జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ | District courts in the Indian Ocean 261 | Sakshi
Sakshi News home page

జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ

Published Sat, Dec 28 2013 12:47 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ - Sakshi

జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ

=జనవరి 5న పరీక్షలు
 =మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో నిర్వహణ
 =హైకోర్టు ఉత్తర్వులతో నియామకాలు
 =జిల్లాకు మరో ఐదు కొత్త న్యాయస్థానాలు
 =జిల్లా చీఫ్ జస్టిస్ చక్రధరరావు వెల్లడి

 
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని న్యాయస్థానాల్లో ఏడు విభాగాల్లో 261 పోస్టులను భర్తీ చేయనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు తెలిపారు. మచిలీపట్నంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్లు 52, ఫీల్డ్ అసిస్టెంట్లు 31, ఎగ్జామినర్లు 12, పర్సనల్ అసిస్టెంట్లు (స్టెనోగ్రాఫర్) 15, టైపిస్టులు 20, కాపీయిస్టులు 16, అటెండర్లు 115 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. మొత్తం పోస్టులకు సుమారు 60 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిశీలించి, అనర్హులను మినహాయించి అర్హులకు పరీక్ష పెడుతున్నట్టు తెలిపారు.

జూనియర్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. జనవరి ఐదున మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మిగిలిన పోస్టులవారికి ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్టులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటివరకు హాల్‌టిక్కెట్లు అందని అభ్యర్థులు జనవరి 3, 4 తేదీల్లో డూప్లికేట్‌వి పొందవచ్చని, ఇందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని తెలిపారు. వివరాలకు 08672 223089, 231335 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
 
పారదర్శకంగా పోస్టుల భర్తీ...
 
న్యాయస్థానాల్లో పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో 1,110 మంది పనిచేస్తున్నారని, ఇంకా 30 శాతం వరకు సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఆగస్టు 8 వరకు మొదట గడువిచ్చామన్నారు.

అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా చాలామంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించామని చెప్పారు. జిల్లాకు ఇటీవల ఐదు కోర్టులు మంజూరయ్యాయని, విజయవాడలో రెండు, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరంలలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా న్యాయస్థానాలు ప్రారంభించాల్సి ఉందని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement