సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖకు ఈడీ జోనల్ ఆఫీసు నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక, జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.
అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడీ కోరింది.
ఇదిలా ఉండగా.. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment