- లోక్‌పాల్ పరిధిలో ప్రధాని, మంత్రులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు
- ప్రధానిపై దర్యాప్తుకు లోక్‌పాల్
- ఫుల్ బెంచ్ కానీ, సభ్యుల్లో మూడింట
- రెండో వంతు మంది కానీ ఆమోదించాలి
- లోక్‌పాల్ కేసుల్లో సీబీఐ సహా ఏ సంస్థ దర్యాప్తుపై అయినా లోక్‌పాల్‌కు పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం
- నిజాయితీగల ఉద్యోగులకు భద్రత.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఏడాది జైలు, లక్ష జరిమానా
- లోక్‌పాల్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిని లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు
- విచారణ పెండింగ్‌లో ఉన్నా కూడా..
- అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్‌మెంట్, జప్తుకు అవకాశం
- లోక్‌పాల్ కేసుల దర్యాప్తులో దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం
‘అత్యున్నత’ అవినీతికి చెక్
Published Thu, Dec 19 2013 1:15 AM | Last Updated on Sat, Mar 9 2019 4:10 PM
కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో అవినీతికి చెక్ పెట్టేందుకు.. చిరకాలంగా ప్రయత్నిస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కోసం సామాజిక ఉద్యమనేతలు, ప్రజానీకం ఉధృతంగా ఉద్యమించటంతో.. ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గింది. లోక్‌పాల్ బిల్లును రూపొందించిన 44 ఏళ్ల తర్వాత.. ఎనిమిది సార్లు పార్లమెంటు ముందుకు వచ్చిన తర్వాత.. బిల్లులో అనేక మార్పుచేర్పులు, సవరణల తర్వాత.. చివరకు ఉభయసభల ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తూ చరిత్రాత్మక లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును పార్లమెంటు బుధవారం ఆమోదించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి 365 రోజుల్లోగా (అంటే ఏడాది కాలం లోగా) ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర శాసనసభల్లో చట్టం చేయటం ద్వారా.. రాష్ట్రస్థాయిలో అవినీతిపై దర్యాప్తు కోసం లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. లోకాయుక్త స్వరూప, స్వభావాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులోని ముఖ్యాంశాలివీ...
ఒక చైర్మన్, 8 మంది సభ్యులు...
లోక్‌పాల్.. కేంద్రం స్థాయిలో ఉండే స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇందులో చైర్మన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. అందులో సగం మంది న్యాయ సభ్యులై ఉంటారు. మరో సగం మంది ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ వర్గాలు, మైనారిటీలు, మహిళలు ఉంటారు. లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు విభాగంతో పాటు, సొంతంగా విచారణ (ప్రాసిక్యూషన్) విభాగం కూడా ఉంటుంది. లోక్‌పాల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
ఎంపిక ఇలా: లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ఒక కమిటీ ద్వారా జరుగుతుంది. ఈ కమిటీలో.. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో పాటు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి, ఈ నలుగురూ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి నియమించే ప్రముఖ న్యాయనిపుణుడు.. మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ.. తనకు సాయంగా ఏడుగురు నిపుణులతో ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది.
లోక్‌పాల్ సభ్యులు ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా ఉండరాదు.
లోక్‌పాల్ పదవీ కాల పరిమితి ఐదేళ్లు, లేదా.. చైర్మన్ కానీ, సభ్యులు కానీ వారికి 75 ఏళ్ల వయసు నిండే వరకూ పదవిలో కొనసాగుతారు.
లోక్‌పాల్ సభ్యులపై ఆరోపణలు వస్తే...
ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై కనీసం 100 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించినట్లయితే.. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు సదరు సభ్యుడు/సభ్యురాలిపై విచారణ చేపట్టవచ్చు. లోక్‌పాల్ సభ్యుడిని/సభ్యురాలిని సుప్రీంకోర్టు సిఫారసు లేదా మధ్యంతర ఉత్తర్వు మేరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. సదరు సభ్యుడు/సభ్యురాలిని రాష్ట్రపతి తొలగించవచ్చు.
పరిధిలో ప్రధాని, ఎంపీలు...
దేశ ప్రధానమంత్రి కూడా లోక్‌పాల్ పరిధిలో ఉంటారు. అంతర్జాతీయ సంబంధాలు, భద్రత, ప్రజా శాంతి, అణుశక్తి, అంతరిక్ష రంగాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు మినహా.. ఇతరత్రా అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధానిపై దర్యాప్తు చేపట్టే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అయితే.. ప్రధానిపై దర్యాప్తు చేపట్టేందుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ (సభ్యులందరూ) కానీ, సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదం తెలిపాలి. ప్రధానమంత్రిపై విచారణను రహస్యంగా (ఇన్-కెమెరా) నిర్వహిస్తారు. లోక్‌పాల్ అభీష్టం మేరకు.. ఈ సమావేశం విచారణ వివరాలను ప్రచురించటం కానీ, ఎవరికీ తెలియజేయటం కానీ జరగదు.
కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. పార్లమెంటులో చెప్పిన అంశాలపై కానీ, అక్కడ ఓటింగ్ జరిగిన అంశాలపై కానీ లోక్‌పాల్ ప్రమేయం ఉండదు.
అవినీతి నిరోధక చట్టం - 1988 కింద భాష్యం చెప్పిన గ్రూప్-ఏ, బీ, సీ, డీ తరగతుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ఉద్యోగులు అందరూ కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. గ్రూప్-ఏ, బీ తరగతుల అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. దర్యాప్తు తర్వాత లోక్‌పాల్‌కు వస్తాయి. గ్రూప్-ిసీ, డీ ఉద్యోగులపై ఆరోపణలను చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దర్యాప్తు చేసి, లోక్‌పాల్‌కు నివేదిస్తారు. నిజాయితీ, నిబద్ధత గల ప్రభుత్వోద్యోగులకు తగినంత భద్రత ఉంటుంది.
ప్రభుత్వం నిధులు అందించే సొసైటీలు, ట్రస్టులు, సంఘాలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద విదేశాల నుంచి ఏటా రూ. 10 లక్షలకు మించి నిధులు అందుకునే అన్ని సంస్థలూ దీని పరిధిలో ఉంటాయి. ప్రార్థనాస్థలాల నిర్మాణాలకు, మతపరమైన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. - సాక్షి, సెంట్రల్ డెస్క్
లోక్‌పాల్ దర్యాప్తు ఇలా...
ఎవరైనా ప్రభుత్వాధికారిపై ఏదైనా అవినీతి ఆరోపణపై దర్యాప్తుకు ముందుకు వెళ్లాలని లోక్‌పాల్ నిర్ణయిస్తే.. అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించుకునేందుకు తన దర్యాప్తు విభాగం ద్వారా కానీ, సీబీఐ సహా మరే ఇతర దర్యాప్తు సంస్థ ద్వారా అయినా కానీ ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి వాదనను విన్న తర్వాతే లోక్‌పాల్ దర్యాప్తుకు ఆదేశిస్తుంది.
లోక్‌పాల్‌కు.. సీబీఐతో సహా ఏ దర్యాప్తు సంస్థకైనా తాను రిఫర్ చేసే కేసుల దర్యాప్తుపై స్వయంగా పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం ఉంటుంది. లోక్‌పాల్ రిఫర్ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఎవరినైనా సరే.. లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు. లోక్‌పాల్ సిఫారసు చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లయితే.. అందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
సీబీఐ డెరైక్టర్ ఎంపికను ప్రధానమంత్రి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ సిఫారసు చేస్తుంది. సీబీఐలో ప్రత్యేకంగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఒక డెరైక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేస్తారు. సీబీఐ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (కాగ్) సిఫారసుల ఆధారంగా నియమిస్తారు. సీబీఐ డెరైక్టర్‌కు, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌కు రెండేళ్ల నిర్ణీత పదవీ కాల పరిమితి ఉంటుంది.
కేసులో ప్రాథమిక విచారణకు, దర్యాప్తుకు, కోర్టు విచారణకు స్పష్టమైన కాల పరిమితులు ఉంటాయి. ప్రాథమిక విచారణను 60 రోజుల్లో పూర్తిచేయాలి. దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలి. విచారణను రెండు సంవత్సరాల్లో ముగించాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు.
విచారణ పెండింగ్‌లో ఉన్నాకూడా.. అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్‌మెంట్, జప్తుకు కూడా అవకాశముంటుంది. ఈ చట్టం కింద దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు ఫిర్యాదులు చేసినట్లయితే ఏడాది వరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించటం జరుగుతుంది.
Advertisement