Ramlila Maidan
-
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
మోదీ ఆశీస్సులు కావాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన రాజకీయ ప్రత్యర్థులను క్షమించేశా నన్నారు. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తనను తాను ఢిల్లీ కొడుకునని చెప్పుకున్నారు. ఈ విజయం తనది కాదని, ప్రతి ఢిల్లీ పౌరుడిదని అన్నారు. గతంలో కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు. ‘హమ్ హోంగే కామ్యాబ్..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపి పాడి కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ
-
ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణుల అంచనా. ఉగ్రవాదుల నుంచి ప్రధానికి ముప్పు ఉన్న నేపథ్యంలో ఎన్ఎస్జీతో పాటు దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ శనివారం భద్రత ఏర్పాట్ల గురించి పలు భేటీలు నిర్వహించారు. ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లతో పాటు సమీప భవనాల మీద స్నిప్పర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ఈ సారి పక్కా? ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పాగా వేయడానికి గట్టి కృషి చేస్తున్నామంటూ ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయోల్ శనివారం వెల్లడించారు. ఇదికాక, ఢిల్లీలోని అనధికార కాలనీలలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులను కల్పిస్తూ ఈ నెల 4వ తేదీన పార్లమెంటులో బిల్లు పాసైంది. దీంతో 1731 కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 40 లక్షల మంది ఓటర్లు మోదీ పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. మోదీకి కృతజ్ఞతగా 11 లక్షల మంది సంతకాలతో కూడిన ప్రతిని ఈ సభలో ఆయనకు బహుకరిస్తున్నారు. అంతేకాక, మోదీ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో నిర్వహిస్తున్న మొదటి ఎన్నికల సభ ఇది. సభ నేపథ్యంలో ఢిల్లీ - గుర్గావ్ రహదారిపై ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరకంగా పలు నిరసన ప్రదర్శనలు జరుగుతుండడంతో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకొంది. చదవండి : అభివృద్ధిపై దృష్టి పెట్టండి -
30న కాంగ్రెస్ ‘భారత్ బచావో’ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘భారత్ బచావో ర్యాలీ’ని చేపట్టనుంది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీఎస్టీ అమలులో వైఫల్యాలు, ఎన్డీయే సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని వార్‌రూమ్‌లో ఏఐసీసీ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలపైనా చర్చించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టని రాష్ట్రాల్లో ఆందోళనలను 25 తేదీలోగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 30న ఢిల్లీలో ‘భారత్ బచావో ర్యాలీ’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‡రెడ్డి, సంపత్‌కుమార్, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 1200 మందిని తరలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
‘పండుగలు మన విలువలకు ప్రతీక’
సాక్షి, న్యూఢిల్లీ : మన పుణ్యభూమిలో పండుగలు ఘనమైన విలువలు, సామాజిక జీవితం, విద్యలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పండుగలు మనల్ని ఏకంచేసి అందరినీ మమేకం చేస్తాయని, అవి మనలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, నూతన స్వప్నాలను నింపుతాయని వ్యాఖ్యానించారు. దసరా సందర్భంగా ప్రధాని మోదీ రాంలీలా మైదానంలో జరిగిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో పౌరులంతా ఈ ఏడాది ఒక సమున్నత లక్ష్యాన్ని సాధించాలని పిలుపు ఇచ్చారు. ఆహార వృధాను అరికట్టడం, ఇంధన ఆదా, నీటి పొదుపు లక్ష్యంగా మనం ముందుకుసాగాలని కోరారు. -
మజ్బూత్? మజ్బూర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్బూర్) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్బూత్) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు. అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే.. దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రైతులే నవభారత చోదక శక్తులు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పేర్కొంది. స్థిరత్వమా? అస్థిరతా? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. -
కిసాన్ మార్చ్‌లో రాహుల్, కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం శూన్య హామీలు మినహా రైతులకు ఎలాంటి మేలూ చేయలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన కిసాన్ మార్చ్‌లో రాహుల్ పాల్గొన్నారు. మద్దతు ధర పెంపు, బోనస్‌లపై రైతులకు వాగ్ధానం చేసిన మోదీ ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తే రైతు రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాము రైతుల పక్షాన ఉండి వారి తరపున పోరాటం చేస్తామని రాహుల్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. మీ శక్తితోనే ఈ దేశం బలోపేతమైందని అన్నారు. దేశం నలుమూలల నుంచీ రాజధానికి చేరుకున్న వేలాది రైతులు పార్లమెంట్ స్ర్టీట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘీభావ సభలో పలువురు నేతలు రైతులకు బాసటగా నిలిచారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో రైతులు మోదీ సర్కార్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని రైతుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేథా పాట్కర్ ఆరోపించారు. రైతులు, గిరిజనుల భూములను బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. -
దేశ రాజధానికి పోటెత్తిన రైతులు
సాక్షి,న్యూఢిల్లీ : రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు సహా తమ డిమాండ్ల సాధనకు రెండు రోజుల పాటు నిరసన తెలిపేందుకు దేశవ్యాప్తంగా రైతులు గురువారం వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. రాంలీలా మైదాన్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకూ శుక్రవారం జరిగే ర్యాలీకి ఏపీ, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధాని చేరుకున్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికుల సంఘాలతో కూడిన అఖిల భారత రైతు సంఘర్ష్ సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు రైతులు బస్సులు, రైళ్లు సహా పలు మార్గాల్లో రాజధానికి పోటెత్తారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు, పంజాబ్, హర్యానా, యూపీ నుంచి రైతులు గురువారం ఉదయం నుంచే ఢిల్లీకి చేరుకున్నారని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. నగరం నలుమూల నుంచి రాంలీలా మైదాన్‌కు రైతులు తరలివస్తుండటంతో ఢిల్లీలో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్షకు పైగా రైతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రైతు ర్యాలీ సందర్భంగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను సిద్ధం చేశారు. ట్రాక్టర్లు, ట్రక్కులను నగరంలోకి అనుమతించమని ఘజియాబాద్ ఎస్పీ ఉపేంద్ర అగర్వాల్ స్పస్టం చేశారు. అడ్డుకుంటే అంతే.. తమ ర్యాలీని అడ్డుకుంటే పార్లమెంట్ వరకూ నగ్న ప్రదర్శన చేపడతామని తమిళనాడుకు చెందిన రైతులు హెచ్చరించారు. ఢిల్లీకి చేరుకున్న 1200 మంది సభ్యులతో కూడిన రైతుల బృందం శుక్రవారం నాటి ర్యాలీకి సన్నద్ధమైంది. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు తమ సహచరుల పుర్రెలతో వీరు దేశ రాజధానికి చేరుకోవడం అలజడి రేపుతోంది. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది మంది రైతుల పుర్రెలతో గత ఏడాది జంతర్ మంతర్ వద్ద వీరు నిరసనలకు దిగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ సంఘానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకుంటున్నారని రైతు సంఘం నేత అయ్యకన్ను చెప్పారు. గత ఐదేళ్లుగా తాము కరువును ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు రైతుల కోసం చేస్తున్నదేమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘చరిత్రలో నిలిచిపోయేలా రైతుల ఆందోళన’
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధరల గ్యారెంటీ, రుణ విముక్తి చట్టాన్ని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అన్నదాతల పదఘట్టనలతో మార్మోగనుంది. ఈనెల 29, 30 తేదీలలో ఢిల్లీలో రైతుల భారీ కవాతుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా రైతులు ఈ కవాతుకు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వివిధ రైళ్లలో ఇప్పటికే బయలు దేరారు. దేశంలోని 208 రైతు, రైతు కూలీ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఏర్పాటు చేసుకున్న అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు ఈ ర్యాలీ జరుగుతుంది. కరవు, దుర్భిక్షం ఒకపక్క గిట్టుబాటు ధరలు లేక మరోపక్క రైతులు అల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు కూడళ్లు– బిజీ వాసన్, మంజూ కా తిలా, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుంచి రైతులు ఈనెల 29న ఈ కిసాన్ విముక్తి మార్చ్ ప్రారంభించి రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. 30వ తేదీ ఉదయం రైతులు రామలీలా మైదానం నుంచి పార్లమెంటుకు కవాతు ప్రారంభిస్తారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద రైతులను ఉద్దేశించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగిస్తారు. ప్రధాన డిమాండ్లు రెండు: ఢిల్లీలో గత ఏడాది నవంబర్లోనూ రైతులు ప్రత్యామ్నాయ పార్లమెంటు నిర్వహించి రైతు సమస్యలను చర్చించి ఓ ముసాయిదా తయారు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐకేఎస్‌సీసీ రెండు ప్రైవేటు బిల్లులను తయారు చేసింది. వాటిలో ఒకటి.. రైతుల రుణ విముక్తి బిల్లు–2018, రెండోది వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు, కనీస మద్దతు ధరల గ్యారంటీ బిల్లు–18. ఈ బిల్లులను కొందరు సభ్యులు రాజ్యసభలో, లోక్‌సభలోనూ ప్రవేశపెట్టారు. 21 రాజకీయ పార్టీలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా రైతు సమస్యలను చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ రెండు బిల్లులపై చర్చ జరపాలన్నది ఏఐకేఎస్‌సీసీ డిమాండ్. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, శాశ్వత రుణ విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర రైతులు ముంబై వరకు లాంగ్‌మార్చ్ నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతు పోరాటాలు జయప్రదం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది..: ఈ మహాకవాతుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి 300 మంది, విజయవాడ నుంచి 400 మంది, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి మరో 400 మంది బయలుదేరి వెళ్లారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీకి వెళుతున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వెళుతున్నట్లు సంఘాల నేతలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే వారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా నుంచి ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. మార్గంమధ్యలో మహారాష్ట్ర రైతులు ఈ ర్యాలీలో కలుస్తారు. ‘రైతాంగంపై నోట్ల రద్దు ప్రభావం’ సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం భారత రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్దావలే అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్‡్ష(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 70 రైతు సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. మీడియా సమావేశంలో అశోక్ దావలే మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది మంది రైతులతో ఢిల్లీ రాంలీలామైదాన్‌లో ఈనెల 29, 30 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ మాట్లాడుతూ పార్లమెంటులో సీపీఎం ఎంపీలు ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకుఅన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడనున్నాయని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్రయాదవ్ తెలిపారు. జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ రైతులను విస్మరించడం విచారకరమని ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్ అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను విస్మరించడం వల్లే రైతన్న అప్పులఊబిలో కూరుకుపోయారని సామాజిక వేత్త మేథాపాట్కర్ చెప్పారు. -
అక్రమ వలసదారులను గుర్తిస్తాం
న్యూఢిల్లీ: తమ పార్టీకి మళ్లీ అధికారమిస్తే దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. వలసదారులకు అండగా ఉంటూ కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం పార్టీ ర్యాలీ ‘పూర్వాంచల్ మహాకుంభ్’లో ఆయన మాట్లాడారు. ‘2019లో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం దేశంలో అక్రమ వలసదారుల గుర్తింపును మా పార్టీ చేపడుతుంది. అక్రమ వలసదారులు దేశానికి చెద పురుగుల్లా తయారయ్యారు. వారిపై చర్యలు తీసుకుంటే దేశభక్తులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, రాహుల్ బాబా, కేజ్రీవాల్ మాత్రం గగ్గోలు పెడతారు. ఎందుకంటే వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. అక్రమ వలసలపై రాహుల్, కేజ్రీవాల్‌లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన మహా కూటమికి ఒక విధానం లేదు, నేతా లేడు. ఆ కూటమికి నాయకుడు కావాలని రాహుల్ అనుకుంటున్నారు. కానీ, శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ అందుకు ఒప్పుకోరు’ అని అన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ చేపట్టాల్సిన నాలుగు భారీ ర్యాలీల్లో పూర్వాంచల్ మహాకుంభ్ ఒకటి. సీఎంగా పరీకరే కొనసాగుతారు: అమిత్‌షా గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకరే కొనసాగుతారని అమిత్ షా స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వెల్లడించారు. ‘మనోహర్ పరీకరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గోవా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశాం’ అని తెలిపారు. ఆయనకు మెజారిటీ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో ఆయన కొనసాగింపుపై అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. -
రాంలీలా మైదాన్‌కు అటల్జీ పేరుపై..
సాక్షి, న్యూఢిల్లీ : రాంలీలా మైదాన్‌ను మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మైదాన్గా పేరు మార్చడం లేదని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తెలిపింది. రాంలీలా మైదాన్ పేరును వాజ్‌పేయి మైదాన్గా మార్చడం ఓట్లు రాల్చదని, మోదీ పేరుతో ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా లేరని..ఆయన పేరును మార్చాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన క్రమంలో ఎన్డీఎంసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రాంలీలా మైదాన్‌కు అటల్జీ పేరును పెట్టాలనే ప్రతిపాదన లేదని నార్త్ ఢిల్లీ మేయర్ అధేష్ గుప్తా స్పష్టం చేశారు. మరోవైపు రాంలీలా మైదాన్ పేరు మార్చే ప్రతిపాదన లేదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ పేర్కొన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో ఈ వదంతులు సృష్టిస్తున్నారని, తాము రామ భక్తులమని రాంలీలా మైదాన్ పేరు మార్చే ప్రసక్తే లేదన్నారు. ఎన్డీఎంసీ కౌన్సిలర్లు కొందరు మైదానానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని కోరినట్టు వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని చారిత్రక రాంలీలా మైదాన్ రాజకీయ పార్టీల సభలకు, కార్యక్రమాలకు వేదికవుతోంది. రాజకీయ పార్టీల కార్యకలాపాలతో పాటు ప్రతిఏటా ఇక్కడ రామ్‌లీలా నిర్వహిస్తారు. -
రామ్‌లీలా మైదానానికి మాజీ ప్రధాని పేరు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ పేరు మార్పు చేయాలని పేర్కొంది. 93 ఏళ్ల వాజ్‌పేయి దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 16న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తమైంది. కాగా వాజ్‌పేయి గౌరవార్థం రామ్‌లీల మైదానానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రతి ఏడాది రామ్‌లీల ఉత్సవాలు జరిగే ఈ మైదానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. రాజకీయ సభలు, ర్యాలీలు, ఉత్సవాలు, వినోదకార్యక్రమాలకు ఈ మైదానం వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి గావాజ్‌పేయి ఇక్కడ అనేక సార్తు ప్రసంగించారు. ఆయన ప్రసంగాలు వినేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. చత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే కొత్త రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా రామ్‌లీలా మైదానం పేరు మార్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పేరు మార్చి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని, అది సాధ్యం కాదన్నారు. బీజేపీకి ఓట్లు పడాలంటే మార్చాల్సింది మైదానం పేరు కాదని ప్రధాన మంత్రి పేరును మార్చాలని( నరేంద్రమోదీని తొలగించాలని) ఎద్దేవా చేశారు. -
ఇక అన్ని ఎన్నికల్లో గెలుపు మాదే
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు, 2019 సాధారణ ఎన్నికల్లోనూ విజయం తమదేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్ చేపట్టిన జన ఆక్రోశ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు 2014లో తమ పార్టీపై అసత్యాలు ప్రచారం చేశాయని, అయితే వాస్తవాలు ఇప్పుడు బయటకొస్తున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. అవినీతి, రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం తదితర అంశాలపై దేశ కాపలాదారు (చౌకీదారు)గా చెప్పుకుంటున్న ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. జడ్జి లోయా కేసు, వ్యవసాయ సంక్షోభంపై ప్రధాని కనీసం నోరువిప్పలేదని రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు కూడా మోదీ ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టారు. ‘ఇటీవలి చైనా పర్యటనలో డోక్లాంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏ తరహా ప్రధాని?’ అని రాహుల్ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ మనకు నిరుద్యోగం, గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీని తప్పుపడుతూ)ను ఇచ్చారు. బేటీ పఢావో.. బేటీ బచావో అని చెప్పే ఆయన హయాంలోనే బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి (ఉన్నావ్ రేప్) పాల్పడ్డారు’ అని విమర్శలు గుప్పించారు. బీజేపీని ఓడిస్తాం: రాహుల్ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్లు, యువ నేతల్ని కాంగ్రెస్ పార్టీ ఒకేలా గౌరవిస్తుందని, పార్టీలో వ్యక్తమయ్యే విభిన్న అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ చేతులకు ముస్లింల రక్తపు మరకలు అంటాయని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పార్టీ విధానాలకు విరుద్ధంగా సల్మాన్ ఖుర్షీద్ కొన్ని రోజుల క్రితం తన అభిప్రాయాల్ని వెల్లడించారు. పార్టీలో విభిన్న అభిప్రాయాలు ఉండాలన్న విషయాన్ని నేను అంగీకరిస్తా. పార్టీకి లబ్ధి చేకూర్చే వేర్వేరు అభిప్రాయాల్ని అనుమతిస్తా. అయితే ఆర్ఎస్ఎస్పై పార్టీ పోరాడుతున్న ఈ సమయంలో మనం ఐక్యంగా, స్నేహభావంతో సాగాలి’ అన్నారు. ఆ సమయంలో ఖుర్షీద్ చప్పట్లు కొట్టడం గమనార్హం. రాజ్యాంగ సంస్థల్ని బలహీనపర్చారు: సోనియా తన వాగ్దానాల్ని నిలబెట్టుకోకుండా బీజేపీ ప్రజల్ని మోసగించిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి లోతుగా పాతుకుపోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ‘రాజ్యాంగ సంస్థల్ని బలహీన పరచడంలో ఏ అవకాశాన్ని బీజేపీ వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి పార్టీల్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇటీవలి పరిణామాలు.. గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అందరినీ వంచించారనీ దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆందోళనలో యువత: మన్మోహన్ మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని బలహీన పరచడంతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గత నాలుగేళ్లలో అన్ని వర్గాల మధ్య విద్వేషాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కనుమరుగవడంతో యువత ఆందోళనతో ఉంది. దేశమంతా నైరాశ్యం అలముకుంది’ అని అన్నారు. మానస సరోవర యాత్రకెళ్తా కర్ణాటక ఎన్నికల అనంతరం టిబెట్‌లోని కైలాశ్ మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకుంటున్నానని రాహుల్ తెలిపారు. ఈ ఆలోచన తనకు ఇటీవల తాను ప్రయాణిస్తున్న విమానం సాంకేతికలోపంతో నేలవైపు దూసుకెళ్తున్న సమయంలో వచ్చిందన్నారు. ‘రెండ్రోజుల క్రితం కర్ణాటకకు విమానంలో వెళ్తున్నాం. ఒక్కసారిగా విమానం ఒక కుదుపునకు లోనైంది. ఎడమవైపు ఒరిగిపోయి, వేగంగా నేలవైపు దూసుకుపోసాగింది. 8 వేల అడుగులు వేగంగా కిందకు దిగింది. ఇక అంతా అయిపోయిందనే అనుకున్నాను. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆది దేవుడైన శివుడు జ్ఞాపకమొచ్చాడు. ఆ క్షణంలోనే కైలాశ్ మానస సరోవర యాత్ర చేయాలన్న తలంపు వచ్చింది. అందుకే ఇప్పుడు మీ అనుమతి కోరుతున్నా. కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక 10–15 రోజులు సెలవు తీసుకుని, మానస సరోవర యాత్రకు వెళ్తాను’ అని రాహుల్ వివరించారు. రాహుల్‌వి పగటి కలలే: బీజేపీ ఇకపై అన్ని ఎన్నికల్లో విజయం తమదేనంటూ రాహుల్ పగటి కలలు కంటున్నారని బీజేపీ విమర్శించింది. నిరుత్సాహంలో ఉన్న పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో జన ఆదేశ్‌తో(ప్రజా తీర్పు) వారు అధికారం కోల్పోయారు. ఇప్పుడు జన ఆక్రోశ్(ప్రజాగ్రహం)కు ప్రతినిధులుగా నటిస్తున్నారు. నిజానికిది ‘పరివార్ ఆక్రోశ్’ ర్యాలీ’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. -
29న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు, సమాజంలో అసహనం, ఆందోళనలపై ఢిల్లీలో ఈ నెల 29న నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఎన్డీఏ నాలుగేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. వీటికి నిరసనగా రామ్‌లీలా మైదాన్ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీసిందని పార్టీ అధ్యక్షుడు రాహుల్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. -
సీఎంపై చెప్పుదాడి!
-
హజారే దీక్ష విరమణ.. సీఎంపై చెప్పుదాడి!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటుకోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరో రోజులపాటు చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను ముగించారు. అవినీతి వ్యతిరేక పోరాటయోధుడిగా పేరొందిన 80 ఏళ్ల హజారే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహించారు. సీఎం ఫడ్నవిస్ స్వయంగా రాంలీలా మైదానానికి వచ్చి.. ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతుండగా.. జనంలోంచి ఓ వ్యక్తి ఆయన లక్ష్యంగా చెప్పు విసిరారు. అది ఫడ్నవిస్‌కు దూరంగా పడింది. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని హజారే డిమాండ్ చేశారు. ఆరు నెలల్లోగా అంటే ఆగస్టులోగా తన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే సెప్టెంబర్‌లో మళ్లీ ఆందోళనకు ఆయన హెచ్చరించారు. -
రామ్‌లీలా మిఠాయి
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో రావణ దహనం తర్వాత చేసుకునే మిఠాయిల సంబరం ఇదిగో...! మోతీచూర్ లడ్డు కావలసినవి: సెనగపిండి – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; పాలు – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు; నెయ్యి – డీప్ ఫ్రైకి తగినంత; ఏలకుల పొడి – టీ స్పూను; బాదం తరుగు – టేబుల్ స్పూను; పిస్తా తరుగు – టేబుల్ స్పూను తయారి: ∙పంచదారకు మూడు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చే వరకు ఉడికించి, పక్కన ఉంచాలి పాలు జత చేసి పొంగే వరకు ఉంచి, దించేయాలి ∙మిఠాయి రంగు జత చేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, మూడు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. (ఇష్టపడేవారు మిఠాయి రంగు కలుపుకోవచ్చు) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి ∙సన్న రంధ్రాలున్న చట్రంలో సెనగ పిండి పోస్తూ సన్న బూందీ నేతిలో పడేలా కదుపుతుండాలి ∙వేయించిన బూందీని బయటకు తీయాలి ∙ఈ విధంగా మొత్తం చేసుకున్నాక, పంచదార పాకంలో వేసి కలపాలి ఏలకుల పొడి వేసి బాగా కలిపి చేతితో లడ్డు తయారుచేయాలి ∙(ముత్యం పరిమాణంలో బూందీ తయారుచేసి, లడ్డూ చేస్తాం కనుక, ఈ లడ్డూను మోతీచూర్ లడ్డూ అంటారు). షీరా కావలసినవి: పాలు – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; రవ్వ – కప్పు; బాదం తరుగు – టేబుల్ స్పూను; ఎండు ద్రాక్ష – టేబుల్ స్పూను; నెయ్యి – అర కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు తయారి: ముందుగా పాలు మరిగించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి వే డయ్యాక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, బొంబాయి రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వే పాలు పోసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ∙పంచదార వేసి మరోమారు ఉyì కించాలి ∙చివరగా బాదం తరుగు, నెయ్యి వేసి మరోమారు కలిపి దించేయాలి. కాజూ కత్లీ కావలసినవి: జీడిపప్పు – 3 కప్పులు; పంచదార పొడి – 10 టేబుల్ స్పూన్లు; పాల పొడి – టీ స్పూను; రోజ్ ఎసెన్స్ – పావు టీ స్పూను; సిల్వర్ ఫాయిల్ – చిన్న షీటు తయారి: ∙జీడిపప్పులను తగినన్ని నీళ్లలో సుమారు గంట సేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, పంచదార పొడి, పాల పొడి జత చేసి, మిక్సీలో వేసి ముద్దగా చేసి తీసేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఈ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతూ ఉడికించి, దింపేయాలి ∙తరవాత కొద్దిసేపు చేతితో మర్దించాలి ∙రోజ్ ఎసెన్స్ జత చేయాలి. ∙ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఉడికిన జీడిపప్పు మిశ్రమాన్ని పళ్లెంలో పోసి, సమానంగా పరిచి, పైన సిల్వర్ ఫాయిల్ అతికించాలి. ∙కొద్దిగా గట్టిపడగానే డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఘేవార్ కావలసినవి: మైదా పిండి – 4 కప్పులు; నెయ్యి – 2 కప్పులు; పాలు – కప్పు; నీళ్లు – 4 కప్పులు; బాదం తరుగు – టేబుల్ స్పూను; పిస్తా తరుగు – టేబుల్ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పంచదార – 2 కప్పులు; మిఠాయి రంగు – చిటికెడు తయారి: ∙మిక్సింగ్ బౌల్లో మైదా, నెయ్యి, పాలు, మూడు కప్పుల నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి ∙మిగిలిన ఒక కప్పు నీళ్లలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి, ఈ రంగు నీళ్లను పిండిలో పోసి మృదువుగా కలుపుకోవాలి ∙స్టీలు లేదా అల్యూమినియం గిన్నెలో సగ భాగానికి నెయ్యి పోసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙నెయ్యి వేడి కాగానే, కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమాన్ని గ్లాసుతో పోయాలి. మధ్యలో పిండి అలాగే నిలిచి ఉండేట్లు సన్నని మంట మీద వేడి చేయాలి ∙మరో గ్లాసు పిండి తీసుకుని దాని మీదే మళ్లీ పోసి, ఈ సారి కూడా పిండి మ«ధ్యలో నిలిచి ఉండే వరకు తక్కువ మంట మీద వేడి చేయాలి ∙ఘేవర్ రెడీ అయినట్లే ∙మరొక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి తీగపాకం వచ్చవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఘేవర్‌ను పంచదార పాకంలో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారాక కుంకుమ పువ్వు నీళ్లు చిలకరించాలి ∙బాదం, పిస్తా, ఏలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
దసరా.. చలో రామ్‌లీలా! - రాశీ ఖన్నా
విజయదశమి వచ్చిందంటే ఢిల్లీ అంతా సందడి నెలకొంటుంది. ఢిల్లీలో దసరా పండగను బాగా జరుపుకుంటారు. చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసేవాళ్లం. పూజలో చెప్పే కథలను శ్రద్ధగా వినేదాన్ని. ఆ తర్వాత రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి వెళ్లేవాళ్లం. హీరోయిన్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లడానికి కుదరడంలేదు. దసరా సమయంలో ఇంట్లో అందర్నీ కలిసే అవకాశం తక్కువసార్లు లభించింది. ఇప్పుడు అమ్మానాన్నలు కూడా హైదరాబాద్ వచ్చేశారు. ఈరోజు నా కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ. త్వరగా షూటింగ్ ముగించుకుని సాయంత్రం పూజకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నా. -
మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం వ్యాపారులు కదం తొక్కారు. బంగారం కొనుగోళ్లు, ఉత్పత్తి వ్యవహారంలో కొత్త నిబంధనలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ రాంలీలా మైదానంలో ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పోస్టర్లను ప్రదర్శించారు. మోదీ, జైట్లీ బంగారు నెక్లెస్ లు, చెవికమ్మెలు, ముక్కెరలు ధరించినట్టుగా పోస్టర్లలో చూపించారు. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొంటే పాన్ కార్డును తప్పని చేశారు. అలాగే, ఉత్పత్తి మీద ఎక్సైజ్ సుంకం 1 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బంగారం వర్తకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దుకాణాలు మూసేసి గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. -
సోనియా ర్యాలీ ఢిల్లీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపనుందా!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే నెల రామ్‌లీలామైదాన్‌లో నిర్వహించే ర్యాలీ.. వరుస పరాజయాలతో నిరాశలో మునిగిపోయిన కార్యకర్తలకు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక సీటు గెలవలేక పోయింది. దీంతో ఢిల్లీలో దాదాపు కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు డీలా పడకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో పాటు భూసేకరణ బిల్లుకు నిరసనగా రామ్‌లీలామైదాన్‌లో ఏప్రిల్ 12న భారీ ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ర్యాలీకి హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రైతులతో పాటు ఢిల్లీకి చెందిన రైతులు కూడా భారీ స్థాయిలో పాల్గొనేలా చేయాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఢిల్లీలో దాదాపు 25 వేల రైతు కుటుంబాలు ఉన్నాయని అంచనా. వీరిని ర్యాలీలో పాల్గొనేలా చేసే భాధ్యతను ఢిల్లీ కాంగ్రెస్ స్వీకరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త పని లభించింది. ర్యాలీకి ముందు ఢిల్లీ కాంగ్రెస్ నగరంలో కిసాన్ రథ్ యాత్ర జరపనుంది. ఈ యాత్ర బుధవారం లేదా గురువారం ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఉదయం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో రథ యాత్ర నిర్వహించి సాయంత్రం బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులెక్కువగా ఉన్న నరేలా, మెహ్రోలీ, నజఫ్ఘడ్, ముండ్కా, బవానా, పాలం, బిజ్వాసన్, చత్తర్పుర్ వంటి ప్రాంతాల గుండా జరిగేలా ఈ రథ యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ రథయాత్ర, బహిరంగసభల్లో పాల్గొంటారు. పింఛన్లు చెల్లించనందుకు నిరసన వితంతువులు, వృద్ధులు, శారీరక వికలాంగులకు పింఛన్లు చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ మంగళవారం ఎమ్సీడీ ముఖ్య కార్యాలయం సివిక్ సెంటర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను చేధించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. నిధుల కొరత కారణంగా తమకు గత పది నెలలుగా పింఛన్లు అందడం లేదని వృద్ధులు, వితంతువులు ఆరోపించారు.