సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం చేరుకున్నారు.
కాగా, గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్థక శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇక, గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కామ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.
గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment