సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది.
దేశంలోనే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌ను కూల్చి అక్కడ సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చి, చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తుచేశారని తెలిపారు.
కష్టపడితేనే న్యాయవాదిగా గుర్తింపు: సీజే
న్యాయవాద వృత్తిలో షాట్‌కట్స్ ఉండవని, కష్టపడిన వారికే మంచి గుర్తింపు లభిస్తుందని జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. యువ న్యాయవాదులు కష్టపడాలని, సీనియర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో కూడా న్యాయమూర్తుల సహకారంతో కేసులను విచారించి ప్రజలకు సత్వర న్యాయం అందించామని తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ పనిచేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వివరించారు. న్యాయమూర్తులతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, తన కార్యాలయ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమా చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment