అన్‌లాక్ అవొచ్చు. క్యాట్ మ్యాన్ ప్రకాశ్.. కొచ్చిలో ఉంటారు. ఆయన పంచ ప్రాణాల్లో మూడు ప్రాణాలు పిల్లులే! వాటిల్లో రెండు ఎప్పుడూ ఆయన్ని అంటుకునే ఉంటాయి. లాక్డౌన్లో వాటికి ఫుడ్డు కరువైంది. ప్రకాశ్ తను తింటున్నదే పిల్లులకూ పెట్టొచ్చు. అయితే ఆయన ఫుడ్డు వాటికి నచ్చడం లేదు. ప్రకాశ్ వెజిటేరియన్. లాక్డౌన్ లేనప్పుడు వాటి కోసం బయటికి వెళ్లి నాన్‌వెజ్ బిస్కెట్లు కొని తెచ్చేవాడు. లాక్డౌన్లో అలా కుదరడం లేదు. బయటికొస్తే.. పోలీసులు తరిమికొడుతున్నారు. ఏమిటీ దారుణం అని కోర్టుకెక్కాడు ప్రకాశ్. ఆ కథ విని కేరళ హైకోర్టు.. అతడికి లాక్డౌన్ పాస్ ఇప్పించింది. ఇంటికి రా మమ్మీ బెలగావిలోని ‘బెలగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ కోవిడ్ వార్డులో సేవలు అందిస్తున్న సుగంధ అనే నర్సు పదిహేను రోజులుగా ఇంటికే వెళ్లలేదు. ‘నువ్వు రాకపోతే, నేనే వస్తా’ అని తండ్రిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చేసింది సుగంధ కూతురు ఐశ్వర్య. తల్లీ కూతుళ్లు దూరం నుంచే చూసుకున్నారు. ‘ప్లీజ్ ఇంటికి రా మమ్మీ..’ అని కూతురు ఏడుస్తూ అడుగుతుంటే, సుగంధ తనూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. టీవీలో వీళ్లను చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కళ్లు కూడా చెమ్మగిల్లాయి. వెంటనే సుగంధకు ఫోన్ చేశారు. ధన్యవాదాలు తెలిపారు. స్వీట్‌బాక్స్‌తో వచ్చారు! లక్నోలో 83 ఏళ్ల ఆర్.సి.కేశ్వరి అనే పెద్దాయన కొడుకు, కోడలు యు.ఎస్.లో ఉంటున్నారు. భార్య లేరు. షుగర్ ప్రాబ్లమ్ ఒక్కటే ఆయనతో ఉంటోంది! ఉంటోంది కానీ, తరచు పడిపోతూ ఉంటుంది. లాక్డౌన్లో ఓ రోజు అలాగే హటాత్తుగా పడిపోయింది. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయిన ఆ ‘క్రిమికాలం’లో.. చాక్లెట్ కోసమో, ఇంత చక్కెర కోసమో ఆయన వెళ్లి ఎవరి తలుపు తట్టగలరు? వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పారు. వెనువెంటనే పోలీసులు వచ్చి ఆయన చేతిలో స్వీట్‌బాక్స్ పెట్టారు! చిన్న ముక్క తినిపించారు కూడా. కాపాడి ఫైన్ వేశారు లాక్డౌన్లో పాపం ఒక హైదరాబాద్ గృహస్తుడు గోధుమ పిండి కోసం బయటికి వచ్చి బుక్ అయిపోయాడు. సేమ్ ఇలాగే ఒక పాశ్చాత్య ధూమపాన ప్రియుడు సిగరెట్ల కోసం ఫ్రాన్స్ నుంచి స్పెయిన్‌కి కాలినడకన బయల్దేరి, ఒక కందకంలో చిక్కుకుని.. సరిహద్దు పిరనీస్ ప్రాంతంలో గగనతలంపై హెలీకాప్టర్‌లో గస్తీ కాస్తున్న ఫ్రెంచ్ మౌంటేన్ పోలీసుల కంటపడ్డాడు. వెంటనే వాళ్లు కిందికి దిగి, కందకం నుంచి ఆ వ్యక్తిని తాళ్లతో పైకి లాగి ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందుకు 11 వేల రూపాయల (మన కరెన్సీలో) జరిమానా కూడా విధించారు. దేవుళ్ల టీమ్ ఆçసుపత్రు లలో పరీక్షలు జరుగుతాయి కానీ, ఆసుపత్రులకే పెద్ద పరీక్షగా మారింది కరోనా. ఒక ప్రాణాన్ని ఒడ్డున పడేయడానికి ఒక టీమ్ మొత్తం మునకలేస్తోంది. యు.ఎస్.లోని రొనాల్డ్ రీగన్ మెడికల్ సెంటర్లోనైతే.. పేషెంట్‌కి నయమై వీడ్కోలు చెబుతున్న ప్రతిసారీ ‘ఎక్స్‌ట్యూబేషన్’ డాన్స్ వేస్తున్నారు వైద్య సిబ్బంది. ఎక్స్‌ట్యూబేషన్ అంటే వెంటిలేటర్‌ను తొలగించడం. బొమ్మను చేసి ప్రాణం పోశాక తన సృష్టిని చూసుకున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందో తెలీదు. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టాక వీళ్లు చేస్తున్న డాన్స్ చూస్తుంటే మాత్రం దేవుళ్లు డాన్స్ చేస్తున్నట్లే అనిపిస్తోంది! రైలొచ్చి పాలిచ్చింది! ముంబైలో ఉంటున్న రేణు కుమారి లాక్డౌన్లో ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ‘‘మోదీజీ.. నా మూడున్నరేళ్ల కుమారుడికి ‘ఆటిజం’ ఉంది. ఒంటె పాలు మాత్రమే సరిపడుతున్నాయి. రాజస్థాన్‌లోని సద్రి నుంచి ఒంటె పాలను కానీ, ఒంటె పాలపిండి గానీ నా చిన్నారి కోసం తెప్పించగలరు’’ అని విన్నవించుకున్నారు. అంతే.. ఆ మర్నాటికి 20 లీటర్ల ఒంటె పాల క్యాన్ ఆమె చేతికి అందింది! ఆ ట్వీట్ గురించి తెలిసిన నార్త్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు సద్రీ నుంచి గూడ్స్ రైల్లో ఒంటెపాలను తెప్పించి ముంౖ»ñ లోని రేణు కుమారి ఇంటికి చేర్చారు! ఇక ఆ తల్లి ఆనందానికి హద్దు ఉంటుందా? పోలీస్ సాంగ్ పంజాబ్‌లోని మన్సాలో ఏడాది వయసున్న ఓ చిన్నారి బర్త్ డేకి పోలీసులు కేక్ తెచ్చివ్వడమే కాకుండా ఆ పాపకు బర్త్ డే సాంగ్ పాడి మరీ వెళ్లడం ఇప్పుడొక ముచ్చటైన సంగతిగా లాక్డౌన్లో దేశమంతా చెప్పుకుంది. లాక్డౌన్లో బయటికి రావడానికి లేదు. ఈలోపు బేబీ బర్త్ డే వచ్చేసింది. ఆ మురిపెం ఎలా తీర్చుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఏమైతే అదైందని.. పోలీసులకు ఫోన్ చేసి సమస్యను చెప్పుకున్నారు. పోలీసులు కూడా వెంటనే స్పందించారు. అమ్మ కోసం దొంగతనం కేసులో దోషిగా రుజువైన ఒక బాలుడికి బియ్యం, పప్పులు ఉప్పులు, కొత్త బట్టలు, ఇతర నిత్యావసర వస్తువు లు ఇవ్వాలని బిహార్ లోని నలంద కోర్టు జడ్జి ప్రభుత్వాన్ని ఆదేశించారు! ‘‘ఆ బాలుడు మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండేందుకు అతడికి ఒక అవకాశం ఇస్తున్నాను’’ అని తీర్పు ఇస్తున్న సందర్భంగా జడ్జి గారు అన్నారు. జబ్బున పడిన తన తల్లి కోసం లాక్డౌన్లో తినడానికి ఏమీ దొరక్క ఆ బాలుడు దొంగతనం చేశాడు. పక్కపక్క వార్డులు తల్లికి కరోనా పాజిటివ్. ఆమె జన్మనిచ్చిన బిడ్డకు కరోనా నెగటివ్. ఇద్దర్నీ వేర్వేరు వార్డుల్లో ఉంచారు. బిడ్డను తాకడానికి, కనీసం చూసుకోడానికి లేదు. ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రిలో(మహారాష్ట్ర) ఆమెకు సిజేరియన్ జరిగింది. స్పృహలోకి రాగానే బిడ్డను చూపించమని బతిమాలింది. ‘‘ఇప్పుడొద్దమ్మా..’’ అన్నారు. వైద్యులకూ చూపించాలనే ఉంది కానీ, కరోనా వార్డులోకి బిడ్డను తీసుకెళ్లడం, కరోనా వార్డు నుంచి తల్లి రావడం రెండూ ప్రమాదమే అని నచ్చజెప్పారు. వాట్సాప్ వీడియోలో చూపించారు. అలసి సొలసి ఇద్దరు యంగ్ అండ్ ఎనర్జిటిక్ పోలీసులు లాక్డౌన్ డ్యూటీ చేశారు. చేశారు. చేశారు. చేశారు. అలసిపోయి నిద్రకు వాలిపోయారు. ఉల్లంఘనకారుల నుంచి సీజ్ చేసిన టూవీలర్ బండ్ల వరుసల మధ్య ఖాళీ స్థలంలో ఉంటే అక్కడే.. గుండెలపై చేతులు వేసుకుని.. కొన్ని గంటలపాటు గాఢంగా నిద్రపోయారు. ఆ ఫోటోను అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాధుర్ వర్మ షేర్ చేశారు. ‘ఈ కరోనా వారియర్లను చూసి డిపార్ట్మెంట్ గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు. గౌరవ వందనం యు.ఎ.ఇ.లో కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న డాక్టర్ ఆయేషా లాక్డౌన్లో ఓరోజు డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి వెళుతున్నారు. ఆమెను ఆపిన పోలీస్ అధికారి.. ఆమె ఐడీ కార్డు తీసి చూపించబోయేంతలోనే డాక్టరుగా గుర్తుపట్టి ఆమెకు సెల్యూట్ చేయడం, ‘దయచేసి వెళ్లండి’ అని దారి ఇవ్వడం ఆయేషాను ఆశ్చర్యపడేలా చేసింది. ఆ.. గౌరవ వందనానికి తనకు కన్నీళ్లొచ్చినట్లు ఆమె తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. చేపలకు చూపులు ప్లీజ్! టోక్యోలోని సువిధ అక్వేరియంలో సందర్శకులను కళ్లలో కళ్లు పెట్టి చూసే అలవాటున్న ఈల్ చేపలకు లాక్‌డౌన్‌తో మనుషుల చూపులే కరువయ్యాయి. నిస్పృహలోకి వెళ్లిపోయాయి. పనివాళ్ల అలికిడి వినిపిస్తున్నప్పటికీ.. పాత ముఖాలే కదా అన్నట్లు తలెత్తి చూడకుండా నీళ్లలోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆక్వేరియం నిర్వాహకులు ‘దయచేసి మా ఈల్ చేపలతో వీడియో–చాట్ చేయండి’ అని ప్రజలకు విజ్ఞప్తులు పంపవలసి వచ్చింది. పిల్లిమాతల్లి టర్కీ పట్టణం ఇస్తాంబుల్‌లో లాక్డౌన్ సమయంలో ఒక పిల్లి.. అనారోగ్యంతో ఉన్న తన పిల్లను నేరుగా ఆసుపత్రిలోకి తీసుకెళ్లింది! వైద్యులు వెంటనే ఉరుకులు పరుగుల మీద పిల్లి పిల్లను వైద్యం కోసం లోపలకి తీసుకెళ్లారు. పిల్లి మాత బయటే ఉండిపోయి.. మనుషుల మధ్య మనిషిలా.. లోపల ఉన్న తన పిల్ల కోసం తచ్చాడుతూ ఉంది. ఆ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పిల్లి కొన్నాళ్ల క్రితమే ఆ ఆసుపత్రి సమీపంలో పిల్లల్ని పెట్టిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు జీవితం ఎంత అందమైనది అనిపిస్తుంది. వధువు వైపు వధువుకు తల్లిదండ్రులు లేరు. లాక్డౌన్లో ఆమె బంధువులెవరూ రాలేదు. వరుడు, అతడి తల్లిదండ్రులు, కొందరు బంధువులు ఉన్నారు. ‘అమ్మాయి వైపు అయినవారు ఒక్కరైనా లేకుండా ఎలా!’ అనే ప్రశ్న వచ్చింది. ‘అయినవారు ఎందుకు లేరూ.. మేమున్నాం’ అని పోలీసులు వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు. ‘సంతోషంగా ఉండు తల్లీ’ అని అమ్మాయిని దీవించారు. పోలీసుల్లాంటి అన్నయ్యలు ఉంటే ఏ వధువు మాత్రం సంతోషంగా ఉండదు? ప్రాణానికి ప్రాణం జహీద్ అబ్దుల్ మజీద్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. పరిస్థితి విషమించిన ఒక కోవిడ్ పేషంట్ని అంబులెన్స్‌లోంచి దించి ఐసీయులోకి తరలించే ప్రయత్నంలో ఆయన ఏమాత్రం సంకోచించక తన ముఖానికి ఉన్న సేఫ్టీ గేర్ ని తొలగించుకున్నారు! అంబులెన్సులో తగినంత వెలుతురు లేకపోవడంతో తన ముఖానికి ఉన్న సేఫ్టీ గేర్ ని తొలగించుకుని ఆ పేషంట్ ట్యూబ్ ని సరిచేశారు. పేషంట్ ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ డాక్టర్ని చూసి ఎయిమ్స్ గర్వపడింది. దేశం అభినందించింది. చెప్పలేక చెప్పలేక ఉబర్ కంపెనీ లాక్డౌన్లో ఒకే రోజు 3500 మంది ఉద్యోగులను తొలగించింది. జూమ్ వీడియో లోకి వచ్చిన ఆ కంపెనీ కస్టమర్ సర్వీస్ హెడ్ రాఫీన్ షెవల్యూ.. మూడే మూడు నిముషాలలో విషయాన్ని చెప్పేశారు. అది కూడా.. ‘ఉబర్ తో ఇది మీ ఆఖరి పని దినం’ అనే ఒకే ఒక మాటను చెప్పటానికి సిద్ధపడటం కోసం ఆమెకు పట్టిన సమయం అది. ఆ వెంటనే ఆమె కంటతడి పెట్టుకుని.. ‘ఎవరూ కూడా ఇలాంటి ఒక ప్రకటన చేయాలని కోరుకోరు’ అని కళ్లు తుడుచుకున్నారు. తిండి కలవాడు వలస కార్మికుడు ఆ యువకుడు (23). రాజస్థాన్ నుంచి సొంత రాష్ట్రం బిహార్ వచ్చాడు. బక్సర్‌లో అతడిని క్వారెంటైన్లో ఉంచారు. రోజుకు 40 చపాతీలు, 8 నుంచి 20 ప్లేట్ల అన్నం తింటున్నాడు. అది చూసిన వంట మనిషి ‘నా వల్ల కాదు. నేను అలసిపోతున్నాను’ అని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ‘తప్పు. అలా అనకు. అతడు ఎంత అడిగితే అంతా పెట్టాలి. లేదు, అయిపోయింది అనే మాటలు రానివ్వకు. అతడు నొచ్చుకుంటాడు. తింటున్న వాళ్లను అర్ధాకలితో మాడ్చకూడదు’ అని, కుక్ భుజం తట్టి పంపించారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ.కె.సింగ్. లోకల్ ట్రైన్ కోవిడ్ హీరోలు నర్సులు, డాక్టర్లు మాత్రమే కాదు. సోనూ సూద్ కూడా. వేల మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో వాళ్ల వాళ్ల ఊళ్లకు చేర్చిన సోనూ కూడా ఇరవై ఏళ్ల క్రితం పంజాబ్ నుంచి ముంబై వచ్చినప్పుడు పాస్ తీసుకుని లోకల్ ట్రైన్లలో తిరిగిన వాడే. అప్పుడు ఆయన తీసుకున్న 420 రూపాయల నెలవారీ పాస్‌ను సంపాదించి, దాచిపెట్టుకుని ఉన్న ఆయన అభిమాని ఒకరు ఆ పాస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘కష్టాలు పడిన వాళ్లకే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. అందుకు సోనూ స్పందిస్తూ ‘లైఫ్ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్’ అని రీట్వీట్ చేశారు. జీవితం కలిమి లేముల వలయం అని. -
జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
మెదక్‌జోన్: వ్యాధుల నివారణ కోసం ప్రతివ్యక్తి మాత్రలను తప్పని సరిగా వేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో మంగళవారం నులిపురుగుల, పైలేరియా మాత్రలను కలెక్టర్ చేతుల మీదుగా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకు తెలియకుండానే నట్టలు( నులిపురుగులు) మన శరీరంలోకి ప్రవేశించి మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వివరించారు. దీంతో మనం తీసుకునే ఆహారాన్ని పురుగులు తినేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ పురుగుల సంఖ్య అధికమైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అలాగే బోదకాలు వ్యాధి బారిన పడకుండా డీఈసీ మాత్రలను సైతం వేసుకోవాలని ఈ మాత్రలను ప్రతి మనిషికి ఇచ్చే విధంగా సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారుల సూచన మేరకు ఈ మాత్రలను ప్రతివ్యక్తి వేసుకోవాలని లేనిచో మైక్రోఫైలేరియా మనశరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం బారిన పడతామన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మరుగుదొడ్లను వినియోగించడంతోపాటు ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. 50 శాతం వ్యాధులు మనం సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకపోవటంతోనే వస్తాయన్నారు. భోజనం చేసే ముందు, మలవిసర్జన చేసిన తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే అనేక వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని వాటి నివారణకోసం తగుజాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏడాదికి రెండు సార్లు వేసే నులిపురుగు నివారణ మాత్రలు తప్పని సరిగా పిల్లలు, యువకులు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీరాములు, ఇర్షాద్, అనిల్, కుమారస్వామి, పాండురంగాచారి, చందర్, మణికంఠ ఆరోగ్యకార్యకర్తలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్‌పై పోరాటానికి ప్రొటీన్ సిద్ధమైంది
దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే కేన్సర్‌కు చికిత్స కల్పించాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఒక ప్రొటీన్‌ను కృత్రిమంగా సిద్ధం చేశారు. రోగ నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఇంటర్‌ల్యూకిన్ –2 (ఐఎల్–2) కేన్సర్‌తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ వంటి అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులకు చికిత్స కల్పించగలదు. అయితే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్ డిజైన్ విభాగం కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఐఎల్–2 ను పోలిన కృత్రిమ ప్రొటీన్‌ను డిజైన్ చేశారు. జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ కృత్రిమ ప్రొటీన్ కేన్సర్ కణాలపై దాడి చేయగల టీ– కణాలను చైతన్యవంతం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. నియో –2/15 అని పిలిచే ఈ కృత్రిమ ప్రొటీన్ ఇంటర్‌ల్యూకిన్ –15 ప్రొటీన్‌లా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దాదాపు 30 ఏళ్లుగా ఐఎల్–2ను సురక్షితంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నియో –2/15 ద్వారా ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేయిన్ అడ్రియానో సిల్వా తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే నియో –2/15 ద్వారా కేన్సర్‌కు మరింత మెరుగైన, దుష్ప్రభావాలు ఏవీ లేని చికిత్స అందుతుందని అంచనా -
కేరళకు ‘నిపా’ దెబ్బ
కొజికోడ్: నిపా అనే అరుదైన వైరస్ కారణంగా కేరళలోని కొజికోడ్ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్‌లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు. కేరళలో హై అలర్ట్.. నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్కు పంపారు. గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది 1998లో తొలిసారి.. నిపా వైరస్‌ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నాడియాలోనూ నిపా వైరస్ కనిపించింది. కేరళలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. లక్షణాలు ఇవీ: నిపా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి. గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రాష్ట్రంలో మళ్లీ క్షయ కాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్ల క్రితమే అంతరించిందనుకున్న క్షయ (ట్యుబర్కులోసిస్) మళ్లీ విజృంభిస్తోంది. ఏటా ప్రతి లక్ష మందిలో 119 మంది టీబీ బారినపడుతుండగా ప్రతి సంవత్సరం దాదాపు 2,500 మంది మరణిస్తున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 45,315 మందికి ఈ వ్యాధి సోకింది. క్షయ రోగులలో ఎక్కువ మంది పేదలే ఉంటున్నారు. రోగులను గుర్తించకపోవడం వల్లే వ్యాధి నియంత్రణ సాధ్యం కావడంలేదు. క్షయ నియంత్రణ కోసం ఏటా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు. క్షయ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తప్పుబట్టింది. 2016లో దాదాపు 34,800 కేసులను రాష్ట్ర యంత్రాంగం నమోదు చేయలేదని నిర్ధారించింది. 1,376 క్లినిక్‌లు, 1,613 ఆస్పత్రులు, 437 పరీక్ష కేంద్రాలు కలిపి రాష్ట్రంలో 3,426 ప్రైవేటు వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఏ నిర్ధారించిన టీబీ కేసులలో ఒక్క దానిని సైతం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయలేదని విమర్శించింది. ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టీబీ నివారణపై కేంద్రం ఆదేశాలు... - క్షయ రోగులు వ్యాధి తగ్గే వరకు కచ్చితంగా మందులు వేసుకునేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా క్షయ బారిన పడుతున్న వారికి మెరుగైన మందులివ్వాలి. - గిరిజన ప్రాంతాల్లోని క్షయ బాధితులకు ఔషధాలతోపాటు చికిత్స పొందుతున్న రోజుల్లో నెలకు రూ. 750 చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. - క్షయ నివారణ చర్యల్లో చురుగ్గా పనిచేసే సిబ్బందికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకం అందించాలి. అలాగే రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా ప్రోత్సహించే సిబ్బందికి రూ. 1,500 చొప్పున, వ్యాధి తిరగబెట్టిన రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా చూసే సిబ్బందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకం అందించాలి. - రోగులను గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రికి రూ. 100 చొప్పున, ఆ రోగికి చికిత్స అందిస్తే రూ. 500 చొప్పున ఇచ్చే నగదు పురస్కారంపై అందరికీ అవగాహన కల్పించాలి. - జాతీయ క్షయ నివారణ సంస్థలో ఖాళీగా ఉన్న 17 రాష్ట్రస్థాయి పోస్టులను, జిల్లాల స్థాయిలో ఖాళీగా ఉన్న 222 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -
చికున్‌గున్యా జన్యురూపం గుర్తింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిని వణికిస్తున్న చికున్ గున్యా వైరస్ జన్యురూపాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. 2006లో విజృంభించిన ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ వైరస్సే ఇప్పుడూ పీడిస్తోందని తేల్చారు. ఈ సీజన్లో ఢిల్లీలో ఇప్పటిదాకా 3,700 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వైరస్‌ను గుర్తించి, నివేదికను జాతీయ సంక్రమిత వ్యాధుల నియంత్రణ పథకం వారికి పంపామని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఆసియన్, వెస్ట్ ఆఫ్రికన్, ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ అని మూడు జన్యురూపాల్లో ఉంటుంది. -
బొప్పాయి.. డెంగీకి బైబై...
వ్యాధి నియంత్రణకు మార్గమంటున్న డాక్టర్లు * నగరంలో పెరిగిన పండ్ల అమ్మకాలు * మూడింతలు పెరిగిన ధర సాక్షి, ముంబై: డెంగీ నియంత్రణకు బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతోందని డాక్టర్లు చెబుతుండటంతో దానికి నగరంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డెంగీ కారక దోమల ఉధృతితో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగీకి ప్రత్యేకించి ఔషధాలు ఏమీ లేవని, జ్వరాన్ని నియంత్రించడమొకటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. అయితే బొప్పాయి పండు రసం సేవించడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (ఏపీఎంసీ)లో గత కొన్ని వారాలుగా బొప్పాయికి విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ పండ్ల వ్యాపారి మాట్లాడుతూ.. డెంగీ నియంత్రణకు ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్న కారణంగా బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇటీవల రెండు నెలల కిందట ఈ పండ్ల అమ్మకాలు సాధారణస్థాయిలో ఉన్నాయని, కాని ప్రస్తుతం వీటి అమ్మకాలు మూడింతలు పెరిగాయని తెలిపారు. కొన్ని వారాల కిందట కిలో రూ.8 -15 పలికిన ఈ పండ్లు ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో ఈ పండు కిలో రూ.20 నుంచి 25 వరకు ధర పలుకుతున్నాయి. కాగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.30 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ మార్కెట్ డెరైక్టర్ సంజయ్ పాన్సారే మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా డెంగీ వ్యాధి నవీ ముంబైతోపాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. బొప్పాయిలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో వీటి డెంగీ పీడితులకు ఈ రసం తాగించాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వినియోగం బాగా పెరిగిందన్నారు. గతంలో మార్కెట్‌కు రోజుకు 10 నుంచి 15 ట్రక్కుల బొప్పాయి సరఫరా కాగా, ప్రస్తుతం రోజుకు 40 ట్రక్కుల వరకు సరఫరా అవుతోందని ఆయన వివరించారు. -
అవగాహనే అసలు మందు
- థైరాయిడ్ బాధితుల్లో ఆడవారే అధికం - అవగాహనతో వ్యాధి నియంత్రణ - నేడు వరల్డ్ థైరాయిడ్ డే న్యూస్‌లైన్, గుంటూరు మెడికల్, ఎంత తిన్నా లావుగా కాకపోవడం, కొందరు అధికంగా బరువు పెరగడం, అలసట, చర్మం ఎండిపోవడం.. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించడం మంచిదని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టర్ పతకమూరి పద్మలత తెలిపారు. థైరాయిడ్ గ్రంథిపై చాలామందికి సరైన అవగాహన లేకపోవటంతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోలేక పోతున్నట్లు చెప్పారు. నేడు వరల్డ్ థైరాయిడ్ డే. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు ‘న్యూస్‌లైన్’కు వివరించారు. థైరాయిడ్ గ్రంథి అంటే.. గొంతు ముందు భాగంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా గులాబీ రంగులో ఇంచుమించు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది 20గ్రాముల బరువు ఉండి శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. శరరీం, ఎముకల పెరుగుదలను, ఉష్ణోగ్రతను, మానసిక వికాసాన్ని అదుపుచేస్తుంది. వివిధ కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ హార్మోను ఉత్పత్తికి మన శరీరంలో తగినంత అయోడిన్ అవసరం. థైరాయిడ్ లోపం వల్ల.. - థెరాయిడ్ లోపంతో హుషా రు తగ్గుతుంది. విపరీతమైన అలసట వస్తుంది. నడవాలన్నా , పనిచేయాలన్నా ఓపిక ఉండదు. చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. - కండరాలు ఉబ్బుతాయి. మలబద్ధకం, కండరాలు పట్టివేసినట్లు ఉండటం, చర్మం కింద కొవ్వు చేరి బరువు పెరుగుతారు. గొంతు బొంగురుగా మారటంతో పాటు ముఖం గుండ్రంగా కనపడుతుంది. - జీవక్రియ స్థాయి విపరీతంగా పెరిగి శరీరంలోని అన్ని శక్తి వనరులు ఖాళీ అవుతాయి. ఎముకల్లో క్యాల్షియం తక్కువై ఎముకలు పెలుసు బారతాయి. తలమీద వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. ముఖ్యంగా కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. - పిల్లలో పెరుగుదల ఉండదు. స్త్రీల రుతుచక్రంలో మార్పులు రావటం, గర్భం రావటం ఆలస్యం అవ్వటం, తరచుగా గర్భస్రావాలు జరగటం తదితర లక్షణాలు ఉంటాయి. వందలో పదిమందికి.. - ఈ వ్యాధి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి వస్తుంది. - జీజీహెచ్‌కు వైద్యం కోసం వచ్చే వారిలో 100 మందిలో పదిమంది ఈ వ్యాధి బాధితులే. - మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా థైరాయిడ్ గ్రంథి సమస్య వస్తోంది. ఆడవారిలో 80శాతం మందికి ఉంటే మగవారిలో - - 20శాతం మందికి వస్తుంది. దీనికి జీవితాంతం మందులు వాడాలి. - వ్యాధి సోకిన వారికి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా లక్షణాలు ఉంటాయి. - ఆహారంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవటం వల్ల కొంతవరకు థైరాయిడ్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. - జన్యుపరలోపాల వల్ల, తల్లికి ఉంటే బిడ్డకు, వంశ పారంపర్యంగా ఈ వ్యాధి వస్తుంది. - అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్ ఉందో లేదో నిర్ధారణ పరీక్ష చేయించటం చాలా ఉత్తమం. డాక్టర్ పద్మలత, ఎండ్రోకైనాలజిస్ట్