కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణలో సుప్రీంకోర్టు
తీర్పు రిజర్వు
మంగళవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్‌వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు.
బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్‌వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు.
బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment