Sheep Distribution scheme
-
‘కట్టలు’ తెగిన అవినీతి
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టలు బద్ధలవుతున్నాయి. ‘కట్టల’పాములు బయటికొస్తున్నాయి. అవినీతి నిరోధక విభాగం చేపడుతున్న వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్లు’సత్ఫలితాలనిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులకు అనేక అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.దీంతో వారు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీఏ.. ఇలా ఏ శాఖనూ వదలకుండా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 105 కేసులు నమోదు చేశారు. గతంలో బాధితులు చేసే ఫిర్యాదులు, వారందించే సమాచారం ఆధారంగా అవినీతి అధికారులను ట్రాప్ చేసేవారు. ఎక్కువగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల నమోదుకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్ర స్థాయిలో అవినీతి అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘ఆపరేషన్లు’పూర్తి చేస్తున్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్ శాఖను సైతం అప్పగించడంతో.. ఏసీబీ తనిఖీలతో పాటు విజిలెన్స్ సోదాలూ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.వందల కోట్ల అవినీతి, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి తదితర కేసులు వెలుగులోకి వచ్చాయి.ఏసీబీ ఇటీవల నమోదు చేసిన ప్రధాన కేసులు కొన్ని.. జనవరి 2024: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2024: గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ జగజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం దొరికింది.మార్చి 2024: మార్చిలో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.మే 2024: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతో పాటు, బినామీల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఆగస్టు 2024: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు సహా రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు ఏసీబీ గుర్తించింది.డిసెంబర్ 2023: గతేడాది డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాంచందర్ నాయక్ సహా పలువురిని అరెస్టు చేశారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ ‘లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోలేరు..’అని ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారని తెలిపారు. -
గొర్రెల పథకంలో 700 కోట్లు దోపిడీ.. చివరికి బతుకమ్మ చీరలు కూడా
-
గొర్రెల స్కాంపై ఈడీ స్పీడ్.. పశుసంవర్ధక శాఖకు అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం చేరుకున్నారు.కాగా, గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్థక శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇక, గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కామ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. -
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండగా..మరోవైపు మనీలాండరింగ్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ కొన్నట్టు చూపడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అప్పటి మంత్రి పేషీ కేంద్రంగా జరిగిన ఈ గోల్‌మాల్‌లో రూ.700 కోట్ల వరకు నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. ఈ మొత్తం కుంభకోణంలో ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన అధికారుల విచారణతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతమైతే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిబంధనలు తుంగలోతొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎంఎల్ఏ చట్టం కింద లేఖ గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) ఎండీకి లేఖ రాశారు. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మాగిమై అరోకియారాజ్.. కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా.. తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 11 మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, టీఎస్జీడీసీఎఫ్ఎల్ ద్వారా పంపిణీ అయిన చెక్కుల పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం కుంభకోణంలో కీలకమైన గొర్రెల రవాణా కాంట్రాక్టుదారుల వివరాలు, వారికి జరిగిన చెల్లింపులు, గొర్రెల దాణా కొనుగోలు వివరాలు కూడా ఈడీ కోరింది. అంతర్గతంగా జరిగిన అవినీతికి సంబంధించి అదనపు వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ ఇద్దరూ చెప్పే విషయాలే కీలకం! గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. గొర్రెలను విక్రయించినా తమకు డబ్బులు ఇవ్వలేదని, తమ పేరిట ఎవరో డబ్బులు తీసుకున్నారంటూ ఏపీ రైతుల ఫిర్యాదు చేయడంతో మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి.కృష్ణయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధ శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రాంచందర్, కల్యాణ్‌కుమార్‌లను కస్టడీకి తీసుకుని ఈ నెల 10 నుంచి 13 వరకు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో వారు ఏసీబీకి ఏం చెప్పారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎవరెవరున్నారనే దిశగా దర్యాప్తు ఈ మొత్తం కుంభకోణంలో ఈ ఇద్దరే కీలకంగా పనిచేశారా? ఇంకా ఎవరైనా వీరిద్దరికీ ఆదేశాలు ఇచ్చారా? అప్పటి మంత్రి పేషీలో ఇంకెవరెవరు ఉన్నారు? గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గొర్రెల పంపిణీ పథకం కొనుగోల్ మాల్ వ్యవహారాలకు సంబంధించి బ్రోకర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చేతులు మారినట్టు, ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్నే మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్టు చూపిస్తూ బిల్లులు పెట్టడం..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలు చేయడంలో జరిగిన అక్రమాలు, పశుసంవర్ధకశాఖ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్ర తదితర వివరాలు బహిర్గతం కావచ్చని అంటున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణలో గొర్రెల స్కాం.. రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖకు ఈడీ జోనల్ ఆఫీసు నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా, తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక, జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడీ కోరింది.ఇదిలా ఉండగా.. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దిమాక్ అంటే ఇట్లుండాలే!.. గొర్రెల మిన 700 కోట్లు సంపాదించిండు
-
గొర్రెల పంపిణీలో 700 కోట్ల భారీ స్కాం
-
గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీబీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
‘గొర్రెల’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఒక విడత పూర్తయిన ఈ పథకం కింద రెండో విడత గొర్రెలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌఖికంగా వచి్చన ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు చడీచప్పుడు లేకుండా గొల్ల కుర్మలు కట్టిన డీడీలను పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్లకుర్మల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. గత నెలరోజులుగా..: ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెల రోజుల క్రితమే ప్రారంభమైందని, జిల్లాల వారీగా వరుసగా డీడీలు వెనక్కు ఇస్తున్నారని, కొన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల కిందటే ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మరో 3,37,816 మంది గొల్లకుర్మలకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, గత ఎన్నికల కంటే ముందు సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీసి గొర్రెలెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం అకస్మాత్తుగా డీడీలు వాపస్ చేస్తుండటం గమనార్హం. ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ... వాస్తవానికి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టోలో కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, 90 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ గొల్లకుర్మలు కట్టిన డీడీలను వారికి వెనక్కు ఇచ్చేస్తుండటం గమనార్హం. అయితే, మంత్రివర్గంలో ఎవరికీ కేటాయించకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోకే పశుసంవర్ధక శాఖ వస్తుంది. నేరుగా సీఎం పర్యవేక్షణలోకి రావడంతో శాఖ కార్యకలాపాల గురించి ఆయనకు చెప్పేందుకు అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒక్కసారేనని, ఈ చర్చ తర్వాతే ఉన్నతాధికారులు కొందరిపై రేవంత్ చర్యలు తీసుకున్నారని అధికారులంటున్నారు. అయితే, డీడీలు వెనక్కు ఇవ్వాలని నిజంగానే రేవంత్ ఆదేశాలిచ్చారా లేక అధికారులే చొరవ తీసుకుని ఈ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పథకం అమలులో అవినీతి జరిగితే ఈ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసి గొల్లకుర్మలకు మేలు చేయాలే కానీ ఏకంగా పథకాన్ని తీసేవిధంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. డీడీలు వెనక్కు ఇస్తున్న ప్రక్రియపై గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. డీడీలను వాపస్ చేయడాన్ని వెంటనే నిలిపివేసి అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. -
తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఏసీబీ దూకుడు
-
‘రెండో విడత’ గొర్రె..పంపిణీకి కొర్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు నిధుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.4,565 కోట్ల రుణాన్ని మంజూరు చేసినా.. నిధులను విడుదల చేయకుండా కొర్రీలు పెడుతుండటంపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా ఆటంకాలు కల్పిస్తోందనే ఆరోపణలు అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తొలి విడత కోసం తీసుకున్న రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నా.. రెండో విడత నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటం సందేహాలకు తావిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్సీడీసీ బోర్డు సమావేశాలకు రాష్ట్ర అధికారులు హాజరై పథకం అమలు ఆవశ్యకతను, మొదటి విడత తీసుకున్న రుణం కింద తిరిగి చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలను, రెండో విడత కింద ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గల అవకాశాలను స్పష్టంగా వివరించినా.. కుంటిసాకులు చెప్తూ ఆపుతుండటం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సరేనంటూనే.. అభ్యంతరాలు వాస్తవానికి రెండో విడత గొర్రెల పంపిణీకి అవసరమైన నిధులను ఇచ్చేందుకు ఎన్సీడీసీ గత ఏడాది అక్టోబర్‌లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులను గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట విడుదల చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు అవసరమైంది. ఈ పూచీకత్తు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత జాప్యం చేయగా.. కథ అడ్డం తిరిగింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ అప్పుల కింద పరిగణిస్తామని, ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలో లెక్కగడతామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. గత ఏడాది పలు ఆర్థిక సమీకరణాల కారణంగా ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. రెండో విడత కింద గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమై అధికారికంగా పూచీకత్తు ఇస్తూ ఎన్సీడీసీకి ప్రతిపాదనలు పంపింది. కానీ ఈసారి ఆడిట్ రిపోర్టు రూపంలో అడ్డంకి ఎదురైంది. తొలి విడత గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో పేర్కొనడంతో ఎన్సీడీసీ రుణం విడుదలపై పునరాలోచనలో పడింది. ఎన్సీడీసీ కేంద్ర మంత్రి అమిత్‌షా పరిధిలోని సహకార శాఖ పరిధిలోకి వస్తుందని.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ నడుమ రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎన్సీడీసీ బోర్డు సభ్యులు నిధుల విడుదలకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకసారి బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత నిధులను వెంటనే విడుదల చేయాలి. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి మరీ బోర్డు సభ్యులు కొందరు తెలంగాణకు నిధులు ఇవ్వద్దని పేచీ పెడుతున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ అధికారులు సుముఖంగా ఉన్నారని, ఇటీవలి బోర్డు సమావేశ ఎజెండాలో ఈ ప్రతిపాదన పెట్టారని.. కానీ కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని మరో సమావేశం వరకు ఈ నిధుల విడుదలను వాయిదా వేయించారని అంటున్నాయి. ఖజానా నుంచే సర్దుబాటుకు ఏర్పాట్లు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో గొర్రెల పంపిణీ పథకంపై చర్చ జరిగింది. రుణం మంజూరు చేసినా విడుదల చేయకుండా ఎన్సీడీసీ వ్యవహరిస్తున్న తీరు, రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. 10–15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అయితే రుణ విడుదలను ఎన్సీడీసీ వాయిదా వేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఖజానా నుంచే రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. వారం, పదిరోజుల్లో జరిగే ఎన్సీడీసీ భేటీ వరకు వేచి చూస్తామని, ఈ దఫా కూడా నిధులను విడుదల చేయకపోతే.. రాష్ట్ర ఖజానా నుంచే విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆర్థికశాఖ అధికారి వెల్లడించారు. ఒక్క వాయిదా తప్పకుండా.. తొలి విడత గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ ఇచ్చిన రూ.3,955 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. 2017లో ఈ రుణం మంజూరుకాగా.. ఏటా మే, నవంబర్ మాసాల్లో వాయిదాలను జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 వాయిదాల్లో అసలు కింద రూ.2,626 కోట్లు, వడ్డీ కింద రూ.1,442 కోట్లు కలిపి రూ.4,068 కోట్లను చెల్లించింది. తొలి విడత రుణం 2025 మే నాటికి తీరిపోనుంది. ఇలా ఠంచన్‌గా రుణ వాయిదాలు చెల్లిస్తున్నా.. రెండో విడత కింద రూ.4,565 కోట్లను మంజూరు చేసి మరీ నిలిపివేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. రెండో విడత రుణం విడుదల చేసేందుకు.. కేంద్ర సహకార శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్‌షా అనుమతి కావాల్సిందేనని ఎన్సీడీసీ బోర్డులోని కీలక అధికారి ఒకరు మన రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. గొర్రెల పంపిణీ సంబంధిత గణాంకాలివీ.. ఇప్పటివరకు గొర్రెల పంపిణీ జరిగిన లబ్ధిదారుల సంఖ్య: 3.94 లక్షలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిన తీరు: 2014–15లో 1.28 కోట్ల నుంచి 2022–23 నాటికి 1.90 కోట్లకు.. మాంసం ఉత్పత్తి పెరిగిన తీరు: 2014–15లో 5.05 లక్షల టన్నుల నుంచి 2021–22 నాటికి 10.04 లక్షల టన్నులకు.. -
సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..
సాక్షి, హైదరాబాద్: రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెలు, బర్రెల్ని అడ్డదారిలో సొంతం చేసుకుని, వాటిని మార్కెట్లో అమ్మేసి వచ్చిన లాభాలు పంచుకుందామంటూ ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తి నుంచి కొందరు రూ.75 లక్షలు తీసుకున్నారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలో నివసించే బాధితుడికి సనత్‌నగర్‌లో నివసించే కె.అర్వింద్‌కుమార్‌తో పదేళ్లుగా పరిచయం ఉంది. గతేడాది ఫిబ్రవరి 15న అర్వింద్ ద్వారా చౌదరిగూడకు చెందిన ఎస్.శ్రీనివాస్‌రావుతో బాధితుడిని పరిచయమైంది. శ్రీనివాస్ ఘట్కేసర్లోని ప్రభుత్వ పశువైద్యశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. తెలంగాణ వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడిగానూ ఉన్న శ్రీనివాస్‌కు మంచి పలుకుబడి ఉందంటూ అర్వింద్ బాధితుడితో చెప్పాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో శ్రీనివాస్‌కు రూ.కోటి అవసరం ఉందని చెప్పాడు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీపై బర్రెలు, గొర్రెలు అందించే పథకం మార్చ్ 31తో ముగుస్తుందని చెప్పాడు. చదవండి: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్ అయితే అనేక గ్రామాల్లోని రైతులు మార్జిన్ మనీ కట్టలేకపోయారని, వారి తరఫున మనమే కడదామంటూ ఎర వేశాడు. ఆ స్కీమ్‌లో వచ్చిన బర్రెలు, గొర్రెల్ని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుందామన్నారు. అలా వచ్చిన లాభాలను పంచుకుందామంటూ ఎర వేశారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య లక్ష్మికి రూ.58 లక్షలు నగదు రూపంలో ఇచ్చాడు. మరో రూ.17 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా లక్ష్మి ఖాతాకు బలీ చేశాడు. ఆ సందర్భంలో శ్రీనివాస్ ఏడు చెక్కులతో పాటు బాండ్ పేపర్ అందించాడు. అప్పట్లో నిందితులు చెప్పిన దాని ప్రకారం గతేడాది ఏప్రిల్‌లోనే అసలు, లాభాలు బాధితుడుకి ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి డబ్బు ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో ఇటీవల బాధితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా తాళం వేసుంది. అతడి వివరాలు చెప్పాలంటూ అనిల్‌ను కోరగా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనివాస్, అర్వింద్, లక్ష్మీ తదితరులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మొక్కలకు నీరు పడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు -
‘గొర్రెలకు’ కేంద్రం రూపాయీ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: ఎంపీగా, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చిందని సంజయ్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మాసాబ్‌ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మీడియా తో సోమవారం మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పథకానికి రూపకల్పన చేసి నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారన్నారు. 7.31లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో గొర్రెల యూనిట్లు పంపిణీ కోసం తొలివిడతలో రూ.3549.98 కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా రుణం తీసుకున్నామని, అందులో ఇప్పటికే అసలు కింద రూ.1723.62 కోట్లు, వడ్డీ కింద రూ.1177.12 కోట్లు చెల్లించామని చెప్పారు. తాము మొదటి విడతలో తీసుకున్న రుణంలో రూ.వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. మొదటివిడతలో రుణాన్ని సకాలంలో చెల్లిస్తున్నందున రెండో విడత కోసం రూ.4,593.75 కోట్ల రుణంగా ఇచ్చేందుకు ఎన్సీడీసీ అంగీకరించిందని చెప్పారు. ఇందులోనూ కేంద్రం నుంచి రూపాయి కూడా సబ్సిడీ రాదని ఎన్సీడీసీ స్పష్టం చేసిందని వెల్లడించారు. నయాపైసా ఇవ్వకుండా రూ.వెయ్యి కోట్లు ఇచ్చామని చెప్పుకోవడం బీజేపీ దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమని తలసాని విమర్శిం చారు. ఇన్ని అబద్ధాలు ఆడే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గొర్రెల పథకాన్ని దేశమంతా అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. -
Telangana: గొర్రెల పంపిణీపై కేంద్ర బృందం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర బృందం ప్రశంసలు లభించాయి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సభ్యులు సోమవారం ఇక్కడ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. సుధీర్‌కుమార్ శర్మ, ముఖేశ్‌కుమార్, భూపిందర్‌సింగ్, తెహెదుర్ రెహ్మాన్, వి.కె.దుబాసీ, శ్రీనివాసులతో కూడిన బృందం మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రం లో పశుసంపద అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి తలసాని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విరించారు. జీవాల వద్దకే వైద్యసేవలను తీసుకెళ్లేందుకు సంచార వైద్యశాలలను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అరగంటలో వైద్యం అవసరమున్న ప్రాంతాలకు తమ సిబ్బంది వెళ్లగలుగుతున్నారని చెప్పారు. మాంసం ఎగుమతి కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, గొర్రె పిల్లల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం అవసరమైన మార్కెట్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. అనంతరం ఎన్సీడీసీ సభ్యులు మాట్లాడుతూ పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, గొర్రెల పంపిణీలాంటి పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెల సమాఖ్య ఎండీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
గొల్ల, కురుమలకు కేసీఆర్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: గొల్ల, కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) రెండో విడత గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారి కుటుంబాల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పథకాలు ప్రకటిస్తే చట్టం చేసినట్లేనని తలసాని పేర్కొన్నారు.(చదవండి: సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు) ‘‘బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు మన రాష్ట్రంలో లేవు. వచ్చే అవకాశం లేదు. శుక్ర, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో కోళ్లు చనిపోయాయని వార్తలు వచ్చాయి. కానీ మహారాష్ట్ర నుంచి వచ్చిన గొర్రెలు వాతావరణం సహకరించక మృతిచెందాయి. తెలంగాణలో కొన్ని చోట్ల కోళ్లు చనిపోయిన మాట వాస్తమేనని, అవి పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడంతో వాతావరణంలో మార్పు వల్ల చనిపోయాయని’’ మంత్రి వివరించారు. బర్డ్ ఫ్లూను ఎదుర్కొనేందుకు 13 వందల బృందాలు రెడీగా ఉన్నాయన్నారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: 40 వేల మందికి ఈసీ షాక్!) డీడీలు కట్టిన 28 వేల 335 మందికి సబ్సిడీపై గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రూ.360 కోట్ల వ్యయంతో గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 16న నల్గొండలో గొర్రెల పంపిణీ రెండో విడత ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12 నుండి హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. వరదలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు 10 వేల రూపాయలు చెల్లించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. -
అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని.. అక్క చెల్లెమ్మలు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. అందుకే వారి ముఖాల్లో అహర్నిశలు సంతోషం ఉండేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో భాగంగా అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో మేకలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేసే ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను బహూకరించారు. అనంతరం జిల్లాల్లోని లబ్ధిదారులనుద్ధేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు మూడు దశల్లో పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం అత్యంత తృప్తి ఇచ్చే పథకాల్లో ఒకటి అని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.. ► గ్రామీణ ప్రాంతాల్లో చేయూత, ఆసరా కింద ఇచ్చిన డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేసుకునేలా సహకారం అందిస్తున్నాం. దాని వల్ల అదే గ్రామంలో వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ఆదాయ వనరు ఏర్పరచినట్లు అవుతుంది. తద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మారుతాయి. ► చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వడంతో పాటు, కుటుంబ సభ్యుడిగా వారిని చేయి పట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఇదే ఉదాహరణ. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ► అమూల్‌తో ఒప్పందం తర్వాత రూ.3,500 కోట్లతో 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు.. అంటే ఒక ఆవు, దూడ.. లేదా కడుపుతో ఉన్న గేదె పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఇవాళ రూ.1,869 కోట్లతో 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఒక్కో యూనిట్లో ఐదారు నెలల వయసున్న 14 మేకలు లేదా గొర్రెలు.. ఒక మేకపోతు లేదా పొట్టేలు ఉంటుంది. మొత్తంగా రూ.5,500 కోట్ల వ్యయంతో అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ► 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్ల పంపిణీని వారం క్రితం ప్రారంభించాం. ఈ పథకం ప్రారంభం రోజున 7 వేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి (2022) వరకు 3.69 లక్షల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఆ విధంగా దాదాపు 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ జరుగుతుంది. ► 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం. తొలి దశలో వచ్చే మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు, రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడో విడతలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఇందుకోసం దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలను ఎక్కడెక్కడి నుంచో సేకరించాల్సి వస్తోంది. అందుకే మూడు దశల్లో కార్యక్రమం చేపట్టాం. పలు సంస్థలతో ఒప్పందం ► చేయూత సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా జీవనోపాధి కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చూసేందుకు ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్ఎల్ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ► స్థానిక జాతుల్లో నచ్చిన మేకలు, గొర్రెలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. సరైన ధరకు వచ్చేలా, అన్నీ సవ్యంగా జరగడం కోసం ప్రత్యేకంగా ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్ అధికారులు, బ్యాంక్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ లబ్ధిదారుడికి అడుగడుగునా తోడుగా నిలుస్తుంది. ► రాష్ట్రంలో మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే అంత కంటే ఎక్కువ ధర వస్తే అక్కచెల్లెమ్మలు నేరుగా అమ్ముకోవచ్చు. అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేల ద్వారా మరిన్ని సేవలు ► గ్రామాలలో ఆర్బీకేలు రైతులకు వ్యవసాయ పరంగానే కాకుండా, పశు పోషణలో కూడా తోడ్పడతాయి. రైతులు, అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తాయి. పశువుల మంచి చెడులు చూసే వ్యవస్థ కూడా ఆర్బీకేలలో ఉంటుంది. ► నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ, సమతుల్యమైన దాణా సరఫరా వంటివి ఆర్బీకేల పరిధిలో ఉంటాయి. వైఎస్సార్ సన్నజీవుల నష్ట పరిహారం పథకాన్ని (ఇన్సూ్యరెన్స్), టీకాలు వేయడం, వెటర్నరీ సర్వీసులను కూడా ఆర్బీకేల పరిధిలోకి తెస్తాం. ► పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాటు కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తే బాగుంటుందని ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరింత తోడుగా నిలుస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు మరింత తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా (సీఎం స్వాగతించారు) ఇదే సరైన సమయం. బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మేకలు, గొర్రెలలో మంచి బ్రీడ్ ఉంది. వాటిని ఇక్కడికి కూడా తీసుకువస్తే.. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకు మేము సహకరిస్తాం. (ఈ విషయాన్ని వెంటనే పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు) – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇర్ఫాన్ అల్లానా, అల్లానా గ్రూప్ చైర్మన్ అక్క చెల్లెమ్మలు చేపట్టబోయే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తీసుకు వచ్చేందుకు ఏడాదిన్నరగా ఎన్నో పథకాలు అమలు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఇస్తూ చట్టం చేశాం. మరోవైపు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం. వీరికి ఇంకా మేలు చేసే అవకాశం దేవుడు కల్పించాలి. గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని భావించలేదు. వ్యవసాయంతో పాటు మేకలు, పశువులు, కోళ్లు, చేపల సాగు వంటివి చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. కరవు కాటకాలు వచ్చినా అవి ఆదుకుంటాయి. రైతన్నలు, అక్క చెల్లెమ్మలకు అదనంగా ఆదాయం కల్పించే వనరులివి. నాన్న గారిని మించి మేలు చేస్తున్నారు నాకు 47 ఏళ్లు. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 తీసుకున్నాను. బ్యాంకు ద్వారా రూ.56,250 రుణం వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఏపీఎం, బ్యాంకు ఆఫీసర్ వచ్చి మొత్తం రూ.75 వేలతో జీవాలు కొనిచ్చారు. చాలా ఆనందంగా ఉంది. రైతు భరోసా కేంద్రం ద్వారా టీకాలు, మందులు ఉచితంగా ఇస్తారు. మహిళలందరం పలు పథకాల వల్ల లబ్ధిపొందుతున్నాం. నాన్న గారి కంటే మించి మీరు మేలు చేస్తున్నారు. మా మహిళల దీవెనలన్నీ మీకే ఉంటాయి. – మరియమ్మ, రుద్రవరం గ్రామం, బేతంచర్ల మండలం, కర్నూలు జిల్లా. జీవనాధారం దొరికింది వైఎస్సార్ చేయూత సొమ్ము, లోన్ ద్వారా 14 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఇచ్చారు. మేం నష్టపోకుండా ఎలా సాకాలన్న దానిపై మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మాకు జీవనాధారం దొరికింది. గతంలో రుణాల కోసం పనులు మానుకుని, తిండి లేకుండా పడిగాపులు కాసేవాళ్లం. ఇప్పుడు మీరు పెట్టిన గ్రామ సచివాలయాల వల్ల, వలంటీర్ల వల్ల మా పనులు సులభంగా అవుతున్నాయి. రైతు భరోసా, పింఛన్లు, అమ్మ ఒడి, విద్యా కానుక.. ఇలా ఎన్నో పథకాల వల్ల అందరికీ మేలు జరుగుతోంది. కరోనా కష్టకాలంలో మీ వల్ల మూడు పూటలా అన్నం తిన్నాం. చాలా సంతోషంగా ఉంది. – దానమ్మ, ఎరుమల్లపాడు, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా. మా కాలంలో నువ్వే రాముడివి 14 గొర్రెలు, ఒక పొట్టేలు డాక్టర్లు సూచించినవే తీసుకున్నాను. వాటిని బాగా మేపుకుంటే మంచిగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఎక్కడా పనికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆదాయం పెరుగుతుంది. పిల్లలను ధైర్యంగా చదివించుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాపకు అమ్మఒడి వచ్చింది. నాకు వితంతు పింఛన్ వస్తోంది. మా సంఘానికి రుణమాఫీ కూడా వచ్చింది. ‘ఇప్పుడు మా దేవుడు ఇంటికాడ కొచ్చి పింఛన్ ఇత్తాండు’ అని మా నాన్న పొగుడుతున్నాడు. అన్నా.. రాఖీ పండుగ రోజు నీ ఫొటో గూట్లో పెట్టి రాఖీ కట్టాను. రామ రాజ్యం గొప్పదని పెద్దలు అంటారు.. అదెలాంటిదో మేం చూడలేదన్నా.. మా కాలంలో నువ్వే రాముడివి. దేవుడివి. – లక్ష్మీదేవి, నాయనపల్లి, అనంతపురం జిల్లా మీ మేలు మరవలేం పాదయాత్రలో మీరు ప్రకటించిన విధంగా మాకు అన్ని విధాలా మేలు చేస్తున్నారు. జగనన్న జీవ క్రాంతిలో భాగంగా మేకలను పొందడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి ద్వారా బాగా అభివృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది. నా ముగ్గురు పిల్లలకు విద్యా దీవెన అందింది. మా అత్తకు పింఛన్ వస్తోంది. ఇంటింటికీ తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు. కరోనా సమయంలో బాగా ఆదుకున్నారు. మీ మేలు మరవలేము. – సవర ఇవాంజెలిన్, సిరిపురం గ్రామం, పలాస, శ్రీకాకుళం జిల్లా. జగనన్న జీవక్రాంతి పథకం లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు రైతుల మాదిరిగా పశువులకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొన్న వారికి ఇది ఉపయోగ పడుతుంది. కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు జారీ చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ -
డీడీలు కట్టినా.. గొర్రెలు రాలే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రెండేళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. అప్పు చేసి డీడీలు కట్టినా ఇంకా గొర్రెలను ఇవ్వలేదని 28 వేల మం ది గొర్రెల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3.70 లక్షల మందికి పంపిణీ.. వాస్తవానికి రాష్ట్రంలో గొర్రెల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెంపకందారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7.25 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. తొలి విడతలో భాగంగా 3.70 లక్షల మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి దాదాపు రూ.3,700 కోట్ల వ్యయంతో 2017 జూన్ నుంచి 2018 ఏప్రిల్ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దీని కింద 20+1 గొర్రెలను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించి అందులో 25 శాతం అంటే రూ.31,250 లబ్ధిదారుల వాటాగా తీసుకుని మిగిలిన రూ.93,750 ప్రభుత్వమే భరించింది. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. ముందస్తు అసెంబ్లీతోపాటు వరుస ఎన్నికల కోడ్, నిధుల లేమి పేరుతో ఇప్పటివరకు గొర్రెలను పంపిణీ చేయలేదు. 28 వేల మందికి గొర్రెల పంపిణీకి దాదాపు రూ.300 కోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు నిధులు కూడా గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య, జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో ఉన్నాయని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు. -
గొర్రెలు యాడబోయె..!
సాక్షి, వరంగల్: గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు మోక్షం కలిగేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారిపై విచారణ ముమ్మరమైంది. ఈ అక్రమాలపై ఓ వైపు కోర్టు కేసు.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారి అవినీతి అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. కొందరు అధి కారుల నిర్లక్ష్యం, కక్కుర్తి, దళారుల ప్రలోభాల కారణంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అబాసుపాలైన విషయం తెలిసిందే. ఇదే పథకంలో అక్రమాలపై ఓ వైపు కోర్టులో ‘పిల్’పై విచారణ.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతుండటంతో రెండో విడత పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 47,750 యూనిట్లు పంపిణీ లక్ష్యం కాగా 3,787 యూనిట్లు పంపిణీ చేసిన తర్వాత బ్రేక్ వేశారు. లబ్ధిదారులు డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) కట్టి ఆరు నెలలు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో అక్రమాలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 575 సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 60 వేల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే మొదటి విడతలో ప్రభుత్వం యాదవులను మాత్రమే పెంపకందారులుగా గుర్తించింది. విడతల వారీగా అర్హులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొదటి విడత(ఎ–లిస్టు)లో 50,678 యూనిట్లు మంజూరు చేసింది. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించి పంపిణీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది ఒక కమిటీగా మొత్తం ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ జరిగింది. మహారాష్ట్రతో పాటు కడప జిల్లాలోని ఆరు మండలాల్లో గొర్రెల కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. వాటికి ఇన్సూరెన్స్ ట్యాగ్లు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా జిల్లాకు పంపాల్సి వుండగా.. ఇక్కడే అనేక అక్రమాలు జరిగినట్లు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చాయి. వరంగల్ పాత జిల్లా పరిధిలో 50,678 యూనిట్లకుగాను అధికారులు 49,276 యూనిట్లు(97 శాతం) గ్రౌండింగ్ చేయగా.. చాలా చోట్ల రీ–సైక్లింగ్ జరిగినట్లు ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన డీవీఅండ్ఏహెచ్ఓ డాక్టర్ ఎం.బాలకిషన్, జనగామ జిల్లా బచ్చన్నపేట వీఏఎస్ డాక్టర్ కె.హరికిషన్లపై చర్యలకు ఈ బృందం ఫెడరేషన్ ఎండీకి సిఫారసు చేసింది. కొనుగోలు పథకంలో జరిగిన అక్రమాల జాబితాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది. రెండో విడత ఇప్పట్లో లేనట్టేనా..? రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే సుమారు 4,200 మందికిపైగా డీడీలు చెల్లించగా 1,349 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో మొదటి విడతలో పలుచోట్ల లెక్కలేనన్ని అవినీతి అక్రమాలు జరగడం.. అవి ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తుండటంతో మొత్తానికే పంపిణీ నిలిపి వేశారు. ఇదిలా ఉండగా గొర్రెల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనన్ని భావించిన పశు సంవర్థకశాఖ అధికారులు వర్షాకాలం ప్రారంభం కావడంతో సుమారు నెలన్నర నుంచి పశువుల రోగనిరోధక చర్యల్లో భాగంగా నట్టల మందు, గాలికుంటు వ్యాధి, చిటుకు రోగాల నివారణ టీకాలు ఇచ్చే పనిలో ఉన్నారు. పెద్దరోగం(పీపీఆర్) లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందన్న సంకేతాలతో ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం మరో 25 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఇప్పట్లో మొదలు కాకపోవచ్చనే అధికారులు చెప్తున్నారు. -
ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ
సాక్షి, అర్వపల్లి: రెండో విడత గొర్రెల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంకా మొదటి విడత ప్రక్రియే కొనసాగుతోంది. రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. గొర్రెల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ ఊసేలేదు. తమకు గొర్రెలు వస్తాయో రావో అనే ఆందోళనలో గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెల కాపరుల సంక్షేమం, ఆర్థి కాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్ విలువ రూ. 1.11 లక్షలు కాగా లబ్ధిదారుల వాటా రూ.27,750, మిగిలిన రూ.83,250 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో 2017 మే, జూన్ నెలల్లో ఒకే సారి మొదటి, రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడత లక్ష్యం 17,732 యూనిట్లు కాగా, ఇప్పటి వరకు గొర్రెల కాపరులు 17,257 యూనిట్లకు డీడీలు చెల్లించారు. కాగా 16,759 యూనిట్లు పంపిణీ చేశారు. మరో 498 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. మొదటి విడతలో కాపరులు తమ వాటాధనం కింద 16,759 యూనిట్లకు రూ.46,50, 62,250 చెల్లించగా ప్రభుత్వం రూ.1,39,51,86,750 విలువ చేసే గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ విడతలో మొత్తం గొర్రెల పంపిణీకి సుమారు రూ.186 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ ప్రక్రియ 201మే వరకుపూర్తికావాల్సి ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. సబ్సిడీ గొర్రెలను అమ్ముకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వం 75శాతం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తుండగా అనేక చోట్ల గొర్రెలను అమ్మేసుకుంటున్నారు. అలాగే రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చిన గొర్రెలకు కలిగిన సంతానాన్ని మాత్రమే విక్రయించాలనేది నిబంధన. గొర్రెల మేతకోసం కూడా గడ్డి విత్తనాలను అందిస్తున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం గొర్రెలు అవసరం లేని కాపరులను గుర్తించి వల వేస్తున్నారు. లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ రెండో విడత లబ్ధిదారులను 2017 మే, జూన్ నెలల్లో గుర్తించారు. ఈ విడతలో జిల్లాలో 17,325 గొర్రెల యూనిట్ల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 జూన్‌లో రెండో విడత పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా ఇంతవరకు రెండో విడతపై ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు. తమకు రెండో విడత గొర్రెలు వస్తాయో, రావోనని ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో.. ఇదీ పరిస్థితి.. మొత్తం యూనిట్లు 17,732 డీడీలు చెల్లించినవారు 17,257 ఇప్పటి వరకు పంపిణీ చేసిన యూనిట్లు 16,759 గ్రౌండింగ్ అయినవి 498 మొత్తం ఖర్చు రూ.186కోట్లు రెండో విడత లక్ష్యం 17,325లక్ష్యం రెండో విడతపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు రెండో విడత రాయితీ గొర్రెల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. రెండో విడతలో జిల్లాలో 17,325 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతకు సంబంధించి 17,732 యూనిట్లకు గాను 16,759 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశాం. ఇందుకోసం రూ.186కోట్లు ఖర్చు చేయడం జరిగింది. – వేణుమనోహరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గొర్రెలు ఇస్తే ఉపాధి కలుగుతుంది రెండోవిడత లబ్ధిదారుల జాబితాలో నాపేరు ఉంది. ఇంతవరకు గొర్రెలు రాలేదు. నాభర్త అకాల మరణం పొందారు. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాను. గొర్రెలు ఇస్తే వాటిని పెంచుకొని ఉపాధి పొందుతా. ఇప్పటికైనా గొర్రెలను పంపిణీ చేయాలి. – వజ్జె వల్లమ్మ, రెండో విడత లబ్ధిదారురాలు, రామన్నగూడెం, జాజిరెడ్డిగూడెం మండలం -
టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణం జరిగిందంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వంతో పాటు సీబీఐని పిటిషనర్ ప్రతి వాదులుగా చేర్చారు. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
రెండో విడత ఏది..?
సాక్షి, వరంగల్ రూరల్ : ఆర్భాటంగా ప్రారంభించారు.. అద్భుతంగా ఉంటుందన్నారు.. ఆర్థికంగా పోరగమి స్తారని తెలిపారు.కాని క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో లోపాలు గొల్ల కురుమల పాలిట శాపాలుగా మారుతు న్నాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ ఇంతవరకూ జరుగలేదంటే అతిశయోక్తి కాదు. గొల్ల, కురుమ, యా దవుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 237 గొర్రెల కాపర్ల సొసైటీలు ఉండగా అందులో 26,152 సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి విడతలో 13,111, రెండో విడతలో 13,052 మంది సభ్యులకు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జూన్ 20, 2017న జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. మొదటి విడతలో 13,111 మంజూరు కాగా 12,832 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటి వరకు 77 మందికే అందించారు. గొర్రెల పంపిణీ ఇలా.. గొర్రెల కాపరుల సంఘాల్లో సభ్యులైన వారంతా ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. జిల్లాలో ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ1.25లక్షలు. ఇందులో 75 శాతం సబ్సిడీ అందజేస్తారు. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు తన వాటా కింద చెల్లిస్తున్నాడు. అంటే ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి సబ్సిడీ కింద 75 శాతం అనగా రూ.93,750 రాయితీ ఇస్తున్నారు. మిగతా 25శాతం రూ 31,250 లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి, కాపర్ల సంఘాల్లోని కొందరు సభ్యులతో ఓ కొనుగోలు కమిటీ ఉంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసువచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వీటికి ఉచితంగా ఇన్సూరెన్స్ చేయనున్నారు. ఇది కూడా డాక్టర్లే చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేది. రెండో విడతలో 77 మందికే అందజేత రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటివరకు 77 మందికే అందించారు. అక్టోబర్, 2018న ప్రారంభమైన రెండో విడత ఇప్పటి వరకూ పుంజుకోలేదు. డీడీ కట్టేదుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా గొర్రెలు అందించే వారు కరువయ్యారు. మొదటి విడత ఏప్రిల్, 2018 నాటికి పూర్తికావల్సి ఉన్న నేటికి పూర్తి కాలేదు. మాకు కూడా గొర్రెలు ఇయ్యాలే.. మాది చెన్నారావుపేట మం డల కేంద్రం. మా కురుమ సంఘంలో 105 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతగా మా సంఘంలో 53 మందికి ఇచ్చారు. రెండో విడత వెంటనే ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. గొర్రెలు తీసుకున్నవాళ్లు లాభపడ్డారు. మాకు గొర్రె లేదు.. ఏది లేదు. అడిగితే ఎన్నికల కోడ్ ఉన్నది. అయిపోయాక ఇస్తామని చెబుతున్నారు. కొందరికి ఇచ్చి కొందరికి ఆపడం ఏంది.. మాకూ కూడా సర్కారు తొందరగా ఇచ్చి ఆదుకోవాలి. –చిట్టె మల్లయ్య, గొర్రెల కాపరి, చెన్నారావుపేట రెండేళ్లయినా.. రెండో విడత లేదు.. మా ఊరిలో గొర్రెల పంపిణీ కోసం గ్రామ సభలు పెట్టి ముందస్తుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో సగం మందికి గొర్రెలు ఇచ్చారు. మిగతా సగం మంది లబ్ధిదారులకు ఏడాది లోపు సబ్సిడీ గొర్రెలు ఇస్తామన్నారు. కానీ రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని దాటవేస్తున్నారు. వెంటనే ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేయాలి. –పెద్దబోయిన రాజన్న, నల్లబెల్లి -
‘మంద’ గమనమే!
నేలకొండపల్లి: ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెల మందకు సంబంధించి బీమా గడువు ముగియగా..దీని కొనసాగింపు, రెన్యూవల్‌పై స్పష్టత లేక జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి ప్రభుత్వమే రెన్యూవల్ చేస్తుందేమోనని గొల్ల, కురమలు భావిస్తుండగా..లబ్ధిదారులే చేయించుకోవాలని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే..ఈ మేరకు క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా ప్రచారం చేయకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదైనా జరిగి జీవాలకు ప్రాణనష్టం కలిగితే చివరకు పరిహారం సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. గొల్ల, కురమల అభివృద్ధికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై జీవాలను పంపిణీ చేసిన విషయం విదితమే. వాటికి సంబంధించి సర్కారు చేయించిన బీమా పాలసీ గడువు తాజాగా తీరిపోయింది. 2017లో ప్రభుత్వం గొల్ల, కురమలకు మెదటి విడతగా 15,500 యూనిట్లు పంపిణీ చేసింది. గొర్రెలు కొనుగోలు చేసినప్పటి నుంచి ఏడాది వరకు బీమా వర్తించేలా సదరు కంపెనీతో ఒప్పందం కదుర్చుకుని ప్రభుత్వమే అప్పట్లో పాలసీ చేయించింది. ఇప్పటి వరకు దాదాపు 80శాతానికి పైగా యూనిట్ల పాలసీ గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పాలసీని రెన్యూవల్ చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. రాయితీ గొర్రెల పథకం కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు. యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా ఇందులో 75 శాతం రాయితీ వర్తించింది. లబ్ధిదారులు తమ వాటాగా రూ.31,250ని డీడీ రూపంలో చెల్లించారు. జీవాలను కొనుగోలు చేసిన సమయంలో యూనిట్‌కు రూ.2,830తో ప్రభుత్వం బీమా చేయించింది. తద్వారా పెంపకందారులకు ఎంతో లబ్ధి కలిగింది. ప్రమాదవశాత్తూ జీవాలు మృత్యువాత పడితే పరిహారం అందింది. గతేడాది ఇచ్చిన వాటిలో 1400 జీవాలు చనిపోయాయి. ఇప్పటి వరకు 1200 జీవాలకు నష్టపరిహారం అందించారు. ఆడ జీవాలకు రూ.5,200, మగ జీవాలకు రూ.7 వేల చొప్పున నష్ట పరహారం సొమ్మును ఇచ్చారు. అయితే..ఇప్పుడు పాలసీ రెన్యూవల్ చేయించుకోవడంపై అధికారులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయట్లేదు. అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో..ఈ రెన్యూవల్ ప్రక్రియ మందగమనంగా సాగుతోంది. జీవాలు చనిపోతే..నష్టపరిహారం అందక వీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా బాధ్యులు స్పందించి..గొర్రెల బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకునే విధానంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరముంది. లబ్ధిదారులేమో..ఈ సారి కూడా ప్రభుత్వమే తమ జీవాలకు రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వమే బీమా చేయించాలి.. సబ్సీడీ గొర్రెలను కొనుగోలు చేసేటప్పడు ప్రభుత్వం ఆ యూనిట్లకు బీమా చేయించింది. గడువు ముగిసిన అనంతరం కూడా మళ్లీ చేస్తే బాగుంటుంది. అలా అయితే..మాకు మరింత ప్రోత్సాహకం ఇచ్చినట్లవుతుంది. – చిర్రా బాబు, లబ్ధిదారుడు, అనాసాగారం పథకం పట్ల నిర్లక్ష్యం వద్దు.. యాదవులకు అందించిన గొర్రెల యూనిట్ల పథకం పట్ల నిర్లక్ష్యం తగదు. చనిపోయిన గొర్రెలకు చాలా వరకు నష్టపరిహారం అందించలేదు. రెండో విడతలో నేటి వరకు పంపిణీ చేయలేదు. ఇబ్బందులు లేకుండా చూడాలి. – యడ్ల తిరపరావు, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా నాయకులు -
ఒక్కరోజులోనే అమ్మకానికి!
నారాయణపేట: రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.75 వేలు వెచ్చించి 21 గొర్రెలను అందిస్తోంది. వీటితో ఆయా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. నారా యణపేట జిల్లాలోని మరికల్‌కు చెందిన గొర్రెల కాపరులకు సోమవారం పశుసంవర్ధకశాఖ అధికారులు 64 యూనిట్లకు గాను లబ్ధిదారులు ఒక్కొక్క యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున అందజేశారు. అయితే కాపరులు గొర్రెలను పొంది ఒకరోజు సైతం తమ వద్ద పెట్టుకోకుండా దళారులతో కుమ్మక్కై బేరం చేసుకోవడంతో వాటిని ప్రత్యేక వాహనంలో నల్లగొండ జిల్లా మల్లెపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల వద్ద పట్టుబడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మధ్యవర్తి సాయం తీసుకుంటున్నారు. అక్కడే గొర్రెకు పోగువేసి జిల్లాకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చి మరికల్లో కాపరులకు అందజేశారు. దళారులచే విక్రయాలు ప్రభుత్వ సబ్సిడీతో కొనుగోలు చేసిన గొర్రెలను ఎక్కడ పెంచుకుంటాం.. ఒక్కసారే అమ్మితే పోలా అంటూ కాపరులు అధిక సొమ్ముకు ఆశపడి దళారులతో కుమ్మక్కై గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఒక్కో యూనిట్లో దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొర్రెలు ఒక్కసారిగా విక్రయాలు చేయడంతో దళారులకు కాసుల పంటనే చెప్పవచ్చు. 64 యూనిట్లు అంటే 1344 గొర్రెలు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున అధికంగా విక్రయించిన రూ.32 లక్షల లాభం వస్తుంది. ఇందులో లబ్ధిదారులకు సగం ఇచ్చినా.. మిగతా సగం దళారుల సొంతమవుతుంది. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెలు అమ్మితే సభ్యత్వం రద్దు మరికల్ (నారాయణపేట): గొర్రెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అక్రమంగా అమ్మి న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య అన్నారు. మరికల్లో డీడీలు కట్టిన వారికి 64 యూనిట్లను మం జూరు చేశామని, ఈ మేరకు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసిన రోజు రాత్రికే చట్టానికి విరుద్ధంగా గొర్రెలను మాచర్ల కొనుగోలుదారులకు అమ్మిన లబ్ధిదారుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామన్నారు. అలాగే ఆ గ్రామాన్ని సైతం బ్లాక్ లిస్టులో పెట్టి మిగతా లబ్ధిదారులకు కూడా గొర్రెలను నిలిపివేస్తామన్నారు. దీంతోపాటు సం ఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. పట్టుబడిన గొర్రెలను డీడీలు కట్టిన ఇతర గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తా మన్నారు. అక్రమంగా గొర్రెలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభు త్వ సబ్సిడీ గొర్రెలను దొడ్డిదారిన అమ్మితే ఎంతటి వారైనా సరే కేసులు తప్పవని హెచ్చరించారు. -
రెండో విడత గొర్రెల పంపిణీ
మెదక్ అర్బన్: రెండో విడత గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి పశుసంవర్థశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన పశుసంవర్థక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అనంతపురం నుంచి గొర్రెలను తీసుకోవాలని సూచించడం జరిగిందని దాని స్థానంలో కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునేలా అవకాశం కల్పించాలని మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరారు. లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలను అమ్మడం నేరమని తెలిపారు. అలా అమ్మినట్లు నిరూపణ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎండీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ రెండో విడత కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గొర్రెల పెంపకంతో ఆయా వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి మండల స్థాయి అధికారులు లబ్ధిదారులకు అందచేసిన గొర్రెలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. ఏ ఒక్క లబ్ధిదారులు కూడా గొర్రెలను అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంపిణీ చేసిన గొర్రెలు అక్రమ రవాణా జరగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీటి తొట్లకు మరమ్మతులు.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పశువులకు తాగునీటి సౌకర్యాలతో పాటు పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి పశుసంవర్థక శాఖ అధికారులను ఆదే«శించారు. జిల్లాలో రబీ సీజన్లో వ్యవసాయానికి అవసరమైన పరిస్థితులు లేవన్నారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు సైతం తాగునీటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఎంపీడీఓలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లకు చిన్నచిన్న మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఏ గ్రామంలో అయినా కొత్తగా నీటి తొట్లు నిర్మించేందుకు అవసరం ఉంటే ఎన్ఆర్జీఎస్ పథకం కింద నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ, ఉద్యానవన శాఖలు సైతం పశుగ్రాసం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా నుంచి 500 మెట్రిక్ టన్నుల విత్తనాలకు ప్రతిపాదనలు పంపాలని ఏడీ అశోక్కుమార్కుసూచించారు. అటవీ ప్రాంతంలో నాటే విత్తనాలపై స్థానిక వెటర్నీరీ అసిస్టెంట్‌తో పాటు అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎఫ్ఓ పద్మజారాణి, డీటీవో గణేష్, మెదక్ డీఎస్పీ క్రిష్ణమూర్తి, ఏడీ వెంకటయ్యతో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెపిల్ల....మురిసె గొల్ల
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గొర్రె బలుస్తే గొల్లకు లాభం.. అనే నానుడి వాస్తవ రూపం దాల్చుతోందని అంటున్నారు.. పశుసంవర్ధక శాఖ అధికారులు. జిల్లాలో గతేడాది గొల్ల, కుర్మల లబ్ధిదారులకు సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 93 వేల గొర్రె పిల్లలు జన్మించాయని పశు సంవర్థక శాఖ గుర్తించింది. తద్వారా సుమారు రూ.30 కోట్ల మేరకు లబ్ధిదారులకు ఆదాయం లభించినట్లు అంచనా వేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 9,631 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 8,522 యూనిట్లు పంపిణీ చేయగలిగారు. ఒక్కో యూనిట్ వ్యయం రూ.1.25 లక్షలు ఉండగా.. లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేశారు. ఇందుకోసం మొదటి విడతలో రూ.94.59 కోట్లు ఖర్చు చేశారు. మూడు నెలల వయస్సు దాటిన గొర్రె పిల్ల సుమారు రూ.మూడు వేల వరకు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రకు మన బృందాలు.. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం మహారాష్ట్రలోని హింగోళి, జాల్నాలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు పశువైద్యులు, కొందరు లబ్ధిదారుల ప్రతినిధుల బృందం ఇటీవల హింగోళి, జాల్నాకు వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం 2018–19లో 9,475 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 472 యూనిట్లు గొర్రెలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌తో జాప్యం.. ఎన్నికల కోడ్ కారణంగా రెండో విడత గొర్రెల పంపిణీలో కొంత జాప్యం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా కోడ్ అమలులో ఉంది. దీంతో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం వీలు కాలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పశుసంవర్థక శాఖ ఈ గొర్రెల పంపిణీ పథకంపై దృష్టి సారించింది. గొర్రెల కొనుగోలుకు ప్రక్రియను వేగవంతం చేసింది. చనిపోయిన గొర్రెల స్థానంలో.. గతేడాది లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెల్లో సుమారు 5,230 గొర్రెలు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. గొర్రెల బీమా పథకం కింద చనిపోయిన గొర్రెల స్థానంలో పంపిణీ చేయాల్సిన గొర్రెలను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మరణించిన 5,230 గొర్రెలకు సంబంధించి బీమా కంపెనీ నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులు జమ చేశారు. ఈ బీమా పరిహారం నిధులతో చనిపోయిన గొర్రెల స్థానంలో కొనుగోలు చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గొర్రెల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేకపోవడంతో ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాము. ఇప్పటి వరకు 557 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. వీటితో పాటు, గొర్రెల బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు, దాణా వంటివి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందజేచేస్తున్నాము. డాక్టర్ బాలిక్ అహ్మద్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి -
తెచ్చుడు.. అమ్ముడే!
సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతుందడానికి మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లి గ్రామమే నిదర్శనం. ఈ గ్రామానికి మొత్తం 34 యూనిట్లు మంజూరైతే రెండు రోజుల క్రితం 32 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. గొల్ల కురుమ సంఘం నేత బంధువులకు సంబంధించి రెండు యూనిట్లు గ్రామానికి రాకుండానే కాగితాలపైనే మంజూరు చూపిస్తుండటం గమనార్హం. ఇందులో పశుసంవర్ధకశాఖ అధికారుల పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు యూనిట్లే కాకుండా మంజూరైన మిగతా గొర్రెలను కూడా గ్రామం నుంచి తరలించినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసు పాలవుతుందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో అపహాస్యమవుతోంది. గొల్ల, కురుమల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం క్షేత్ర స్థాయిలో పక్కదారి పడుతోంది. అధికారులు, రాజకీయ నాయకులు, లబ్ధిదారులు ఒకటవ్వడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం లక్ష్యాన్ని చేరడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు నిఘా లేకపోవడం.. చెక్‌పోస్టులు ఉన్నా వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ దందా జోరుగా కొనసాగుతుంది. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెలను మరుసటి రోజే లబ్ధిదారులు అమ్ముకుంటున్న ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గొర్రెలు ఇచ్చింది అమ్ముకోవడానికా.. పెంచుకోవడానికా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా ‘మామూళ్ల’ మైకంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిఘా కొరవడంతో.. అటు చెక్‌పోస్టుల కంట పడకుండా పక్కా ప్లాన్‌తో మారుమూల గ్రామాల మీదుగా రాత్రి వేళల్లో సరిహద్దు దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఈ పథకం తీరు తెన్నులను సమీక్షించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జోరుగా కమీషన్లు గొర్రెల పథకం ఇటు దళారులు, అటు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. జిల్లాలో 528 యాదవ సంఘాల్లో 54,591 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. వీరిలో మొదటి విడతలో 27,075 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి గత ఏడాది నుంచి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో 22,197 మంది లబ్ధిదారులకు 4,66,137 గొర్రెలను పంపిణీ చేశారు. వీటిలో 20 శాతం కూడా లబ్ధిదారుల వద్ద లేవని యాదవ సంఘం సభ్యులే చెబుతుండడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో గొర్రెల కొనుగోలు కోసం రూ.277.46 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అధికారులు, దళారులు కలిసి 20శాతం చొప్పున కమీషన్ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఆదాయంలో అందరికీ స్థాయిని బట్టి వాటాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద ఎత్తున గొర్రెలు రీసైక్లింగ్ జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం పథకం తీరు తెన్నులను సమీక్షించడానికి సిద్ధపడడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎలా తరలిస్తారంటే... సబ్సిడీ గొర్రెలను దళారులు చాలా చాకచక్యంగా తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు కేంద్రానికి దూరంగా ఉంటే సబ్సిడీ గొర్రెల చెవులకు ఉన్న ట్యాగ్‌లను తొలగించి రాత్రి సమయంలో వాహనాల్లో గుర్తుపట్టకుండా సాధారణ గొర్రెల్లో కలిపి తరలిస్తున్నారు. ఇక దగ్గర్లో ఉంటే మేత కోసమని నడిపించుకుంటూ సరిహద్దు దాటగానే వాహనాలు ఎక్కించి తరలిస్తున్నారు. ఈలోగా ఎవరైనా గుర్తుపట్టి సబ్సిడీ గొర్రెలు తరలుతున్నాయని అధికారులకు సమాచారం ఇస్తే అప్పుడు ఇక్కడ మేత లేదు.. కాసే వారు లేరు.. మా బంధువుల ఇంటికి తోలుతున్నామని చెబుతుంటారు. గట్టిగా నిలదీస్తే ఎంతోకొంత ముట్టజెప్పి వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరు ప్రధాన రహదారుల్లో కాకుండా అధికారుల సూచన మేరకు మారుమూల గ్రామాల మీదుగా వెళ్తున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలోనే తొలి కేసు ఇక్కడే... సబ్సిడీ గొర్రెల పథకం అమలులో భాగంగా గొర్రెల రీసైక్లింగ్ చేసే విషయంలో 2017 సంవత్సరంలో జిల్లాలోని హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెలను అమ్ముకోవడంతో వారిపై అధికారులు కేసులు నమోదు చేసి డబ్బు రికవరీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే గొర్రెల రీ సైక్లింగ్ విషయం ఇదే తొలికేసు కావడం గమనార్హం. అదేవిధంగా ధన్వాడ మండలంలో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు... అధికారుల మామూళ్ల మత్తు కారణంగా రీసైక్లింగ్ వ్యవహారాన్ని మామూలుగా తీసుకుంటున్నారు. గ్రామాల్లో గొర్రెలను విక్రయిస్తున్నారని సమాచారం ఇచ్చినా పశుసంవర్ధకశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే విక్రయాలు జరగకపోయేవని స్థానికులు అంటున్నారు. ప్రారంభంలో పంపిణీ చేసిన గొర్రెలనే లబ్ధిదారులు అమ్ముకున్నట్లు తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రా, తమిళనాడు నుంచి కొనుగోలు జిల్లాలోని పలు మండలాల లబ్ధిదారులకు గొర్రెలను అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేస్తున్న సమయంలోనే అక్కడి బేరగాళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిన వారు మాటముచ్చట పక్కా చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేసిన వెంటనే వారు యూనిట్లను కొనుగోలు చేసి మళ్లీ ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇలా క్రయ, విక్రయాలలో అధికారులకు స్థాయిని బట్టి వాటాలు కేటాయిస్తున్నారు. పోలీసులదే బాధ్యత జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. కానీ వాటిని అరికట్టేందుకు తగిన యంత్రాంగం మా వద్ద లేదు. పథకాన్ని అమలు చేయడం వరకు మాత్రమే మా బాధ్యత. గొర్రెలు సరిహద్దు దాటకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖది. గొర్రెలు రీసైక్లింగ్ జరగకుండా చూడాలని మేం ఇది వరకే పోలీసులకు సూచించాం. – దుర్గయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
ఇస్తారా..లేదా..!
సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు తీయడానికి లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పైసలు కట్టినా యూనిట్లు సకాలం లో యూనిట్లు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10వేల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 500 మంది మాత్రమే డీడీలు తీశారు. జిల్లాలో తొలి విడతలో 9,687 యూనిట్లు, రెండో విడతలో 9,655 యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. మొదటి విడత గ్రామాల్లో పంపిణీ పూర్తికాగా మునిసిపాలిటీ పరిధిలో 736 యూనిట్లకు అనుమతి రాకపోవడంతో అవి అలాగే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీఓ 74తో మునిసిపాలిటీల్లోనూ లబ్ధిదారులకు గొర్రెలు అందించేందుకు అనుమతి నిచ్చింది. వీటిని రెండో విడతలో కలిపి 10,391 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల్లో అనుమానాలు.. రెండో విడత సబ్సిడీ గొర్రెల యూనిట్లను తీసుకోవాలనుకునే వారిని అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని నాలుగు నెలలుగా గ్రామాల్లో చర్చజరుగుతుండడంతో లబ్ధిదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు డబ్బులు కడితే ఎప్పుడో యూనిట్లు ఇస్తారని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం ఈ పథకం ఉంటుందా.. లేదా? అని అనుమాన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది డీడీలు తీయడానికి వెనకాడుతున్నారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సంబంధిత అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో నెల లేదా రెండు నెలలు మాత్రమే పథకానికి తాత్కాలికంగా విరామం ఉంటుందని ఆ తర్వాత నుంచి డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రెలు అందిస్తామని చెబుతున్నారు. రెండో విడత గొర్రెల యూనిట్లను 2019 జూలై నాటికి పంపిణీ చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పంటలకే పెట్టుబడి పెడుతున్నారు. దీంతో తీరికగా డీడీలు కట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొనుగోలులో సాంకేతికత.. సబ్సిడీ గొర్రెల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి పటిష్ట్ట ప్రణాళికలతో అధికారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల కొనుగోలు విషయంలో సాంకేతికతను ఉపయోగించనున్నారు. జీవాలను కొనుగోలు చేసిన వెంటనే ప్రత్యక్షంగా ఫొటో తీసీ అప్లోడ్ చేయాల్సి చేయనున్నారు. లబ్ధిదారుడి వివరాలు, జీవాలు కొనుగోలు చేసిన ప్రాంతం, విక్రయించిన వ్యక్తి తదితర వివరాలు అప్పటికప్పుడే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచేలా ప్రణాళికలు రచించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఉన్న చోటు నుంచి వివరాలు, ఫొటోలు పంపాల్సిందే. ఒకవేళ సిగ్నల్ లేకపోతే మరుసటి రోజువరకు ఆగాల్సిందే. గొర్రెలను తరలించే వాహనానికి జీపీఎస్ అమర్చనున్నారు. దీనివల్ల కొనుగోలు ప్రాంతం నుంచి స్వస్థలానికి వచ్చే వరకు వాహనం ఎటువెళ్తోందనే విషయం అధికారులకు తెలుస్తుంది. దీంతో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు.. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లబ్ధిదారులకు దూరాభారం తప్పేలా లేదు. ఇంతకు ముందు జిల్లాలోని లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల వారు అనంతపురం వెళ్లి గొర్రెలను తీసుకువచ్చాక భూపాలపల్లి జిల్లా వారు వెళ్లడంతో నాణ్యమైన గొర్రెలు లభించలేదనే అపవాదు ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సారి మహారాష్ట్రలోని పూణే ప్రాంతం నుంచి గొర్రెలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై లోపు పంపిణీ పూర్తి చేస్తాం.. వచ్చే ఏడాది జూలై చివరి వరకు లబ్ధిదారులందరికీ గొర్రెల యూనిట్లు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాకు మొదటి విడత అనంతపురం నుంచి జీవాలను తీసుకువచ్చాం. రెండో విడతలో మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఎన్నికలు ఉన్నప్పటికీ పంపిణీకి ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్నికల షెడ్యూల్ కాలంలో మాత్రమే పంపిణీ తాత్కాలికంగా జరగదు. తర్వాత కొనసాగుతుంది. – బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నాణ్యమైన గొర్రెలు అందించాలి ఇప్పటికే రెండో విడత యూనిట్ల పంపిణీ అలస్యమైంది. నాణ్యమెన గొర్రెలు అందిస్తే బాగుంటుంది. గత విడతలో గ్రామాల్లో ఇచ్చారు. ఈ సారి భూపాలపల్లి మునిసిపాలిటీ ప్రాంతంలోని లబ్ధిదారులకు యూనిట్లు అందించాలి. – గుండబోయిన రాజైలు, వేశాలపల్లి, భూపాలపల్లి -
రెండో విడత షురూ..
గద్వాల వ్యవసాయం : గొర్రెల పెంపంకం అభివృద్ధి పథకంలో భాగంగా అందించే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలైంది. జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు ఇప్పటికే జాబితా ‘ఏ’ కింద మొదటి విడతను పూర్తి చేసి జాబితా ‘బీ’ కింద ఉన్న లబ్ధిదారులకు జూలై చివరివారం నుంచే పంపిణీ ప్రక్రియ ఆరభించారు. కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని గొర్రెలు కావాలని ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సైతం పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు. రాయితీ ఇలా.. పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్ 20న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో కురుమ యాదవులు గ్రామాల వారీగా సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. డిప్ ద్వార మొదటి విడత, రెండో విడత లబ్దిదారులను ఎంపిక చేశారు. మొదటివిడత లబ్దిదారులకు (లిస్ట్–ఏ) 2017–18లో, రెండో విడత లబ్ధిదారులకు (లిస్ట్–బి) 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్లో ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.25లక్షలు ఖర్చు అవుతుండగా ఇందులో లబ్దిదారుడు 25శాతం చెల్లిస్తే 75శాతం ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. శరవేగంగా రెండో విడత పంపిణీ రెండో విడత కింద (2018–19) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంపిణీ షురూ చేశారు. జూలై చివరివారం నుంచే ప్రక్రియ ప్రారంభంకాగా ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా కొన్ని యూనిట్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 487 యూనిట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఏపీలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. రెండో విడత గొర్రెలను ఏపీలోని కడప, మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని హుమనాబాద్‌ల నుంచి తీసుకొస్తున్నారు. పశుసంవర్దకశాఖ అధికారులు అక్కడి వెళ్లి గొర్రెల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 35,000 మందితో ప్రతిపాదనలు గత ఏడాది పథకాన్ని ప్రారంభించగా గొర్రెలను కావాలనుకునే పెంపకందారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అందరి సమక్షంలో డిప్ వేసి లిస్ట్ ఏ, బీగా విభజించారు. అయితే జిల్లాలో చాలామంది కురువ కులస్థులు తమను మాదాసి, మాదారి కురువలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల డిప్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్నప్పటికీ డిప్‌కు దూరంగా ఉన్నారు. ఇలా సుమారు 35వేల మంది ఉన్నారు. అయితే రెండో విడతలో తమకు గొర్రెల యూనిట్లను అందించాలని, అధికారులు రెండో విడతకు తోడు అదనంగా 35వేల యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించారు. అందరికీ న్యాయం మొదటివిడత గొర్రెల పంపిణీ లక్ష్యాన్ని పూర్తిచేశాం. రెండో విడతలోనూ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప, నాందేడ్, హుమనాబాద్ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తున్నాం. అయితే రెండోవిడతలో మరో 35వేల యూనిట్లు అదనంగా మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. – డాక్టర్ ఆదిత్య కేశవసాయి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు : 182 సహకార సంఘాల్లోని సభ్యులు : 35,300 మంది మొదటి విడత పంపిణీ లక్ష్యం : 10,872 యూనిట్లు ఇప్పటివరకు చేసింది : 10,520 యూనిట్లు రెండో విడత పంపిణీ లక్ష్యం : 10,782 ఇప్పటి వరకు చేసింది : 487 యూనిట్లు -
గొర్రెలు ఎప్పుడొస్తాయో?
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలసమైంది. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. ఎన్నో ఆపసోపాలు పడి, ఆరోపణలు ఎదుర్కొని తొలి విడత గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది జూన్ 20న గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూ నిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించారు. జిల్లాలో 133 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. ఇందులో 8,590 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 4,323 యూనిట్లకు గాను 4,282 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ యూనిట్లలో 3,880 గొర్రెలు చనిపోగా 2,100 గొర్రెలకు బీమా మంజూరైంది. తొలి విడత కోసం అధికారులు మూడు నెలల పాటు మహారాష్ట్రకు వెళ్లి నానా తిప్పలు పడి గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గొర్రెలు వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని యూనిట్లలో రోగాలతో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకోవాల్సి వచ్చింది. రెండో విడతలో 4267 యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సారి లబ్ధిదారుల సమక్షంలోనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. తొలివిడతలో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి రెండో విడత గొర్రెల పంపిణీ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరింత ఆలస్యం.. జూలై 2నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జూలై 2న పంపిణీ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో రవాణా వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని చివరకు గొర్రెలు కొనుగోలు చేసే రోజు చేతులెత్తేయడంతో అధికారులు అకోలిలోనే వాహనాలు మాట్లాడుకొని తీసుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి రాకుండా ఉండేందకు ట్రాన్స్‌పోర్టు కోసం ముందుగా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయి, గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే మరో 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో గొర్రెలు పంపిణీ చేస్తే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది సైతం వ్యాధులతో చాలా గొర్రెలు మృతి చెందాయి. సమస్యలు అధిగమించేనా.. మొదటివిడత గొర్రెల పంపిణీలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలోని అకోల, బుల్తానా, తులియ, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగబాద్ వంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో సమయానికి గొర్రెలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. దొరికిన గొర్రెలు సైతం కొన్ని చిన్నవిగా ఉండడం, కొన్ని ముసలి గొర్రెలు ఉండడంతో అప్పట్లో లబ్ధిదారులు అనాసక్తి చూపారు. అయినా ఏదోవిధంగా వారిని ఒప్పించిన అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. తొలి విడతలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, కొంత మంది లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు గొర్రెలకు వ్యాధులు సోకి మృత్యువాత పడ్డాయి. కొన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య కూడా ఏర్పడి పోషణ భారంగా మారి అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడతల ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో విడత పంపిణీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. -
పది జిల్లాల్లో వంద శాతం గొర్రెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: జాబితా ఏ కింద ఇప్పటికే 10 జిల్లాల్లో వంద శాతం గొర్రెల పంపిణీ పూర్తయిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. జీవాలకు వైద్యసేవలు అందించే పశు వైద్యశాలలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్లు కేటాయించిందని వివరించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జిల్లా పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మందులు, దాణా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రతి వైద్యశాలలో మంచినీటి నల్లా కనెక్షన్ కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు దరఖాస్తు చేయాలని చెప్పారు. చనిపోయిన గొర్రెలకు ఈ నెలాఖరులోగా క్లెయిమ్‌లు పరిష్కరించాలని మంత్రి సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పల్లీ ఆధారిత పరిశ్రమ
వనపర్తి : మరో నెలరోజుల్లో ఇక్రిషాట్ సహకారంతో జిల్లాలో వేరుశగన (పల్లి) ఆధారిత పరిశ్రమలు నెలకొలిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ శ్వేతామహంతి వెల్లడించారు. గురువారం రాత్రి ఈ విషయమై కలెక్టర్ ఇక్రిషాట్ ప్రతినిధులతో తన చాంబర్లో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. వనపర్తి మండలం దత్తాయపల్లి సమీపంలో యూనిట్‌ను ఏర్పాటు చేసి పల్లితో నూనె, పల్లిచెక్కిలు, పీనట్ బట్టర్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ నిర్వాహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. యూనిట్ ఏర్పాటు కోసం కావాల్సిన రా మెటీరియల్, మార్కెటింగ్ ఉద్యోగాలు, అవసరమయ్యే నిధులు, వ్యాపార నిర్వాహణ బాధ్యతలపై ఇక్రిషాట్ ప్రతినిధులు సైకత్దత్తా ఎంజుదార్, అర్వాడి, డీఆర్డీఓ గణేష్, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఏపీఎంలతో చర్చించారు. రా మెటీరియల్‌ను వెంటనే కొనుగోలు చేయా లని డీఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఇక్రిషాట్ ప్రతినిధులు దత్తాయపల్లి సమీపంలో యూనిట్ ప్రారంభించే ప్రదేశాన్ని పరిశీలించారు. గొర్రెల పంపిణీపై నిర్లక్ష్యం సహించం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే.. సహించబోనని కలెక్టర్ శ్వేతాహంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గొర్రెల యూనిట్లను సకాలంలో గ్రౌండ్ చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెల రవాణాకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. ఎక్కడా రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పక్కాగా పథకం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసవంర్ధక శాఖ అధికారి వీరనంది, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వేలానికి రీసైక్లింగ్ గొర్రెలు
హన్మకొండ: గొర్రెల పంపిణీ పథకంలో రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడిన గొర్రెలను వేలం వేసేందుకు ఆధికార యంత్రాంగం నిర్ణయించింది. రీ సైక్లింగ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో పట్టుబడిన గొర్రెల్లో 467 గొర్రెలను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 24న వేలం వేయనున్నట్లు కలెక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. డిసెంబర్ 14న రాత్రి ఎల్కతుర్తి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 634 గొర్రెలను పట్టుకున్నారు. పట్టుకున్న గొర్రెల్లో 467 గొర్రెలకు ట్యాగులు బిగించిన ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. ట్యాగులు లేని 107 గొర్రెలున్నట్లు, 60 గొర్రె పిల్లలున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును కోర్టుకు పంపారు. గొర్రెలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పశు సంవర్థక, పశు వైద్య శాఖకు అప్పగించారు. దీంతో వీటి పోషణ, కాపలా గత డిసెంబర్ 16వ తేదీ నుంచి ఎల్కతుర్తి పశువైద్యాధికారి డాక్టర్ నవత పర్యవేక్షణలో కొనసాగింది. దీంతో గొర్రెల పోషణ, వాటి కాపలా బాధ్యతపై మీమాంస నెలకొంది. పెద్ద సంఖ్యలో గొర్రెలు దొరకడం, విక్రయించిన వారు ఎవరో తెలియక పోవడం పెద్ద సమస్యగా మారింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లికి చెందిన పది మంది, కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ముగ్గురు గొర్రెలు తరలిస్తూ దొరికారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో గొర్రెలను కాపాడే బాధ్యత, పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఎల్కతుర్తి పశు వైద్య, పశు సంవర్థక అధికారి నవత పోషణ భారం కష్టంగా ఉందని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో డిసెంబర్ 23న ఖిలావరంగల్ మండలం మామునూర్‌లోని షెడ్లో ఉంచి వాటిని పోషిస్తున్నారు. పోషణ భారంగా మారండతో అధికారులు పోలీసుల ద్వారా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రీ సైక్లింగ్ జరిగిన గొర్రెలను వేలం వేసి వచ్చిన సొమ్మును కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ 24న గొర్రెలను వేలం వేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. 24న ఉదయం 10 గంటలకు మామునూర్‌లోని గొర్రెల షెడ్లో జరుగనున్న వేలంపాటలో 450 గొర్రెలు, 17 పొట్టేళ్లకు వేలం వేయనున్నారు. ఆసక్తిగలవారు ఈ నెల 24 ఉదయం 9 గంటలలోపు రూ.10 వేలు జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి కార్యాలయంలో చెల్లించి రశీదు పొంది వేలం పాటలో పాల్గొనాలని కలెక్టర్ అమ్రపాలి కాట సూచించారు. వేలంలో పాల్గొని ఖరీదు చేసిన గొర్రెలను అదే రోజు పూర్తి డబ్బులు చెల్లించి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 7337396426, 9989997412 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
1.28 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే భారీ మొత్తంలో గొర్రెలను పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. బుధవారం సచివాలయంలో గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్థకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గొర్రెల కొనుగోలు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిబంధనల మేరకే గొర్రెల కొనుగోలు, పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారులు కారణంగా మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
గొర్రెల పంపిణీకి బ్రేక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గొర్రెల పంచాయితీ రచ్చకెక్కింది. అధికారుల సహాయ నిరాకరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గొర్రెల పంపిణీకి అర్ధంతరంగా బ్రేక్ పడింది. ఇప్పటికే అధిక ధరలు, రీ సైక్లింగ్, సంతలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో తలబొప్పి కట్టిన సర్కారుకు తాజాగా పశుసంవర్థకశాఖ యంత్రాంగం షాక్ ఇచ్చింది. జీవాల కొనుగోళ్లు మొదలు రాష్ట్రానికి తరలించే వరకు బాధ్యత వహించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. సిరిసిల్ల జిల్లాలో జరిగిన అవకతవకలపై ఇద్దరు అధికారులపై వేటు వేసింది. ఈ నిర్ణయమే వెటర్నరీ ఉద్యోగుల సహాయ నిరాకరణకు దారితీసింది. దీంతో వారంరోజులుగా గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా వర్గాలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తోంది. జూలైలో ప్రారంభమైంది. జీవాల కొనుగోలు, జిల్లాకు తరలించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో వీటికి డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గ జీవాల లభ్యత లేకపోవడం.. ఆ జీవాలను తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. సగటున రోజుకు 2025 యూనిట్లు లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా గొర్రెల లభ్యత లేకపోవడంతో.. ప్రతి రోజు సగటున 20 నుంచి 25 యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. జీవాల పంపిణీలో చోటుచేసుకుంటున్న చిన్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తున్నా రని ఆగ్రహించిన పశుసంవర్థకశాఖ అధికారులు గొర్రెల సేకరణకు దూరంగా ఉన్నారు. ఎదురుచూపుల్లో 400 మంది! గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న సదాశయంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి జూలైలో శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. యూనిట్ విలువలో 75 శాతం అనగా రూ.93,750 సబ్సిడీ అందజేస్తోంది. మిగిలిన 25 శాతం (రూ.31,250) లబ్ధిదారులు భరించాలి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 20 వేలమంది లబ్ధిదారులకు డిసెంబర్‌లోగా అందజేయాలి. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 3,407 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. గొర్రెల కొనుగోలుకు కర్ణాటక వెళ్లేందుకు పశువైద్యాధికారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా వారం రోజులుగా ఒక్క యూనిట్ కూడా లబ్ధిదారునికి చేరలేదు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే గొర్రెలను తెచ్చేందుకు ముందుకు సాగుతామని అధికారులు అంటున్నారు. గొర్రెల పంపిణీని సమర్థంగా నిర్వహించండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆయన తన చాంబర్లో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై పశుసంవర్థకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, పశువైద్యాధికారుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. గొర్రెల కొనుగోళ్లలో జరుగుతున్న పొరపాట్లను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధికారులను పంపించి సమాచారం సేకరించాలని మంత్రి డైరెక్టర్‌ను ఆదేశించారు. అలాగే గొర్రెల లభ్యత తగ్గడానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందన్నారు. ఇటీవల ప్రారంభించిన మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల పనితీరును గురించి కూడా ఈ సమావేశంలో తలసాని సమీక్షించారు. -
గొర్రెల రీసైక్లింగ్‌పై కదిలిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్/పుల్కల్: సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్ వ్యవహారంపై ప్రభుత్వం కదిలింది. ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘అటూ ఇటూ అదే గొర్రె, ఎవరు బకరా’శీర్షికన ప్రచురితమైన పరిశోధనాత్మక కథనంపై స్పందించింది. గొర్రెల రీసైక్లింగ్ దందాపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లో సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా వదలబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు కచ్చితంగా ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా గొర్రె లు కొనుగోలు చేయాలన్నా రు. ఇప్పటివరకు సుమారు 1.23 లక్షల యూనిట్ల గొర్రె లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇటీవల లబ్ధిదారులకు అందజేసిన గొర్రెల రీసైక్లింగ్‌పై ప్రాథమిక సమాచారం అందడంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విధివిధానాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్న సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. మామూళ్లు ఇచ్చాకే అమ్ముకున్నాం.. సబ్సిడీ గొర్రెలు అమ్మినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతుండగా.. లబ్ధిదారులు కూడా అంతే ఘాటుగా స్పందించారు. అధికారులకు మామూళ్లు ఇచ్చిన తర్వాతే గొర్రెలు అమ్ముకున్నామని, తమపై చర్యలు తీసుకునే ముందు ఆ అధికారులపై కేసులు పెట్టాలని అంటున్నారు. ‘‘మేం ఊరికే గొర్రెలు అమ్ముకోలేదు. పది మందిమి కలిసి వేర్వేరు శాఖలకు చెందిన అధికారులకు రూ.60 వేల మామూళ్లు ఇచ్చాం. మాకేమైనా అయితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అడుగుతాం’’అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ లబ్ధిదారుడు ‘సాక్షి’తో అన్నాడు. మరోవైపు అధికారులు ఆదివారం పుల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రాథమిక సమాచారం సేకరించారు. గ్రామాల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెలు ఉన్నాయా? ఎన్ని మృతి చెందాయి? తదితర అంశాలపై వివరాలు సేకరించారు. పుల్కల్లో 15 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. -
ఎక్కడి గొర్రెలు అక్కడికే!
అల్లాదుర్గం(మెదక్): గొర్రెల పంపిణీ వ్యవహారం రానురాను ప్రహసనంగా మారుతోంది. లబ్ధిదారులు గొర్రెలను తాము పెంచుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో అవి చేతులు మారుతున్నాయి. అధికారులు కూడా దీనిని నివారించలేకపోతున్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దే శంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేసి విడతలవా రీగా ఒక్కో లబ్ధిదారునికి 21 గొర్రెల చొప్పున అందజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంచుకుంటూ వారు జీవనోపాధి పొందుతారని స ర్కారు ఆశించింది. పంపిణీ చేసిన గొర్రెల పెంపకం సజావుగా జరుగుతుందా..లేదా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని వేయనున్నట్లు ప్రకటించిం ది. ఇతర రాష్ట్రాల నుంచి జీవాలను తెచ్చి పంపిణీ చేసింది. కమిటీలను వేయకపోవడంతో ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే గొర్రెలను తరలించి లబ్ధిదారులు యథేచ్చగా అమ్ముకుంటున్నారు. వాటిని అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినా ఫలితం కనిపించ డం లేదు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు....అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను లబ్ధిదారులు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. మండలంలోని మందాపూర్‌లో 23, ముప్పారంలో 39, చిల్వెరలో 30, వెంకట్రావ్‌పేటలో 14, రాంపూర్‌లో 13 యూనిట్లను అందజేశారు. ముప్పారం, చిల్వెర గ్రామాలకు చెందినవారు ఇప్పటికే సగం వరకు గొర్రెలను అమ్ముకున్నారు. ఇటీవల ముప్పారం గ్రామంలో రెండు టాటా ఎసీలలో గొర్రెలను తరలి స్తుండగా ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలను ఏడాది వరకు అమ్మవద్దనే నిబంధనలు ఉన్నాయి. అల్లాదుర్గం మండలంలో మాత్రం మూడు నెలలకే అమ్మేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏర్పాటు కాని పర్యవేక్షణ కమిటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పథకం నీరుగారిపోతోంది. గొర్రెల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటి కీ అది అమలుకు నోచుకోలేదు. ఎంపీడీఓ, తహసీల్దార్, పశువైద్యాధికారితో కలిపి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అవి ఏర్పడే లోపు గొర్రెలన్నీ మాయమయ్యేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
మాకొద్దీ గొర్రెలు...
- కొన్నింటికి రోగాలు.. మరికొన్ని మృత్యువాత - ఆసక్తిచూపని లబ్ధిదారులు రాయికల్(జగిత్యాల): గొల్లకుర్మలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గొర్రెల పంపిణీ పథకంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన గొర్రెలు లభించకపోవటం.. పంపిణీ చేసిన వాటిల్లో చాలావరకు రోగాల బారిన పడటం.. మరికొన్ని మృత్యువాత పడటంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్లకుర్మల కోసం సీఎం కేసీఆర్ 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికైన ఒక్కొక్కరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పశువైద్యులు రాష్ట్రంలో లబ్ధిదారులకు సరిపోయే గొర్రెలు లేకపోవడంతో ఒక్కో జిల్లాకు ఒక్కో రాష్ట్రాన్ని ఎంపిక చేసి పశువైద్యుల బృందాన్ని పంపించి గొర్రెలను కొనుగోలు చేయిస్తున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన గొర్రెలు ఒక్కసారిగా వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురి కావడం.. అంతకు ముందే బక్కచిక్కిన గొర్రెలను పంపిణీ చేయడంతో అవి రోగాల బారినపడి చనిపోతున్నాయి. జగిత్యాల జిల్లా అయోధ్య గ్రామంలో 10, అర్పపెలిలో 4, డబ్బ గ్రామంలో 15, ఫకీర్కొండాపూర్లో నాలుగు ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో గొల్ల కుర్మలు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. లోకల్లోనే ధర తక్కువ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గొల్లకుర్మలు చెబుతున్నారు. కొందరు దళారులు రంగంలోకి దిగి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి ఒక్కో జతకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకే కొనుగోలు చేసి.. ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి.. వాటిని అక్కడ మళ్లీ మనకే రూ. 14 వేలకు జతగా విక్రయిస్తున్నారు. -
నో స్టాక్!
►అధికార యంత్రాంగానికి గొర్రెల కష్టం ►దావణగిరె, చిత్రదుర్గలోనూ చుక్కెదురు ►ఇప్పటివరకు పంపిణీ చేసింది 72 యూనిట్లే ►జీవాల ధరలకు రెక్కలు.. పెంపకందార్ల అనాసక్తి ►గొర్రెల పరిణామంపైనా పెదవివిరుపు కర్ణాటకబాట పట్టినా గొర్రెల జాడ మాత్రం కనిపించడంలేదు. ప్రతి రోజు సగటున 101 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం జీవాల లభ్యత లేక చేతులెత్తేసింది. ఇప్పటివరకు కేవలం 72 యూనిట్లను మాత్రమే పంపిణీ చేయగలిగింది. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అధికార యంత్రాంగానికి గుదిబండగా పరిణమించింది. ఇబ్బడిముబ్బడిగా నమోదైన సభ్యులకు.. లభిస్తున్న గొర్రెల సంఖ్యకు పొంతన కుదరకపోవడం ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెల 20వ తేదీన గొర్రెల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు 150 యూనిట్లను మాత్రమే సేకరించగలిగింది. జిల్లాకు కేటాయించిన గొర్రెలను కర్ణాటక రాష్ట్రం దావణగిరె, చిత్రదుర్గ జిల్లాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. స్థానికంగా కొంటే అక్రమాలు జరిగే ఆస్కారముందని భావించిన సర్కారు ఈ ఆలోచన చేసింది.ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించిన పశుసంవర్థకశాఖ.. గొర్రెల లభ్యతను అధ్యయనం చేసింది. ఇందుకనుగుణంగా గొర్రెల కొనేందుకు ఆయా జిల్లాల్లోని సంతలకు వెలుతున్న అధికారులకు నిరాశే మిగులుతోంది. ఇక్కడితో పోలిస్తే ధరలు రెట్టింపు కావడం.. నిర్దేశిత షీప్ల పరిణామంలో తేడా ఉండడంలో గొర్రెల పెంపకందారులు ఆసక్తి చూపడంలేదు. దీంతో సుదూర ప్రాంతంలో గొర్రెల కోసం గాలించినా ఫలితం కనిపించడంలేదు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి జీవాలు కొనుగోలు చేయడం కన్నా.. సమీప ప్రాంతాల్లోనే కొనడం మంచిదనే అభిప్రాయం గొల్ల, కుర్మ, యాదవ సామాజికవర్గం నుంచి వ్యక్తమవుతోంది. కష్టమే సుమా! జిల్లావ్యాప్తంగా 368 సొసైటీలు రిజిష్టర్ కాగా, ఇందులో 45,163 మంది సభ్యులుగా నమోదయ్యారు. వీరిలో ఈ ఏడాది 22,581 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సివుంది. అంటే సగటున రోజుకు 101 మంది చొప్పున ఆరు నెలలపాటు పంపిణీక్రతువు కొనసాగాలి. ఈ పథకం ప్రారంభించి పదిరోజులు కావస్తున్నా పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 72 మందికే యూనిట్లను పంపిణీ చేశారు. మరో 24 యూనిట్లు జిల్లాకు చేరుకోగా.. మరో 54 యూనిట్లు మార్గమధ్యంలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
ఎమ్మెల్యేని, నాకూ గొర్రెలున్నాయ్.. కానీ..
- గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: ‘నేను ఎమ్మెల్యేనే.. అయినాకూడా ఓ వైపు వ్యవసాయం చేస్తూ మరో వైపు గొర్రెలు పెంచుతున్నా. ప్రస్తుతం నా దగ్గర 400 గొర్రెలు ఉన్నాయి. కానీ ఏం లాభం? గొర్రెలు కాచేందుకు మనుషులు దొరకని పరిస్థితి’ అని గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించారు సీఎల్పీ ఉప నేత టి. జీవన్‌రెడ్డి. జగిత్యాల మండలంలోని కన్నాపూర్ గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసిన సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నా గొర్రెల కాపరికి రూ. 60 వేల జీతం ఇస్తున్నా. ఏదైనా పనిఉందని గొర్రెలకాపరి పనిలోకి రాకుంటే కష్టమే! నేనైతే గొర్రెల వెంబడి పోనుకదా! ముందుముందు ఇదే సమస్య మీకూ(లబ్ధిదారులకు) ఎదురుకాబోతోంది. జీవాలకు వచ్చే వ్యాధులు గురించి జర జాగ్రత్త వహించండి. లేదంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమోగానీ మీరు ఇంట్లో నుంచి కట్టిన డబ్బులు పోయే పరిస్థితి ఉంటంది’ అన్నారు. ఇలా జీవన్‌రెడ్డి మాట్లాడుతుండగా సభలో నవ్వులు పూశాయి. -
గొర్రెల కోసం ‘పశుబజార్’ వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన గొర్రెలను వెతికేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అందు కోసం pashubazar.telan gana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. గొర్రెల పెంపకందారులు ఈ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకొని, ఎన్ని గొర్రెలు విక్రయిస్తారో వివరాలు తెలియజేస్తే కొనుగోలు చేస్తామని పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువులు అమ్మడానికి, కొనడానికి వేదికగా ఈ వెబ్సైట్ పనిచేస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లకుండా వెబ్సైట్ ద్వారానే తమ పశువులను మంచి ధరకు అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. వెబ్‌సైట్‌ను ఉపయోగించడం రానివారు హెల్ప్‌లైన్ నెంబర్ ‘7337362131’ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800–599–3699కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందార్ల సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు ఎస్.రామచందర్ పాల్గొన్నారు. -
309 సహాయ పశువైద్యుల పోస్టులు భర్తీ
గొర్రెల పథకం నోడల్ అధికారిగా కలెక్టర్: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశు సంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 309 సహాయ పశువైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో గొర్రెల పంపిణీ పథకం అమలుకు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. గొర్రెల కొనుగోలు కోసం విధివిధానాలను రూపొందించేందుకు శుక్రవారం సచివాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు. గొర్రెలు లేని 18 సంవత్సరాలు పైబడిన గొల్ల, కుర్మ కులస్తులందరినీ సొసైటీలలో సభ్యులుగా నమోదు చేయించాలని మంత్రి సూచించారు.గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపికను లాటరీ ద్వారా చేపట్టాలని, సగం మంది మొదటి సంవత్సరం, మిగిలిన సగం మంది రెండో సంవత్సరం లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారి నుంచి యూనిట్ విలువలో 25 శాతం ముందుగా మండలస్థాయిలో త్రిసభ్య కమిటీ వసూలు చేస్తే, దానికి 75 శాతం విలువను ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. మండలస్థాయి త్రిసభ్య కమిటీ కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అటవీశాఖ భూముల్లో స్టైలోరకం గడ్డిని పెంచేవిధంగా చర్యలు చేపట్టాలని, పశుసంవర్థక శాఖ, ఉద్యానశాఖ సమన్వయంతో పండ్ల తోటల్లో పశుగ్రాసం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలల ద్వారా గొర్రెల మంద వద్దనే వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, పశువైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ 15 రోజుల్లో గ్రామస్థాయి లబ్ధిదారుల ఎంపిక విషయమై గొల్ల, కుర్మ కులస్తుల కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటికే వారికున్న గొర్రెలు, ఆధార్‌కార్డు నంబర్, వారి భూముల సమాచారం సేకరిస్తుందని వివరించారు.