సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంచాయతీ ఎన్నికల్లో గెలు పొంది ఖర్చులు చూపించని ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో చివరకు వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 42మంది ఉప సర్పంచ్‌లు, 534మంది వార్డు సభ్యులు మొత్తంగా 576మంది పదవులు కోల్పోయారు.
లెక్కలు చూపడంలో తాత్సారం
జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 837 పంచాయతీలకు 2019 జనవరి మాసంలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. కాగా, పోటీచేసిన అభ్యర్థులంతా మూడు నెలల్లో ఎన్నికల్లో ఖర్చు చేసిన వ్యయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల సంఘం ఖర్చు వివరాల నివేదికను కోరినా చాలామంది స్పందించలేదు. ఖర్చుల వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటీసులు కూడా జారీ చేసింది. అయినా, వారు పెడచెవిన పెట్టడంతో ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని నోటీసులకు స్పందించని వారందరూ పదవులు కోల్పోతున్నట్లు ప్రకటించింది.
కోర్టును ఆశ్రయించే యోచనలో..
ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కొందరు ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలు సమర్పించారు. అయితే, వారు నోటీసులకు సకాలంలో స్పందించకపోవడంతోనే అనర్హత వేటు వేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరు అభ్యర్థులు ఎన్నికల వ్యయం లెక్కలు ఎలా సమర్పించాలో తెలియదని చెబుతుండగా, ఇంకొందరు తమకు నోటీసులు అందలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంపై అనర్హత వేటుకు గురైన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని కారణంగానే వారిపై అనర్హత వేటు వేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఖాళీ స్థానాలకు ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా అనర్హత వేటుకు గురైన 576 వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఏడుగురు సభ్యులు మృతిచెందిన స్థానాలు మొత్తంగా 583 వార్డులకు ఎన్నికల సంఘం తిరిగి ఎన్నికలు నిర్వహించనుంది. కాగా, ఉప సర్పంచ్‌లు అనర్హత వేటుకు గురైన పంచాయతీల్లో కోరం ఉంటే మరో సభ్యుడిని ఎన్నుకుని ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కోరం లేని పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు సంబంధిత అధికారికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment