ఆప్ + కాప్
Published Mon, Jan 27 2014 10:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
రామ్‌లీలా మైదాన్‌లోనే లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ఆప్ సర్కారు చెబుతుండగా, అలా చేస్తే తమకు చాలా సమస్యలు వస్తాయని పోలీసులు ఆక్షేపిస్తున్నారు. అసెంబ్లీని బహిరంగ ప్రదేశంలో సమావేశపర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి మళ్లీ పోలీసులతో పేచీ మొదలయింది. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు రామ్‌లీలా మైదాన్‌లోనే చట్టరూపం కల్పిస్తామని ప్రభుత్వం అంటుండగా, అక్కడ విధానసభను సమావేశపరచడం భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తుం దని పోలీసులు చెబుతున్నారు. ఈ తాజా సమస్య మరోమారు ఢిల్లీ పోలీసులు, సర్కారుకు మధ్య ఘర్షణ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల రామ్‌లీలా మైదాన్‌లో జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించారు.
బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీని సమావేశపరచడం వల్ల భద్రతా సమస్యలు వస్తాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఢిల్లీ పోలీసులు లెప్టినెంట్ గవర్నర్, ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరిస్తే హాజరయ్యే వేలాది మందిని తనిఖీ చేయడం, అదుపులో పెట్టడం కష్టమవుతుందని పోలీసులు లేఖలో పేర్కొన్నారు. రామ్‌లీలా మైదాన్‌కు ఆ సమయంలో వివిధ రాజ కీయ పార్టీల సభ్యులు, నాయకులు హాజరవుతారని, వారి మధ్య ఘర్షణ తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను అదుపు చేయడం కష్టమవుతుందని పోలీసులు అంటున్నారు. అసెం బ్లీ సమావేశం కోసం రామ్‌లీలా మైదాన్ సమీపంలోని అనేక రోడ్లను మూసివేయాల్సి ఉంటుందని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు.
వాగ్దానం చేశాం కాబట్టే..
అయితే రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరచి బిల్లును ఆమోదిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేశాం కాబట్టి అక్కడే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆప్ వాదిస్తోంది. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపర్చడం అంత సులభం కాదని నిపుణులు కూడా అంటున్నారు. ‘లోక్‌సభ, రాజ్యసభతోపాటు దేశంలో 38 చట్టసభలు ఉన్నాయి. గడచిన 65 సంవత్సరాల్లో ఎక్కడా అసెంబ్లీ సమావేశాలు బహిరంగ ప్రదేశంలో జరగలేదు. అసెంబ్లీని బహిరంగప్రదేశంలో సమావేశపర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ సవరణ చేయకుండా ఇలా చేయడం కుదరదు’ అని ఢిల్లీ అసెంబ్లీ మాజీ కార్యదర్శి ఎస్.కె.శర్మ అంటున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రుల కార్యాలయాల్లో మాత్రమే సభాకార్యక్రమాలు జరగవచ్చని రాజ్యాంగం పేర్కొం దని ఆయన చెప్పారు. మైదానంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించినట్లయితే సభామర్యాదను కాపాడడం కష్టమవుతుందని ఆయన అంటున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీని సమావేశపరచడం రాజకీయ డ్రామా అని ప్రతిపక్షనేత హర్షవర్ధన్ విమర్శించారు.
Advertisement
Advertisement