anti-corruption
-
‘కట్టలు’ తెగిన అవినీతి
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టలు బద్ధలవుతున్నాయి. ‘కట్టల’పాములు బయటికొస్తున్నాయి. అవినీతి నిరోధక విభాగం చేపడుతున్న వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్లు’సత్ఫలితాలనిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులకు అనేక అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.దీంతో వారు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీఏ.. ఇలా ఏ శాఖనూ వదలకుండా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 105 కేసులు నమోదు చేశారు. గతంలో బాధితులు చేసే ఫిర్యాదులు, వారందించే సమాచారం ఆధారంగా అవినీతి అధికారులను ట్రాప్ చేసేవారు. ఎక్కువగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల నమోదుకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్ర స్థాయిలో అవినీతి అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘ఆపరేషన్లు’పూర్తి చేస్తున్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్ శాఖను సైతం అప్పగించడంతో.. ఏసీబీ తనిఖీలతో పాటు విజిలెన్స్ సోదాలూ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.వందల కోట్ల అవినీతి, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి తదితర కేసులు వెలుగులోకి వచ్చాయి.ఏసీబీ ఇటీవల నమోదు చేసిన ప్రధాన కేసులు కొన్ని.. జనవరి 2024: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2024: గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ జగజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం దొరికింది.మార్చి 2024: మార్చిలో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.మే 2024: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతో పాటు, బినామీల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఆగస్టు 2024: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు సహా రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు ఏసీబీ గుర్తించింది.డిసెంబర్ 2023: గతేడాది డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాంచందర్ నాయక్ సహా పలువురిని అరెస్టు చేశారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ ‘లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోలేరు..’అని ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారని తెలిపారు. -
G20 Anti-Corruption Meet: నేరగాళ్ల ఆస్తులను జప్తు చేద్దాం
కోల్‌కతా: అవినీతిపై ఉమ్మడిగా పోరాడదామని జీ 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక తదితర నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునే ఘరానా వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. శనివారం కోల్‌కతాలో జరిగిన జీ 20 అవినీతి నిరోధక మంత్రుల స్థాయి భేటీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాంటి నేరగాళ్లు విదేశాల్లో కూడబెట్టిన, పోగేసిన అక్రమాస్తులను, చేసిన అక్రమాలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నేరగాళ్లను వీలైనంత త్వరగా మాతృ దేశానికి అప్పగించడం కూడా సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతి వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయేది నిరుపేదలేనని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. -
ఏబీవీపై దేశద్రోహం కేసుపెట్టాలి
సాక్షి, తిరుపతి: వ్యక్తిగత స్వార్థం, అవినీతి సంపాదన కోసం దేశ భద్రతను పణంగా పెట్టి ప్రమాదకరమైన వస్తువులను కొనుగోలు చేసిన దేశద్రోహి ఏబీ వెంకటేశ్వరావు (ఏబీవీ) అని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏబీవీ అంటే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అంటూ అర్థం చెప్పారు. తిరుపతిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఏబీవీ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా చెవిరెడ్డి బయటపెట్టారు. ఐపీఎస్‌ను వ్యక్తిగత రాజకీయ సర్వీసు (ఇండివిడ్యువల్ పొలిటికల్ సర్వీస్)గా మార్చారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం రక్షణ పరికరాలను కొనుగోలు చెయ్యాలంటే.. కేంద్రం అనుమతి తీసుకోవాలని, కానీ ఏబీవీ అలాంటి అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొన్నారని తెలిపారు. దేశానికి ప్రమాదకర వస్తువుల కొనుగోలుపై కేంద్రం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 124ఏ కింద దేశద్రోహం కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీ దేశాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనపై ‘లుకౌట్’ నోటీసులు జారీ చేయాలని కోరారు. తెలంగాణ, కర్ణాటకలో రూ. కోట్ల ఆస్తులు ఏబీవీకి తెలంగాణలో, కర్ణాటకలో వంద ఎకరాల భూములు ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు. వీటి విలువ రూ. వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని వివరించారు. ఈడీ, ఐటీ, అవినీతి నిరోధక శాఖ సమగ్ర విచారణ జరిపితే ఏబీవీ భూ దందాలు, అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్ తరువాత అత్యంత ధనవంతుడు ఏబీవీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల పేరున ఇసుకరీచ్‌లు తీసుకున్నారన్నారు. ఏబీవీ ఫోన్ కాల్ డేటా వెలికి తీస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. బెజవాడ పోలీస్ కమిషనర్‌గా ఏబీవీ ఉన్నపుడు జరిగిన జంట హత్యల కేసులో విలువైన బంగారు ఆభరణాలను ఆయన మాయం చేశారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఐపీఎస్ ఘట్టమనేని శ్రీనివాస్, డీఎస్పీ రాంకుమార్ వద్దే వందల కోట్లు ఉంటే వారి గురువు ఏబీవీ వద్ద ఇంకెన్ని కోట్లు ఉంటాయో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఏబీవీ అవినీతిని దగ్గరగా చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం ముందు నోరు విప్పాలని పిలుపునిచ్చారు. -
ఏసీబీ పనితీరుపై సీఎం ఆగ్రహం
-
అవినీతి అంతంచేసే చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ కింద కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, మహరాష్ట్రలో లోకాయుక్తను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత వారం రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం విరమించిన విషయం తెల్సిందే. హజారే దీక్షను విరమింపచేసేందుకు జూనియర్ మంత్రులను పంపించినా లాభం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి హజారే దీక్షను విరమింప చేశారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తానని ఫడ్నవీస్ హామీ ఇచ్చి ఉండవచ్చుగానీ కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తానని ఏ హోదాలో హామీ ఇచ్చారో, ఆ హామీని అన్నా హజారే ఎలా విశ్వసించారో వారికే తెలియాలి. ‘దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా భారత యుద్ధం’ అంటూ అన్నా హజారే పోరాటం చేయడం వల్లనే 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాటి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతో తోడ్పడింది. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్ర మోదీ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేక పోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించని మోదీ లోక్‌పాల్‌ను నియమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో! 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారెవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆర్జేడీ నాయకుడు లాలూను జైలుకు పంపించడం, యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతిలపై, పశ్చిమ బెంగాల్లో పోలీసు కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరపడం రాజకీయ కక్షలే తప్పించి అవినీతి నిర్మూలనా చర్యలు ఎంత మాత్రం కావు. నేతల అవినీతిని పక్కన పెడితే అధికార యంత్రాంగంలో, సైనికుల్లో, పోలీసుల్లో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఎలాంటి చట్టాలను తీసుకరాలేదు. అన్ని ప్రభుత్వ రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అందుకు చట్టాలను తీసుకొచ్చినట్లయితే సగం అవినీతి దానంతట అదే తగ్గిపోయి ఉండేది. మోదీ ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం గహ నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచింది. తద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు లబ్ధి చేకూరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో ఇలాంటి చట్టాలను తీసుకరావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకతు ఆస్కారమిస్తూ అవినీతి బట్టబయలకు అవకాశం ఇస్తున్న ‘సమాచార హక్కు’ చట్టాన్ని నీరుకార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం విచిత్రం. తనతో సహా కొంత మంది మంత్రుల విద్యార్హతలను సమాచార హక్కు కింద వెల్లడించకుండా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ను పీఎంవో కార్యాలయం అడ్డుకున్న విషయం తెల్సిందే. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడానికి వీలుగా వారి జీతభత్యాలను, పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయించే విధంగా సమాచార చట్టంలో రహస్యంగా సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుల జడ్జీలతో సమానంగా కేంద్ర సమాచార కమిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జీల జీతభత్యాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయిస్తుందన్న విషయం తెల్సిందే. పార్లమెంట్‌ను మభ్యపెట్టడం ద్వారా కేవలం కేబినెట్ ఆమోదంతో ఆ సవరణ తీసుకరావాలనుకుంది. అదికాస్త బయటకు పొక్కడంతో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక పోయింది. గోవా పోలీసు అధికారి అమ్జద్ కరోల్ 2014లో ఓ పేద మహిళలను బహిరంగంగా వివస్త్రను చేసి చితకబాదినా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విధుల నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ 2017లో అధికారుల అవినీతి కారణంగా తమకు ఎంత అధ్వాన్నమైన ఆహారాన్ని ఇస్తున్నారో వీడియో ద్వారా బయటపెడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోకపోగా క్రమశిక్షణారాహిత్యం కింద బహదూర్ యాదవ్‌ను తొలగించారు. ఢిల్లీలో ప్రతిష్టాకరమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్) ఆస్పత్రిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అప్పటి ఆస్పత్రి విజిలెన్స్ కమిషనర్ మెగసెసే అవార్డు గ్రహీత సంజీవ్ చతుర్వేదీ బయటపెట్టినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడానికి బాధ్యుడయిన ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌పైనా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చట్టాలు అవసరం. అందుకు చిత్తశుద్ధి ఇంకా ఎంతో అవసరం. -
‘అవినీతి అంతానికి ఆమ్ఆద్మీ పార్టీలో చేరండి’
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి నిర్మూలన కోసం ప్రజలు ఆమ్ఆద్మీ పార్టీలో సభ్యత్యం పొందాలని ఆ పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ విజయపతి సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక అనంతపురం రోడ్డు ఎంజీ సర్కిస్లోని ఎస్.లింగన్న కాంప్లెక్స్ ముందు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి సుమారు 10-15 బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,000 మంది ఆమ్ఆద్మీ పార్టీ సభ్యత్వాన్ని పొందారన్నారు. అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపడుతున్న ఉద్యమాల్లో ఐక్యమత్యంగా పోరాడేందుకు సభ్యత్వాన్ని పొందాలన్నారు. వాలంటీర్లు ఎం. హనుమేష్ కుమార్, చంద్రశేఖర్, నిసార్ అహమ్మద్, సాగర్, కమలేష్, ఎంజీ.వెంకటేష్ పాల్గొన్నారు. -
అవినీతిపై కొత్త హెల్ప్‌లైన్- 1031
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌కు నాలుగు అంకెల నంబర్‌ను శుక్రవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దీంతోపాటు పాత నంబర్‌ను కూడా కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘గత 36 గంటల్లో హెల్ప్‌లైన్‌కు సుమారు 23,000 కాల్స్ వచ్చాయి. ఒక వ్యక్తిని పట్టుకున్నాం కూడా. మరోవ్యక్తి చివరి నిమిషంలో లంచం తీసుకోవడానికి నిరాకరించి తప్పించుకున్నాడు..’ అని వివరించారు. కరెంట్ కోతలపై ఎస్ఎంఎస్ చేస్తే చాలు.. ఏ డిస్కమ్ అయినా అప్రకటిత కరెంటు కోతలకు పాల్పడితే వినియోగదారులు ఒక ఎస్ఎంఎస్ చేస్తే చాలు.. తమ సర్కారు సత్వర చర్యలు తీసుకుం టుందని సీఎం పేర్కొన్నారు. ‘మీ ప్రాంతంలో అప్రకటిత కరెంటు కోత ఉంటే మీరు వెంటనే సెల్ నం బర్- 9223166166కు ఎస్ఎంఎస్ చేయండి.. చాలు..’ అని సీఎం చెప్పారు. ‘డిస్కంల నుంచి కరెంటు కోతల వివరాలను తీసుకుంటాం. నిరాధారమైన అప్రకటిత కోతలుంటే సదరు కంపెనీ నుంచి జరిమానా వసూలుచేస్తామ’న్నారు. -
హస్తిన నుంచి అవినీతిని తరిమేద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వమని అడుగుతున్నాడా? అయితే అతనితో మీరు ఎలా వ్యవహరించాలనే విషయమై అవినీతి నిరోధక విభాగం అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ ప్రకారంగా నడుచుకొని సదరు అవినీతి అధికారులను కటకటాల వెనక్కు తోయొచ్చు. అయితే ఈ విషయమై ముం దు మీరు అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా సులభతరం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రకటించింది. ఎన్నికలకు ముందు.. హస్తిన నుంచి అవినీతిని తరిమేస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ‘యాంటి కరప్షన్ డ్రైవ్’ను ఆయన బుధరవారం ఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ‘011-27357169’ హెల్ప్ లైన్ నంబర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది హెల్ప్‌లైన్ నంబర్ మాత్రమే. దీనికి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆడియో లేదా వీడియో రికార్డింగుతో సాక్ష్యాన్ని అవినీతి నిరోధక విభాగానికి అప్పగించి లంచగొండి అధికారులను పట్టించవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నంబరు ప్రతి ఢిల్లీవాసిని ఓ అవినీతి వ్యతిరేక ఉద్యమకారునిగా చేస్తుం ది. లంచగొండి అధికారులను భయపెట్టాలనేదే ఈ హెల్ప్‌లైన్ జారీ చేయడం వెనుకనున్న ప్రధాన ఉద్దేశం. ఈ హెల్ప్‌లైన్ గురించి ఢిల్లీ ప్రభుత్వం హోర్డింగుల ద్వారా, రేడియో జింగిల్స్ ద్వారా ప్రచా రం చేస్తుంది. ఉద యం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంద’ని చెప్పారు. ‘అధికారులు ఎవరైనా లంచం అడిగితే నిరాకరించకండి. వారితో సెట్టింగ్ చేసుకొని మాకు తెలియచేయండి. మేం వారి భరతం పడతాం’ అని రామ్‌లీలామైదాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రకటించినట్లుగా మరో హామీ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను ముందుగా ప్రకటించినట్లుగా రెండు రోజులలోకాక పదిరోజుల తరువాత విడుదల చేశారు. విజిలెన్స్ విభాగంలో సమస్యల వల్ల ఈ హెల్ప్‌లైన్ నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సమయం పట్టిందని కేజ్రీవాల్ చెప్పా రు. అయితే ప్రస్తుతం తాము జారీ చేసిన నం బరు కఠినంగా ఉందని, సులభంగా ఉండే నాలుగంకెల నంబర్‌ను మరో నాలుగైదు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో కూడా ఆయన వివరించారు. ‘011-27357169 నంబరుకు ఫోన్చేసినట్లయితే ఫోన్ చేసిన వ్యక్తి పేరు, వారు చెప్పే మాటలు ఢిల్లీ ప్రభుత్వ కాల్సెంటర్లో రికార్డు అవుతాయి. ఆ తరువాత ఫోన్ చేసిన వ్యక్తికి అవినీతి నిరోధక విభాగం అధికారి నుంచి పోన్ వస్తుంది. ఫోన్ చేసిన అధికారి స్టింగ్ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనేది తెలియచేస్తారు. ఈ సలహా మేరకు ఫోన్‌చేసిన వ్యక్తి తనను లంచం అడిగిన అధికారి మాటలను ఫోన్లో రికార్డు చేసి దానిని అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే అవినీతి నిరోధక విభాగం వలపన్ని లంచం అడిగిన అధికారిని పట్టుకుంటుంద’ని ఆయన చెప్పారు. ఢిల్లీవాసి అందించే వీడియా లేదా ఆడియో టేపులు కోర్టులో సాక్ష్యంగా కూడా పనికి వస్తాయన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ను సమర్థంగా నిర్వహించడం కోసం అవినీతి నిరోధక విభాగం తగినన్ని బృందాలను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ పోలీసుల సహాయం తీసుకోవడానికి లెప్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. -
‘అత్యున్నత’ అవినీతికి చెక్
లోక్‌పాల్ పరిధిలో ప్రధాని, మంత్రులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రధానిపై దర్యాప్తుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ కానీ, సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదించాలి లోక్‌పాల్ కేసుల్లో సీబీఐ సహా ఏ సంస్థ దర్యాప్తుపై అయినా లోక్‌పాల్‌కు పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం నిజాయితీగల ఉద్యోగులకు భద్రత.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఏడాది జైలు, లక్ష జరిమానా లోక్‌పాల్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిని లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు విచారణ పెండింగ్‌లో ఉన్నా కూడా.. అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్మెంట్, జప్తుకు అవకాశం లోక్‌పాల్ కేసుల దర్యాప్తులో దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో అవినీతికి చెక్ పెట్టేందుకు.. చిరకాలంగా ప్రయత్నిస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కోసం సామాజిక ఉద్యమనేతలు, ప్రజానీకం ఉధృతంగా ఉద్యమించటంతో.. ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గింది. లోక్‌పాల్ బిల్లును రూపొందించిన 44 ఏళ్ల తర్వాత.. ఎనిమిది సార్లు పార్లమెంటు ముందుకు వచ్చిన తర్వాత.. బిల్లులో అనేక మార్పుచేర్పులు, సవరణల తర్వాత.. చివరకు ఉభయసభల ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తూ చరిత్రాత్మక లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును పార్లమెంటు బుధవారం ఆమోదించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి 365 రోజుల్లోగా (అంటే ఏడాది కాలం లోగా) ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర శాసనసభల్లో చట్టం చేయటం ద్వారా.. రాష్ట్రస్థాయిలో అవినీతిపై దర్యాప్తు కోసం లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. లోకాయుక్త స్వరూప, స్వభావాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులోని ముఖ్యాంశాలివీ... ఒక చైర్మన్, 8 మంది సభ్యులు... లోక్‌పాల్.. కేంద్రం స్థాయిలో ఉండే స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇందులో చైర్మన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. అందులో సగం మంది న్యాయ సభ్యులై ఉంటారు. మరో సగం మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలు, మైనారిటీలు, మహిళలు ఉంటారు. లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు విభాగంతో పాటు, సొంతంగా విచారణ (ప్రాసిక్యూషన్) విభాగం కూడా ఉంటుంది. లోక్‌పాల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఎంపిక ఇలా: లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ఒక కమిటీ ద్వారా జరుగుతుంది. ఈ కమిటీలో.. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో పాటు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి, ఈ నలుగురూ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి నియమించే ప్రముఖ న్యాయనిపుణుడు.. మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ.. తనకు సాయంగా ఏడుగురు నిపుణులతో ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది. లోక్‌పాల్ సభ్యులు ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా ఉండరాదు. లోక్‌పాల్ పదవీ కాల పరిమితి ఐదేళ్లు, లేదా.. చైర్మన్ కానీ, సభ్యులు కానీ వారికి 75 ఏళ్ల వయసు నిండే వరకూ పదవిలో కొనసాగుతారు. లోక్‌పాల్ సభ్యులపై ఆరోపణలు వస్తే... ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై కనీసం 100 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించినట్లయితే.. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు సదరు సభ్యుడు/సభ్యురాలిపై విచారణ చేపట్టవచ్చు. లోక్‌పాల్ సభ్యుడిని/సభ్యురాలిని సుప్రీంకోర్టు సిఫారసు లేదా మధ్యంతర ఉత్తర్వు మేరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. సదరు సభ్యుడు/సభ్యురాలిని రాష్ట్రపతి తొలగించవచ్చు. పరిధిలో ప్రధాని, ఎంపీలు... దేశ ప్రధానమంత్రి కూడా లోక్‌పాల్ పరిధిలో ఉంటారు. అంతర్జాతీయ సంబంధాలు, భద్రత, ప్రజా శాంతి, అణుశక్తి, అంతరిక్ష రంగాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు మినహా.. ఇతరత్రా అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధానిపై దర్యాప్తు చేపట్టే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అయితే.. ప్రధానిపై దర్యాప్తు చేపట్టేందుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ (సభ్యులందరూ) కానీ, సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదం తెలిపాలి. ప్రధానమంత్రిపై విచారణను రహస్యంగా (ఇన్-కెమెరా) నిర్వహిస్తారు. లోక్‌పాల్ అభీష్టం మేరకు.. ఈ సమావేశం విచారణ వివరాలను ప్రచురించటం కానీ, ఎవరికీ తెలియజేయటం కానీ జరగదు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. పార్లమెంటులో చెప్పిన అంశాలపై కానీ, అక్కడ ఓటింగ్ జరిగిన అంశాలపై కానీ లోక్‌పాల్ ప్రమేయం ఉండదు. అవినీతి నిరోధక చట్టం - 1988 కింద భాష్యం చెప్పిన గ్రూప్-ఏ, బీ, సీ, డీ తరగతుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ఉద్యోగులు అందరూ కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. గ్రూప్-ఏ, బీ తరగతుల అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. దర్యాప్తు తర్వాత లోక్‌పాల్‌కు వస్తాయి. గ్రూప్-ిసీ, డీ ఉద్యోగులపై ఆరోపణలను చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దర్యాప్తు చేసి, లోక్‌పాల్‌కు నివేదిస్తారు. నిజాయితీ, నిబద్ధత గల ప్రభుత్వోద్యోగులకు తగినంత భద్రత ఉంటుంది. ప్రభుత్వం నిధులు అందించే సొసైటీలు, ట్రస్టులు, సంఘాలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద విదేశాల నుంచి ఏటా రూ. 10 లక్షలకు మించి నిధులు అందుకునే అన్ని సంస్థలూ దీని పరిధిలో ఉంటాయి. ప్రార్థనాస్థలాల నిర్మాణాలకు, మతపరమైన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ లోక్‌పాల్ దర్యాప్తు ఇలా... ఎవరైనా ప్రభుత్వాధికారిపై ఏదైనా అవినీతి ఆరోపణపై దర్యాప్తుకు ముందుకు వెళ్లాలని లోక్‌పాల్ నిర్ణయిస్తే.. అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించుకునేందుకు తన దర్యాప్తు విభాగం ద్వారా కానీ, సీబీఐ సహా మరే ఇతర దర్యాప్తు సంస్థ ద్వారా అయినా కానీ ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి వాదనను విన్న తర్వాతే లోక్‌పాల్ దర్యాప్తుకు ఆదేశిస్తుంది. లోక్‌పాల్‌కు.. సీబీఐతో సహా ఏ దర్యాప్తు సంస్థకైనా తాను రిఫర్ చేసే కేసుల దర్యాప్తుపై స్వయంగా పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం ఉంటుంది. లోక్‌పాల్ రిఫర్ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఎవరినైనా సరే.. లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు. లోక్‌పాల్ సిఫారసు చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లయితే.. అందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సీబీఐ డెరైక్టర్ ఎంపికను ప్రధానమంత్రి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ సిఫారసు చేస్తుంది. సీబీఐలో ప్రత్యేకంగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఒక డెరైక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేస్తారు. సీబీఐ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (కాగ్) సిఫారసుల ఆధారంగా నియమిస్తారు. సీబీఐ డెరైక్టర్‌కు, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌కు రెండేళ్ల నిర్ణీత పదవీ కాల పరిమితి ఉంటుంది. కేసులో ప్రాథమిక విచారణకు, దర్యాప్తుకు, కోర్టు విచారణకు స్పష్టమైన కాల పరిమితులు ఉంటాయి. ప్రాథమిక విచారణను 60 రోజుల్లో పూర్తిచేయాలి. దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలి. విచారణను రెండు సంవత్సరాల్లో ముగించాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. విచారణ పెండింగ్‌లో ఉన్నాకూడా.. అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్మెంట్, జప్తుకు కూడా అవకాశముంటుంది. ఈ చట్టం కింద దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు ఫిర్యాదులు చేసినట్లయితే ఏడాది వరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించటం జరుగుతుంది.