
రండి... అవినీతిపై పోరాడదాం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీనియర్ మంత్రులతో కలిసి శనివారం సమావేశమైయ్యారు.
న్యూఢిల్లీ: అన్నిపార్టీలు కలిసివచ్చి లోక్ పాల్ బిల్లుపై పార్లమెంటులో ఆమోదం పొందేలా పోరాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. సీనియర్ మంత్రులతో కలిసి శనివారం ప్రధానమంత్రి కార్యాలయంలో రాహుల్ గాంధీ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ లోక్ పాల్ బిల్లు అంశం జాతీయ ప్రాముఖ్యత కలిగినదన్నారు. దేశాన్ని పట్టిపీడుస్తున్న అవినీతి మహామ్మారిపై పోరాటం చేసేందుకు ఈ బిల్లు బలమైన ఆయుధంగా ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపునా తమ పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే మిగతా పార్టీలు కూడా తమతో కలిసి పనిచేసి లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడాలని రాహుల్ కోరారు. అయితే ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానున్నట్లు తెలిపారు. అన్నిపార్టీలు కలిసి సమన్వయంతో లోక్ పాల్ ఆమోదం పొందేలా కృషిచేయాలంటూ రాహుల్ విజ్ఞప్తి చేశారు.