అరవింద్ కేజ్రీవాల్ శిష్యుడి విధి నిర్వర్తించలేదు: రాందేవ్ బాబా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై యోగా గురువు రాందేవ్ బాబా మండిపడ్డారు. లోక్పాల్ బిల్లు విషయంలో అన్నాహజారేతో విభేదించడాన్ని ఆయన వ్యతిరేకించారు. శిష్యుడి విధులను కేజ్రీవాల్ నిర్వర్తించలేదన్నారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని మీరట్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విమర్శించారు. అన్నా హజారే ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా గురుశిష్య పరంపరకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వెళ్లారన్నారు.
అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిగ్గుపడటం కూడా సరికాదని రాందేవ్ చెప్పారు. ఆయన బాధ్యతలను తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ స్వలింగ సంపర్కానికి మద్దతు ఇవ్వడాన్ని రాందేవ్ తీవ్రంగా విమర్శించారు. సుప్రీం తీర్పును విమర్శించడం ద్వారా ఆ పార్టీ ప్రజల మద్దతును కోల్పోయిందని చెప్పారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న నరేంద్రమోడీ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని తెలిపారు.