ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి | Election Commission officials pressure on YSRCP candidates: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి

Published Thu, Aug 8 2024 4:43 AM | Last Updated on Thu, Aug 8 2024 4:43 AM

Election Commission officials pressure on YSRCP candidates: Andhra pradesh

మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారుల ఒత్తిడి

విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్‌

21 రోజులు గడిచినా ఈవీఎంలలో ఇంకా 99 శాతం ఛార్జింగ్‌ 

దీనిపై విచారణ జరపాలని ఆర్వోకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు

ఈసీ సూచన మేరకు రూ.94,400 ఫీజు కింద చెల్లింపు

ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్‌ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు

విచారణ కోసం రూ.5,66,400 ఫీజు చెల్లించిన బాలినేని

ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి శంబంగి చినఅప్పలనాయుడు ఫిర్యాదు.. ఈనెల 25 నుంచి 28 వరకూ విచారణ చేస్తామన్న ఎన్నికల సంఘం

తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన

ఫిర్యాదులు వెనక్కి తీసు కోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు

ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్‌డీ అనుమానాలు

ఓట్లు, పోలింగ్‌ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు

ఏపీలో ఏకంగా 12.54 శాతం పోలింగ్‌ పెరగడంపై ఆశ్చర్యం

హ్యాకింగ్‌ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్‌ శాతం పెరగడానికి కారణమని విశ్లేషణ

వీఎఫ్‌డీ, ఏడీఆర్‌ ప్రశ్నలపై స్పందించని ఎన్నికల సంఘం

తాజాగా ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఒత్తిడిఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్న ఈసీ తీరు 

సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫారŠమ్స్‌), వీఎఫ్‌డీ (ఓట్‌ ఫర్‌ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్‌ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్‌ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్‌ శాతం ఇంత భారీ స్థాయి­లో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్‌ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్‌డీ, ఏడీఆర్‌ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకో­వాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..
రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయ­నగరం లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోల­య్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్‌ 4న చేపట్టింది. అంటే పోలింగ్‌ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్‌ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్‌ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ అను­మానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

విచారణ కోసం జూన్‌ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్‌ ట్యాంపరింగ్‌ జరిగిందా? కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్, వీవీ పాట్స్‌ ట్యాంపరింగ్‌గానీ ఏమైనా మార్పులుగానీ జరిగా­యా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్‌ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.

వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత  అనుమానా­స్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తు­న్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్‌డీలతోపాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.

ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్‌ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.

విచారణ నిర్వహించాల్సిందే
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్‌ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌కు, కౌంటింగ్‌ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్‌ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్‌ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్,  విజయనగరం లోక్‌సభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 

ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్‌ 
ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్‌ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్‌ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా.  – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement