సమావేశంలో పాల్గొన్న అధికారులు, విద్యార్థినులు
మెదక్‌జోన్: వ్యాధుల నివారణ కోసం ప్రతివ్యక్తి మాత్రలను తప్పని సరిగా వేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో మంగళవారం నులిపురుగుల, పైలేరియా మాత్రలను కలెక్టర్ చేతుల మీదుగా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకు తెలియకుండానే నట్టలు( నులిపురుగులు) మన శరీరంలోకి ప్రవేశించి మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వివరించారు. దీంతో మనం తీసుకునే ఆహారాన్ని పురుగులు తినేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ పురుగుల సంఖ్య అధికమైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అలాగే బోదకాలు వ్యాధి బారిన పడకుండా డీఈసీ మాత్రలను సైతం వేసుకోవాలని ఈ మాత్రలను ప్రతి మనిషికి ఇచ్చే విధంగా సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్యశాఖ అధికారుల సూచన మేరకు ఈ మాత్రలను ప్రతివ్యక్తి వేసుకోవాలని లేనిచో మైక్రోఫైలేరియా మనశరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం బారిన పడతామన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మరుగుదొడ్లను వినియోగించడంతోపాటు ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. 50 శాతం వ్యాధులు మనం సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకపోవటంతోనే వస్తాయన్నారు.
భోజనం చేసే ముందు, మలవిసర్జన చేసిన తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే అనేక వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని వాటి నివారణకోసం తగుజాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏడాదికి రెండు సార్లు వేసే నులిపురుగు నివారణ మాత్రలు తప్పని సరిగా పిల్లలు, యువకులు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీరాములు, ఇర్షాద్, అనిల్, కుమారస్వామి, పాండురంగాచారి, చందర్, మణికంఠ ఆరోగ్యకార్యకర్తలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment