జ్యోతిప్రజ్వలన చేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సాక్షి, పెద్దపల్లి: కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ఉంటే న్యాయవ్యవస్థ మరింత చేరువగా పనిచేయగలుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలోని కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సహా 14 మంది హైకోర్టు జడ్జీలతో కలసి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విన్నానని గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత గురించి వివరించారని పేర్కొన్నారు. బాంబే హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రొసీడింగ్స్ అందిస్తే అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాలకు సమాంతర న్యాయసేవలు అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడీ్జలు మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, కలెక్టర్ సంగీత, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment