ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి..
పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో స్వేచ్ఛగా దాడులు, సోదాలు
గతానికి భిన్నంగా ప్రత్యేకంగా ఓ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకుని ఆపరేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
వలలో పడుతున్న భారీ తిమింగలాలు
105 ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన కేసులు
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టలు బద్ధలవుతున్నాయి. ‘కట్టల’పాములు బయటికొస్తున్నాయి. అవినీతి నిరోధక విభాగం చేపడుతున్న వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్లు’సత్ఫలితాలనిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులకు అనేక అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.
దీంతో వారు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీఏ.. ఇలా ఏ శాఖనూ వదలకుండా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 105 కేసులు నమోదు చేశారు. గతంలో బాధితులు చేసే ఫిర్యాదులు, వారందించే సమాచారం ఆధారంగా అవినీతి అధికారులను ట్రాప్ చేసేవారు. ఎక్కువగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల నమోదుకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. ప్రత్యేకంగా ఒక డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్ర స్థాయిలో అవినీతి అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘ఆపరేషన్లు’పూర్తి చేస్తున్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్ శాఖను సైతం అప్పగించడంతో.. ఏసీబీ తనిఖీలతో పాటు విజిలెన్స్ సోదాలూ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.వందల కోట్ల అవినీతి, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి తదితర కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఏసీబీ ఇటీవల నమోదు చేసిన ప్రధాన కేసులు కొన్ని..
జనవరి 2024: హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 2024: గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ జగజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం దొరికింది.
మార్చి 2024: మార్చిలో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
మే 2024: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతో పాటు, బినామీల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి.
ఆగస్టు 2024: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు సహా రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు ఏసీబీ గుర్తించింది.
డిసెంబర్ 2023: గతేడాది డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాంచందర్ నాయక్ సహా పలువురిని అరెస్టు చేశారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ
‘లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోలేరు..’అని ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment