
అవినీతి రహిత దేశమే లక్ష్యం: బాబు
సాక్షి, హైదరాబాద్: లోక్‌పాల్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిపై చిత్తశుద్ధితో పోరాటం చేయకుండా రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. అవినీతి వల్ల రూపాయి విలువ పడిపోయిందని, దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ను సాగనంపితేనే ప్రజలకు మంచి రోజులొస్తాయని, టీడీపీ ఆ దిశగా కృషి చేస్తుందని చెప్పారు. తనకున్న వ్యక్తిగత పరిచయాలతోనే మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు చెప్పారు. ఆ సందర్భంగా దేశ, రాష్ర్ట అంశాలను పలువురు బీజేపీ నేతలతో చర్చించినట్లు వివరించారు. పొత్తుల విషయమై సరైన సమయంలో స్పందిస్తామని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట ్టడానికి ముందు జరగబోయే బీఏసీ సమావేశంలో ఉమ్మడి రాజధాని, గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం వంటి అంశాలను చర్చిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని ఆహ్వానించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తని ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు అడిగి సమాధానం కోరేది.
గుజరాత్ ఊచకోత విషయంలో నరేంద్ర మోడీని సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన మీరే ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఎందుకు తంటాలు పడుతున్నారు?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకాయుక్తకు అధికారాలు ఇవ్వలేని మీరు లోక్‌పాల్ గురించి మాట్లాడటమేంటి?
మీ అబ్బాయి లోకేష్ విదేశీ చదువులకు కట్టిన ఫీజు వివరాలే ఇంతకాలంగా చెప్పని మీరు లోక్‌పాల్ రావడం వల్ల లాభాలుంటాయని ప్రజలకు చెబితే నమ్ముతారా?
జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేస్తే ఆ సంస్థలు బాగా పనిచేస్తున్నాయంటారు. మిగతావాళ్ల విషయంలో మాత్రం రాజకీయ అవసరాలకోసం వాడుతున్నారని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?