law service
-
జిల్లాకో న్యాయసేవాధికార సంస్థ ! 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, కామారెడ్డి: పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించే న్యాయసేవాధికార సంస్థలు కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగానే కొనసాగాయి. అయితే సేవలు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్‌గా ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రారంభించింది. తరువాత కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. అయితే న్యాయస్థానాలకు సంబంధించి విభజన ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. ఇటీవలే కొత్త జిల్లాల్లో జిల్లా న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. అంతేగాక కొత్త జిల్లాల్లో పోక్సో కేసుల విచారణకు కోర్టులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ట్రిబ్యునళ్లు, కోర్టులు రావలసి ఉంది. అవి కూడా త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త జిల్లాల్లో న్యాయస్థానాల సముదాయాల నిర్మాణానికి భూసేకరణ కూడా చేపట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచిత న్యాయసేవలు, సహాయం అందనుంది. అంతేగాక చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే వారిని కౌన్సెలింగ్ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తారు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బాలల హక్కులు, వారికున్న చట్టాలపై (జువైనల్) పోలీసులు, న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, బాలల సంరక్ష అధికారులు, జువైనల్ యూనిట్ల అధికారులకు జువైనల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎంఏ సోమశేఖర్, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ, జేసీ–2 రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పెను మార్పులతో బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బాలలను చిన్నతనంలోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి రఘురామ్, ఆరో అదనపు జిల్లా జడ్జి వీ.శేషుబాబు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, ప్రభుత్వ న్యాయవాదులు, జైలు అధికారులు పాల్గొన్నారు.