లెక్క చెప్పరేం..?
నల్లగొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల నుంచి ఖర్చుల వివరాలను రాబట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు కావొస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అభ్యర్థుల నుంచి ఖర్చు వివరాలను సేకరించలేకపోయారు. వీరికి తగ్గట్టు పోటీచేసిన అభ్యర్థులు కూడా లెక్కలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎన్నికల వ్యయ పరిశీలకులదే పూర్తి బాధ్యత కాగా...జిల్లా అధికారులు తమకేమీపట్టనట్లుగా వదిలేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నెలరోజుల్లోపు అభ్యర్థుల ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే దానికంటే ముందుగానే ఎన్నికలు జరిగే సమయంలోనే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు వివరాలను నమోదు చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా వ్యయ పరిశీలకులను నియమించారు. అభ్యర్థులు నిర్వహించిన సభలు, సమావేశాలు, వాహనాలు ఇతర వ్యవహారాలను వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అభ్యర్థుల ఖాతాల్లో రాశారు. కానీ అభ్యర్థుల నుంచి రావాల్సిన ఖర్చు వివరాలు మాత్రం ఇంకా అందలేదు.
పొంతన లేని ఖర్చులు...
ఈ ఎన్నికల్లో జిల్లాలో రెండు ఎంపీ స్థానాలకు 22 మంది, 12 నియోజకవర్గాలకు 183 మంది కలిపి మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో కేవలం 50మంది అభ్యర్థులు మాత్రమే ఖర్చు వివరాలు ఇచ్చారు. వారిలోనూ స్వతంత్రులే ఎక్కువ ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు అభ్యర్థులు మాత్రమే లెక్కలు ఇచ్చారు. అయితే అభ్యర్థులు అందజేస్తున్న లెక్కలకు, వ్యయ పరిశీలకుల వద్ద ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంటోంది. పలుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల వివరాలను అభ్యర్థులు ఖర్చు ఖాతాలో జమచేయడం లేదు. కానీ పరిశీలకులు వాటిన్నింటిని కూడా వీడియో ద్వారా చిత్రీకరించారు. ఎన్నికల నిబంధనల మేరకు సభలు, సమావేశాలకు అయిన ఖర్చు కూడా...ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న అభ్యర్థులందరూ భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కలను అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో అధికారులు తమ వద్దకు వచ్చిన వాటిని కూడా తిప్పి పంపుతున్నారు.
ఖర్చుల్లో టాప్ వీరు..
సాధారణంగా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28లక్షల వరకు ఖర్చుపెట్టవచ్చు. ఎంపీ అభ్యర్థి రూ.70లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇప్పటివరకు అందిన ఎన్నికల ఖర్చు వివరాల్లో మొదటి స్థానంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన సభకు భారీగా ఖర్చు చేశారు. ఈ సభకు హాజరైన అభ్యర్థుల నెత్తిన ఒక్కొక్కరికి రూ. 9లక్షల చొప్పున ఎన్నికల ఖర్చు ఖాతాలో జమచేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఎన్నికల్లో 23లక్షల రూపాయల ఖర్చు చూపారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి సంబంధించి రూ.50లక్షలుగా లెక్క చూపారు. ఇక జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు నిర్వహించిన బహిరంగ సభలకు మించి భువనగిరిలో ప్రధాని మన్మోహన్ సభకు భారీగా ఖర్చు అయింది. ఈ సభ నిర్వహణకు ఎన్నికల నిబంధనల మేరకు రూ.98 లక్షలు ఖర్చు అయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ ఖర్చు కూడా ఆ సభకు హాజరైన అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లోకి వెళుతుంది. వీడియోల ద్వారా వ్యయ పరిశీలకులు వాటిని చిత్రీకరించి ఎన్నికల నిబంధనల మేరకు లెక్కకట్టి అభ్యర్థుల ఖర్చు ఖాతాలో రాశారు.
సమీపిస్తున్న గడువు...
సార్వత్రిక ఫలితాలు మే 16న ప్రకటించారు. ఫలితాలు వెల్లడైన నెలరోజుల్లోపు అంటే ఈ నెల 15వ తేదీలోగా అభ్యర్థులు ఖర్చు వివరాలు అందజేయాలి. కానీ 50 మంది అభ్యర్థులు మాత్రమే ఇచ్చారు. లెక్కలు వివరాలను అందజేయాల్సిందిగా అభ్యర్థులకు నోటీ సులు కూడా జారీ చేశారు. వారినుంచి ఎలాంటి స్పందన రానందున అధికారులకు మరోమార్గం లేక ఈ నెల 10వ తేదీన అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గడువులోగా లెక్కలు ఇవ్వన్నట్లయితే ఎన్నికల నిబంధనల మేరకు ఆరేళ్లపాటు పోటీ చేసేందుకు అనర్హులవుతారు.