న్యూఢిల్లీ: లోక్పాల్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలో చర్చ జరగగా అనంతరం ఓటింగ్ జరిగింది. పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు వెంటనే ఆమోదించాలంటూ అన్నా హజారే డిమాండ్ కు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా అన్నా హజారే రాజ్యసభకు ధన్యవాదాలు తెలియజేశారు. రేపు లోక్పాల్ బిల్లు లోక్సభ ముందుకు రానుంది. రాజ్యసభలో లోక్పాల్ బిల్లు ఆమోదం పొందడంతో రాలెగావ్ సిద్ధిలో అన్నా హజారే మద్దతు దారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బిల్లు లోక్సభలోనూ ఆమోదం పొందుతుందని అన్నా హజారే ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.