![Second Phase Sheep Distribution Scheme Medak - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/10/col.jpg.webp?itok=wda5NUJO)
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ అర్బన్: రెండో విడత గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి పశుసంవర్థశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన పశుసంవర్థక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అనంతపురం నుంచి గొర్రెలను తీసుకోవాలని సూచించడం జరిగిందని దాని స్థానంలో కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునేలా అవకాశం కల్పించాలని మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరారు. లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలను అమ్మడం నేరమని తెలిపారు.
అలా అమ్మినట్లు నిరూపణ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎండీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ రెండో విడత కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గొర్రెల పెంపకంతో ఆయా వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి మండల స్థాయి అధికారులు లబ్ధిదారులకు అందచేసిన గొర్రెలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. ఏ ఒక్క లబ్ధిదారులు కూడా గొర్రెలను అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంపిణీ చేసిన గొర్రెలు అక్రమ రవాణా జరగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
నీటి తొట్లకు మరమ్మతులు..
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పశువులకు తాగునీటి సౌకర్యాలతో పాటు పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి పశుసంవర్థక శాఖ అధికారులను ఆదే«శించారు. జిల్లాలో రబీ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన పరిస్థితులు లేవన్నారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు సైతం తాగునీటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఎంపీడీఓలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లకు చిన్నచిన్న మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
అలాగే ఏ గ్రామంలో అయినా కొత్తగా నీటి తొట్లు నిర్మించేందుకు అవసరం ఉంటే ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ, ఉద్యానవన శాఖలు సైతం పశుగ్రాసం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా నుంచి 500 మెట్రిక్ టన్నుల విత్తనాలకు ప్రతిపాదనలు పంపాలని ఏడీ అశోక్‌కుమార్‌కుసూచించారు. అటవీ ప్రాంతంలో నాటే విత్తనాలపై స్థానిక వెటర్నీరీ అసిస్టెంట్‌తో పాటు అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎఫ్‌ఓ పద్మజారాణి, డీటీవో గణేష్, మెదక్ డీఎస్పీ క్రిష్ణమూర్తి, ఏడీ వెంకటయ్యతో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment