District courts
-
జిల్లా కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్
సాక్షి, పెద్దపల్లి: కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ఉంటే న్యాయవ్యవస్థ మరింత చేరువగా పనిచేయగలుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలోని కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సహా 14 మంది హైకోర్టు జడ్జీలతో కలసి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విన్నానని గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత గురించి వివరించారని పేర్కొన్నారు. బాంబే హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రొసీడింగ్స్ అందిస్తే అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాలకు సమాంతర న్యాయసేవలు అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడీ్జలు మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, కలెక్టర్ సంగీత, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
AP: జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. వెబ్సైట్లలో దరఖాస్తులు.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–135, కాపీయిస్టు–20, టైపిస్ట్–16, అసిస్టెంట్–14, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13, ఎగ్జామినర్–13, కంప్యూటర్ ఆపరేటర్లు–11, సెక్షన్ ఆఫీసర్లు–9, డ్రైవర్లు–8, ఓవర్సీర్–1, అసిస్టెంట్ ఓవర్సీర్–1 మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–1,520, జూనియర్ అసిస్టెంట్–681, ప్రాసెస్ సర్వర్–439, కాపీయిస్టు–209, టైపిస్ట్–170, ఫీల్డ్ అసిస్టెంట్–158, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114, ఎగ్జామినర్–112, డ్రైవర్(ఎల్వీ)–20, రికార్డ్ అసిస్టెంట్–9 మొత్తం 3,432 పోస్టులు. -
వికేంద్రీకరణతో సత్వర న్యాయం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల వికేంద్రీకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం హై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలసి 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సీజేఐ మాట్లాడారు. తగ్గనున్న కేసుల భారం ‘జిల్లా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సత్వర న్యాయం అందించలేని పరిస్థితి. జిల్లా కోర్టుల విభనజతో భారం తగ్గి త్వరగా న్యాయం అందే అవకాశం లభించింది. కొత్త కోర్టుల ఏర్పాటుకు తగినట్లు న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి సీఎం ఆమోదించడం శుభ పరిణామం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు, హైకోర్టులో సిబ్బంది పెంపు ఇలా న్యాయవ్యవస్థ పటిష్టతలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచింది. హైదరాబాద్‌లో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఐటీకి పేరుగాంచింది. కోర్టుల్లోనూ ఐటీ సేవలను వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం అందించడం మన బాధ్యత ’అని సీజేఐ వివరించారు. త్వరలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొంతవరకు సఫలీకృతం అయ్యా. ప్రజలు ఆస్పత్రికి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లు న్యాయస్థానాలను ఆశ్రయించేలా తీర్చిదిద్దాం. 111 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించా. 194 హైకోర్టు ఖాళీలకు సిఫారసు చేయగా, కేంద్రం 152కు ఆమోదం తెలిపింది. వీరిలో 33 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. అలాగే ఇప్పటివరకు 19 మంది న్యాయమూర్తులను నియమించాం. మరో ఇద్దరిని త్వరలో నియమించనున్నాం. ఇందులో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం..’అని తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం: సీఎం ‘గతంలో తెలంగాణ హైకోర్టు ప్రారంభానికి ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం సందర్భంగా రావడం ఆనందదాయకం. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమనంలో దూసుకుపోతోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని సీజేఐని కోరాం. ఆయన చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి వెంటనే నియామకం చేపట్టారు. ఇది హైకోర్టు పటిష్టతకు దోహదం చేసింది. 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ఏర్పాటుతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నా స్వస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. మా దగ్గరి నుంచి సంగారెడ్డి కోర్టుకు వెళ్లాలంటే 150 కి.మీ.లు పోవాలి. ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలుగా విభజించాం. ములుగు, భూపాలపల్లి చిన్న ప్రాంతాలే అయినా జిల్లాలుగా ఏర్పాటు చేశాం. న్యాయస్థానాల వికేంద్రీకరణ, సత్వర న్యాయంతో ప్రజలకు చిక్కులు తొలగిపోతాయి..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చదవండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పరిధి దాటితే ఉపేక్షించం.. ‘న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే న్యాయమూర్తుల నియామకంతో పాటు ఇతర వసతులు ఉండాలి. దీనిపై ఏప్రిల్‌లో జరిగిన సీఎం, హైకోర్టు సీజేల భేటీలో అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అయితే కొంత అవగాహన లోపంతో జాతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగడం లేదు. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో దీనిపై తీర్మానం చేయాలని భావించినా సాధ్యంకాలేదు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రాలకు మంచి జరిగేది. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైపోయింది. కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం పరిపాటిగా మారింది. ఇది దురదృష్టకరం. పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటితే ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..’అని సీజేఐ చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: హైకోర్టు సీజే ‘కొత్త జ్యుడీషియల్ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుంది’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.లలిత, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, కా ర్యదర్శులు కల్యాణ్‌రావు, సుజన్‌కుమా ర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జ్యుడీషియల్ జిల్లా (హైదరాబాద్ మినహా) కోర్టులు గురువారం ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జ్యుడీషియల్ జిల్లా కోర్టులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం 10 రెవెన్యూ జిల్లాలను 33 జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు న్యాయస్థానాలు మరింత చేరువకానున్నాయి. జిల్లా కోర్టుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. ఇదిలాఉండగా, 33 జ్యుడీషియల్ జిల్లాలను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో జారీ చేసింది. అలాగే ఆయా జ్యుడీషియల్ కోర్టుల పరిధులను ఇందులో పేర్కొంది. -
33 జ్యుడీషియల్ జిల్లాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ జిల్లాలు ఏర్పడిన దాదాపు మూడేళ్ల తర్వాత 33 జ్యుడీషియల్ జిల్లాలకు సర్కారు ఆమోదం తెలిపింది. దీంతో నూతన జిల్లాల్లో ప్రధాన జిల్లా న్యాయస్థానాల(పీడీజే కోర్టు)ను ఏర్పాటు చేయనుంది. హైకోర్టు సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కోర్టులు పనిచేస్తున్నాయి. జూన్ 2 నుంచి 33 జ్యుడీషియల్ జిల్లాల వారీగా పీడీజే కోర్టులు విధులు నిర్వహిస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కె.సుగుణ గెజిట్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా ఉన్న కేసులను కొత్త జిల్లాలవారీగా విభజించి ఆయా కోర్టులకు బదిలీ ప్రక్రియను హైకోర్టు ఆమోదం తర్వాతే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేసుల వివరాల హార్డ్ కాపీని, మెయిల్ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా హైకోర్టుకు పంపించాలని జిల్లా కోర్టులతోపాటు ఇతర న్యాయస్థానాలకు సూచించారు. కాగా, కొత్త జ్యుడీషియల్ జిల్లాల వారీగా కోర్టుల ఏర్పాటు నేపథ్యంలో భవనాలు, సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భవనాలు ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్ర న్యాయశాఖలో కొత్త పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. -
తెలంగాణలో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానాన్ని హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. -
50 మందితో స్వాతంత్ర్య వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించాలని సోమవారం అన్ని జిల్లాల న్యాయస్థానాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో ఆంక్షల మధ్యే వేడుకలు జరుపుకోవాలని తెలిపింది. వైద్యారోగ్య శాఖ సూచనల ప్రకారం భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్కులు ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. 50 మందితోనే స్వాతంత్ర్య సంబురాలు జరుపుకోవాలని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వేడుకను సైతం 20 నిమిషాల్లో ముగించాలని స్పష్టం చేసింది. ఈ వేడుకలకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపవద్దని తెలిపింది. ఈ ఆంక్షలన్నింటినీ అన్ని జిల్లాల న్యాయస్థానాలు అమలు చేయాలని ఆదేశించింది. (ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు) -
కోర్టు ఉద్యోగాలకు అభ్యర్థుల కొరత
నల్లగొండ : కోర్టు ఉద్యోగాల్లో కోలాహలం మొదలయ్యింది. అవుట్ సోర్సింగ్ కింద ఉమ్మడి జిల్లాకు 175 పోస్టులు మంజూరయ్యాయి. అటెండర్ 119, జూనియర్ అసిస్టెంట్ (టైపిస్ట్) 39, స్టెనో పోస్టులు 17 కలిపి మొత్తం 175 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని జిల్లాలోని త్రిసభ్య కమిటీకి అప్పగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల మాటెత్తగానే ముందుగా బేరసారాలతోనే రంగంలోకి దిగే ఏజెన్సీలకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈసారి కొత్త పద్ధతి పాటించారు. కలెక్టర్ ఎంపానల్మెంట్ చేసిన 14 ఏజెన్సీలనే న్యాయాధికారులు ఎంపిక చేశారు. ఈ 14 ఏజెన్సీలు..ఒక్కో ఏజెన్సీ 175 మంది అర్హులైన అభ్యర్థులతో జాబితా సమర్పించాలని సూచించారు. దీంతో ఒక్కో ఏజెన్సీ 175 మంది చొప్పున 14 ఏజెన్సీలు 2,450 దరఖాస్తులను సోమవారం జిల్లా కోర్టు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. అభ్యర్థుల కొసం కొత్త ఉద్యోగాల ప్రకటన జారీ చేసే అవకాశాన్ని ఏజెన్సీలకు ఇవ్వలేదు. ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల దరఖాస్తులనే సమర్పించాలని అధికారులు సూచించారని ఏజెన్సీలు తెలిపాయి. అయితే దీంట్లో ఎన్ని ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహారించాయనే దానిపైనే అనుమానాలు తలెత్తున్నాయి. అంతా పారదర్శకమేనా..! కోర్టుల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 14 ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఎంపిక చేసిన 14 ఏజెన్సీల్లో కొన్ని ఏజెన్సీలు గతంలో నిరుద్యోగులను నట్టేట ముచ్చినవే. కానీ ఇప్పుడలా కాకుండా కేవలం దరఖాస్తులు పంపడం వరకే ఏజెన్సీలను పరిమితం చేశారు. ఎంపిక చేసే అధికారం త్రిసభ్య కమిటీ సభ్యులదే. ఈ ఎంపిక విధానం ఎట్లా ఉంటుదనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక్కో పోస్టుకు 1ః3 ప్రకారం మెరిట్ జాబితా తయారు చేస్తారని అంటున్నారు. మరోవైపు రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కొరత.. అటెండర్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉందని ఏజెన్సీలు తెలిపాయి. స్టెనో, టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందన్నారు. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తులు స్వల్పంగానే వచ్చాయని తెలిపారు. అయితే అటెండర్ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు, అదనంగా స్కిల్ వర్కర్ నిబంధన కూడా జోడించారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొన్ని ఏజెన్సీలు అభ్యర్థులతో లోపాయికారిక ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగం వస్తే మొదటి నాలుగు మాసాల వేతనం ఏజెన్సీకి ఇవ్వాలనే ఒప్పందం ఒకటికాగా..డిపాజిట్ల రూపంలో ముందుగానే ఏజెన్సీలు తమ నుంచి డబ్బులు వసూలు చేశారని నిరుద్యోగులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగం రాకుంటే తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కోర్టు ఉద్యోగాలు మరోసారి వివాదస్పదం కాకుండా అధికారులు పాటించిన కొత్త విధానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. -
జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ
=జనవరి 5న పరీక్షలు =మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో నిర్వహణ =హైకోర్టు ఉత్తర్వులతో నియామకాలు =జిల్లాకు మరో ఐదు కొత్త న్యాయస్థానాలు =జిల్లా చీఫ్ జస్టిస్ చక్రధరరావు వెల్లడి సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని న్యాయస్థానాల్లో ఏడు విభాగాల్లో 261 పోస్టులను భర్తీ చేయనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు తెలిపారు. మచిలీపట్నంలోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్లు 52, ఫీల్డ్ అసిస్టెంట్లు 31, ఎగ్జామినర్లు 12, పర్సనల్ అసిస్టెంట్లు (స్టెనోగ్రాఫర్) 15, టైపిస్టులు 20, కాపీయిస్టులు 16, అటెండర్లు 115 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. మొత్తం పోస్టులకు సుమారు 60 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిశీలించి, అనర్హులను మినహాయించి అర్హులకు పరీక్ష పెడుతున్నట్టు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. జనవరి ఐదున మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మిగిలిన పోస్టులవారికి ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్టులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటివరకు హాల్‌టిక్కెట్లు అందని అభ్యర్థులు జనవరి 3, 4 తేదీల్లో డూప్లికేట్వి పొందవచ్చని, ఇందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని తెలిపారు. వివరాలకు 08672 223089, 231335 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పారదర్శకంగా పోస్టుల భర్తీ... న్యాయస్థానాల్లో పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో 1,110 మంది పనిచేస్తున్నారని, ఇంకా 30 శాతం వరకు సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఆగస్టు 8 వరకు మొదట గడువిచ్చామన్నారు. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా చాలామంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించామని చెప్పారు. జిల్లాకు ఇటీవల ఐదు కోర్టులు మంజూరయ్యాయని, విజయవాడలో రెండు, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరంలలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా న్యాయస్థానాలు ప్రారంభించాల్సి ఉందని ఆయన వివరించారు.