నల్లగొండ : కోర్టు ఉద్యోగాల్లో కోలాహలం మొదలయ్యింది. అవుట్ సోర్సింగ్ కింద ఉమ్మడి జిల్లాకు 175 పోస్టులు మంజూరయ్యాయి. అటెండర్ 119, జూనియర్ అసిస్టెంట్ (టైపిస్ట్) 39, స్టెనో పోస్టులు 17 కలిపి మొత్తం 175 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని జిల్లాలోని త్రిసభ్య కమిటీకి అప్పగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల మాటెత్తగానే ముందుగా బేరసారాలతోనే రంగంలోకి దిగే ఏజెన్సీలకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈసారి కొత్త పద్ధతి పాటించారు. కలెక్టర్ ఎంపానల్‌మెంట్ చేసిన 14 ఏజెన్సీలనే న్యాయాధికారులు ఎంపిక చేశారు. ఈ 14 ఏజెన్సీలు..ఒక్కో ఏజెన్సీ 175 మంది అర్హులైన అభ్యర్థులతో జాబితా సమర్పించాలని సూచించారు. దీంతో ఒక్కో ఏజెన్సీ 175 మంది చొప్పున 14 ఏజెన్సీలు 2,450 దరఖాస్తులను సోమవారం జిల్లా కోర్టు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. అభ్యర్థుల కొసం కొత్త ఉద్యోగాల ప్రకటన జారీ చేసే అవకాశాన్ని ఏజెన్సీలకు ఇవ్వలేదు. ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల దరఖాస్తులనే సమర్పించాలని అధికారులు సూచించారని ఏజెన్సీలు తెలిపాయి. అయితే దీంట్లో ఎన్ని ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహారించాయనే దానిపైనే అనుమానాలు తలెత్తున్నాయి.
అంతా పారదర్శకమేనా..!
కోర్టుల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 14 ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఎంపిక చేసిన 14 ఏజెన్సీల్లో కొన్ని ఏజెన్సీలు గతంలో నిరుద్యోగులను నట్టేట ముచ్చినవే. కానీ ఇప్పుడలా కాకుండా కేవలం దరఖాస్తులు పంపడం వరకే ఏజెన్సీలను పరిమితం చేశారు. ఎంపిక చేసే అధికారం త్రిసభ్య కమిటీ సభ్యులదే. ఈ ఎంపిక విధానం ఎట్లా ఉంటుదనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక్కో పోస్టుకు 1ః3 ప్రకారం మెరిట్ జాబితా తయారు చేస్తారని అంటున్నారు. మరోవైపు రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థుల కొరత..
అటెండర్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉందని ఏజెన్సీలు తెలిపాయి. స్టెనో, టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందన్నారు. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తులు స్వల్పంగానే వచ్చాయని తెలిపారు. అయితే అటెండర్ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు, అదనంగా స్కిల్ వర్కర్ నిబంధన కూడా జోడించారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొన్ని ఏజెన్సీలు అభ్యర్థులతో లోపాయికారిక ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగం వస్తే మొదటి నాలుగు మాసాల వేతనం ఏజెన్సీకి ఇవ్వాలనే ఒప్పందం ఒకటికాగా..డిపాజిట్ల రూపంలో ముందుగానే ఏజెన్సీలు తమ నుంచి డబ్బులు వసూలు చేశారని నిరుద్యోగులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగం రాకుంటే తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కోర్టు ఉద్యోగాలు మరోసారి వివాదస్పదం కాకుండా అధికారులు పాటించిన కొత్త విధానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment