-
చరిత్రాత్మక లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
కేంద్రం స్థాయిలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ
-
ప్రధాని, ఎంపీలు, ఉద్యోగులంతా లోక్‌పాల్ పరిధిలోకి
-
రాజ్యసభ సవరణలతో సహా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
రాష్ట్ర విభజనపై సభ్యుల ఆందోళన మధ్యలోనే చర్చ
-
బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్
-
ఇది కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవటంపై సుష్మా విమర్శ
-
మరిన్ని బిల్లుల కోసం భేటీలను పొడిగించాలన్న రాహుల్
ఈ ఘనత ప్రజలు, ఆ పెద్దాయనదే: సుష్మా
లోక్‌పాల్ బిల్లుపై జరిగిన స్వల్ప చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. లోక్‌పాల్ బిల్లు గతంలో బలహీనంగా ఉన్నందున బీజేపీ వ్యతిరేకించిందన్నారు. అయితే రాజ్యసభలో ఈ బిల్లును తగినవిధంగా సవరించినందున మద్దతు ప్రకటించామన్నారు. బిల్లు ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ఈ ఘనత దేశ ప్రజలతో పాటు.. పలుమార్లు నిరాహార దీక్షలు చేపట్టిన పెద్దాయన (అన్నాహజారే)కు దక్కాలని వ్యాఖ్యానించారు.
అవినీతిపై పోరుకు లోక్‌పాల్ సరిపోదు: రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. అవినీతిపై పోరాటానికి లోక్‌పాల్ బిల్లు ఒక్కటే సరిపోదని.. సమగ్రమైన అవినీతి వ్యతిరేక నియమావళి అవసరమని చెప్పారు. యూపీఏ సర్కారు అవినీతి వ్యతిరేక వ్యవస్థను రూపొందించిందని, ఇందులో భాగమైన మరో ఆరు బిల్లులను ఆమోదించటానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలను పొడిగించాలని ఆయన సూచించారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణ బిల్లు, న్యాయ ప్రమాణాలు, బాధ్యత బిల్లు, సేవలు అందించటానికి నిర్ణీత కాలాన్ని నిర్దేశించే బిల్లు, ప్రభుత్వ సేకరణ, విదేశీ లంచాలు వంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాలుగా ఎనిమిది సార్లు విఫలయత్నాల అనంతరం.. భారతదేశం చరిత్రాత్మక లోక్‌పాల్ చట్టాన్ని ఆమోదించింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు - 2013ను బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును 2011 డిసెంబర్‌లోనే లోక్‌సభ తొలిసారి ఆమోదించింది. అయితే.. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి ముందు పలు సవరణలు చేసింది. ఆ బిల్లును బుధవారం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో లోక్‌పాల్ బిల్లును సవరణలతో సహా లోక్‌సభ ఆమోదించింది. సమాజ్‌వాది, శివసేన మినహా మిగతా పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి.
ఇది అరాచకానికి దారితీస్తుంది: ములాయం
లోక్‌పాల్ బిల్లు ప్రమాదకరమైనదని.. ఇది అరాచకానికి దారితీస్తుందని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ నిరసన వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేసే ముందు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. బిల్లును ఉపసంహరించుకోవాలని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ భయంతో పనిచేయరని, అభివృద్ధి ఉండదని, పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని పేర్కొన్నారు. ఈ బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతిస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీని ప్రశ్నించారు. శివసేన పార్టీ నేత అనంత్‌గీతె కూడా పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవటం ద్వారా.. ఆయన పార్లమెంటుకు కాకుండా మరెక్కడో జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు...
లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్ మాట్లాడుతూ.. రాజ్యసభలో మంగళవారం చేసిన సవరణలకు సంబంధించిన కాపీలను లోక్‌సభ సభ్యులకు బుధవారం నాడే అందించారని, నిబంధనల ప్రకారం.. ఏ చట్టాన్నయినా మరొక సభ ఆమోదం కోసం తీసుకునేటపుడు కనీసం రెండు రోజుల సమయం ఇవ్వాలని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీనిని స్పీకర్ రద్దు చేస్తూ.. రెండు రోజుల నిబంధనను సడలించటానికి తాను అంగీకరించానని తెలిపారు.
గందరగోళంలోనే చర్చ, ఆమోదం: బిల్లుపై చర్చ జరుగుతున్నంత సేపూ.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లో నిలుచుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు కూడా వెల్‌లోనే ఉండి తమ ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్లు చేస్తున్నారు. అస్సాంలో గిరిజనులపై దాడికి నిరసనగా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎంపీ ఎస్.కె.బిస్వ్‌ముతియారీ కూడా వెల్‌లో నిలుచుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు, గందరగోళం మధ్యనే స్పీకర్ మీరాకుమార్ లోక్‌పాల్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించి.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
అవినీతిపై పోరులో చారిత్రక ఘట్టం: ప్రధాని
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇది చరిత్రాత్మక చట్టం. పార్లమెంటు తన విజ్ఞతతో ఈ చట్టం చేయాలని నిర్ణయించటం పట్ల మేం ఎంతో సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘బిల్లు ఆమోదం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని సోనియా చెప్పారు. అవినీతిపై పోరాటానికి ఇంకా చాలా చేయాలని మరో ఏడు బిల్లులను ఆమోదించాల్సి ఉందని చెప్పారు.
బిల్లు ఆమోదంలో రాహుల్‌దే కీలక పాత్ర: కాంగ్రెస్
లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ శ్లాఘించింది. ‘‘రాహుల్ మనోభావాల్లో ఒక సందేశం ఉంది... అది.. ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందనేది. ఒక్క లోక్‌పాల్ ద్వారానే అవినీతిపై పోరాడలేమని కూడా రాహుల్ చెప్పారు. ఆర్‌టీఐ చట్టం పునాదిగా సమగ్ర అవినీతి వ్యతిరేక నియామవళి అవసరముందని చెప్పారు’’ అని పార్టీ అధికార ప్రతినిధి రాజ్‌బబ్బర్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు.
లోక్‌పాల్‌ను రాజకీయ వర్గమే పాలిస్తుంది: ఆప్
చెన్నై: పార్లమెంటు ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బిల్లు తాము కోరినట్లుగా లేదని, లోక్‌పాల్‌ను కూడా రాజకీయ వర్గమే పరిపాలిస్తుందని ఆ పార్టీ నేత యోగేంద్రయాదవ్ విమర్శించారు. ‘‘అన్నాహజారేకు పార్లమెంటు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేదు’’ అని ఆయన బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బిల్లును హజారే అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించగా.. అది ఆయన కోరుకున్న బిల్లు కాదని ఆయన గుర్తిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
హజారే పట్టుదలకు నివాళి: మోడీ
అహ్మదాబాద్: లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించటం.. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే పోరాటానికి, పట్టుదలకు నివాళి అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. హజారే ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు బుధవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఆమోదం ప్రజలందరి విజయమంటూ పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు.