
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు మధ్య విభేదాల నేపథ్యంలో తాజాగా జరుగనున్న ఓ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తమిళిసై ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణస్వీకారం చేయించేది గవర్నరే. ఇది రాజ్‌భవన్‌లో జరగడం సంప్రదాయం.
ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు హాజరుకావాలి. మరి గవర్నర్‌తో విభేదాలతో కొంతకాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తలపెట్టిన టీ–హబ్ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
నిజానికి ఈ భవనాన్ని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ దానిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో.. వ్యూహాత్మకంగానే కార్యక్రమాన్ని మార్చినట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకుముందు రెండుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
దాదాపు ఏడాది నుంచి..
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలతో విభేదాలు తలెత్తి.. ఒకదశలో పరస్పర విమర్శల వరకు వెళ్లింది. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయాలన్న ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టిననాటి నుంచి రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు పొసగడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు పది నెలలుగా సీఎం రాజ్‌భవన్ గడప తొక్కలేదు కూడా. గవర్నర్ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు నేరుగానే ఆరోపణలు చేశారు.
శాసన మండలి ప్రొటెం చైర్మన్ నియామక విషయంలోనూ గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదలను పక్కనపెట్టి.. పూర్తిస్థాయి చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించడం కూడా దూరాన్ని పెంచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దిన వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, సీఎం సహా మంత్రులు, సీఎస్, డీజీపీ కూడా హాజరుకాకపోవడంతో గవర్నర్, సీఎం మధ్య అంతరం మరింత పెరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదన్న సాంకేతిక కారణం చూపుతూ గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. దీనిపై మనస్తాపం చెందిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం గవర్నర్‌కు మర్యాద ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు.
మరోవైపు గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆమెకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలకలేదు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర హోంశాఖకు పంపారు. తాజాగా రాజ్‌భవన్‌లో గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించడంపైనా టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వెళతారా, లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
టీ–హబ్ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు!
రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లే అంశంపై చర్చ నేపథ్యంలో మంత్రి కె.తారకరామారావు చేసిన ట్వీట్ కూడా ఆసక్తి రేపింది. ‘‘కొత్త టీ–హబ్ భవనాన్ని జూన్ 28న ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నాను. హైదరాబాద్ నగర నూతన ఆవిష్కరణల ఎకో సిస్టమ్‌కు దీని ద్వారా గొప్ప ఊతం లభించనుంది.’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్‌భవన్ కార్యక్రమం జరిగే సమయంలోనే టీ–హబ్ ప్రారంభోత్సవం ఉండటం గమనార్హం.