పార్లమెంటులోనూ జై సమైక్యాంధ్ర!!
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన మూడు నిమిషాలకే గంట పాటు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే.. 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ రెండు నిమిషాలు కూడా సాగలేదు.
అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి లోక్‌పాల్‌పై చర్చ ప్రారంభించాలని విపక్ష నేత అరుణ్ జైట్లీ సభాపతిని కోరారు. దీన్ని మన్నించిన సభాపతి... చర్చ ప్రారంభించాలని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌ను కోరారు. లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు వెంటనే సభ మధ్యలోకి దూసుకొచ్చారు. చర్చ ప్రారంభం కాకుండా అడ్డుతగిలారు. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.