వికేంద్రీకరణతో సత్వర న్యాయం: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ | 32 Judicial District Courts Inaugurated By CJI NV Ramana And CM KCR | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టులను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌

Published Thu, Jun 2 2022 6:25 PM | Last Updated on Fri, Jun 3 2022 7:25 AM

32 Judicial District Courts Inaugurated By CJI NV Ramana And CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాల వికేంద్రీకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం హై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మతో కలసి 32 జ్యుడీషియల్‌ జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సీజేఐ మాట్లాడారు.

తగ్గనున్న కేసుల భారం
‘జిల్లా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సత్వర న్యాయం అందించలేని పరిస్థితి. జిల్లా కోర్టుల విభనజతో భారం తగ్గి త్వరగా న్యాయం అందే అవకాశం లభించింది. కొత్త కోర్టుల ఏర్పాటుకు తగినట్లు న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి సీఎం ఆమోదించడం శుభ పరిణామం. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు, హైకోర్టులో సిబ్బంది పెంపు ఇలా న్యాయవ్యవస్థ పటిష్టతలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచింది.

హైదరాబాద్‌లో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ ఐటీకి పేరుగాంచింది. కోర్టుల్లోనూ ఐటీ సేవలను వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం అందించడం మన బాధ్యత ’అని సీజేఐ వివరించారు. 

త్వరలో మరో ఇద్దరు న్యాయమూర్తులు
‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొంతవరకు సఫలీకృతం అయ్యా. ప్రజలు ఆస్పత్రికి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లు న్యాయస్థానాలను ఆశ్రయించేలా తీర్చిదిద్దాం.

111 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించా. 194 హైకోర్టు ఖాళీలకు సిఫారసు చేయగా, కేంద్రం 152కు ఆమోదం తెలిపింది. వీరిలో 33 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. అలాగే ఇప్పటివరకు 19 మంది న్యాయమూర్తులను నియమించాం. మరో ఇద్దరిని త్వరలో నియమించనున్నాం. ఇందులో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం..’అని తెలిపారు. 

ప్రజా సమస్యలకు పరిష్కారం: సీఎం
‘గతంలో తెలంగాణ హైకోర్టు ప్రారంభానికి ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు 32 జ్యుడీషియల్‌ జిల్లా కోర్టుల ప్రారంభం సందర్భంగా రావడం ఆనందదాయకం. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్‌డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమనంలో దూసుకుపోతోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని సీజేఐని కోరాం. ఆయన చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి వెంటనే నియామకం చేపట్టారు.

ఇది హైకోర్టు పటిష్టతకు దోహదం చేసింది. 32 జ్యుడీషియల్‌ జిల్లా కోర్టుల ఏర్పాటుతో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నా స్వస్థలం మెదక్‌ జిల్లా సిద్దిపేట. మా దగ్గరి నుంచి సంగారెడ్డి కోర్టుకు వెళ్లాలంటే 150 కి.మీ.లు పోవాలి.

ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలుగా విభజించాం. ములుగు, భూపాలపల్లి చిన్న ప్రాంతాలే అయినా జిల్లాలుగా ఏర్పాటు చేశాం. న్యాయస్థానాల వికేంద్రీకరణ, సత్వర న్యాయంతో ప్రజలకు చిక్కులు తొలగిపోతాయి..’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 
చదవండి: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

పరిధి దాటితే ఉపేక్షించం..
‘న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే న్యాయమూర్తుల నియామకంతో పాటు ఇతర వసతులు ఉండాలి. దీనిపై ఏప్రిల్‌లో జరిగిన సీఎం, హైకోర్టు సీజేల భేటీలో అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అయితే కొంత అవగాహన లోపంతో జాతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగడం లేదు. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో దీనిపై తీర్మానం చేయాలని భావించినా సాధ్యంకాలేదు.

ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రాలకు మంచి జరిగేది. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైపోయింది. కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం పరిపాటిగా మారింది.

ఇది దురదృష్టకరం. పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటితే ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..’అని సీజేఐ చెప్పారు. 

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: హైకోర్టు సీజే 
‘కొత్త జ్యుడీషియల్‌ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుంది’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ శ్రీదేవి, జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ కె.లలిత, జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ సుమలత, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, కా ర్యదర్శులు కల్యాణ్‌రావు, సుజన్‌కుమా ర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement