కాంగ్రెస్ కోర్‌కమిటీ ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. ప్రధానంగా లోక్పాల్ బిల్లుపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్‌కమిటీ ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. ప్రధానంగా లోక్పాల్ బిల్లుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముందు ప్రకటించిన ప్రకారం రాజ్యసభలో ఈరోజు లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరగవలసి ఉంది. అయితే ఈరోజు కేంద్ర మంత్రి ఓలా మృతికి సంతాపం తెలిపిన తరువాత పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్దాయి. అందువల్ల రేపు రాజ్యసభలో లోక్పాల్ బిల్లుపై చర్చ జరుగుతుంది. లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 2012 డిసెంబర్ 23న నివేదిక సమర్పించింది. దాదాపు ఏడాది తరువాత ఈ బిల్లు చర్చకు రానుంది.
పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలంటూ అన్నా హజారే మహారాష్ట్రంలోని తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధీలో చేస్తున్న నిరవధిక దీక్ష ఏడవ రోజుకు చేరిన విషయం తెలిసిందే. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించారు. దాంతో ఈ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు సంపూర్ణ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.