కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్ పాల్ బిల్లు: రాహుల్
అన్నికాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్‌పాల్ బిల్లును ఫిబ్రవరి 28 తేదిలోగా అమల్లోకి తీసుకువస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
న్యూఢిల్లీ: అన్నికాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్‌పాల్ బిల్లును ఫిబ్రవరి 28 తేదిలోగా అమల్లోకి తీసుకువస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి రాహుల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అమల్లో భాగంగా లోకాయుక్తల నియామకాలు చేపడుతాం అని తెలిపారు. అధిక ధరలను నియంత్రించేందుకు సీఎంల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అని ఆయన మీడియాకు వెల్లడించారు. పళ్లు, కూరగాయల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలకు అందుబాటులోకి రావడం అన్ని రాష్ట్రాల్లో బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలను వెంటనే అమలు చేస్తాం. ఆహార భద్రతా బిల్లుకు అనుగుణంగా చర్చలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దుకాణాలు లేదా స్వయం సహాయ సంఘాల ద్వారా చౌక ధరలకే నిత్యావసర సరుకులివ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని రాహుల్ తెలిపారు.
నేటి సమావేశంలో ధరలు, అవినీతి అంశాలపై చర్చించాం. లోక్‌పాల్ బిల్లు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్‌గాంధీ అన్నారు. లోకపాల్ బిల్లు కార్యాచరణపై మేం మాట్లాడేసరికి మిగతాపార్టీలన్నీ మౌనం వహించాయి అని ప్రతిపక్షాల తీరును రాహుల్ తప్పుపట్టారు. లోక్‌పాల్ బిల్లును మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం, ఆదర్శ్ కుంభకోణం వ్యవహారంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించం అని రాహుల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్టీఐని తీసుకువచ్చిన తామే, లోక్‌పాల్ బిల్లునూ కూడా తెచ్చాం అని రాహుల్ అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రాహుల్ వెళ్లిపోవడం కొసమెరుపు. దేశ రాజధాని లో శుక్రవారం నిర్వహించిన సీఎంల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు అజయ్‌మాకెన్ వెల్లడించారు.