హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ | Justice Ujjal Bhuyan Appointed Chief Justice Of Telangana High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

Published Mon, Jun 20 2022 1:44 AM | Last Updated on Mon, Jun 20 2022 10:11 AM

Justice Ujjal Bhuyan Appointed Chief Justice Of Telangana High Court - Sakshi

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఐదు హైకోర్టులకు నూతన సీజేలను నియమించాలని, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలంటూ మే 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

ఆ సిఫార్సులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం పేర్కొంది. జస్టిస్‌ భూయాన్‌ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆయనకు ఇదే కోర్టులో పదోన్నతి లభించింది. కాగా, 2021, అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయ్యారు.

1991లో బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌..
జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. అస్సాంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అస్సాం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్‌ భూయాన్‌ డాన్‌ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్‌ కాలేజీలో ప్లస్‌ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు.

అస్సాం బార్‌ కౌన్సిల్‌లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. ఇతర పలు రాష్ట్రాల బార్‌ కౌన్సిల్స్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్‌ 6న సీనియర్‌ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. అసోం అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగారు.

మిజోరాం రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా 2011, అక్టోబర్‌ 17న నియమితులయ్యారు. 2019, అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా భూయాన్‌ కొనసాగుతున్నారు.

నాలుగేళ్లలో ఐదో సీజే..
జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ రాష్ట్ర హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్‌ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement