సమావేశంలో మాట్లాడుతున్న పద్మ
-
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశ్య పద్మ
-
సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిరసనలు
ఆదిలాబాద్ రిమ్స్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్‌మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐకేఎస్ (1936) ఆవిర్భవించినప్పటి నుంచి రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధర, బ్యాంకుల జాతీయకరణపై పోరాటాలు చేస్తోందన్నారు. సెప్టెంబర్ 1ని డిమాండ్ డేగా నిర్వహిస్తున్నామని, 1 నుంచి 8వ వరకు రైతు సమస్యలపై రాష్ట్రం వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు. 1న జిల్లా, మండల అధికారులకు రైతు సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని, సంఘం జెండాలు ఆవిష్కరించాలని, 2 నుంచి 8 వరకు ప్రతీ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి కమిటీలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యచరణ రూపొందించాలన్నారు. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు ఇప్పుడు కూడా అమలు చేయడంతో వ్యవసాయం తగ్గిపోతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ రోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే రైతు ఆత్మహత్యలు ఉండవన్న కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఉద్యమాలు చేస్తే కేవలం ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి నెలలోపే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించన్ మంజూరు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, నకిలీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు గడ్డం భూపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు సక్కుబాయి, అరుణ్‌కుమార్ ఉన్నారు.