‘అన్నా’ను ఏమీ అనొద్దు: రాందాస్ | Arvind Kejriwal must stop criticising Anna Hazare, says Ramdas Athawale | Sakshi
Sakshi News home page

‘అన్నా’ను ఏమీ అనొద్దు: రాందాస్

Published Wed, Dec 18 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Arvind Kejriwal must stop criticising Anna Hazare, says Ramdas Athawale

సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు అంశంపై అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య తలెత్తిన వాగ్వాదంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే జోక్యం చేసుకున్నారు. అథవాలే అన్నాహజారేకి అండదండగా నిలిచారు. మంగళవారం ఆయన ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ‘ఇకనుంచి అన్నాహజారేపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేకపోతే మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వం’ అని అరవింద్‌ను హెచ్చరించారు. లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కేజ్రీవాల్ అనవసరంగా లోక్‌పాల్‌ను జోక్‌పాల్ అంటూ ఎగతాళి చేయొద్దన్నారు.
 
 ఈ వైఖరి మార్చుకోని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సభ కూడా నిర్వహించకుండా అడ్డుకుంటామంటూ రాందాస్ ఘాటుగా హెచ్చరించారు. ‘లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే పూర్తిగా అధ్యయనం చేశారు. అందులో సీబీఐ, ప్రధానిలనుకూడా చేర్చాలంటూ ఆయన  చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అన్నాహజారే కారణంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా స్థానాలు వచ్చాయని, ఆ విషయం ఎంతమాత్రం మర్చిపోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement