జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒక్కరోజే సీజేగా కొనసాగనున్నట్లు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నవీన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అయితే జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు. మరుసటి రోజు నుంచి సీనియారిటీలో ముందు వరుసలో ఉన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
జస్టిస్ లలిత, జస్టిస్ రమేశ్ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్‌ల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ డి.రమేశ్‌ను, తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ లలిత కన్నెగంటిని బదిలీ చేయాలంటూ గత ఏడాది నవంబర్ 24న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే.
ఈ సిఫార్సును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్వీట్ చేశారు. అలాగే ఈ అంశంపై న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
చదవండి: కేజీఎఫ్ స్టైల్‌లో వీడియో: వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment