సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధరల గ్యారెంటీ, రుణ విముక్తి చట్టాన్ని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అన్నదాతల పదఘట్టనలతో మార్మోగనుంది. ఈనెల 29, 30 తేదీలలో ఢిల్లీలో రైతుల భారీ కవాతుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా రైతులు ఈ కవాతుకు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వివిధ రైళ్లలో ఇప్పటికే బయలు దేరారు. దేశంలోని 208 రైతు, రైతు కూలీ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఏర్పాటు చేసుకున్న అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు ఈ ర్యాలీ జరుగుతుంది. కరవు, దుర్భిక్షం ఒకపక్క గిట్టుబాటు ధరలు లేక మరోపక్క రైతులు అల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు కూడళ్లు– బిజీ వాసన్, మంజూ కా తిలా, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుంచి రైతులు ఈనెల 29న ఈ కిసాన్ విముక్తి మార్చ్ ప్రారంభించి రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. 30వ తేదీ ఉదయం రైతులు రామలీలా మైదానం నుంచి పార్లమెంటుకు కవాతు ప్రారంభిస్తారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద రైతులను ఉద్దేశించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగిస్తారు.
ప్రధాన డిమాండ్లు రెండు: ఢిల్లీలో గత ఏడాది నవంబర్‌లోనూ రైతులు ప్రత్యామ్నాయ పార్లమెంటు నిర్వహించి రైతు సమస్యలను చర్చించి ఓ ముసాయిదా తయారు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐకేఎస్‌సీసీ రెండు ప్రైవేటు బిల్లులను తయారు చేసింది. వాటిలో ఒకటి.. రైతుల రుణ విముక్తి బిల్లు–2018, రెండోది వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు, కనీస మద్దతు ధరల గ్యారంటీ బిల్లు–18. ఈ బిల్లులను కొందరు సభ్యులు రాజ్యసభలో, లోక్‌సభలోనూ ప్రవేశపెట్టారు. 21 రాజకీయ పార్టీలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా రైతు సమస్యలను చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ రెండు బిల్లులపై చర్చ జరపాలన్నది ఏఐకేఎస్‌సీసీ డిమాండ్. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, శాశ్వత రుణ విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే మహారాష్ట్ర రైతులు ముంబై వరకు లాంగ్‌మార్చ్ నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతు పోరాటాలు జయప్రదం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది..: ఈ మహాకవాతుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి 300 మంది, విజయవాడ నుంచి 400 మంది, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి మరో 400 మంది బయలుదేరి వెళ్లారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీకి వెళుతున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వెళుతున్నట్లు సంఘాల నేతలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే వారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా నుంచి ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. మార్గంమధ్యలో మహారాష్ట్ర రైతులు ఈ ర్యాలీలో కలుస్తారు.
‘రైతాంగంపై నోట్ల రద్దు ప్రభావం’
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం భారత రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్‌దావలే అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్‡్ష(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 70 రైతు సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. మీడియా సమావేశంలో అశోక్ దావలే మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది మంది రైతులతో ఢిల్లీ రాంలీలామైదాన్‌లో ఈనెల 29, 30 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ మాట్లాడుతూ పార్లమెంటులో సీపీఎం ఎంపీలు ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకుఅన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడనున్నాయని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్రయాదవ్ తెలిపారు. జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ రైతులను విస్మరించడం విచారకరమని ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్ అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను విస్మరించడం వల్లే రైతన్న అప్పులఊబిలో కూరుకుపోయారని సామాజిక వేత్త మేథాపాట్కర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment