aiks
-
‘చరిత్రలో నిలిచిపోయేలా రైతుల ఆందోళన’
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధరల గ్యారెంటీ, రుణ విముక్తి చట్టాన్ని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అన్నదాతల పదఘట్టనలతో మార్మోగనుంది. ఈనెల 29, 30 తేదీలలో ఢిల్లీలో రైతుల భారీ కవాతుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా రైతులు ఈ కవాతుకు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వివిధ రైళ్లలో ఇప్పటికే బయలు దేరారు. దేశంలోని 208 రైతు, రైతు కూలీ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఏర్పాటు చేసుకున్న అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు ఈ ర్యాలీ జరుగుతుంది. కరవు, దుర్భిక్షం ఒకపక్క గిట్టుబాటు ధరలు లేక మరోపక్క రైతులు అల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు కూడళ్లు– బిజీ వాసన్, మంజూ కా తిలా, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుంచి రైతులు ఈనెల 29న ఈ కిసాన్ విముక్తి మార్చ్ ప్రారంభించి రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. 30వ తేదీ ఉదయం రైతులు రామలీలా మైదానం నుంచి పార్లమెంటుకు కవాతు ప్రారంభిస్తారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద రైతులను ఉద్దేశించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగిస్తారు. ప్రధాన డిమాండ్లు రెండు: ఢిల్లీలో గత ఏడాది నవంబర్లోనూ రైతులు ప్రత్యామ్నాయ పార్లమెంటు నిర్వహించి రైతు సమస్యలను చర్చించి ఓ ముసాయిదా తయారు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐకేఎస్‌సీసీ రెండు ప్రైవేటు బిల్లులను తయారు చేసింది. వాటిలో ఒకటి.. రైతుల రుణ విముక్తి బిల్లు–2018, రెండోది వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు, కనీస మద్దతు ధరల గ్యారంటీ బిల్లు–18. ఈ బిల్లులను కొందరు సభ్యులు రాజ్యసభలో, లోక్‌సభలోనూ ప్రవేశపెట్టారు. 21 రాజకీయ పార్టీలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా రైతు సమస్యలను చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ రెండు బిల్లులపై చర్చ జరపాలన్నది ఏఐకేఎస్‌సీసీ డిమాండ్. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, శాశ్వత రుణ విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర రైతులు ముంబై వరకు లాంగ్‌మార్చ్ నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతు పోరాటాలు జయప్రదం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది..: ఈ మహాకవాతుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి 300 మంది, విజయవాడ నుంచి 400 మంది, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి మరో 400 మంది బయలుదేరి వెళ్లారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీకి వెళుతున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వెళుతున్నట్లు సంఘాల నేతలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే వారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా నుంచి ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. మార్గంమధ్యలో మహారాష్ట్ర రైతులు ఈ ర్యాలీలో కలుస్తారు. ‘రైతాంగంపై నోట్ల రద్దు ప్రభావం’ సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం భారత రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్దావలే అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్‡్ష(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 70 రైతు సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. మీడియా సమావేశంలో అశోక్ దావలే మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది మంది రైతులతో ఢిల్లీ రాంలీలామైదాన్‌లో ఈనెల 29, 30 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ మాట్లాడుతూ పార్లమెంటులో సీపీఎం ఎంపీలు ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకుఅన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడనున్నాయని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్రయాదవ్ తెలిపారు. జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ రైతులను విస్మరించడం విచారకరమని ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్ అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను విస్మరించడం వల్లే రైతన్న అప్పులఊబిలో కూరుకుపోయారని సామాజిక వేత్త మేథాపాట్కర్ చెప్పారు. -
ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు. ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మ సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిరసనలు ఆదిలాబాద్ రిమ్స్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐకేఎస్ (1936) ఆవిర్భవించినప్పటి నుంచి రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధర, బ్యాంకుల జాతీయకరణపై పోరాటాలు చేస్తోందన్నారు. సెప్టెంబర్ 1ని డిమాండ్ డేగా నిర్వహిస్తున్నామని, 1 నుంచి 8వ వరకు రైతు సమస్యలపై రాష్ట్రం వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు. 1న జిల్లా, మండల అధికారులకు రైతు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని, సంఘం జెండాలు ఆవిష్కరించాలని, 2 నుంచి 8 వరకు ప్రతీ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి కమిటీలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యచరణ రూపొందించాలన్నారు. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు ఇప్పుడు కూడా అమలు చేయడంతో వ్యవసాయం తగ్గిపోతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ రోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే రైతు ఆత్మహత్యలు ఉండవన్న కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఉద్యమాలు చేస్తే కేవలం ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి నెలలోపే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించన్ మంజూరు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, నకిలీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు గడ్డం భూపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు సక్కుబాయి, అరుణ్‌కుమార్ ఉన్నారు. -
ఆత్మహత్యలు మాని పోరుకు రండి
భీమవరం : రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు మాని పోరుబాట పట్టాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రథమ మహాసభలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపి బహిరంగ సభ నిర్వహించారు. సభలో విజు కృష్ణన్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల్లో దేశంలో 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచిరోజులు వస్తాయని నమ్మబలికి అధికారం సాధించిన మోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు వరాల జల్లులు కురిపించిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక రైతులు ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనడం దుర్మార్గమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి.. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న కౌలు రైతులు, రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన పాలకులు ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదన్నారు. కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి రైతులకు ధర ఇవ్వాలని కృష్ణన్ డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీ వల్ల సన్న, చిన్నకారు, పేద, కౌలు రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రూ.7,640 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కోసం కేటాయిస్తే.. రైతులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.18 వేల కోట్లు ఉందని ఆయన చెప్పారు. దీనిని బట్టి రైతులకు రుణమాఫీ ఎంతవరకు ఉపయోగపడిందో అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, సుబ్బారావు మాట్లాడుతూ రాజధాని భూసేకరణ పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వేలాది ఎకరాల భూముల్ని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ఏపీ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య, ఏఐకేఎస్ జాతీయ నాయకులు హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.