జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ ! 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం | Free Judicial Service All Districts Telangana CJ UJJAL BHUYAN | Sakshi
Sakshi News home page

జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ !  23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం

Published Sun, Jan 1 2023 8:48 AM | Last Updated on Sun, Jan 1 2023 4:01 PM

Free Judicial Service All Districts Telangana - Sakshi

సాక్షి, కామారెడ్డి: పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించే న్యాయసేవాధికార సంస్థలు కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగానే కొనసాగాయి. అయితే సేవలు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వర్చువల్‌గా ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రారంభించింది. తరువాత కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లు, జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. అయితే న్యాయస్థానాలకు సంబంధించి విభజన ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది.

ఇటీవలే కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. అంతేగాక కొత్త జిల్లాల్లో పోక్సో కేసుల విచారణకు కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ట్రిబ్యునళ్లు, కోర్టులు రావలసి ఉంది. అవి కూడా త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త జిల్లాల్లో న్యాయస్థానాల సముదాయాల నిర్మాణానికి భూసేకరణ కూడా చేపట్టారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయసేవలు, సహాయం అందనుంది. అంతేగాక చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారిని కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తారు.
చదవండి: Telangana: గ్రూప్‌–4లో 8,039 పోస్టులే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement