Lokpal Bill
-
ఎట్టకేలకు లోక్‌పాల్
ఉన్నత స్థాయి అధికార వ్యవస్థల్లో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ సుదీర్ఘ కాలం తర్వాత సాకారమైంది. తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. ఆయ నతోపాటు 8మంది సభ్యుల్ని కూడా నియమించారు. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలతో కూడిన ఎంపిక కమిటీ శుక్రవారం సమావేశమై వీరి పేర్లను ఖరారు చేసింది. అయితే ఎంపిక కమిటీ తొలి సమావేశం వివాదం లేకుండా ముగియలేదు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే తనను కమిటీ సభ్యుడిగా కాక ‘ప్రత్యేక ఆహ్వానితుడి’గా పిల వడంపై అభ్యంతర వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. ఆహ్వానితుడిగా హాజరైతే ఆయ నకు ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన అభ్యంతరాలేవీ మినిట్స్‌లో నమోదు కావు. లోక్‌పాల్ ఎంపి కలో ఎలాంటి పాత్ర లేనప్పుడు తాను హాజరుకావడంలో అర్ధమేముందన్నది ఖర్గే ప్రశ్న. ఇది సహే తుకమైనదే. ఈ దేశంలో లోక్‌పాల్ అవసరాన్ని గుర్తించి, దానికోసం ఉద్యమం ప్రారంభించి యాభైయ్యేళ్లు కావస్తోంది. ఆ తర్వాత అది క్రమేపీ నీరసించింది. దానికోసం ఎవరెన్నిసార్లు డిమాండ్ చేసినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న దాఖలా లేదు. కానీ యూపీఏ ఏలుబడిలో వరసబెట్టి జరిగిన కుంభ కోణాల తర్వాత 2010లో అన్నా హజారే నాయకత్వంలో మొదలుపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్‌పాల్ కోసం గట్టిగా పట్టుబట్టింది. అది కూడా త్వరలోనే చల్లబడుతుందని వేసిన అంచనాలన్నీ తలకిందులై దేశవ్యాప్తంగా దాని ప్రభావం పెరుగుతుండటాన్ని గమనించాక యూపీఏ సర్కారు 2013 డిసెంబర్లో ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లు తీసుకొచ్చింది. ఉభయసభల్లోనూ అది ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత 2014 జనవరి 1న చట్టంగా కూడా మారింది. అయితే ఆనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న బీజేపీ కేంద్రంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహించినా గత అయిదేళ్లుగా అనేక కారణాల వల్ల లోక్‌పాల్ వ్యవస్థ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా చట్టంలో పేర్కొన్నవిధంగా ప్రతిపక్ష నాయ కుడి హోదాలో ఎవరూ లేకపోవడం సాంకేతిక అవరోధంగా మారిందని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీన్ని అధిగమించడానికి చట్టాన్ని సవరిస్తామని, ఆ తర్వాత లోక్‌పాల్ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. అయితే ఈ వాదనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లోక్‌పాల్ ఏర్పాటుకు అది తుది గడువు విధించడంతో కేంద్రానికి ఇక తప్ప నిసరైంది. కనుకనే ఇన్నాళ్లకైనా లోక్‌పాల్ ఏర్పడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతి తారస్థాయిలో పెరిగిపోయిన వర్తమాన తరుణంలో లోక్‌పాల్ ఏర్పాటు ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. రాష్ట్రాల్లో ఇప్పటికే లోకాయుక్తలు ఏర్పాటైతే సరేసరి. లేనట్టయితే ఈ చట్టంకింద వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశంలో తెలంగాణతో సహా డజను రాష్ట్రాలు ఇంకా లోకాయుక్తలు, ఉపలోకాయుక్తల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాని పదవిలో ఉన్నవారి నుంచి మొదలుకొని కేంద్రమంత్రులు, ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వగైరాలపై వచ్చే అవినీతి ఆరోపణలను లోక్‌పాల్ పరిశీలించి అవసరమైతే సీబీఐతోసహా వివిధ సంస్థలతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ప్రాసిక్యూషన్ చర్యకు అనుమతించవచ్చు. పదవిలో కొనసాగుతున్నవారు మాత్రమే కాదు... మాజీ ప్రధానులు, మాజీ కేంద్రమంత్రులు, మాజీ ఎంపీలు, రిటైరైన కేంద్ర ప్రభుత్వ అధికారులపై సైతం వచ్చే ఆరోపణలను ఇది విచారిస్తుంది. అయితే అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉండే అంశాల్లోనూ, విదేశాంగ, ఆంతరంగిక భద్రత, అణు శక్తి, అంతరిక్షం వగైరా రంగాలకు సంబం ధించిన అంశాల జోలికి ఇది పోదు. అలాగే పార్లమెంటులో లేదా సభా సంఘాల్లో ప్రస్తావనకొచ్చే అంశాల ఆధారంగా చేసే ఆరోపణల్లో ఇది జోక్యం చేసుకోదు. లోక్‌పాల్ ఏర్పాటుతో అవినీతి పూర్తిగా అంతమవుతుందనిగానీ, ప్రజాజీవన రంగం ప్రక్షాళన అవుతుందనిగానీ చెప్పడం కష్టం. అయితే అధికారంలో ఉన్నవారు ఒకటి రెండుసార్లు ఆలోచించి దేనిపైన అయినా నిర్ణయం తీసు కోవడానికి ఈ లోక్‌పాల్ దోహదపడుతుంది. ఒకసారంటూ అధికారం వచ్చాక అయిదేళ్ల వరకూ తాము ఏం చేసినా చెల్లుతుందని, తమను అడిగేవారెవరూ లేరని ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులు భావిస్తున్నారు. వేలకోట్లు రూపాయలు పోగేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మె ల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడం, ఎన్నికలొచ్చినప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి విజయం సాధించడానికి ప్రయత్నించడం ఎక్కువైంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు చట్టం నిర్దేశిం చిన పరిమితులకు మించి అనేక వందల రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థ పైనే ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. లోక్‌పాల్ దీన్ని ఏమేరకు నియంత్రించగలదో చూడాలి. అయితే లోక్‌పాల్, ఇతర సభ్యుల నియామకంతో అంతా ముగియలేదు. తనకొచ్చే ఆరోపణ లపై లోక్‌పాల్ ప్రాథమిక విచారణ జరపడానికి డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ విభాగం కావాలి. అలాగే ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఉండాలి. ఈ రెండు విభా గాలూ పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలి. వీటికి మరికొంత సమయం పడుతుంది. ఫిర్యాదు స్వీకరించిన 90 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తికావాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత తగిన సంస్థతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. లేదా ఆరోపణలకు ఆధారాలు లేవనుకుంటే కేసును ముగించవచ్చు. దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న లోక్‌పాల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, అవినీతిని ఏదోమేరకు అరికడుతుందని ఆశించాలి. -
అవినీతి అంతంచేసే చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ కింద కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, మహరాష్ట్రలో లోకాయుక్తను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత వారం రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం విరమించిన విషయం తెల్సిందే. హజారే దీక్షను విరమింపచేసేందుకు జూనియర్ మంత్రులను పంపించినా లాభం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి హజారే దీక్షను విరమింప చేశారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తానని ఫడ్నవీస్ హామీ ఇచ్చి ఉండవచ్చుగానీ కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తానని ఏ హోదాలో హామీ ఇచ్చారో, ఆ హామీని అన్నా హజారే ఎలా విశ్వసించారో వారికే తెలియాలి. ‘దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా భారత యుద్ధం’ అంటూ అన్నా హజారే పోరాటం చేయడం వల్లనే 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాటి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతో తోడ్పడింది. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్ర మోదీ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేక పోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించని మోదీ లోక్‌పాల్‌ను నియమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో! 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారెవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆర్జేడీ నాయకుడు లాలూను జైలుకు పంపించడం, యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతిలపై, పశ్చిమ బెంగాల్లో పోలీసు కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరపడం రాజకీయ కక్షలే తప్పించి అవినీతి నిర్మూలనా చర్యలు ఎంత మాత్రం కావు. నేతల అవినీతిని పక్కన పెడితే అధికార యంత్రాంగంలో, సైనికుల్లో, పోలీసుల్లో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఎలాంటి చట్టాలను తీసుకరాలేదు. అన్ని ప్రభుత్వ రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అందుకు చట్టాలను తీసుకొచ్చినట్లయితే సగం అవినీతి దానంతట అదే తగ్గిపోయి ఉండేది. మోదీ ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం గహ నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచింది. తద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు లబ్ధి చేకూరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో ఇలాంటి చట్టాలను తీసుకరావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకతు ఆస్కారమిస్తూ అవినీతి బట్టబయలకు అవకాశం ఇస్తున్న ‘సమాచార హక్కు’ చట్టాన్ని నీరుకార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం విచిత్రం. తనతో సహా కొంత మంది మంత్రుల విద్యార్హతలను సమాచార హక్కు కింద వెల్లడించకుండా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ను పీఎంవో కార్యాలయం అడ్డుకున్న విషయం తెల్సిందే. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడానికి వీలుగా వారి జీతభత్యాలను, పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయించే విధంగా సమాచార చట్టంలో రహస్యంగా సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుల జడ్జీలతో సమానంగా కేంద్ర సమాచార కమిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జీల జీతభత్యాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయిస్తుందన్న విషయం తెల్సిందే. పార్లమెంట్‌ను మభ్యపెట్టడం ద్వారా కేవలం కేబినెట్ ఆమోదంతో ఆ సవరణ తీసుకరావాలనుకుంది. అదికాస్త బయటకు పొక్కడంతో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక పోయింది. గోవా పోలీసు అధికారి అమ్జద్ కరోల్ 2014లో ఓ పేద మహిళలను బహిరంగంగా వివస్త్రను చేసి చితకబాదినా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విధుల నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ 2017లో అధికారుల అవినీతి కారణంగా తమకు ఎంత అధ్వాన్నమైన ఆహారాన్ని ఇస్తున్నారో వీడియో ద్వారా బయటపెడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోకపోగా క్రమశిక్షణారాహిత్యం కింద బహదూర్ యాదవ్‌ను తొలగించారు. ఢిల్లీలో ప్రతిష్టాకరమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్) ఆస్పత్రిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అప్పటి ఆస్పత్రి విజిలెన్స్ కమిషనర్ మెగసెసే అవార్డు గ్రహీత సంజీవ్ చతుర్వేదీ బయటపెట్టినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడానికి బాధ్యుడయిన ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌పైనా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చట్టాలు అవసరం. అందుకు చిత్తశుద్ధి ఇంకా ఎంతో అవసరం. -
ఇచ్చిన మాటను తప్పిన ప్రభుత్వమిది
-
హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం
-
హజారే డిమాండ్లకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు. -
లోక్‌పాల్ కోసం అన్నా హజారే నిరశన
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి వ్యతి రేకంగా హాజారే ఏడేళ్ల కింద ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించి, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేయడం తెల్సిందే. రామ్‌లీలా మైదానంలో శుక్రవా రం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈసారి ఆయన టార్గెట్‌గా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచే అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. -
రాజ్యాంగాన్ని కాపాడండి: అరవింద్ కేజ్రీవాల్
-
రాజ్యాంగాన్ని కాపాడండి: అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంతో కయ్యానికి మరోసారి కాలుదువ్వారు. కాంగ్రెస్, కేంద్ర హోంశాఖ ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. అంతకుముందు కేంద్రం అనుమతి లేకుండా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందేమో తెలపాలంటూ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ సలహా కోరారని, అది రాజ్యాంగ విరుద్ధమేనంటూ పరాశరన్ చెప్పారంటూ వార్తలు వచ్చాయి. అసలు ఆ విషయం ఎలా బయటకు పొక్కిందంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిల్లును పంపకమునుపే దాని రాజ్యంగబద్ధతపై న్యాయసలహా ఎందుకు తీసుకోవలసివచ్చిందంటూ తన మూడు పేజీల బహిరంగ లేఖలో నజీబ్ జంగ్‌ను నిలదీశారు. బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెస్ నేతలు జైలుకు పోతారు కాబట్టి తనను, తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా ఆ నేతలు మీడియాకు లీకులిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీలను కాకుండా రాజ్యాంగాన్ని రక్షించాలని లేఖలో నజీబ్‌జంగ్‌ను కోరారు. రాజ్యాంగపరంగా అనుమతులు పొందకపోతే బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ లవ్లీ చెప్పారు. సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్, షాజియా ఇల్మిలకు సుప్రీంకోర్టు పరువునష్టం నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ చర్య తీసుకుంది. -
ఆప్ + కాప్
రామ్‌లీలా మైదాన్‌లోనే లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ఆప్ సర్కారు చెబుతుండగా, అలా చేస్తే తమకు చాలా సమస్యలు వస్తాయని పోలీసులు ఆక్షేపిస్తున్నారు. అసెంబ్లీని బహిరంగ ప్రదేశంలో సమావేశపర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి మళ్లీ పోలీసులతో పేచీ మొదలయింది. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు రామ్‌లీలా మైదాన్‌లోనే చట్టరూపం కల్పిస్తామని ప్రభుత్వం అంటుండగా, అక్కడ విధానసభను సమావేశపరచడం భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తుం దని పోలీసులు చెబుతున్నారు. ఈ తాజా సమస్య మరోమారు ఢిల్లీ పోలీసులు, సర్కారుకు మధ్య ఘర్షణ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల రామ్‌లీలా మైదాన్‌లో జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించారు. బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీని సమావేశపరచడం వల్ల భద్రతా సమస్యలు వస్తాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఢిల్లీ పోలీసులు లెప్టినెంట్ గవర్నర్, ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరిస్తే హాజరయ్యే వేలాది మందిని తనిఖీ చేయడం, అదుపులో పెట్టడం కష్టమవుతుందని పోలీసులు లేఖలో పేర్కొన్నారు. రామ్‌లీలా మైదాన్‌కు ఆ సమయంలో వివిధ రాజ కీయ పార్టీల సభ్యులు, నాయకులు హాజరవుతారని, వారి మధ్య ఘర్షణ తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను అదుపు చేయడం కష్టమవుతుందని పోలీసులు అంటున్నారు. అసెం బ్లీ సమావేశం కోసం రామ్‌లీలా మైదాన్ సమీపంలోని అనేక రోడ్లను మూసివేయాల్సి ఉంటుందని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు. వాగ్దానం చేశాం కాబట్టే.. అయితే రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరచి బిల్లును ఆమోదిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేశాం కాబట్టి అక్కడే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆప్ వాదిస్తోంది. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపర్చడం అంత సులభం కాదని నిపుణులు కూడా అంటున్నారు. ‘లోక్‌సభ, రాజ్యసభతోపాటు దేశంలో 38 చట్టసభలు ఉన్నాయి. గడచిన 65 సంవత్సరాల్లో ఎక్కడా అసెంబ్లీ సమావేశాలు బహిరంగ ప్రదేశంలో జరగలేదు. అసెంబ్లీని బహిరంగప్రదేశంలో సమావేశపర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ సవరణ చేయకుండా ఇలా చేయడం కుదరదు’ అని ఢిల్లీ అసెంబ్లీ మాజీ కార్యదర్శి ఎస్.కె.శర్మ అంటున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రుల కార్యాలయాల్లో మాత్రమే సభాకార్యక్రమాలు జరగవచ్చని రాజ్యాంగం పేర్కొం దని ఆయన చెప్పారు. మైదానంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించినట్లయితే సభామర్యాదను కాపాడడం కష్టమవుతుందని ఆయన అంటున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరచడం రాజకీయ డ్రామా అని ప్రతిపక్షనేత హర్షవర్ధన్ విమర్శించారు. -
హజారే ఉద్యమం వల్లే.. లోక్‌పాల్ చట్టం
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారేపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. హజారే నేతృత్వంలో పౌరసమాజం సాగించిన ఉద్యమం ఫలితంగానే లోక్‌పాల్ చట్టం వచ్చిందని ఆయన అన్నారు. దేశంలో ప్రజల భాగస్వామ్యంతో రూపొందిన తొలి చట్టం ఇదేనన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో శనివారం ఏర్పాటైన 10వ నెహ్రూ స్మారకోపన్యాస కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ‘నెహ్రూ-పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అంశంపై రాష్ట్రపతి మాట్లాడారు. లోక్‌పాల్ బిల్లు కోసం హజారే ఉద్యమం ప్రారంభించినప్పుడు పౌరసమాజం నుంచి ఆయనకు భారీ మద్దతు లభించిందని గుర్తు చేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... - చట్టాల రూపకల్పనలో పౌరసమాజం కీలక పాత్ర పోషించగలదని ‘లోక్‌పాల్’ ఉద్యమం చాటింది. - {పజాస్వామిక వ్యవస్థలో ప్రజలే యజమానులు. రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎన్నికైన ప్రజాప్రతినిధులు వమ్ము చేయరాదు. - రాజకీయాల్లోకి నేరచరితుల ప్రవేశం, అవినీతి ఆందోళనకరంగా మారాయి. - సంచలన వార్తల కోసం పరుగులు తీసే మీడియా వ్యాప్తి, పౌరసమాజానికి చెందిన సంస్థల వంటి కొత్త శక్తులు రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. -
లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ షురూ
పదవుల భర్తీకి దరఖాస్తులు కోరిన కేంద్రం న్యూఢిల్లీ: అవినీతి నిరోధక వ్యవస్థ అయిన లోక్‌పాల్ నియామక ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. లోక్‌పాల్ చైర్పర్సన్, 8 మంది సభ్యుల పదవుల భర్తీకి గాను అర్హుల నుంచి శనివారం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో నాలుగు జ్యుడీషియల్ పదవులు. అవి న్యాయ వ్యవస్థతో సంబంధమున్న వారికి రిజర్వయ్యాయని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. వాటికి అర్హులైన అధికారుల నుంచి దరఖాస్తులు కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టుల రిజిస్ట్రార్లకు లేఖ పంపామన్నారు. అంతేగాక రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా కేంద్రం లేఖ రాసిందన్నారు. చైర్మన్, సభ్యుల పదవుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ త్వరలో ప్రఖ్యాత దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇస్తామని తెలిపారు. దరఖాస్తులను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శికి ఫిబ్రవరి 7లోగా చేరేలా పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పలు స్థాయిల్లో ఉండే అధికారులు, మంత్రులు తదితరులతో పాటు ఏకంగా ప్రధానిపై వచ్చే అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపే అధికారం లోకాయుక్తకు ఉన్న విషయం తెలిసిందే. ఈ దిశగా కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తల ఏర్పాటుకు వీలు కల్పించే లోక్‌పాల్, లోకాయుక్తల బిల్లు-2013ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జనవరి 1న ఆమోదించారు. ఇవీ అర్హతలు: లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా నియమితులయ్యే వారికి ఆ పదవిని చేపట్టేనాటికి కనీసం 45 ఏళ్లుండాలి. పార్లమెంటులో గానీ, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల్లో సభ్యత్వం ఉండరాదు. లోకాయుక్త పదవులు చేపట్టాలంటే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సభ్యులై ఉండకూడదు. నైతికంగా తలదించుకునే నేరాలు చేశారని కోర్టులు నిర్ధారించిన వారు అనర్హులు. ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి వీరిని పదవుల్లో నియమిస్తారు. లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన నామినేట్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయ కోవిదుడు కమిటీలో ఉంటారు. న్యాయ కోవిదుడిని రాష్ట్రపతి గానీ, ఇతర సభ్యుల్లో ఎవరైనా గానీ నామినేట్ చేయవచ్చు. పదవీకాలం: ఐదేళ్లు, లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు జీతభత్యాలు: చైర్‌పర్సన్‌కు సీజేఐతో సమానంగా సభ్యులకు: సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా చైర్పర్సన్, సభ్యుల ఎంపికకు లోక్‌పాల్ చట్టంలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు ఇలా ఉన్నాయి... లోక్‌పాల్ చైర్మన్: భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి. లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్న వారు. లేదా తిరుగులేని నీతి నిజాయితీలున్న ప్రముఖులు జ్యుడీషియల్ సభ్యులు: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్న వారు. లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్నవారు నాన్ జ్యుడీషియల్ సభ్యులు: తిరుగులేని నీతి నిజాయితీలతో పాటు అవినీతి నిరోధక విధానాలు, పాలన, విజిలెన్స్, బీమా, బ్యాంకింగ్ వంటి అంశాలపై కనీసం 25 ఏళ్లకు తగ్గని అనుభవం, ప్రత్యేక పరిజ్ఞానమున్న ప్రముఖులు -
'కేజ్రివాల్ అంకుల్... మా కుటుంబాన్ని ఆదుకోండి'
పేదరికంతో బాధపడుతూ బ్రతకడానికి అష్టకష్టాలు పడుతున్న తమను ఆదుకోవాలని ఓ మైనర్ బాలుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ని అభ్యర్థించారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే సాగించిన ఉద్యమంలో బీహార్ లోని సర్ఫు్ద్దీన్ పూర్ కు గ్రామానికి చెందిన దినేశ్ యాదవ్ 2011లో ఆత్మహుతి చేసుకున్నారు. దాంతో దినేశ్ యాదవ్ మృతితో ఆ కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కేజ్రివాల్ ను వేడుకున్నారు. తన తండ్రి మరణం తర్వాత పలువురు నేతలు ఆదుకుంటామని చేసిన హామీల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. 'కేజ్రివాల్ అంకుల్, లోక్ పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో మా నాన్న ఆత్మత్యాగానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి మేము పేదరికంతో బాధపడుతున్నాం అని యాదవ్ పెద్ద కుమారుడు 14 ఏళ్ల గుడ్డు అభ్యర్థించారు. మానాన్న మరణం తర్వాత స్కూల్ వెళ్లడం లేదు. తప్పని పరిస్థితిలో తాము కూలీలుగా పనిచేస్తున్నాం' అని గుడ్డు వెల్డడించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం మా బతుకుల్ని బాగు చేస్తుందనే ఒకే ఆశతో బతుకుతున్నాం అని యాదవ్ భార్య మల్ మతియా దేవి అన్నారు. కనీసం ఢిల్లీకి వెళ్లడానికి చార్టీలు కూడా లేవు అన్నారు. దినేష్ మరణంతో ఆయన తల్లి తండ్రులు, భార్య, ఐదుగురు పిల్లలు పరిస్థితి దిక్కు తోచని విధంగా మారింది. -
లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
-
లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అత్యున్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన ఈ చరిత్రాత్మక బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని రక్షణలతో ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. సవరించిన లోక్‌పాల్ బిల్లును డిసెంబర్ 17, 18 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ర్టపతి ఆమోదం పొందడంతో లోక్‌పాల్ బిల్లు కొన్ని లాంఛనాల తర్వాత చట్టరూపం దాల్చుతుంది. ఇప్పుడు ఈ బిల్లు న్యాయ శాఖలోని శాసన విభాగం కార్యదర్శి సంతకం చేసి.. దానిని అధికార గెజిట్‌లో ప్రచురణ కోసం పంపుతారు. ఇది చట్టరూపం దాల్చితే లోక్‌పాల్ ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో చట్టాల ద్వారా లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలి. -
లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో లోక్‌పాల్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లును పార్లమెంటు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమోదించింది. ప్రధానమంత్రిని సైతం ఈ బిల్లు పరిధిలోకి తెస్తూ డిసెంబర్ 18న పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంతకుమించి ఈ బిల్లు కోసం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం మరువలేనిది. ఉన్నతస్థాయి అవినీతికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని 1960 ల్లోనే కేంద్రంలో పెద్దలు భావించారు. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. దీనిని 1969లో 4వ లోక్‌సభలో ఆమోదించారు. కానీ అప్పుడది రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లలో లోక్‌పాల్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే 98 గంటల తర్వాత ఏప్రిల్ 11న దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ఇది బలహీనంగా ఉందని, అందులో తాను కోరిన మార్పులు చేపట్టలేదని హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్లో ఆయన మళ్లీ దీక్షకు దిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ చేపట్టారు. అందులో పలు సవరణలు చేసి ఆమోదించారు. ఆ సవరణలకు హజారే సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న బిల్లును మళ్లీ లోక్‌సభకు పంపించి, సవరణలతో సహా ఆమోదించారు. దీంతో లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. ఈరోజు రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టమైంది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్‌పాల్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. తాను పంపిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుంది. లోక్‌పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని, ఇందుకు ఏడాది గడువు ఉంటుందని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఎవరిపైనైనా తప్పుడు ఆరోపణలు చేస్తే జరిమానా, జైలు శిక్షలు కూడా ఉంటాయి. -
లోక్‌పాల్‌పై ఎన్ఎస్యూఐ సంబరాలు
-
లోక్‌పాల్‌పై ఎన్ఎస్యూఐ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లులు ఆమోదించడంపై నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో దేశంలోంచి అవినీ తిని పారద్రోలేందుకు అవసరమైన మరిన్ని చట్టాలను చేయాలంటూ జంతర్‌మంతర్ వద్ద సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్ర్రాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలతో జంతర్‌మంతర్ నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు. ఎన్నోఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాత్ర ఉందని వారు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్ పాల్ బిల్లు: రాహుల్
న్యూఢిల్లీ: అన్నికాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్‌పాల్ బిల్లును ఫిబ్రవరి 28 తేదిలోగా అమల్లోకి తీసుకువస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి రాహుల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అమల్లో భాగంగా లోకాయుక్తల నియామకాలు చేపడుతాం అని తెలిపారు. అధిక ధరలను నియంత్రించేందుకు సీఎంల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అని ఆయన మీడియాకు వెల్లడించారు. పళ్లు, కూరగాయల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలకు అందుబాటులోకి రావడం అన్ని రాష్ట్రాల్లో బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలను వెంటనే అమలు చేస్తాం. ఆహార భద్రతా బిల్లుకు అనుగుణంగా చర్చలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దుకాణాలు లేదా స్వయం సహాయ సంఘాల ద్వారా చౌక ధరలకే నిత్యావసర సరుకులివ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని రాహుల్ తెలిపారు. నేటి సమావేశంలో ధరలు, అవినీతి అంశాలపై చర్చించాం. లోక్‌పాల్ బిల్లు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్‌గాంధీ అన్నారు. లోకపాల్ బిల్లు కార్యాచరణపై మేం మాట్లాడేసరికి మిగతాపార్టీలన్నీ మౌనం వహించాయి అని ప్రతిపక్షాల తీరును రాహుల్ తప్పుపట్టారు. లోక్‌పాల్ బిల్లును మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం, ఆదర్శ్ కుంభకోణం వ్యవహారంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించం అని రాహుల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్టీఐని తీసుకువచ్చిన తామే, లోక్‌పాల్ బిల్లునూ కూడా తెచ్చాం అని రాహుల్ అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రాహుల్ వెళ్లిపోవడం కొసమెరుపు. దేశ రాజధాని లో శుక్రవారం నిర్వహించిన సీఎంల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు అజయ్‌మాకెన్ వెల్లడించారు. -
జన విజయం
-
‘అత్యున్నత’ అవినీతికి చెక్
లోక్‌పాల్ పరిధిలో ప్రధాని, మంత్రులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రధానిపై దర్యాప్తుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ కానీ, సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదించాలి లోక్‌పాల్ కేసుల్లో సీబీఐ సహా ఏ సంస్థ దర్యాప్తుపై అయినా లోక్‌పాల్‌కు పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం నిజాయితీగల ఉద్యోగులకు భద్రత.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఏడాది జైలు, లక్ష జరిమానా లోక్‌పాల్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిని లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు విచారణ పెండింగ్‌లో ఉన్నా కూడా.. అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్మెంట్, జప్తుకు అవకాశం లోక్‌పాల్ కేసుల దర్యాప్తులో దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో అవినీతికి చెక్ పెట్టేందుకు.. చిరకాలంగా ప్రయత్నిస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కోసం సామాజిక ఉద్యమనేతలు, ప్రజానీకం ఉధృతంగా ఉద్యమించటంతో.. ఆ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గింది. లోక్‌పాల్ బిల్లును రూపొందించిన 44 ఏళ్ల తర్వాత.. ఎనిమిది సార్లు పార్లమెంటు ముందుకు వచ్చిన తర్వాత.. బిల్లులో అనేక మార్పుచేర్పులు, సవరణల తర్వాత.. చివరకు ఉభయసభల ఆమోదం పొందింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తూ చరిత్రాత్మక లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును పార్లమెంటు బుధవారం ఆమోదించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి 365 రోజుల్లోగా (అంటే ఏడాది కాలం లోగా) ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర శాసనసభల్లో చట్టం చేయటం ద్వారా.. రాష్ట్రస్థాయిలో అవినీతిపై దర్యాప్తు కోసం లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. లోకాయుక్త స్వరూప, స్వభావాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా ఆమోదించిన లోక్‌పాల్ బిల్లులోని ముఖ్యాంశాలివీ... ఒక చైర్మన్, 8 మంది సభ్యులు... లోక్‌పాల్.. కేంద్రం స్థాయిలో ఉండే స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇందులో చైర్మన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. అందులో సగం మంది న్యాయ సభ్యులై ఉంటారు. మరో సగం మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలు, మైనారిటీలు, మహిళలు ఉంటారు. లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు విభాగంతో పాటు, సొంతంగా విచారణ (ప్రాసిక్యూషన్) విభాగం కూడా ఉంటుంది. లోక్‌పాల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఎంపిక ఇలా: లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ఒక కమిటీ ద్వారా జరుగుతుంది. ఈ కమిటీలో.. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో పాటు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి, ఈ నలుగురూ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి నియమించే ప్రముఖ న్యాయనిపుణుడు.. మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ.. తనకు సాయంగా ఏడుగురు నిపుణులతో ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది. లోక్‌పాల్ సభ్యులు ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా ఉండరాదు. లోక్‌పాల్ పదవీ కాల పరిమితి ఐదేళ్లు, లేదా.. చైర్మన్ కానీ, సభ్యులు కానీ వారికి 75 ఏళ్ల వయసు నిండే వరకూ పదవిలో కొనసాగుతారు. లోక్‌పాల్ సభ్యులపై ఆరోపణలు వస్తే... ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై కనీసం 100 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించినట్లయితే.. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు సదరు సభ్యుడు/సభ్యురాలిపై విచారణ చేపట్టవచ్చు. లోక్‌పాల్ సభ్యుడిని/సభ్యురాలిని సుప్రీంకోర్టు సిఫారసు లేదా మధ్యంతర ఉత్తర్వు మేరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. సదరు సభ్యుడు/సభ్యురాలిని రాష్ట్రపతి తొలగించవచ్చు. పరిధిలో ప్రధాని, ఎంపీలు... దేశ ప్రధానమంత్రి కూడా లోక్‌పాల్ పరిధిలో ఉంటారు. అంతర్జాతీయ సంబంధాలు, భద్రత, ప్రజా శాంతి, అణుశక్తి, అంతరిక్ష రంగాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు మినహా.. ఇతరత్రా అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధానిపై దర్యాప్తు చేపట్టే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అయితే.. ప్రధానిపై దర్యాప్తు చేపట్టేందుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ (సభ్యులందరూ) కానీ, సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదం తెలిపాలి. ప్రధానమంత్రిపై విచారణను రహస్యంగా (ఇన్-కెమెరా) నిర్వహిస్తారు. లోక్‌పాల్ అభీష్టం మేరకు.. ఈ సమావేశం విచారణ వివరాలను ప్రచురించటం కానీ, ఎవరికీ తెలియజేయటం కానీ జరగదు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. పార్లమెంటులో చెప్పిన అంశాలపై కానీ, అక్కడ ఓటింగ్ జరిగిన అంశాలపై కానీ లోక్‌పాల్ ప్రమేయం ఉండదు. అవినీతి నిరోధక చట్టం - 1988 కింద భాష్యం చెప్పిన గ్రూప్-ఏ, బీ, సీ, డీ తరగతుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ఉద్యోగులు అందరూ కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అయితే.. గ్రూప్-ఏ, బీ తరగతుల అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. దర్యాప్తు తర్వాత లోక్‌పాల్‌కు వస్తాయి. గ్రూప్-ిసీ, డీ ఉద్యోగులపై ఆరోపణలను చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దర్యాప్తు చేసి, లోక్‌పాల్‌కు నివేదిస్తారు. నిజాయితీ, నిబద్ధత గల ప్రభుత్వోద్యోగులకు తగినంత భద్రత ఉంటుంది. ప్రభుత్వం నిధులు అందించే సొసైటీలు, ట్రస్టులు, సంఘాలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద విదేశాల నుంచి ఏటా రూ. 10 లక్షలకు మించి నిధులు అందుకునే అన్ని సంస్థలూ దీని పరిధిలో ఉంటాయి. ప్రార్థనాస్థలాల నిర్మాణాలకు, మతపరమైన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ లోక్‌పాల్ దర్యాప్తు ఇలా... ఎవరైనా ప్రభుత్వాధికారిపై ఏదైనా అవినీతి ఆరోపణపై దర్యాప్తుకు ముందుకు వెళ్లాలని లోక్‌పాల్ నిర్ణయిస్తే.. అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించుకునేందుకు తన దర్యాప్తు విభాగం ద్వారా కానీ, సీబీఐ సహా మరే ఇతర దర్యాప్తు సంస్థ ద్వారా అయినా కానీ ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి వాదనను విన్న తర్వాతే లోక్‌పాల్ దర్యాప్తుకు ఆదేశిస్తుంది. లోక్‌పాల్‌కు.. సీబీఐతో సహా ఏ దర్యాప్తు సంస్థకైనా తాను రిఫర్ చేసే కేసుల దర్యాప్తుపై స్వయంగా పర్యవేక్షణ, దిశానిర్దేశం చేసే అధికారం ఉంటుంది. లోక్‌పాల్ రిఫర్ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఎవరినైనా సరే.. లోక్‌పాల్ ఆమోదం లేకుండా బదిలీ చేయటానికి వీలులేదు. లోక్‌పాల్ సిఫారసు చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లయితే.. అందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సీబీఐ డెరైక్టర్ ఎంపికను ప్రధానమంత్రి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ సిఫారసు చేస్తుంది. సీబీఐలో ప్రత్యేకంగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఒక డెరైక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేస్తారు. సీబీఐ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (కాగ్) సిఫారసుల ఆధారంగా నియమిస్తారు. సీబీఐ డెరైక్టర్‌కు, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌కు రెండేళ్ల నిర్ణీత పదవీ కాల పరిమితి ఉంటుంది. కేసులో ప్రాథమిక విచారణకు, దర్యాప్తుకు, కోర్టు విచారణకు స్పష్టమైన కాల పరిమితులు ఉంటాయి. ప్రాథమిక విచారణను 60 రోజుల్లో పూర్తిచేయాలి. దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలి. విచారణను రెండు సంవత్సరాల్లో ముగించాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. విచారణ పెండింగ్‌లో ఉన్నాకూడా.. అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల అటాచ్మెంట్, జప్తుకు కూడా అవకాశముంటుంది. ఈ చట్టం కింద దోషులుగా నిర్ధారితులైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు ఫిర్యాదులు చేసినట్లయితే ఏడాది వరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించటం జరుగుతుంది. -
జన విజయం
చరిత్రాత్మక లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం కేంద్రం స్థాయిలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ప్రధాని, ఎంపీలు, ఉద్యోగులంతా లోక్‌పాల్ పరిధిలోకి రాజ్యసభ సవరణలతో సహా బిల్లుకు లోక్‌సభ ఆమోదం రాష్ట్ర విభజనపై సభ్యుల ఆందోళన మధ్యలోనే చర్చ బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవటంపై సుష్మా విమర్శ మరిన్ని బిల్లుల కోసం భేటీలను పొడిగించాలన్న రాహుల్ ఈ ఘనత ప్రజలు, ఆ పెద్దాయనదే: సుష్మా లోక్‌పాల్ బిల్లుపై జరిగిన స్వల్ప చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. లోక్‌పాల్ బిల్లు గతంలో బలహీనంగా ఉన్నందున బీజేపీ వ్యతిరేకించిందన్నారు. అయితే రాజ్యసభలో ఈ బిల్లును తగినవిధంగా సవరించినందున మద్దతు ప్రకటించామన్నారు. బిల్లు ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ఈ ఘనత దేశ ప్రజలతో పాటు.. పలుమార్లు నిరాహార దీక్షలు చేపట్టిన పెద్దాయన (అన్నాహజారే)కు దక్కాలని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరుకు లోక్‌పాల్ సరిపోదు: రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. అవినీతిపై పోరాటానికి లోక్‌పాల్ బిల్లు ఒక్కటే సరిపోదని.. సమగ్రమైన అవినీతి వ్యతిరేక నియమావళి అవసరమని చెప్పారు. యూపీఏ సర్కారు అవినీతి వ్యతిరేక వ్యవస్థను రూపొందించిందని, ఇందులో భాగమైన మరో ఆరు బిల్లులను ఆమోదించటానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలను పొడిగించాలని ఆయన సూచించారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణ బిల్లు, న్యాయ ప్రమాణాలు, బాధ్యత బిల్లు, సేవలు అందించటానికి నిర్ణీత కాలాన్ని నిర్దేశించే బిల్లు, ప్రభుత్వ సేకరణ, విదేశీ లంచాలు వంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాలుగా ఎనిమిది సార్లు విఫలయత్నాల అనంతరం.. భారతదేశం చరిత్రాత్మక లోక్‌పాల్ చట్టాన్ని ఆమోదించింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు - 2013ను బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును 2011 డిసెంబర్లోనే లోక్‌సభ తొలిసారి ఆమోదించింది. అయితే.. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి ముందు పలు సవరణలు చేసింది. ఆ బిల్లును బుధవారం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో లోక్‌పాల్ బిల్లును సవరణలతో సహా లోక్‌సభ ఆమోదించింది. సమాజ్‌వాది, శివసేన మినహా మిగతా పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇది అరాచకానికి దారితీస్తుంది: ములాయం లోక్‌పాల్ బిల్లు ప్రమాదకరమైనదని.. ఇది అరాచకానికి దారితీస్తుందని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ నిరసన వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేసే ముందు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. బిల్లును ఉపసంహరించుకోవాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ భయంతో పనిచేయరని, అభివృద్ధి ఉండదని, పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని పేర్కొన్నారు. ఈ బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతిస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీని ప్రశ్నించారు. శివసేన పార్టీ నేత అనంత్‌గీతె కూడా పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవటం ద్వారా.. ఆయన పార్లమెంటుకు కాకుండా మరెక్కడో జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు... లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్ మాట్లాడుతూ.. రాజ్యసభలో మంగళవారం చేసిన సవరణలకు సంబంధించిన కాపీలను లోక్‌సభ సభ్యులకు బుధవారం నాడే అందించారని, నిబంధనల ప్రకారం.. ఏ చట్టాన్నయినా మరొక సభ ఆమోదం కోసం తీసుకునేటపుడు కనీసం రెండు రోజుల సమయం ఇవ్వాలని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీనిని స్పీకర్ రద్దు చేస్తూ.. రెండు రోజుల నిబంధనను సడలించటానికి తాను అంగీకరించానని తెలిపారు. గందరగోళంలోనే చర్చ, ఆమోదం: బిల్లుపై చర్చ జరుగుతున్నంత సేపూ.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లో నిలుచుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు కూడా వెల్‌లోనే ఉండి తమ ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్లు చేస్తున్నారు. అస్సాంలో గిరిజనులపై దాడికి నిరసనగా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎంపీ ఎస్.కె.బిస్వ్ముతియారీ కూడా వెల్‌లో నిలుచుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు, గందరగోళం మధ్యనే స్పీకర్ మీరాకుమార్ లోక్‌పాల్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించి.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అవినీతిపై పోరులో చారిత్రక ఘట్టం: ప్రధాని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇది చరిత్రాత్మక చట్టం. పార్లమెంటు తన విజ్ఞతతో ఈ చట్టం చేయాలని నిర్ణయించటం పట్ల మేం ఎంతో సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘బిల్లు ఆమోదం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని సోనియా చెప్పారు. అవినీతిపై పోరాటానికి ఇంకా చాలా చేయాలని మరో ఏడు బిల్లులను ఆమోదించాల్సి ఉందని చెప్పారు. బిల్లు ఆమోదంలో రాహుల్‌దే కీలక పాత్ర: కాంగ్రెస్ లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ శ్లాఘించింది. ‘‘రాహుల్ మనోభావాల్లో ఒక సందేశం ఉంది... అది.. ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందనేది. ఒక్క లోక్‌పాల్ ద్వారానే అవినీతిపై పోరాడలేమని కూడా రాహుల్ చెప్పారు. ఆర్టీఐ చట్టం పునాదిగా సమగ్ర అవినీతి వ్యతిరేక నియామవళి అవసరముందని చెప్పారు’’ అని పార్టీ అధికార ప్రతినిధి రాజ్‌బబ్బర్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. లోక్‌పాల్‌ను రాజకీయ వర్గమే పాలిస్తుంది: ఆప్ చెన్నై: పార్లమెంటు ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బిల్లు తాము కోరినట్లుగా లేదని, లోక్‌పాల్‌ను కూడా రాజకీయ వర్గమే పరిపాలిస్తుందని ఆ పార్టీ నేత యోగేంద్రయాదవ్ విమర్శించారు. ‘‘అన్నాహజారేకు పార్లమెంటు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేదు’’ అని ఆయన బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బిల్లును హజారే అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించగా.. అది ఆయన కోరుకున్న బిల్లు కాదని ఆయన గుర్తిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. హజారే పట్టుదలకు నివాళి: మోడీ అహ్మదాబాద్: లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించటం.. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే పోరాటానికి, పట్టుదలకు నివాళి అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. హజారే ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు బుధవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఆమోదం ప్రజలందరి విజయమంటూ పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు. -
రాలేగావ్లో సంబరాలు
సాక్షి, ముంబై: లోక్‌సభలో బుధవారం లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందటంతో అన్నాహజారే స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో సంబరాలు మిన్నంటాయి. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పండ్ల రసం సేవించిన అన్నాహజారే తన తొమ్మిది రోజుల దీక్షను విరమించారు. దీంతో రాలేగావ్వాసుల ముఖాల్లో ఆనందం దోబూచులాడింది. లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిందని, దీంతో అన్నా తన దీక్షను విరమించారంటూ టీవీల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా వారంతా కేరింతలు కొట్టారు. జైహింద్... వందే మాతరం, భారత్ మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కొందరు జాతీయ గీతాలను ఆలపించగా, మరికొందరు భక్తిగీతాలు పాడారు. -
ఎట్టకేలకు లోక్‌పాల్!
రెండున్నరేళ్లుగా లోక్‌పాల్ బిల్లుతో యూపీఏ ప్రభుత్వం సాగిస్తున్న దోబూచులాట ముగిసింది. ఆ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందుకు తీసుకు రావడంతో ఆగక మెరుపువేగంతో దాన్ని ఆమోదింపజేసుకుంది. ఉభయసభలూ ఆందోళనలతో అట్టుడికినా చర్చ, ఓటింగ్ జరిగిపోయాయి. సమాజ్‌వాదీ పార్టీ మినహా రాజకీయపక్షాలన్నీ ఒక్కటై అత్యుత్సాహంతో బిల్లుకు పచ్చజెండా ఊపాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏదో వంకన బిల్లును దాటేయాలని చూస్తున్నాయని, అందువల్ల చర్చ అవసరం లేకుండానే ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తొలుత బీజేపీ ప్రకటించింది. ఇన్నాళ్లూ ఉప్పు, నిప్పులా ఉన్న పాలకపక్షం, అన్నా హజారే బృందం సంబంధాలు కూడా ఊహించని రీతిలో కొత్త మలుపు తిరిగాయి. అవినీతిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంగా దీన్ని అభివర్ణించడంతో పాటు ఈ బిల్లు సాకారం కావడానికి కారణం మీరంటే మీరని ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. పొగడ్తల లేఖలు రాసుకున్నారు. బిల్లు విషయంలో ఎనలేని చొరవను ప్రదర్శించారని రాహుల్‌గాంధీని అన్నా హజారే అభినందిస్తే... ఈ సమస్యపై దేశం దృష్టి కేంద్రీకరించేందుకు అన్నా చేపట్టిన ఆందోళన దోహద పడిందని రాహుల్ పొగిడారు. వీరందరిలో ఇంత మార్పు రావడానికి కారణం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలని వేరే చెప్పనవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఊహించని రీతిలో 28 స్థానాలు గెలవడంతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో గుబులు మొదలైంది. వెనువెంటనే లోక్‌పాల్ బిల్లును గట్టెక్కించకపోతే దేశమంతా ఢిల్లీ ఫలితాలే పునరావృతమైనా ఆశ్చర్యంలేదన్న నిర్ణయానికొచ్చాయి. ఇంతకూ లోక్‌పాల్ నిజంగా బ్రహ్మాస్త్రమేనా? లేక అది అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నట్టు జోక్పాలేనా? పలువురు అంటున్నట్టు అది ఆరోవేలుగా మిగిలి పోతుందా? గతంలో ఇదే లోక్‌పాల్ బిల్లును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని ముక్తకంఠంతో తిరస్కరించిన అన్నా, కేజ్రీవాల్ ఇప్పుడు వేర్వేరు శిబిరాల్లో ఉన్నారు. అది సింహాన్ని సైతం ఒడిసిపట్టగలదని అన్నా అభివర్ణిస్తే... చిట్టెలుకను పట్టడానికి కూడా అది పనికిరాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అన్నా బృందంలో కేజ్రీవాల్ భాగంగా ఉన్నప్పుడు రూపొందిన జన్‌లోక్‌పాల్ బిల్లుపై అప్పట్లో వివిధ వర్గాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అన్నా బృందం తక్కువచేసి చూస్తున్నదని, అది రూపొందించిన జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా ఎలాంటి బాధ్యతా లేని మరో వ్యవస్థను ప్రతిపాదిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. తమ బిల్లుతో పోలిస్తే తీసికట్టుగా ఉన్నదని చెప్పి అప్పట్లో లోక్‌పాల్ బిల్లును అన్నా బృందం తిరస్కరించింది. కానీ, ఇప్పుడు ఆ బిల్లునే అన్నా హజారే ప్రశంసిస్తున్నారు. లోక్‌పాల్ నియామకం, తొలగింపు దగ్గరనుంచి దాని పనితీరు వరకూ అన్నిటిలోనూ అన్నా బృందం అప్పట్లో ప్రతిపాదించిన అంశాలకూ, ఇప్పటి బిల్లుకూ పోలికలు లేవు. ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీరంతా ఎంచుకున్న మరొకరూ కలిసి లోక్‌పాల్‌ను ఎంపికచేస్తారని ప్రభుత్వ బిల్లు పేర్కొంది. ఇలాగైతే, రాజకీయ నాయకుల మాటే నెగ్గుతుంది గనుక ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు...కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉమ్మడిగా నామినేట్ చేసే సభ్యుడొకరు, వీరితోపాటు ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత ఉండాలని జన్‌లోక్‌పాల్ ప్రతిపాదించింది. లోక్‌పాల్ తొలగింపునకు ఏ పౌరుడు చేసే ఫిర్యాదు అయినా సుప్రీంకోర్టు పరిశీలించవచ్చునని జన్‌లోక్‌పాల్ చెప్పగా, ప్రభుత్వం లేదా 100మంది ఎంపీలు సుప్రీంకోర్టుకు ఫిర్యాదుచేసినప్పుడే ఆయనను తొలగించాలని ప్రభుత్వ బిల్లు నిర్దేశిస్తోంది. సీబీఐ డెరైక్టర్ నియామకం, ఆ సంస్థ పనితీరు కూడా ఇప్పటిలా ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉంటాయి. దాన్ని స్వతంత్ర సంస్థగా ఉంచాలన్న జన్‌లోక్‌పాల్ ధ్యేయం నెరవేరలేదు. కాకపోతే దానికి ప్రభుత్వంతోపాటు లోక్‌పాల్ అనే మరో బాస్ తయారవుతారు. సంస్థ డెరైక్టర్ ఎంపికను ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కొలీజియం చూస్తుందని బిల్లు చెబుతోంది. లోక్పాల్తోపాటే అచ్చం అదే నిబంధనలతో రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పడాలన్న అన్నా బృందం సూచనకు గండికొట్టి ఏడాదిలోగా లోకాయుక్తలను రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని కొత్త బిల్లు నిర్దేశించింది. లోక్‌పాల్ ఏర్పాటుకు ప్రాణమనదగ్గ సిటిజన్స్ చార్టర్ ప్రస్తావన కొత్త బిల్లులో లేదు. వాస్తవానికి అన్నా నిరాహారదీక్ష చేసినప్పుడు సిటిజన్స్ చార్టర్‌ను లోక్‌పాల్‌లో భాగం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పౌర సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యే అధికారుల ప్రాసిక్యూషన్‌కు వీలుకల్పించే ఆ నిబంధన లేకుండా సామాన్య జనానికి లోక్‌పాల్ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకోసం వేరే చట్టం తెస్తామని కేంద్రం అంటోంది. అదెంతవరకూ ఆచరణలోకొస్తుందో చూడాలి. న్యాయమూర్తులు, ఎంపీలతోసహా అందరినీ లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలన్న జన్‌లోక్‌పాల్ సంకల్పానికి కూడా బిల్లు గండికొట్టింది. బిల్లులో న్యాయమూర్తుల ప్రస్తావన లేదు. న్యాయమూర్తుల జవాబుదారీతనం బిల్లు ఆ సంగతిని చూస్తుందని ప్రభుత్వం అంటోంది. అలాగే, ఎంపీల విషయంలోనూ బిల్లు కొన్ని మినహాయింపులనిచ్చింది. తప్పుడు ఫిర్యాదులిచ్చే వారికి ఏడాది ఖైదు విధించవచ్చని పొందుపరిచిన నిబంధనవల్ల చిత్తశుద్ధితో ఫిర్యాదుచేసేవారు సైతం జంకుతారు. మొత్తానికి దాదాపు అయిదు దశాబ్దాలనుంచి రకరకాల రూపాల్లో పార్లమెంటు ముందుకొచ్చి కూడా ఆమోదానికి నోచుకోని లోక్‌పాల్ బిల్లు తొలిసారి చట్టం కాబోతున్నది. ఎన్ని లోటుపాట్లున్నా అది సాకారం కావడమే వర్తమాన అవసరం. ఆచరణలో ఎదురయ్యే సమస్యలనుబట్టి సవరణల ద్వారా కట్టుదిట్టం చేయడానికి ఎటూ వీలుంటుంది. ఆ కోణం నుంచి చూస్తే లోక్‌పాల్ రాకను స్వాగతించవలసిందే. -
అరవింద్ కేజ్రీవాల్ శిష్యుడి విధి నిర్వర్తించలేదు: రాందేవ్ బాబా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై యోగా గురువు రాందేవ్ బాబా మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో అన్నాహజారేతో విభేదించడాన్ని ఆయన వ్యతిరేకించారు. శిష్యుడి విధులను కేజ్రీవాల్ నిర్వర్తించలేదన్నారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని మీరట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విమర్శించారు. అన్నా హజారే ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా గురుశిష్య పరంపరకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వెళ్లారన్నారు. అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిగ్గుపడటం కూడా సరికాదని రాందేవ్ చెప్పారు. ఆయన బాధ్యతలను తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ స్వలింగ సంపర్కానికి మద్దతు ఇవ్వడాన్ని రాందేవ్ తీవ్రంగా విమర్శించారు. సుప్రీం తీర్పును విమర్శించడం ద్వారా ఆ పార్టీ ప్రజల మద్దతును కోల్పోయిందని చెప్పారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న నరేంద్రమోడీ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని తెలిపారు. -
లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై హజారే హర్షం
రాలేగావ్ : జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందటం సంతోషకరమని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు హజారే అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో గత మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో పాటు లోక్‌సభలోనూ బిల్లు ఆమోదం పొందటంతో హజారే తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి బిల్లు ఆమోదానికి పోరాడుతున్నామన్నారు. ప్రజలు బలమైన లోక్‌పాల్ బిల్లును కోరుకుంటున్నారన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హజారే కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించటంతో హజారే మద్దతుదారులు దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. గత 40 ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించటంతో కేంద్రం... లోక్‌పాల్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఆయన ఆమోద ముద్ర అనంతరం బిల్లు చట్టం కానుంది. -
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
-
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గందరగోళ పరిస్థితుల మధ్య లోక్‌పాల్ బిల్లును నేడు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ నిన్న ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో చేయడంతో లోక్‌సభ దద్దరిల్లింది. గందరగోళం కొనసాగుతుండగానే లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బీజేపీ బిల్లును సమర్థించింది. సమాజ్‌వాది పార్టీ బిల్లును వ్యతిరేకించింది. లోక్‌పాల్ బిల్లు ఆమోదించేందుకు కేంద్రం యేడాది సమయం తీసుకుందని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విమర్శించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబోతున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఒక్క లోక్‌పాల్‌తో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌పై కాంగ్రెస్, బీజేపీ తొందరపడుతున్నాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా సభ నుంచి ఎస్పీ వాకౌట్ చేసింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో అన్నా హజారే దీక్ష చేస్తున్న రాలెగావ్ సిద్ధిలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. -
లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర సృష్టిస్తాం
-
లోక్‌పాల్ కు రాజ్యసభ ఆమోదం
ఐదు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో పచ్చజెండా నేడు లోక్‌సభకు బిల్లు లోక్‌పాల్ ప్రస్థానమిదీ.. 2011, డిసెంబర్ 11: బిల్లుకు లోక్‌సభ ఆమోదం డిసెంబర్ 29: రాజ్యసభ ముందుకు బిల్లు. అసంపూర్తిగా ముగిసిన చర్చ 2012, మే 2: బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపిన ప్రభుత్వం 2012, నవంబర్ 23: నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఎంపిక కమిటీ న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.. చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. సమాజ్‌వాది పార్టీ తప్ప పాలక, ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రావడంతో బిల్లు గట్టెక్కింది. మంగళవారం ఏకధాటిగా ఐదు గంటలపాటు సాగిన చర్చ అనంతరం రాజ్యసభ మూజువాణి ఓటుతో ‘లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు-2011’ను ఆమోదించింది. మూడు మినహా రాజ్యసభ ఎంపిక కమిటీ చేసిన సిఫారసులన్నింటికీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో ముఖ్యమైంది లోక్‌పాల్ నుంచి లోకాయుక్తలను విడదీయడం. కిందటేడాది బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం లోక్‌పాల్ ఏర్పాటైన సంవత్సరం లోపు రాష్ట్రాలు.. లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అవినీతిపై అంకుశంగా భావిస్తున్న ఈ బిల్లు గత రెండేళ్లుగా రాజ్యసభలోనే ఉంది. ప్రస్తుతం సభ ఆమోదించడంతో బిల్లు బుధవారమే లోక్‌సభ ముందుకు రానుంది. కొన్ని పరిమితులు మినహా ప్రధానమంత్రి, ఎంపీలు, ప్రభుత్వ అధికారులతోపాటు పలు సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. లోకాయుక్తలపై ఎలాంటి నిర్దేశాలు చేయబోం.. రాజ్యసభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి కపిల్ సిబల్ బిల్లు ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. అంతకుముందు బిల్లును వ్యతిరేకిస్తున్న ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌తో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, హోంమంత్రి షిండే సమావేశమయ్యారు. బిల్లుకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. బిల్లు ప్రవేశపెట్టగానే ఎస్పీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం చర్చ సజావుగా సాగింది. చర్చ సందర్భంగా మంత్రి సిబల్ మాట్లాడుతూ.. ‘‘ఇది చరిత్రాత్మకమైన రోజు. లోక్‌పాల్‌కు అనుగుణంగా రాష్ట్రాలన్నీ లోకాయుక్తల చట్టాలను తెస్తాయని ఆశిస్తున్నా. లోకాయుక్తల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎలాంటి నిర్దేశాలు చేయబోదు’’ అని చెప్పారు. చట్టం చేయడం వల్లే అవినీతిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అయితే అవినీతిపరులను కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బిల్లులో ప్రభుత్వం మార్పులు తేవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఎలాంటి పరిమితులు లేకుండా ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ మరో సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. బిల్లును 2011లోనే తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు సంస్థలపై ఓటింగ్: లోక్‌పాల్ పరిధిలోకి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రైవేటు సంస్థలను కూడా తీసుకురావాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు సంస్థలు లంచాలు ఇస్తున్నందున, దీన్ని కూడా లోక్‌పాల్‌కు అప్పగించాలని డిమాండ్ చేశా రు. లంచం డిమాండ్ చేసేవారితోపాటు ఇచ్చేవారి నుంచి కూడా దర్యాప్తు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. దీంతో ఆయన తీర్మానంపై సభలో ఓటింగ్ నిర్వహించారు. అయితే 151-19 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. బిల్లులో ముఖ్యమైన మార్పులివీ.. లోక్‌పాల్‌తోపాటు అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనను సడలించారు. లోక్‌పాల్ ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రాలు అసెంబ్లీల్లో చట్టాల ద్వారా లోకాయుక్తాలను ఏర్పాటు చేసుకోవాలని రాజ్యసభ ఎంపిక కమిటీ సూచించింది. ప్రభుత్వం ఆమోదించింది. లోక్‌పాల్ ఏదైనా కేసును సీబీఐకి అప్పగిస్తే.. ఆ కేసులో లోక్‌పాల్ అనుమతి లేకుండా దర్యాప్తు అధికారిని బదిలీ చేయరాదన్న సిఫారసుకు సర్కారు ఒప్పుకుంది. ఇంతకుముందు ఈ సిఫారసును ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆరోపణలు ఎదుర్కొనే అధికారిపై విచారణకు అనుమతిచ్చే అధికారాన్ని లోక్‌పాల్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం అప్పగించింది. లోక్‌పాల్‌ను ఏర్పాటు చేసే విధానంలో కూడా స్వల్ప మార్పులు చేశారు. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన నలుగురు సభ్యుల కమిటీ లోక్‌పాల్ సభ్యులను ఎంపిక చేస్తారు. ఈ నలుగురు సూచించిన ఒక న్యాయ నిపుణుడు కూడా రాష్ట్రపతి ఆమోదంతో సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిపై ప్రాథమిక దర్యాప్తు మొదలయ్యే వరకు.. ఆయన/ఆమెకు తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వరాదన్న ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. {పజల నుంచి విరాళాలు స్వీకరించే వివిధ సంస్థలను లోక్‌పాల్ నుంచి మినహాయించాలని సెలక్ట్ కమిటీ సిఫారసు చేయగా, ప్రభుత్వం తిరస్కరించింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన సంస్థలకు మాత్రమే లోక్‌పాల్ నుంచి మినహాయింపును కల్పించింది. బిల్లులో మరిన్ని ముఖ్యాంశాలు: లోక్‌పాల్ సభ్యులు ఏ పార్టీకి చెందనివారై ఉండాలి. సుప్రీంకోర్టు మధ్యంత ఉత్తర్వులు లేదా సిఫారసు మేరకు రాష్ట్రపతి.. లోక్‌పాల్ సభ్యుడిని తొలగించవచ్చు. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీం దర్యాప్తు చేయవచ్చు. అయితే సదరు సభ్యుడిపై దర్యాప్తు చేయాలని కోరుతూ కనీసం 100 మంది ఎంపీల సంతకంతో కూడిన నివేదిక రాష్ట్రపతికి చేరాలి. -
‘అన్నా’ను ఏమీ అనొద్దు: రాందాస్
సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు అంశంపై అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య తలెత్తిన వాగ్వాదంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే జోక్యం చేసుకున్నారు. అథవాలే అన్నాహజారేకి అండదండగా నిలిచారు. మంగళవారం ఆయన ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ‘ఇకనుంచి అన్నాహజారేపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేకపోతే మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వం’ అని అరవింద్‌ను హెచ్చరించారు. లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కేజ్రీవాల్ అనవసరంగా లోక్‌పాల్‌ను జోక్పాల్ అంటూ ఎగతాళి చేయొద్దన్నారు. ఈ వైఖరి మార్చుకోని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సభ కూడా నిర్వహించకుండా అడ్డుకుంటామంటూ రాందాస్ ఘాటుగా హెచ్చరించారు. ‘లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే పూర్తిగా అధ్యయనం చేశారు. అందులో సీబీఐ, ప్రధానిలనుకూడా చేర్చాలంటూ ఆయన చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అన్నాహజారే కారణంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా స్థానాలు వచ్చాయని, ఆ విషయం ఎంతమాత్రం మర్చిపోవద్దని సూచించారు. -
చరిత్ర సృష్టించాలి:కపిల్ సిబల్
న్యూఢిల్లీ:రాజ్యసభలో మధ్యాహ్నం 12.30ని మిషాలకు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్‌పాల్ బిల్లుపై చర్చను ప్రారంభించారు.ఈ బిల్లుపై ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించడం ద్వారా సభ చరిత్ర సృష్టించాలని ఆయన తెలిపారు.సెలెక్టివ్ కమిటీ సూచించిన సిఫార్సులను ఆయన సభలో చదివి వినిపించారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు చొరవ చూపడం అభినందిందగ్గ విషయమని వివక్ష నేత అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లుపై పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి రావడం శుభపరిణామని సీపీఎం సభ్యులు సీతారం ఏచూరీ అన్నారు. లోక్‌పాల్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలో చర్చ జరగగా అనంతరం ఓటింగ్ జరిగింది. పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలంటూ అన్నా హజారే డిమాండ్ కు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా అన్నా హజారే రాజ్యసభకు ధన్యవాదాలు తెలియజేశారు. రేపు లోక్‌పాల్ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో రాలెగావ్ సిద్ధిలో అన్నా హజారే మద్దతు దారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందుతుందని అన్నా హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. -
రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం
-
లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలో చర్చ జరగగా అనంతరం ఓటింగ్ జరిగింది. పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలంటూ అన్నా హజారే డిమాండ్ కు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా అన్నా హజారే రాజ్యసభకు ధన్యవాదాలు తెలియజేశారు. రేపు లోక్‌పాల్ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో రాలెగావ్ సిద్ధిలో అన్నా హజారే మద్దతు దారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందుతుందని అన్నా హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. -
పార్లమెంటులోనూ జై సమైక్యాంధ్ర!!
-
పార్లమెంటులోనూ జై సమైక్యాంధ్ర!!
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన మూడు నిమిషాలకే గంట పాటు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ రెండు నిమిషాలు కూడా సాగలేదు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి లోక్‌పాల్‌పై చర్చ ప్రారంభించాలని విపక్ష నేత అరుణ్ జైట్లీ సభాపతిని కోరారు. దీన్ని మన్నించిన సభాపతి... చర్చ ప్రారంభించాలని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌ను కోరారు. లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు వెంటనే సభ మధ్యలోకి దూసుకొచ్చారు. చర్చ ప్రారంభం కాకుండా అడ్డుతగిలారు. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. -
బేరాలుండవు
సాక్షి, చెన్నై:ప్రజలు మెచ్చే పార్టీతో రాష్ట్రంలో పొత్తు ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం తోపాటుగా పార్టీ నాయకుల ఏకాభిప్రాయం తో అధిష్టానానికి పొత్తుపై నివేదిక పంపుతామన్నారు. అధికారం కోసం ఇతర పార్టీలతో బేరసారాలకు దిగబోమని చెప్పారు. టీ నగర్‌లోని కమలాలయంలో సోమవారం నిర్మల సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో నిర్వహించిన మినీ మారథాన్ విజయవంతం అయిందని చెప్పారు. ఉక్కు మనిషి విగ్రహం కోసం రాష్ట్రం లో ఇనుము, పిడికెడు మట్టి సేకరణ వేగ వంతం చేయనున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతకు బీజేపీ అహర్నిశలు శ్రమిస్తోందని వివరించారు. తమిళాస్త్రం: తమిళుల మనోభావాల్ని, హక్కుల్ని కేంద్రంలోని యూపీఏ సర్కారు తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కేంద్రం ఉండటం విచారకరమన్నారు. తమిళ జాలర్లపై దాడులు పేట్రేగుతున్నా మౌనం వహించడం శోచనీయమని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఈ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును మాత్రం బలహీన పరచి చట్టానికి విరుద్ధంగా నడచుకునే పనిలో పడిందని ధ్వజమెత్తారు. దేశంలో బలమైన నాయకత్వం కొరవడిందని, మార్గదర్శకం లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభజనంతో బలమైన నాయకత్వం దేశానికి దక్కబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమిళుల సమస్యల్ని పరిష్కరించే రీతిలో, మనోభావాలు, హక్కుల పరిరక్షణ దిశగా కేంద్రంలో ఏర్పడ బోయే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని ఆకాంక్షించారు. పొత్తులు: ఢిల్లీలోనే కాదు దేశంలో కాంగ్రెస్ పతనం అంచుకు చేరిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతును బీజేపీ కోరబోదని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ బేరసారాలకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో డీఎంకే తెగ తెంపుల్ని గుర్తు చేస్తూ విలేకరులు ప్రశ్నించగా, ఆ పార్టీ నిర్ణయాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని కరుణానిధి వ్యక్తం చేశారని, ఇదే నిర్ణయంతో చివరి వరకు ఉంటారా? అని ప్రశ్నించారు. అవసరం అనుకుంటే జత కట్టడం, వద్దనుకుంటే గుడై బై చెప్పడం డీఎంకేకు పరిపాటేనని గతాన్ని గుర్తు చేశారు. బీజేపీ డీఎంకే జత కట్టే అవకాశాలు ఉన్నట్టున్నాయే అని ప్రశ్నించగా, తాము మాత్రం ఇంత వరకు ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని దాట వేశారు. ఎవరితో పొత్తు అన్నది ప్రజాభీష్టం, పార్టీ నాయకుల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చే పార్టీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. అయితే, తుది నిర్ణయం మాత్రం అధిష్టానం తీసుకుంటుందన్నారు. బీజేపీ జాతీయ నేత ఇలగణేషన్ మాట్లాడుతూ, తెగ తెంపులు చేసుకోవడం కరుణానిధికి వెన్నెతో పెట్టిన విద్య అని అభివర్ణించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు స్థిరత్వంతో ఆయన కొనసాగించేనా అన్నది వేచి చూడాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్, రాష్ర్ట కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
లోక్‌పాల్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చ
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్‌కమిటీ ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. ప్రధానంగా లోక్‌పాల్ బిల్లుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముందు ప్రకటించిన ప్రకారం రాజ్యసభలో ఈరోజు లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరగవలసి ఉంది. అయితే ఈరోజు కేంద్ర మంత్రి ఓలా మృతికి సంతాపం తెలిపిన తరువాత పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్దాయి. అందువల్ల రేపు రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరుగుతుంది. లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 2012 డిసెంబర్ 23న నివేదిక సమర్పించింది. దాదాపు ఏడాది తరువాత ఈ బిల్లు చర్చకు రానుంది. పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలంటూ అన్నా హజారే మహారాష్ట్రంలోని తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధీలో చేస్తున్న నిరవధిక దీక్ష ఏడవ రోజుకు చేరిన విషయం తెలిసిందే. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించారు. దాంతో ఈ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు సంపూర్ణ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. -
విషమించిన అన్నా హజారే ఆరోగ్యం!!
అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తోంది. లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఆయన బరువు 4.3 కిలోలు తగ్గిపోయారని అన్నా అనుచరుడు సురేష్ పఠారే తెలిపారు. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించిందని జాతీయ వార్తా చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లుకు చేసిన సవరణలను అన్నా హజారే స్వాగతిస్తుండగా, ఒకప్పటి ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ లాంటివాళ్లు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినది లోక్‌పాల్ కాదు.. జోక్పాల్ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయితే, బిల్లు నచ్చకపోతే దానిపై నిరాహార దీక్ష చేపట్టాలంటూ ఆయనపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాను కొందరు తప్పుదోవ పట్టించారని, అసలు ఈ బిల్లు ప్రతులన్నింటినీ అన్నా, ఆయన బృంద సభ్యులు ఎవరైనా చదివారా అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తాను నమ్మిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నా ఆచరిస్తారని, మూడేళ్లుగా ఆయనను చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. అన్నా ఆరోగ్యం విషమించడంతో తాను ఢిల్లీ పర్యటనను మానుకుని అన్నాతోనే ఉన్నానని, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకు, అన్నా దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. -
అవినీతి రహిత దేశమే లక్ష్యం: బాబు
సాక్షి, హైదరాబాద్: లోక్‌పాల్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిపై చిత్తశుద్ధితో పోరాటం చేయకుండా రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. అవినీతి వల్ల రూపాయి విలువ పడిపోయిందని, దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను సాగనంపితేనే ప్రజలకు మంచి రోజులొస్తాయని, టీడీపీ ఆ దిశగా కృషి చేస్తుందని చెప్పారు. తనకున్న వ్యక్తిగత పరిచయాలతోనే మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు చెప్పారు. ఆ సందర్భంగా దేశ, రాష్ర్ట అంశాలను పలువురు బీజేపీ నేతలతో చర్చించినట్లు వివరించారు. పొత్తుల విషయమై సరైన సమయంలో స్పందిస్తామని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట ్టడానికి ముందు జరగబోయే బీఏసీ సమావేశంలో ఉమ్మడి రాజధాని, గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం వంటి అంశాలను చర్చిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని ఆహ్వానించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తని ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు అడిగి సమాధానం కోరేది. గుజరాత్ ఊచకోత విషయంలో నరేంద్ర మోడీని సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన మీరే ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఎందుకు తంటాలు పడుతున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకాయుక్తకు అధికారాలు ఇవ్వలేని మీరు లోక్‌పాల్ గురించి మాట్లాడటమేంటి? మీ అబ్బాయి లోకేష్ విదేశీ చదువులకు కట్టిన ఫీజు వివరాలే ఇంతకాలంగా చెప్పని మీరు లోక్‌పాల్ రావడం వల్ల లాభాలుంటాయని ప్రజలకు చెబితే నమ్ముతారా? జగన్మోహన్రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేస్తే ఆ సంస్థలు బాగా పనిచేస్తున్నాయంటారు. మిగతావాళ్ల విషయంలో మాత్రం రాజకీయ అవసరాలకోసం వాడుతున్నారని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? -
రండి... అవినీతిపై పోరాడదాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అన్నిపార్టీలు కలిసివచ్చి లోక్ పాల్ బిల్లుపై పార్లమెంటులో ఆమోదం పొందేలా పోరాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. సీనియర్ మంత్రులతో కలిసి శనివారం ప్రధానమంత్రి కార్యాలయంలో రాహుల్ గాంధీ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ లోక్ పాల్ బిల్లు అంశం జాతీయ ప్రాముఖ్యత కలిగినదన్నారు. దేశాన్ని పట్టిపీడుస్తున్న అవినీతి మహామ్మారిపై పోరాటం చేసేందుకు ఈ బిల్లు బలమైన ఆయుధంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపునా తమ పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే మిగతా పార్టీలు కూడా తమతో కలిసి పనిచేసి లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడాలని రాహుల్ కోరారు. అయితే ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానున్నట్లు తెలిపారు. అన్నిపార్టీలు కలిసి సమన్వయంతో లోక్ పాల్ ఆమోదం పొందేలా కృషిచేయాలంటూ రాహుల్ విజ్ఞప్తి చేశారు. -
లోక్‌పాల్ బిల్లుకు ఇతర పార్టీలు కలసి రావాలి: రాహుల్
-
16న రాజ్యసభకు లోక్‌పాల్ బిల్లు
-
16న రాజ్యసభకు లోక్‌పాల్ బిల్లు
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లును ఈనెల 16న (సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిని ఆమోదించాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాల జాబితాలో దీనిని చేర్చడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి హరీష్ రావత్ గురువారం మీడియాతో అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, దీనిని శుక్రవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నామని, తర్వాత ఇది లోక్‌సభ ముందుకు వస్తుందని చెప్పారు. అయితే, శుక్రవారం ప్రైవేటు సభ్యుల చర్చల కోసం సమయాన్ని కేటాయించడం వల్ల లోక్‌పాల్ బిల్లును సోమవారం ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. దీనిపై చర్చ కోసం ఆరు గంటల సమయాన్ని కేటాయించినట్లు తెలిపాయి. లోక్‌పాల్ సహా కీలకమైన బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూ బీజేపీ నేత అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ తోసిపుచ్చింది. శాసన వ్యవహారాలను ముందుకు తీసుకుపోవడంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకు విపక్షంలో కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని కమల్‌నాథ్ అన్నారు. సభ సజావుగా సాగేందుకు అధికార పార్టీతో పాటు విపక్షానికీ సమానమైన బాధ్యత ఉందని ఆయన అన్నారు. మరోవైపు, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు కోసం మూడు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నందున ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ఆయనకు హామీ ఇచ్చింది. అయితే, సమావేశాలను కుదించడం ద్వారా లోక్‌పాల్ బిల్లును ఆమోదానికి నోచుకోకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ఆరోపించారు. ఏమాత్రం జాప్యం లేకుండా, ఈ బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ప్రకటించనున్నట్లు జేడీయూ, ఎన్సీపీలు ప్రకటించగా, రాజ్యసభలో దీనిని వ్యతిరేకించనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 2012 డిసెంబర్ 23న నివేదిక సమర్పించినా, ఇంతవరకు దానిని ప్రవేశపెట్టకపోవడం వెనుక ప్రభుత్వానికి గల ఉద్దేశాలపై అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. అయితే, మంత్రి రావత్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, లోక్‌పాల్ సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
‘లోక్‌పాల్’పై కేంద్రానిది ప్రజాస్వామ్య వంచన: అన్నా హజారే
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): పటిష్ట లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తోందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దుయ్యబట్టారు. కేంద్రం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలంటూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన హజారే గురువారం తన దీక్ష మూడో రోజు ఈ అంశంపై ప్రధాని కార్యాలయానికి (పీఎంవో) లేఖ రాశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనా సమావేశాల ఎజెండాలో బిల్లు ప్రస్తావన లేదని, ఇది తనను, దేశ ప్రజలను వంచించడమేనంటూ పీఎంవోలో సహాయ మంత్రి వి. నారాయణసామికి పంపిన లేఖలో మండిపడ్డారు. దీక్ష విరమించాలంటూ నారాయణసామి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ప్రభుత్వం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును ఆమోదించే వరకూ దీక్షను విరమించబోనని తేల్చిచెప్పారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసేందుకు కూడా సిద్ధమన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం హజారేను కలిసి దీక్షకు మద్దతు తె లిపింది. ఆప్ అగ్ర నేత అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం వల్ల హజారేను కలిసేందుకు రాలేకపోయారని విశ్వాస్ పేర్కొన్నారు. -
లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో వెంటనే చర్చిస్తాం: షిండే
అవినీతిని అంతం చేసే లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో వీలైనంత వెంటనే చర్చకు చేపడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాలెగావ్ సిద్ధి గ్రామంలో అన్నాహజారే ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో షిండే హడావుడిగా ఈ ప్రకటన చేశారు. లోక్‌పాల్ బిల్లును వెనువెంటనే రాజ్యసభలో చర్చకు చేపట్టాలని సెలెక్ట్ కమిటీ ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణ సామి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ మేరకు నోటీసు పంపినట్లు షిండే చెప్పారు. లోక్‌పాల్ బిల్లును లోక్‌సభ ఇప్పటికే ఆమోదించి, రాజ్యసభకు పంపింది. రాజ్యసభలోని సెలెక్ట్ కమిటీ బిల్లుకు 13 సవరణలు సూచించింది. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని షిండే తెలిపారు. లోక్‌పాల్ బిల్లును వెంటనే అమలు చేయాలన్న ఏకైక డిమాండుతో అన్నా హజారే మళ్లీ ఆమరణ దీక్ష ప్రారంభించడం వల్లే సర్కారులో కదలిక వచ్చిందని అంటున్నారు. -
రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష
రాలేగావ్ : జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లుపై గతంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అన్నా హజారే తెలిపారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
నేటి నుంచి హజారే ఆమరణ దీక్ష
లోక్‌పాల్ బిల్లు కోసం డిమాండ్ సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం మంగళవారం నుంచి ఆయన మరోసారి ఆమరణ నిరహార దీక్షకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ... అపరిమితమైన అవినీతిని అదుపు చేయలేకపోయిన కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించాయన్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతామని సోనియాగాంధీ ఉత్తరం రాయడంతో విశ్వసించి గతంలో తాను చేపట్టిన ఆమరణ దీక్షను విరమించానని చెప్పారు. కానీ ఏడాదిగా రాజ్యసభలో బిల్లుపై చర్చను చేపట్టకుండా సోనియా, యూపీఏ ప్రభుత్వం తనను, ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదంకోసం మంగళవారం నుంచి మరోసారి రాలేగావ్సిద్దిలోని యాదవ్‌బాబా మందిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని చెప్పారు. ఈ బిల్లు కోసం ప్రజలు అహింసమార్గంలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీపార్టీని అభినందించారు. ఆప్ విజయం దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.