ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ‘ఇండియా’ కూటమి సంఘీభావం
ఒక్కతాటిపైకి రానున్న విపక్ష నేతలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ
దేశంలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటోందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆందోళన
కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆప్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.
కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు.
కేవలం రాజకీయ సభ కాదు
ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment