AP: జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | AP: Notification for filling 3,432 posts in District Courts | Sakshi
Sakshi News home page

AP: జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Sun, Oct 23 2022 1:42 AM | Last Updated on Sun, Oct 23 2022 12:17 PM

AP: Notification for filling 3,432 posts in District Courts - Sakshi

సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు.

అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్‌సైట్‌ http://hc.ap.nic.inలో పొందుపరిచారు.  

వెబ్‌సైట్‌లలో దరఖాస్తులు.. 
ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్‌సైట్‌లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్‌ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్‌ 15 రాత్రి 11.59లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్‌ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తులను నవంబర్‌ 11 రాత్రి 11.59 లోపు ఆన్‌లైన్‌ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఆలపాటి గిరిధర్‌ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. 

హైకోర్టులో పోస్టుల ఖాళీలు.. 
ఆఫీస్‌ సబార్డినేట్‌–135, కాపీయిస్టు–20, టైపిస్ట్‌–16, అసిస్టెంట్‌–14, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌–13, ఎగ్జామినర్‌–13, కంప్యూటర్‌ ఆపరేటర్లు–11, సెక్షన్‌ ఆఫీసర్లు–9, డ్రైవర్లు–8, ఓవర్‌సీర్‌–1, అసిస్టెంట్‌ ఓవర్‌సీర్‌–1 మొత్తం 241 పోస్టులు. 

జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీలు.. 
ఆఫీస్‌ సబార్డినేట్‌–1,520, జూనియర్‌ అసిస్టెంట్‌–681, ప్రాసెస్‌ సర్వర్‌–439, కాపీయిస్టు–209, టైపిస్ట్‌–170, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–158, స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌–3)–114, ఎగ్జామినర్‌–112, డ్రైవర్‌(ఎల్‌వీ)–20, రికార్డ్‌ అసిస్టెంట్‌–9 మొత్తం 3,432 పోస్టులు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement