కేజ్రీవాల్‌‌ అరెస్టుపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు | Arrested because of his own deeds: Anna Hazare on Kejriwal arrest | Sakshi
Sakshi News home page

తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్: కేజ్రీవాల్‌పై హజారే సంచలన వ్యాఖ్యలు

Published Fri, Mar 22 2024 2:25 PM | Last Updated on Fri, Mar 22 2024 3:45 PM

Arrested because of his own deeds: Anna Hazare on Kejriwal arrest - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ప్రధాన ప్రతిపక్ష నేతలందరూ అతడికి మద్దతుగా నిలవగా.. హజారే మాత్రం ఢిల్లీ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్‌ అయ్యారని మండిపడ్డారు.

తనతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి వ్యక్తి.. ఈరోజు మద్యం పాలసీ రూపొందించినందుకు బాధపడుతున్నానని అన్నారు. లిక్కర్‌ పాలసీపై కేజ్రీవాల్‌కు లేఖ రాశానని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. తన సొంత లాభం  కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. ఆప్‌ మద్యం పాలసీని రూపొందించకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు.

‘అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నపుడు నేను ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పాను. లిక్కర్‌ పాలసీని వదిలేయమని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పారు. అయినా అతను వినలేదు. డబ్బులకు ఆశపడి పాలసీ రూపొందించారు. కేజ్రీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదు. ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను. అతను నా మాట వినలేదు. అయినా ఇప్పుడు ఏం చేయలేం. చట్టం తనపని తాను చేస్తుంది’ అని అన్నా హజారే పేర్కొన్నారు.
చదవండి: అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్‌ సీఎం  
 

కాగా హజారే గతంలోనూ లిక్కర్‌ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. 2022లో ఆయన కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో..‘ మీరు సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి లేఖ రాస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వ రూపొందిన మద్యం పాలసీ గురించి ఇటీవల వార్తల్లో చూసి నేను బాధపడ్డాను. మద్యం లాగే, అధికారం కూడా మత్తుగా ఉంటుంది. మీరు అధికారం మత్తులో ఉన్నారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. 

అన్నా హజారే 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. దీని నుంచే ఆమ్‌ ఆద్మీ పార్టీ అవతరించింది. ఆ సమయంలో కేజ్రీవాల్‌కు తన ఆశీస్సులు అందించి.. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు హజారే. అయితే ఆ తర్వాత ఆప్ పార్టీపై హజారే పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. కానీ కేజ్రీవాల్‌ కానీ ఆయన పార్టీ నేతలను కానీ హజారే విమర్శలపై స్పందించలేదు.

మరోవైపు అరెస్ట్‌ అయినప్పటికీ ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నారు కేజ్రీవాల్‌. తన ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.  అబ్దుల్‌ కలాం రోడ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి బస చేశారు. నేడు ఆయన్ను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈడీ  హాజరుపరిచింది. పదిరోజుల కస్టడీ కోరనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement