కుటుంబ వివాదాలకు సత్వర పరిష్కారం | Quick resolution of family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబ వివాదాలకు సత్వర పరిష్కారం

Published Sun, Mar 19 2023 1:50 AM | Last Updated on Sun, Mar 19 2023 3:28 PM

Quick resolution of family disputes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక సమీకృత కోర్టుల ద్వా­రా కుటుంబ వివాదాల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ చెప్పారు. కొన్నికేసుల విచారణ సాగుతున్నప్పుడు కక్షిదారుల కంటే న్యాయవాదులే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారని, అది సరికాదన్నారు. ఆయన శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కలసి హైదరాబాద్‌లో కుటుంబ వివాదాల సమీకృత కోర్టుల సముదాయాన్ని ప్రా­రం­భించారు.

 జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ మాట్లా డుతూ‘‘దేశంలో దాదాపు 11.4 లక్షల కుటుంబ వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ వివాదాల ప్రత్యేక కోర్టులు లేని రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే కల్పతరువుగా పేరు పెట్టుకున్న ఈ కోర్టులు కూడా కక్షిదారులు విడాకులు, మధ్యవర్తిత్వం ఇలా వారు ఏది కోరితే అది ఇస్తుంది. కానీ ఏది కోరుకున్నా అది వారి భవిష్య త్‌పై ప్రభావం చూపుతుందని మరవద్దు. కుటుంబ వివాదాలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం పెద్దలు గుర్తించాలి.

మనోవికాసం కక్షిదారులకు మాత్రమే కాదు. బుద్ధి సరిగా లేని వారందరికీ అవసరమే. న్యాయ­మూర్తులు, న్యాయవాదులు కేసు­లను చట్టాల ఆధారంగానే కాకుండా మనసుతో ఆలోచించి పరిష్కరించాలి’’అని రామసుబ్రమణియన్‌ సూచించారు. ఇక ‘‘తల్లిదండ్రుల వివాదాల కారణంగా పిల్లలు చిన్న వయసులో కుంగుబాటుకు గురవుతున్నారు. ఎంతోమంది కోర్టు తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని వస్తారు. తొలుత మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా వారి సమస్యను పరిష్కరించే ప్రయ­త్నం చేయాలి’’అని జస్టిస్‌ నరసింహ పేర్కొన్నారు.

‘‘1970లోనే కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1980 తర్వాత అది కార్యరూపం దాల్చి కోర్టుల ఏర్పాటు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 535 ఫ్యామిలీ కోర్టులు ఉండగా, అందులో 16 మాత్రమే తెలంగాణలో ఉన్నాయి’’అని జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ వివరించారు. 


కక్షిదారులకు ఉపయుక్తం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 
‘‘హైదరాబాద్‌లోని అన్ని ఫ్యామిలీ కోర్టులు ఒకే భవన సముదాయంలో ఉండటం కక్షిదారులకు ఉపయుక్తం. కోర్టులకు వచ్చే వారికి వాటిని చూడగానే సాధారణంగా వ్యతిరేక భావన కలుగుతుంది. అయితే మెడిటేషన్‌ రూం, ప్లే ఏరియా, మీడియేషన్‌ రూం ఇలా ఈ కోర్టును చూస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుంది’’అని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ చెప్పారు. దాదాపు 5,900 కేసులు ఈ కోర్టులకు బదిలీ కానున్నాయని జస్టిస్‌ నవీన్‌రావు వెల్లడించారు.

 కార్యక్రమంలో ఇతర హైకోర్టుల న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, నల్సార్‌ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, తెలంగాణ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement