ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఆయన చర్యలే కారణమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. మద్యం పాలసీకి సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించానని అన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘‘మద్యం మనిషి ఆరోగ్యానికి హానికరమని చిన్న పిల్లలకు కూడా తెలుసు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పాను. లిక్కర్ పాలసీని రూపొందించడం మన ఉద్యోగం కాదని వివరించా. అయినా వినలేదు. పాలసీని రూపొందించి అమలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేయకపోతే అరెస్టై ఉండేవారే కాదు.
మరింత ఎక్కువ డబ్బు సంపాదించడానికే మద్యం పాలసీని కేజ్రీవాల్ తయారు చేసి ఉంటారు. మద్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన కేజ్రీవాల్ అదే మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అరెస్టు కావడం బాధ కలిగిస్తోంది’’ అని అన్నా హజారే పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దశాబ్దం క్రితం జరిగిన ఉద్యమంలో అన్నా హజరే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment