Ujjal Bhuyan
-
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాకు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాక
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్ మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయన్‌తో పాటు హైకోర్టు జడ్జిలు నవీన్‌రావు, సంతోష్‌రెడ్డి తదితరులు వస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్‌లతో కలిసి అధికారులతో చీఫ్ జస్టిస్ రాకపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని కోర్టు సముదాయంలో రూ.5 కోట్లతో వ్యయంతో నిర్మించనున్న 3వ అంతస్తు భవన నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు చీఫ్ శంకుస్థాపన చేస్తారన్నారు. వారికోసం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఆర్అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వారు సీఎస్ఐ చర్చి, ఏడుపాయల సందర్శిస్తారని, ఈసందర్భంగా లోటుపాట్లు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారికి సూచించారు. ఏడుపాయలలో పూర్ణకుంభంతో స్వాగతం, దర్శనం, హరిత హోటల్లో విశ్రమించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఈఓ సాయి శ్రీనివాస్‌కు సూచించారు. సీజీ పర్యటించే ప్రాంతాలను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఈ సమాఏశంలో ఆర్డీఓలు సాయి రామ్, శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ వెంకటేష్, డీఎంఅండ్‌హెచ్‌ఓ చందునాయక్, ఉద్యాన అధికారి నర్సయ్య, డీఎఫ్ఓ రవి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఏడుపాయల ఈఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్’కు ‘మధ్యవర్తిత్వం’ చక్కటి పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భరించలేనంత భారం మోపితే ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటుందని.. ఆ ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం అమలు విధానంపై చర్చా కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజులు జరగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ ఏటికేడు పెరిగిపోతున్న పెండింగ్ కేసులతో న్యాయవ్యవస్థపై విపరీత భారం పడుతోంది. న్యాయమూర్తులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీనికి చక్కని పరిష్కారమే ‘మధ్యవర్తిత్వం’ అని వెల్లడించారు. అవగాహన పెంచుకోవాలి..: ‘హైకోర్టు న్యాయమూర్తులు కూడా మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దేశంలో దాదాపు 5 కోట్లు, రాష్ట్రంలో 10 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుంది? ఈ పరిస్థితులను అధిగమించేందుకు మధ్యవర్తిత్వం తోడ్పడుతుంది.’అని జస్టిస్ లావు నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ‘జిల్లాస్థాయిల్లోనూ మీడియేషన్ సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, భార్యభర్తల గొడవలకు అక్కడే పరిష్కారం చూపిస్తే.. పెండింగ్ కేసుల భారం తగ్గే అవకాశం ఉంది’ అని జస్టిస్ నవీన్‌రావు అభిప్రాయపడ్డారు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జి లిమ్ వర్చువల్‌గా మాట్లాడారు. అనంతరం జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ అనుమప చక్రవర్తి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జార్జి లిమ్ సమాధానం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి(జడ్జి) గోవర్ధన్‌రెడ్డి, జడ్జి రాధిక, ౖహె కోర్టు రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లు పాల్గొన్నారు. -
కుటుంబ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమీకృత కోర్టుల ద్వారా కుటుంబ వివాదాల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ చెప్పారు. కొన్నికేసుల విచారణ సాగుతున్నప్పుడు కక్షిదారుల కంటే న్యాయవాదులే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారని, అది సరికాదన్నారు. ఆయన శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కలసి హైదరాబాద్‌లో కుటుంబ వివాదాల సమీకృత కోర్టుల సముదాయాన్ని ప్రారంభించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లా డుతూ‘‘దేశంలో దాదాపు 11.4 లక్షల కుటుంబ వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ వివాదాల ప్రత్యేక కోర్టులు లేని రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే కల్పతరువుగా పేరు పెట్టుకున్న ఈ కోర్టులు కూడా కక్షిదారులు విడాకులు, మధ్యవర్తిత్వం ఇలా వారు ఏది కోరితే అది ఇస్తుంది. కానీ ఏది కోరుకున్నా అది వారి భవిష్య త్‌పై ప్రభావం చూపుతుందని మరవద్దు. కుటుంబ వివాదాలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం పెద్దలు గుర్తించాలి. మనోవికాసం కక్షిదారులకు మాత్రమే కాదు. బుద్ధి సరిగా లేని వారందరికీ అవసరమే. న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులను చట్టాల ఆధారంగానే కాకుండా మనసుతో ఆలోచించి పరిష్కరించాలి’’అని రామసుబ్రమణియన్ సూచించారు. ఇక ‘‘తల్లిదండ్రుల వివాదాల కారణంగా పిల్లలు చిన్న వయసులో కుంగుబాటుకు గురవుతున్నారు. ఎంతోమంది కోర్టు తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని వస్తారు. తొలుత మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి’’అని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. ‘‘1970లోనే కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1980 తర్వాత అది కార్యరూపం దాల్చి కోర్టుల ఏర్పాటు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 535 ఫ్యామిలీ కోర్టులు ఉండగా, అందులో 16 మాత్రమే తెలంగాణలో ఉన్నాయి’’అని జస్టిస్ సంజయ్‌కుమార్ వివరించారు. కక్షిదారులకు ఉపయుక్తం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ‘‘హైదరాబాద్‌లోని అన్ని ఫ్యామిలీ కోర్టులు ఒకే భవన సముదాయంలో ఉండటం కక్షిదారులకు ఉపయుక్తం. కోర్టులకు వచ్చే వారికి వాటిని చూడగానే సాధారణంగా వ్యతిరేక భావన కలుగుతుంది. అయితే మెడిటేషన్ రూం, ప్లే ఏరియా, మీడియేషన్ రూం ఇలా ఈ కోర్టును చూస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుంది’’అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. దాదాపు 5,900 కేసులు ఈ కోర్టులకు బదిలీ కానున్నాయని జస్టిస్ నవీన్‌రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఇతర హైకోర్టుల న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్
సాక్షి, పెద్దపల్లి: కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ఉంటే న్యాయవ్యవస్థ మరింత చేరువగా పనిచేయగలుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలోని కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సహా 14 మంది హైకోర్టు జడ్జీలతో కలసి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విన్నానని గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత గురించి వివరించారని పేర్కొన్నారు. బాంబే హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రొసీడింగ్స్ అందిస్తే అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాలకు సమాంతర న్యాయసేవలు అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడీ్జలు మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, కలెక్టర్ సంగీత, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
సకాలంలో సత్యాన్ని వెలికితీయాలి
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు సకాలంలో సత్యాన్ని వెలికితీయడం కత్తిమీద సాము లాంటిదని, దీనిలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ అన్నారు. ట్రూత్ ల్యాబ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంపై నల్సార్ యూనివర్సిటీ శనివారం ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. క్రిమినల్ కేసుల్లోనే కాదు, సివిల్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ సైన్స్ సేవలు అందించాలని సూచించారు. పరిశోధనకు కొత్త మార్గాలను అనుసరించడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా సాక్ష్యాన్ని సమర్థవంతంగా రూపొందించడంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకమైనదని అన్నారు. ఆధారాలను వెలికితీయడంలో... న్యాయ రంగంలో ఫోరెన్సిక్ సైన్స్ సహకారం అవసరమని, తద్వారా క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుందని తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్‌రావు అన్నారు. క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు సీజే, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచించారు. రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా, లా కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ రఘురామ్, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు, డా.గాంధీ పీసీ కాజా, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐకి ఇవ్వాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీళ్లపై తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవా రం వెల్లడించనుంది. జన వరి 4న అప్పీళ్లు దాఖలు కాగా, అదే నెల 18 వరకు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సిట్ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది. బీజేపీతోపాటు నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సీఎం కేసీఆర్ వాది, ప్రతివాదిగా లేనప్పుడు ఆయన గురించి తీర్పులో ప్రస్తావించడాన్ని అప్పీల్లో తప్పుపట్టాయి. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రభుత్వా న్ని కూల్చాలని కుట్ర జరిగిందని, అందువల్ల నిందితులకు అనుకూలంగా వచ్చిన సింగిల్‌జడ్జి తీర్పు రద్దు చేయా లని కోరింది. అప్పీళ్లపై ప్రభు త్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, రవిచందర్ వాదనలు వినిపించారు. -
పురోగతిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం మనం వేడుకలు జరుపుకోవాల్సి న రోజు మాత్రమే కాదు.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సాధించిన పురోగతిని ఆత్మపరిశీలన చేసుకునే సమయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు. అనంత రం జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి నుంచి ఎంతో కాలం ప్రయాణించా. మనం సాధించిన లక్ష్యాలను గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం సమానమేనని రాజ్యాంగం చెబుతోంది. ఎక్కడా కులం, మతం, లింగం లాంటి భేదాలు ఉండకూడదు. దేశంలోని ప్రతి పేదవాడికీ న్యాయం అందేలా చూడాలి. పెండింగ్ కేసులను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నామనేది కోర్టుల పనితీరుకు కొలమానం. దీనికి న్యాయవాదులు, రిజిస్ట్రీ సహకారం ఎంతో అవసరం’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు. -
గవర్నర్ ఎట్ హోంకు సీఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: దేశ గణతంత్ర దినోత్సవం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) పాటించలేదని కేంద్ర ప్రభుత్వా నికి నివేదిక పంపించినట్టు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. గణతంత్ర దినోత్స వం సందర్భంగా గురువారం సాయంత్రం ఆమె రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎస్ఓపీ పాటించలేదన్న అంశంపై కేంద్రానికి నివేదిక పంపించారా? అని విలేకరులు ప్రశ్నించగా, పంపించినట్టు ఆమె ధ్రువీకరించారు. తేనేటి విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలేవరూ హాజ రు కాలేదు. గతేడాది రాజ్‌భవన్ తేనేటి విందుకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈసారి పూర్తిగా దూరంగా ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మాజీ గవర్నర్ సీ.హెచ్.విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్.రామచంద్రరావు, వివేక్, కపిలవాయి దిలీప్‌కు మార్, బాబు మోహన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ సాయుధ పోరాట యోధు లు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అతిథులందరి వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరించారు. కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ట్విట్టర్లో వ్యంగాస్త్రాలు సంధించారు. ‘ఎట్ హోం కార్యక్రమం బీజేపీ కా ర్యాలయంలా అయింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసైతోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు హాజరయ్యారు’ అని ఎద్దేవా చేశారు. -
జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ ! 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, కామారెడ్డి: పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించే న్యాయసేవాధికార సంస్థలు కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగానే కొనసాగాయి. అయితే సేవలు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్‌గా ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రారంభించింది. తరువాత కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. అయితే న్యాయస్థానాలకు సంబంధించి విభజన ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. ఇటీవలే కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. అంతేగాక కొత్త జిల్లాల్లో పోక్సో కేసుల విచారణకు కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ట్రిబ్యునళ్లు, కోర్టులు రావలసి ఉంది. అవి కూడా త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త జిల్లాల్లో న్యాయస్థానాల సముదాయాల నిర్మాణానికి భూసేకరణ కూడా చేపట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయసేవలు, సహాయం అందనుంది. అంతేగాక చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారిని కౌన్సెలింగ్ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తారు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
సీజే ఉజ్జల్ భుయాన్: చలించి... మానవత్వాన్ని చాటి...
చార్మినార్(హైదరాబాద్): రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రాంతం అది. రెండు నెలలుగా ఓ మతిస్థిమతం లేని వ్యక్తి ఆ ప్రాంతంలోని రోడ్డుపై తిండిలేక దీనావస్థకు చేరాడు. నడలేని స్థితిలో ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అతన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మదీనా సర్కిల్ ఫుట్‌పాత్‌పై గురువారం అతన్ని చూసి చలించిపోయారు. చింపిరి తల, మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాదికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్దన్రెడ్డిని సీజే ఆదేశించారు. స్పందించిన గోవర్దన్‌రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కె.మురళీమోహన్ను కోరారు. అలాగే ఇదే విషయంపై సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యారా సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురళీమోహన్‌తో పాటు మీర్‌చౌక్ పోలీసులు అక్కడికి వచ్చి అతనికి కొత్త దుస్తులు వేసి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌గా గుర్తింపు... అతన్ని ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన గనెగోని శ్రీనివాస్‌గా గుర్తించారు. అవివాహితుడైన అతనికి ప్రవీణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు సోదరులున్నారన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ప్రవీణ్ జీఎస్ఐ కార్యాలయంలో పని చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఒక పేపర్‌పై రాసి చూపించాడు. కుటుంబ తగాదాల కారణంగా తాను ఇంటి నుంచి వచ్చేసి 2 నెలలుగా మదీనా సెంటర్ వద్ద ఉన్నానని పేర్కొన్నాడు. -
సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచి
వరంగల్ లీగల్: దేశ ఆర్థిక, సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచిగా నిలుస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జ్యూడీషియరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస కేసుల్లో బాధితులకు ఆర్థిక, శారీరక ఉపశమన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధితులను భవిష్యత్ పౌరులుగా సమాజంలో భాగస్వాములను చేసే దిశగా బాలల హక్కుల పరి రక్షణ కోసం పని చేసే అన్ని వర్గాలు దృష్టి సారించా లని పిలుపు నిచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గ్ర హీత కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులు, బంధువులు, పరిచ య స్తుల ద్వారానే అత్యధిక శాతం జరుగుతున్నా య న్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విస్తరించడం ద్వా రా బాధితులకు సత్వర న్యాయం అందించగలు గుతామని చెప్పారు. వరంగల్ పోక్సో కోర్టు ఈ దిశ గా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్ర మంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కు మార్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణ మూర్తి, వ రంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీ వ్‌గాంధీ హన్మంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన య్‌భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనంద్‌మోహన్, శ్రీనివాస్‌గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు జనార్దన్, జయాకర్, ఇతర న్యా యమూర్తులు, లాయర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
Hyderabad: హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిశారు. శుక్రవారం సాయంత్రం సీజే నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్) -
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దీని కోసం ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై సంబంధిత శాఖలు, న్యాయాదికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే మహిళలు, పిల్లలకు భద్రత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. పోక్సో చట్టం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్ర పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డా. షమీమ్ అక్తర్, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ రాధారాణి, జస్టిస్ నందా, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్ రావు, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమలాదేవి, సుజన ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉచిత న్యాయసేవ ప్రజల హక్కు
ఖలీల్‌వాడి(నిజామాబాద్): ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళలా అందిస్తామని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. న్యాయసహాయం అందేలా న్యాయసేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆదివారం రోటరీక్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో 263 మందికి కృత్రిమకాళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని సామాజిక మార్పు, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్నికోర్టుల్లో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టు పరిధిలోనే రెండున్నర లక్షల కేసులు పరిష్కారం కావాల్సి ఉందని చెప్పారు. లోక్‌అదాలత్‌ల ద్వారా వివాదాల పరిష్కారానికి ముందుకు వస్తే అనేక పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉందన్నారు. పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ తెలిపారు. నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవితం గడుపుతున్నారని, ఇది అనేక అనర్థాలకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. కుటుంబసభ్యులు పిల్లలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రయత్నించాలని, తాము ఎటువైపు వెళ్తున్నామనేదానిపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇన్చార్జి సీపీ శ్రీనివాస్‌రెడ్డి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలి
ఖమ్మం లీగల్: న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, దాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు నిలుపుకోవాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. న్యాయం అందించే ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించడంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్ర కీలకమైందని చెప్పారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన న్యాయవాద పరిషత్ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ‘సత్వర న్యాయం–న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. కక్షిదారులు, ప్రజలకు సత్వర న్యాయం అందించకుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 20, 21 ప్రకారం అందరికీ సమన్యాయం వర్తిస్తుందని తెలిపారు. కక్షిదారులకు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉందన్నారు. కష్టపడి పనిచేయాలని, బరువు బాధ్యతలను చిరునవ్వుతో మోయాలంటూ ఇటుకలు మోసే పంజాబీ మహిళ గురించి ప్రస్తావించారు. 15 ఇటుకలను చిరునవ్వుతో మోసే ఆ మహిళ తల మీద మరికొన్ని మోపితే భారం అయినట్లుగా అవుతుందని పెండింగ్ కేసుల గురించి ప్రస్తావిస్తూ అన్నారు. సత్వర న్యాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రపంచంలోనే మనదేశ న్యాయవ్యవస్థ గొప్పదని చెప్పారు. ఖమ్మం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి టి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ సయోధ్య అనేది పురాతన కాలం నుంచి ఉందని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010లో తాను రాసిన పుస్తకంలోని సత్వర న్యాయం అనే అంశంపై వివరించానని తెలిపారు. మహాసభలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, ఎన్.రాజేశ్వర్‌రావు, బి.నగేశ్, అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాద పరిషత్ బాధ్యులు కె.శ్రీనివాసమూర్తి, కరూర్ మోహన్, సునీల్, కె.విజయ్‌కుమార్, ఎస్.వెంకటేశ్వర గుప్తా, అన్ని జిల్లాల న్యాయవాద పరిషత్ న్యాయవాదులు హాజరయ్యారు. -
అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ప్రారంభం
శామీర్‌పేట్: శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార న్యాయ కేంద్రాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి బీపీ జీవన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాల్లో సమకాలీన సమస్యలకు సంబంధించిన బోధనకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ ప్రొఫెసర్లు వెంకట్, డాక్టర్ కేవీకే శాంతి, మల్లిఖార్జున్, రాజేశ్‌కపూర్ పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
బంజారాహిల్స్(హైదరాబాద్): కోర్టుల చుట్టూ తిరగడం కంటే కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. కిందికోరుల్లో, హైకోర్టు మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వివాద పరిష్కార ప్రత్యామ్నాయం(ఏడీఆర్)పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పాల్గొన్నారు. ఏడీఆర్ ఆవశ్యకతపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. చాలా వరకు మధ్యవర్తిత్వ అంశాల్లో ముఖ్య వ్యాజ్యదారుడిగా ప్రభుత్వమే ఉంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 2015, 2019, 2021లో చేసిన సవరణల ప్రయోజనాన్ని జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు వివరించారు. వివాద పరిష్కారానికి బదులు అసలు వివాదాలే రాకుండా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా వ్యాపార సంబంధాలు సరిదిద్దుకోవడం, కొనసాగించడం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అనంతరం ప్యానలిస్టులకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశంలో ఏడీఆర్ యంత్రాంగం ఎలా మెరుగుపర్చాలనే అంశంపై సూచనలిచ్చారు. ఈ సదస్సులో తెలంగాణ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఏడీఆర్ రంగంలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో అతి సులభంగా వ్యాపారం నిర్వహించుకోవడానికి చట్టపరంగా ఉండాల్సిన సహకారం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ మురళీకృష్ణారెడ్డి, టెంపస్ లా ఫర్మ్ ఫౌండర్, భాగస్వామి సుందరీ ఆర్. పీసుపాటి తదితరులు పాల్గొన్నారు. -
జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని.. కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని వికార్ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్ సెంటర్, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్ అం«శం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్పించేందుకు ఈ గెస్ట్‌హౌస్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు. రాష్ట్ర సర్కార్ తీరు హర్షణీయం.. ప్రతిపాదన చేయగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పడంపై ఆనందం వెలిబుచ్చారు. కోర్టులకు భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారు చేసిన ‘న్యాయ నిర్మాణ్’పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భూయాన్ ఆవిష్కరించారు. జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో కూడా ఉండాలన్నారు. జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతుల కల్పన చేస్తేనే న్యాయం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 22 ఏళ్లుగా న్యాయమూర్తిగా సేవలు అందించానని, ఈ నెల 27న సుప్రీంకోర్టు సీజేగా పదవీ విరమణ చేయబోతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ స్థాయికి రావడానికి, న్యాయమూర్తిగా సేవలు అందించడానికి ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. 20 సూట్లు.. 12 డీలక్స్‌లు.. 2.27 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జడ్జీల గెస్ట్‌హౌస్, కల్చరల్ సెంటర్ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధన్యవాదాలు తెలియజేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ఐదు వీఐపీ సూట్లు, మరో 20 సూట్లు, 12 డీలక్స్ గదులు, సాంస్కృతిక భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జస్టిస్ నవీన్‌రావు, పలువురు న్యాయమూర్తులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్‌లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు. -
మానవత్వాన్ని పెంపొందించుకోవాలి
రాయదుర్గం: మనమంతా మానవులుగానే మిగిలిపోదామని, మానవత్వాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమా రీస్ సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ ఆడిటో రియంలో అడ్మినిస్ట్రేటర్స్ కోసం ‘ఎన్‌హ్యా న్సింగ్ ఎఫెక్టివ్‌నెస్’అనే అంశంపై శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ.. తాను నిరంతరం న్యాయ, జీవిత విద్యార్థిగా ఉండాలని కోరుకుంటానన్నారు. అధికారం, గుర్తింపు, దర్పం అనేవి తాత్కాలికమని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు తన సొంతమని, ఇతరులపై ఎప్పుడూ ఆధా రపడలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బ్రహ్మకుమారీస్ సంస్థతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్కరూ నిత్యం మెడిటేషన్, యోగాపై దృష్టి పెట్టాలని బ్రహ్మకుమారీస్ సంస్థ అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ చైర్పర్సన్ రాజయోగిని ఆశాదీదీ, శాంతిసరోవర్ డైరెక్టర్ రాజయో గిని కుల్దీప్దీదీ సూచించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ‘ఎన్‌హ్యా న్సింగ్ ఎఫెక్టివ్‌నెస్’ (మెరుగు పర్చుకోవడం, ప్రభావం) అనే అంశాలపై ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఆడియో, దృశ్య ప్రదర్శన, నృత్య ప్రదర్శ నలు, మెడిటేషన్, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామలింగేశ్వరరావు, జస్టిస్ ఎం. సుధీర్‌కుమార్, సీనియర్ న్యాయవాది రాజేందర్‌రెడ్డి, నిజాం మునిమనుమడు రౌనక్‌యార్‌ఖాన్, రాజయోగిని బీకే శక్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటివరకు సీజేగా పనిచేసిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సీజేగా బాధ్యతలు స్వీక రిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పా టైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకు న్నారు. అస్సాం బార్ కౌన్సిల్లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకు న్నారు. పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ లో ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సి ల్గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియమితులయ్యా రు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవ లందించారు. 2021, అక్టోబర్ 22న సీజేగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు. -
Telangana: సీఎం వెళ్తారా.. వెళ్లరా?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు మధ్య విభేదాల నేపథ్యంలో తాజాగా జరుగనున్న ఓ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తమిళిసై ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణస్వీకారం చేయించేది గవర్నరే. ఇది రాజ్‌భవన్‌లో జరగడం సంప్రదాయం. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు హాజరుకావాలి. మరి గవర్నర్‌తో విభేదాలతో కొంతకాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తలపెట్టిన టీ–హబ్ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నిజానికి ఈ భవనాన్ని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ దానిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో.. వ్యూహాత్మకంగానే కార్యక్రమాన్ని మార్చినట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకుముందు రెండుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలతో విభేదాలు తలెత్తి.. ఒకదశలో పరస్పర విమర్శల వరకు వెళ్లింది. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయాలన్న ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టిననాటి నుంచి రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు పొసగడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు పది నెలలుగా సీఎం రాజ్‌భవన్ గడప తొక్కలేదు కూడా. గవర్నర్ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు నేరుగానే ఆరోపణలు చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ నియామక విషయంలోనూ గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదలను పక్కనపెట్టి.. పూర్తిస్థాయి చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించడం కూడా దూరాన్ని పెంచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దిన వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, సీఎం సహా మంత్రులు, సీఎస్, డీజీపీ కూడా హాజరుకాకపోవడంతో గవర్నర్, సీఎం మధ్య అంతరం మరింత పెరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదన్న సాంకేతిక కారణం చూపుతూ గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. దీనిపై మనస్తాపం చెందిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం గవర్నర్‌కు మర్యాద ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆమెకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలకలేదు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర హోంశాఖకు పంపారు. తాజాగా రాజ్‌భవన్‌లో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడంపైనా టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వెళతారా, లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. టీ–హబ్ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు! రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లే అంశంపై చర్చ నేపథ్యంలో మంత్రి కె.తారకరామారావు చేసిన ట్వీట్ కూడా ఆసక్తి రేపింది. ‘‘కొత్త టీ–హబ్ భవనాన్ని జూన్ 28న ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నాను. హైదరాబాద్ నగర నూతన ఆవిష్కరణల ఎకో సిస్టమ్‌కు దీని ద్వారా గొప్ప ఊతం లభించనుంది.’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్‌భవన్ కార్యక్రమం జరిగే సమయంలోనే టీ–హబ్ ప్రారంభోత్సవం ఉండటం గమనార్హం. -
హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఐదు హైకోర్టులకు నూతన సీజేలను నియమించాలని, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలంటూ మే 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం పేర్కొంది. జస్టిస్ భూయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆయనకు ఇదే కోర్టులో పదోన్నతి లభించింది. కాగా, 2021, అక్టోబర్ 11న తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయ్యారు. 1991లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. అస్సాంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్ సీనియర్ న్యాయవాదిగా, అస్సాం అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్ భూయాన్ డాన్ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్ కాలేజీలో ప్లస్ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. అస్సాం బార్ కౌన్సిల్లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. ఇతర పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్‌లో ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్ 6న సీనియర్ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. అసోం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. మిజోరాం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియమితులయ్యారు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో ఐదో సీజే.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ రాష్ట్ర హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే.