విషమించిన అన్నా హజారే ఆరోగ్యం!!
అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తోంది. లోక్పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఆయన బరువు 4.3 కిలోలు తగ్గిపోయారని అన్నా అనుచరుడు సురేష్ పఠారే తెలిపారు. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించిందని జాతీయ వార్తా చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
లోక్పాల్ బిల్లుకు చేసిన సవరణలను అన్నా హజారే స్వాగతిస్తుండగా, ఒకప్పటి ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ లాంటివాళ్లు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినది లోక్పాల్ కాదు.. జోక్పాల్ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయితే, బిల్లు నచ్చకపోతే దానిపై నిరాహార దీక్ష చేపట్టాలంటూ ఆయనపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నాను కొందరు తప్పుదోవ పట్టించారని, అసలు ఈ బిల్లు ప్రతులన్నింటినీ అన్నా, ఆయన బృంద సభ్యులు ఎవరైనా చదివారా అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తాను నమ్మిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నా ఆచరిస్తారని, మూడేళ్లుగా ఆయనను చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. అన్నా ఆరోగ్యం విషమించడంతో తాను ఢిల్లీ పర్యటనను మానుకుని అన్నాతోనే ఉన్నానని, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకు, అన్నా దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటానని తెలిపారు.