లాక్‌డౌన్‌లో మనసులను కదిలించిన మంచితనాలు! | India Corona Virus Lock Down Tragedy | Sakshi
Sakshi News home page

కళ్లు తుడుచుకోండి

Published Wed, Mar 24 2021 12:15 AM | Last Updated on Wed, Mar 24 2021 10:51 AM

India Corona Virus Lock Down Tragedy - Sakshi

కత్తులు దూసే ద్వేషాన్నైనా భరించవచ్చు. కళ్లు తుడిచే ప్రేమను తట్టుకోవడం కష్టం. లాక్‌డౌన్‌.. మనిషి మీద మనిషి కి ఎంత ప్రేమ ఉంటుందో చూపించింది. ఆకలి తీర్చిన ప్రేమ. అడగకనే అన్నీ అమర్చిన ప్రేమ. ఊరికి చేర్చిన ప్రేమ. ఊపిరి పోసిన ప్రేమ! కళ్లు చెమరుస్తాయి ఇప్పటికీ.. లాక్‌డౌన్‌లో పరిమళించిన మానవత్వాన్ని గుర్తు చేసుకుంటే!  నేటితో​ సరిగ్గా ఏడాది తొలిసారి మనం ‘లాక్‌డౌన్‌’ అనే మాటను విని!! 2020 మార్చి 25 నుంచి మే 31 వరకు 68 రోజుల పాటు నాలుగు విడతలుగా కొనసాగింపుల లాక్‌డౌన్‌. మళ్లొకసారి దేశంలోని 138 కోట్ల మంది జనాభా.. తలుపుల వెనక్కు వెళ్లవలసిన ‘వేవ్‌’ కనిపిస్తోంది! ఈ సందర్భంగా గత లాక్‌డౌన్‌లో మనసులను కదిలించిన కొన్ని మంచితనాలు ఇవి. వీటిల్లో కొన్ని మిమ్మల్ని కడుపారా ఏడిపించవచ్చు. కళ్లు తుడుచుకుంటే ఆ గుండె భారం అన్‌లాక్‌ అవొచ్చు. 

క్యాట్‌ మ్యాన్‌ 
ప్రకాశ్‌.. కొచ్చిలో ఉంటారు. ఆయన పంచ ప్రాణాల్లో మూడు ప్రాణాలు పిల్లులే! వాటిల్లో రెండు ఎప్పుడూ ఆయన్ని అంటుకునే ఉంటాయి. లాక్‌డౌన్‌లో వాటికి ఫుడ్డు కరువైంది. ప్రకాశ్‌ తను తింటున్నదే పిల్లులకూ పెట్టొచ్చు. అయితే ఆయన ఫుడ్డు వాటికి నచ్చడం లేదు. ప్రకాశ్‌ వెజిటేరియన్‌. లాక్‌డౌన్‌ లేనప్పుడు వాటి కోసం బయటికి వెళ్లి నాన్‌వెజ్‌ బిస్కెట్లు కొని తెచ్చేవాడు. లాక్‌డౌన్‌లో అలా కుదరడం లేదు. బయటికొస్తే.. పోలీసులు తరిమికొడుతున్నారు. ఏమిటీ దారుణం అని కోర్టుకెక్కాడు ప్రకాశ్‌. ఆ కథ విని కేరళ హైకోర్టు.. అతడికి లాక్‌డౌన్‌ పాస్‌ ఇప్పించింది. 

ఇంటికి రా మమ్మీ
బెలగావిలోని ‘బెలగావి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ కోవిడ్‌ వార్డులో సేవలు అందిస్తున్న సుగంధ అనే నర్సు పదిహేను రోజులుగా ఇంటికే వెళ్లలేదు. ‘నువ్వు రాకపోతే, నేనే వస్తా’ అని తండ్రిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చేసింది సుగంధ కూతురు ఐశ్వర్య. తల్లీ కూతుళ్లు దూరం నుంచే చూసుకున్నారు. ‘ప్లీజ్‌ ఇంటికి రా మమ్మీ..’ అని కూతురు ఏడుస్తూ అడుగుతుంటే, సుగంధ తనూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. టీవీలో వీళ్లను చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కళ్లు కూడా చెమ్మగిల్లాయి. వెంటనే సుగంధకు ఫోన్‌ చేశారు. ధన్యవాదాలు తెలిపారు.  

స్వీట్‌బాక్స్‌తో వచ్చారు!
లక్నోలో 83 ఏళ్ల ఆర్‌.సి.కేశ్వరి అనే పెద్దాయన కొడుకు, కోడలు యు.ఎస్‌.లో ఉంటున్నారు. భార్య లేరు. షుగర్‌ ప్రాబ్లమ్‌ ఒక్కటే ఆయనతో ఉంటోంది! ఉంటోంది కానీ, తరచు పడిపోతూ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ఓ రోజు అలాగే హటాత్తుగా పడిపోయింది. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయిన ఆ ‘క్రిమికాలం’లో.. చాక్లెట్‌ కోసమో, ఇంత చక్కెర కోసమో ఆయన వెళ్లి ఎవరి తలుపు తట్టగలరు? వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి తన పరిస్థితిని చెప్పారు. వెనువెంటనే పోలీసులు వచ్చి ఆయన చేతిలో స్వీట్‌బాక్స్‌ పెట్టారు! చిన్న ముక్క తినిపించారు కూడా. 

కాపాడి ఫైన్‌ వేశారు
లాక్‌డౌన్‌లో పాపం ఒక హైదరాబాద్‌ గృహస్తుడు గోధుమ పిండి కోసం బయటికి వచ్చి బుక్‌ అయిపోయాడు. సేమ్‌ ఇలాగే ఒక పాశ్చాత్య ధూమపాన ప్రియుడు సిగరెట్‌ల కోసం ఫ్రాన్స్‌ నుంచి స్పెయిన్‌కి కాలినడకన బయల్దేరి, ఒక కందకంలో చిక్కుకుని.. సరిహద్దు పిరనీస్‌ ప్రాంతంలో గగనతలంపై హెలీకాప్టర్‌లో గస్తీ కాస్తున్న ఫ్రెంచ్‌ మౌంటేన్‌ పోలీసుల కంటపడ్డాడు. వెంటనే వాళ్లు కిందికి దిగి, కందకం నుంచి ఆ వ్యక్తిని తాళ్లతో పైకి లాగి ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందుకు 11 వేల రూపాయల (మన కరెన్సీలో) జరిమానా కూడా విధించారు. 

దేవుళ్ల టీమ్‌
ఆçసుపత్రు లలో పరీక్షలు జరుగుతాయి కానీ, ఆసుపత్రులకే పెద్ద పరీక్షగా మారింది కరోనా. ఒక ప్రాణాన్ని ఒడ్డున పడేయడానికి ఒక టీమ్‌ మొత్తం మునకలేస్తోంది. యు.ఎస్‌.లోని రొనాల్డ్‌ రీగన్‌ మెడికల్‌ సెంటర్‌లోనైతే.. పేషెంట్‌కి నయమై వీడ్కోలు చెబుతున్న ప్రతిసారీ ‘ఎక్స్‌ట్యూబేషన్‌’ డాన్స్‌ వేస్తున్నారు వైద్య సిబ్బంది. ఎక్స్‌ట్యూబేషన్‌ అంటే వెంటిలేటర్‌ను తొలగించడం. బొమ్మను చేసి ప్రాణం పోశాక తన సృష్టిని చూసుకున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందో తెలీదు. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టాక వీళ్లు చేస్తున్న డాన్స్‌ చూస్తుంటే మాత్రం దేవుళ్లు డాన్స్‌ చేస్తున్నట్లే అనిపిస్తోంది!  

రైలొచ్చి పాలిచ్చింది!
ముంబైలో ఉంటున్న రేణు కుమారి లాక్‌డౌన్‌లో ప్రధాని మోదీని ట్యాగ్‌ చేస్తూ ఒక ట్వీట్‌ పెట్టారు. ‘‘మోదీజీ.. నా మూడున్నరేళ్ల కుమారుడికి ‘ఆటిజం’ ఉంది. ఒంటె పాలు మాత్రమే సరిపడుతున్నాయి. రాజస్థాన్‌లోని సద్రి నుంచి ఒంటె పాలను కానీ, ఒంటె పాలపిండి గానీ నా చిన్నారి కోసం తెప్పించగలరు’’ అని విన్నవించుకున్నారు. అంతే.. ఆ మర్నాటికి 20 లీటర్ల ఒంటె పాల క్యాన్‌ ఆమె చేతికి అందింది! ఆ ట్వీట్‌ గురించి తెలిసిన నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు సద్రీ నుంచి గూడ్స్‌ రైల్లో ఒంటెపాలను  తెప్పించి ముంౖ»ñ లోని రేణు కుమారి ఇంటికి చేర్చారు! ఇక ఆ తల్లి ఆనందానికి హద్దు ఉంటుందా?

పోలీస్‌ సాంగ్‌
పంజాబ్‌లోని మన్సాలో ఏడాది వయసున్న ఓ చిన్నారి బర్త్‌ డేకి పోలీసులు కేక్‌ తెచ్చివ్వడమే కాకుండా ఆ పాపకు బర్త్‌ డే సాంగ్‌ పాడి మరీ వెళ్లడం ఇప్పుడొక ముచ్చటైన సంగతిగా లాక్‌డౌన్‌లో దేశమంతా చెప్పుకుంది. లాక్‌డౌన్‌లో బయటికి రావడానికి లేదు. ఈలోపు బేబీ బర్త్‌ డే వచ్చేసింది. ఆ మురిపెం ఎలా తీర్చుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఏమైతే అదైందని.. పోలీసులకు ఫోన్‌ చేసి సమస్యను చెప్పుకున్నారు.  పోలీసులు కూడా వెంటనే స్పందించారు. 

అమ్మ కోసం
దొంగతనం కేసులో దోషిగా రుజువైన ఒక బాలుడికి బియ్యం, పప్పులు ఉప్పులు, కొత్త బట్టలు, ఇతర నిత్యావసర వస్తువు లు ఇవ్వాలని బిహార్‌ లోని నలంద కోర్టు జడ్జి ప్రభుత్వాన్ని ఆదేశించారు! ‘‘ఆ బాలుడు మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండేందుకు అతడికి ఒక అవకాశం ఇస్తున్నాను’’ అని తీర్పు ఇస్తున్న సందర్భంగా జడ్జి గారు అన్నారు. జబ్బున పడిన తన తల్లి కోసం లాక్‌డౌన్‌లో తినడానికి ఏమీ దొరక్క ఆ బాలుడు దొంగతనం చేశాడు. 

పక్కపక్క వార్డులు
తల్లికి కరోనా పాజిటివ్‌. ఆమె జన్మనిచ్చిన బిడ్డకు కరోనా నెగటివ్‌. ఇద్దర్నీ వేర్వేరు వార్డుల్లో ఉంచారు. బిడ్డను తాకడానికి, కనీసం చూసుకోడానికి లేదు.  ఔరంగాబాద్‌  సివిల్‌ ఆసుపత్రిలో(మహారాష్ట్ర) ఆమెకు సిజేరియన్‌ జరిగింది. స్పృహలోకి రాగానే బిడ్డను చూపించమని బతిమాలింది. ‘‘ఇప్పుడొద్దమ్మా..’’ అన్నారు. వైద్యులకూ చూపించాలనే ఉంది కానీ, కరోనా వార్డులోకి బిడ్డను తీసుకెళ్లడం, కరోనా వార్డు నుంచి తల్లి రావడం రెండూ ప్రమాదమే అని నచ్చజెప్పారు. వాట్సాప్‌ వీడియోలో చూపించారు.

అలసి సొలసి
ఇద్దరు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పోలీసులు లాక్‌డౌన్‌ డ్యూటీ చేశారు. చేశారు. చేశారు. చేశారు. అలసిపోయి నిద్రకు వాలిపోయారు. ఉల్లంఘనకారుల నుంచి సీజ్‌ చేసిన టూవీలర్‌ బండ్ల వరుసల మధ్య ఖాళీ స్థలంలో ఉంటే అక్కడే.. గుండెలపై చేతులు వేసుకుని.. కొన్ని గంటలపాటు గాఢంగా నిద్రపోయారు. ఆ ఫోటోను అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మాధుర్‌ వర్మ షేర్‌ చేశారు. ‘ఈ కరోనా వారియర్‌లను చూసి డిపార్ట్‌మెంట్‌ గర్విస్తోంది’ అని ట్వీట్‌ చేశారు. 

గౌరవ వందనం
యు.ఎ.ఇ.లో కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న డాక్టర్‌ ఆయేషా  లాక్‌డౌన్‌లో ఓరోజు డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి వెళుతున్నారు. ఆమెను ఆపిన పోలీస్‌ అధికారి.. ఆమె ఐడీ కార్డు తీసి చూపించబోయేంతలోనే డాక్టరుగా గుర్తుపట్టి ఆమెకు సెల్యూట్‌ చేయడం, ‘దయచేసి వెళ్లండి’ అని దారి ఇవ్వడం ఆయేషాను ఆశ్చర్యపడేలా చేసింది. ఆ.. గౌరవ వందనానికి తనకు కన్నీళ్లొచ్చినట్లు ఆమె తన ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. 

చేపలకు చూపులు ప్లీజ్‌!
టోక్యోలోని సువిధ అక్వేరియంలో సందర్శకులను కళ్లలో కళ్లు పెట్టి చూసే అలవాటున్న ఈల్‌ చేపలకు లాక్‌డౌన్‌తో మనుషుల చూపులే కరువయ్యాయి. నిస్పృహలోకి వెళ్లిపోయాయి. పనివాళ్ల అలికిడి వినిపిస్తున్నప్పటికీ.. పాత ముఖాలే కదా అన్నట్లు తలెత్తి చూడకుండా నీళ్లలోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆక్వేరియం నిర్వాహకులు ‘దయచేసి మా ఈల్‌ చేపలతో వీడియో–చాట్‌ చేయండి’ అని ప్రజలకు విజ్ఞప్తులు పంపవలసి వచ్చింది.

పిల్లిమాతల్లి
టర్కీ పట్టణం ఇస్తాంబుల్‌లో లాక్‌డౌన్‌ సమయంలో ఒక పిల్లి.. అనారోగ్యంతో ఉన్న తన పిల్లను నేరుగా ఆసుపత్రిలోకి తీసుకెళ్లింది! వైద్యులు వెంటనే ఉరుకులు పరుగుల మీద పిల్లి పిల్లను వైద్యం కోసం లోపలకి  తీసుకెళ్లారు. పిల్లి మాత బయటే ఉండిపోయి.. మనుషుల మధ్య మనిషిలా.. లోపల ఉన్న తన పిల్ల కోసం తచ్చాడుతూ ఉంది. ఆ సీన్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ పిల్లి కొన్నాళ్ల క్రితమే ఆ ఆసుపత్రి సమీపంలో పిల్లల్ని పెట్టిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు జీవితం ఎంత అందమైనది అనిపిస్తుంది.

వధువు వైపు
వధువుకు తల్లిదండ్రులు లేరు. లాక్‌డౌన్‌లో ఆమె బంధువులెవరూ రాలేదు. వరుడు, అతడి తల్లిదండ్రులు, కొందరు బంధువులు ఉన్నారు. ‘అమ్మాయి వైపు అయినవారు ఒక్కరైనా లేకుండా ఎలా!’ అనే ప్రశ్న వచ్చింది. ‘అయినవారు ఎందుకు లేరూ.. మేమున్నాం’ అని పోలీసులు వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు. ‘సంతోషంగా ఉండు తల్లీ’ అని అమ్మాయిని దీవించారు. పోలీసుల్లాంటి అన్నయ్యలు ఉంటే ఏ వధువు మాత్రం సంతోషంగా ఉండదు?  

ప్రాణానికి ప్రాణం
జహీద్‌ అబ్దుల్‌ మజీద్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌. పరిస్థితి విషమించిన ఒక కోవిడ్‌ పేషంట్‌ని అంబులెన్స్‌లోంచి దించి ఐసీయులోకి తరలించే ప్రయత్నంలో ఆయన ఏమాత్రం సంకోచించక తన ముఖానికి ఉన్న సేఫ్టీ గేర్‌ ని  తొలగించుకున్నారు! అంబులెన్సులో తగినంత వెలుతురు లేకపోవడంతో  తన ముఖానికి ఉన్న సేఫ్టీ గేర్‌ ని తొలగించుకుని ఆ పేషంట్‌ ట్యూబ్‌ ని సరిచేశారు. పేషంట్‌ ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ డాక్టర్‌ని చూసి ఎయిమ్స్‌ గర్వపడింది. దేశం అభినందించింది.

చెప్పలేక చెప్పలేక
ఉబర్‌ కంపెనీ లాక్‌డౌన్‌లో ఒకే రోజు 3500 మంది ఉద్యోగులను తొలగించింది. జూమ్‌ వీడియో లోకి వచ్చిన ఆ కంపెనీ కస్టమర్‌ సర్వీస్‌ హెడ్‌ రాఫీన్‌ షెవల్యూ.. మూడే మూడు నిముషాలలో విషయాన్ని చెప్పేశారు. అది కూడా.. ‘ఉబర్‌ తో ఇది మీ ఆఖరి పని దినం’ అనే ఒకే ఒక మాటను చెప్పటానికి సిద్ధపడటం కోసం ఆమెకు పట్టిన సమయం అది. ఆ వెంటనే ఆమె కంటతడి పెట్టుకుని.. ‘ఎవరూ కూడా ఇలాంటి ఒక ప్రకటన చేయాలని కోరుకోరు’ అని కళ్లు తుడుచుకున్నారు.

తిండి కలవాడు
వలస కార్మికుడు ఆ యువకుడు (23). రాజస్థాన్‌ నుంచి సొంత రాష్ట్రం బిహార్‌ వచ్చాడు. బక్సర్‌లో అతడిని క్వారెంటైన్‌లో ఉంచారు. రోజుకు 40 చపాతీలు, 8 నుంచి 20 ప్లేట్ల అన్నం తింటున్నాడు. అది చూసిన వంట మనిషి ‘నా వల్ల కాదు. నేను అలసిపోతున్నాను’ అని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ‘తప్పు. అలా అనకు. అతడు ఎంత అడిగితే అంతా పెట్టాలి. లేదు, అయిపోయింది అనే మాటలు రానివ్వకు. అతడు నొచ్చుకుంటాడు. తింటున్న వాళ్లను అర్ధాకలితో మాడ్చకూడదు’ అని, కుక్‌ భుజం తట్టి పంపించారు బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఏ.కె.సింగ్‌.

లోకల్‌ ట్రైన్‌ 
కోవిడ్‌ హీరోలు నర్సులు, డాక్టర్లు మాత్రమే కాదు. సోనూ సూద్‌ కూడా. వేల మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో వాళ్ల వాళ్ల ఊళ్లకు చేర్చిన సోనూ కూడా ఇరవై ఏళ్ల క్రితం పంజాబ్‌ నుంచి ముంబై వచ్చినప్పుడు పాస్‌ తీసుకుని లోకల్‌ ట్రైన్‌లలో తిరిగిన వాడే. అప్పుడు ఆయన తీసుకున్న 420 రూపాయల నెలవారీ పాస్‌ను సంపాదించి, దాచిపెట్టుకుని ఉన్న ఆయన అభిమాని ఒకరు ఆ పాస్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ‘కష్టాలు పడిన వాళ్లకే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. అందుకు సోనూ స్పందిస్తూ ‘లైఫ్‌ ఈజ్‌ ఎ ఫుల్‌ సర్కిల్‌’ అని రీట్వీట్‌ చేశారు. జీవితం కలిమి లేముల వలయం అని. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement