All India Kisan Sabha
-
రైతుల రైల్ రోకో
న్యూఢిల్లీ/హిసార్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గురువారం నాలుగు గంటలపాటు రైల్ రోకో చేపట్టాయి. ఆందోళనలతో రైలు సర్వీసులపై కొద్దిపాటి ప్రభావమే పడిందని రైల్వేశాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లలోనే నిలిపివేసినట్లు వెల్లడించింది. పంజాబ్, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై బైఠాయించడంతో కొన్ని మార్గాల్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ అక్కడక్కడా ఆందోళనలు జరిగాయి. చాలా వరకు రాష్ట్రాల్లో రైల్ రోకో ప్రభావం నామమాత్రంగా కనిపించింది. దేశవ్యాప్త రైల్ రోకోకు భారీగా స్పందన లభించినట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. మోదీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక వంటిదని వ్యాఖ్యానించింది. డిమాండ్లు సాధించేదాకా పోరాటం కొనసాగించేందుకు రైతులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది. అవాంఛనీయ ఘటనలు లేవు ‘రైల్ రోకో సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై రైల్ రోకో ప్రభావం కొన్ని చోట్ల నామమాత్రం, మరికొన్ని చోట్ల అస్సలు లేనేలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత రైళ్లు యథావిధిగా నడిచాయి’ అని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. రైల్ రోకో నేపథ్యంలో ముందుగానే రైల్వే శాఖ 25 రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించింది. ముందు జాగ్రత్తగా ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మోహరించింది. హరియాణాలోని అంబాలా, కురుక్షేత్ర, చర్ఖిదాద్రి రైల్వేస్టేషన్లలో రైతులు పట్టాలపై బైఠాయించారని రైల్వే శాఖ వెల్లడించింది.పంజాబ్‌లో ఢిల్లీ–లూధియానా–అమృత్సర్ మార్గం, జలంధర్–జమ్మూ మార్గాల్లోని పట్టాలపై రైతులు కూర్చున్నారు. రాజస్తాన్‌లో రెవారీ–శ్రీగంగానగర్ స్పెషల్ రైలును మాత్రమే ఆందోళనల కారణంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. మీ పంటలను త్యాగం చేయండి: తికాయత్ చట్టాలను వాపసు తీసుకునే వరకు రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను త్యాగం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ‘పంటకు నిప్పు పెట్టాల్సిన అవసరం వచ్చినా అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. పంటలు కోతకు రానున్నందున రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించరాదు’అని తెలిపారు. ఆందోళనలను ఉధృతం చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చే పిలుపునకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీ ట్రాక్టర్లలో ఇంధనం నిండుగా నింపి, ఢిల్లీ వైపు తిప్పి సిద్ధంగా ఉంచండి. రైతు సంఘాల కమిటీ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చు’అని చెప్పారు. ఈ దఫా ఢిల్లీలో చేపట్టే ట్రాక్టర్ ర్యాలీలకు వ్యవసాయ పనిముట్లు కూడా తీసుకురావాలని రైతులను కోరారు. -
రాజధానిలో రైతు రణం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు. రైతుల కపాలాలతో ర్యాలీకి.. వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు. -
‘చరిత్రలో నిలిచిపోయేలా రైతుల ఆందోళన’
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధరల గ్యారెంటీ, రుణ విముక్తి చట్టాన్ని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అన్నదాతల పదఘట్టనలతో మార్మోగనుంది. ఈనెల 29, 30 తేదీలలో ఢిల్లీలో రైతుల భారీ కవాతుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా రైతులు ఈ కవాతుకు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వివిధ రైళ్లలో ఇప్పటికే బయలు దేరారు. దేశంలోని 208 రైతు, రైతు కూలీ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఏర్పాటు చేసుకున్న అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు ఈ ర్యాలీ జరుగుతుంది. కరవు, దుర్భిక్షం ఒకపక్క గిట్టుబాటు ధరలు లేక మరోపక్క రైతులు అల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు కూడళ్లు– బిజీ వాసన్, మంజూ కా తిలా, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుంచి రైతులు ఈనెల 29న ఈ కిసాన్ విముక్తి మార్చ్ ప్రారంభించి రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. 30వ తేదీ ఉదయం రైతులు రామలీలా మైదానం నుంచి పార్లమెంటుకు కవాతు ప్రారంభిస్తారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద రైతులను ఉద్దేశించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగిస్తారు. ప్రధాన డిమాండ్లు రెండు: ఢిల్లీలో గత ఏడాది నవంబర్లోనూ రైతులు ప్రత్యామ్నాయ పార్లమెంటు నిర్వహించి రైతు సమస్యలను చర్చించి ఓ ముసాయిదా తయారు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐకేఎస్‌సీసీ రెండు ప్రైవేటు బిల్లులను తయారు చేసింది. వాటిలో ఒకటి.. రైతుల రుణ విముక్తి బిల్లు–2018, రెండోది వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు, కనీస మద్దతు ధరల గ్యారంటీ బిల్లు–18. ఈ బిల్లులను కొందరు సభ్యులు రాజ్యసభలో, లోక్‌సభలోనూ ప్రవేశపెట్టారు. 21 రాజకీయ పార్టీలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా రైతు సమస్యలను చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ రెండు బిల్లులపై చర్చ జరపాలన్నది ఏఐకేఎస్‌సీసీ డిమాండ్. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, శాశ్వత రుణ విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర రైతులు ముంబై వరకు లాంగ్‌మార్చ్ నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతు పోరాటాలు జయప్రదం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది..: ఈ మహాకవాతుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి 300 మంది, విజయవాడ నుంచి 400 మంది, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి మరో 400 మంది బయలుదేరి వెళ్లారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీకి వెళుతున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది వెళుతున్నట్లు సంఘాల నేతలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే వారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా నుంచి ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకుంటారు. మార్గంమధ్యలో మహారాష్ట్ర రైతులు ఈ ర్యాలీలో కలుస్తారు. ‘రైతాంగంపై నోట్ల రద్దు ప్రభావం’ సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం భారత రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్దావలే అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్‡్ష(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 70 రైతు సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. మీడియా సమావేశంలో అశోక్ దావలే మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది మంది రైతులతో ఢిల్లీ రాంలీలామైదాన్‌లో ఈనెల 29, 30 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ మాట్లాడుతూ పార్లమెంటులో సీపీఎం ఎంపీలు ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకుఅన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడనున్నాయని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్రయాదవ్ తెలిపారు. జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ రైతులను విస్మరించడం విచారకరమని ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్ అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను విస్మరించడం వల్లే రైతన్న అప్పులఊబిలో కూరుకుపోయారని సామాజిక వేత్త మేథాపాట్కర్ చెప్పారు. -
రైతుల నిరసనలు తీవ్రతరం
సాక్షి, పూణే : డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన రైతుల ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. జూన్ 1 నుంచి 10 వరకూ సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల ఏడు నుంచి ఆందోళనను ఉధృతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నిర్ణయించడంతో మహారాష్ట్రలో ముంబయి సహా ప్రధాన నగరాల్లో పండ్లు, కూరగాయలు, పాల సరఫరాల్లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల సరఫరాలకు అవాంతరాలు ఎదురవడంతో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల ధరలు ప్రధాన నగరాల్లో భగ్గుమంటున్నాయి. రైతు నిరసనలు తీవ్రరూపు దాల్చితే ఇబ్బందికరమేనని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్త ఆందోళనను తీవ్రతరం చేస్తామని జూన్ 10 వరకూ ధర్నాలు, రాస్తారోకోలు, ఘోరావ్‌లు, భారీ ప్రదర్శనలతో హోరెత్తిస్తామని ఏఐకేఎస్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలే తెలిపారు. ఆందోళనలో భాగంగా నిత్యావసరాల విక్రయాలను తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు. -
వ్యవసాయాన్ని నీరుగారుస్తున్నారు
– అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశంలో వ్యవసాయాన్ని పాలకులు నీరుగార్చుతున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బు«ధవారం అఖిల భారత కిసాన్ సభ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో రైతుల్ని చైతన్య పరిచేందుకు రైతు పోరాటయాత్ర ప్రారంభించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతాంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే మన దేశంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతాంగం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. తమిళనాడులోని విదురా నుంచి ప్రారంభమైన యాత్ర ఢిల్లీ వరకు సాగుతుందన్నారు. ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అ«ధికారంలోకి వచ్చాక గతంకంటే 26 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులకు అందించాల్సిన ఎక్స్‌గ్రేషియా సైతం అందించడం లేదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా ప్రతి ఏడాది 400 మండలాల్లో సాగునీటి సౌకర్యం లేక కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ ప్రాజెకు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్భాటంగా ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తనాలను మనమే తయారు చేసుకునే శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా వాటిని తయారు చేసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది కరువు మండలాల ప్రకటనతోనే సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం కరువు సహయక చర్యలు చేపట్టడం లో విఫలమైందన్నారు. వేరుశెనగ పంటకు రూ.20 వేల నష్టపరిహరాన్ని అందించాలన్నారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎలాంటి సహాయ, సహకారాలను అందించలేదన్నారు. అనంతరం రైతులతో అర్జీలను స్వీకరించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్దన్న నగేశ్, కదిరప్ప, రామాంజినేయులు తదితరులు పాల్గోన్నారు. -
‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’
చిలమత్తూరు : రుణమాఫీ తదితర ప్రలోభాలతో రైతులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు విజుకృష్ణన్, మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్టులో అఖిల భారత కిసాన్ సభ జాతా చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇస్తూ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్, వినోద్, లక్ష్మీనారాయణ, వినోద్, వెంకట్రామిరెడ్డి, రామచంద్ర, నరసింహులు, నారాయణస్వామి, రాజప్ప, వెంకటేష్ తదితరులు పొల్గాన్నారు. -
20 ఏళ్లలో 3 లక్షల మంది రైతుల ఆత్మహత్య
♦ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవేదన ♦ వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది ♦ వ్యవసాయాభివృద్ధికి ‘గ్రో ఇన్ ఇండియా’ కోసం పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశంలో 1995 నుంచి ఇప్పటివరకు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు ఆత్మహత్యలే అందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ మహాసభల్లో భాగంగా ‘వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయార్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో ప్రభుత్వరంగ పెట్టుబడులు, రాయితీలు’ అనే అంశంపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల వ్యవసాయ రంగం మెరుగుకు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో కులపరమైన రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆహారధాన్యాల ఉత్పత్తుల్లో చిన్నసన్నకారు రైతుల పాత్ర అధికమని, అయితే వారు ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. దేశంలో 64 శాతం మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల వైపు వెళ్తుండగా, మిగిలిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2014-15లో వ్యవసాయాదాయం 1.1 శాతమే పెరిగిందన్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, నీటిపారుదల కోసం వ్యవసాయరంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరముందని, నీటిపారుదల రంగానికే రూ. 3 లక్షల కోట్లు కేటాయించాల్సిన అవసరముందని చెప్పారు. కానీ జలవనరుల శాఖ మాత్రం 2015-16లో రూ. 4,232 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. సాగుకు ముందే గిట్టుబాటు ధర వ్యవసాయ ధరల విధానం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్సారీ అన్నారు. సాగుకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించాలని సూచించారు. నీటిపారుదల, విద్యుత్, ఎరువుల ధరలపైనా హేతుబద్ధ విధానం ఉండాలని, ఆ ప్రకారమే ఇన్‌ఫుట్స్ అందించాలన్నారు. భూముల లీజు వ్యవహారంలో చిన్న సన్నకారు రైతులకు అనుకూలంగా సరళీకరణ పద్ధతులు పాటించాలన్నారు. పేదల కోసం వ్యవసాయ, ఆహార సబ్సిడీలను హేతుబద్ధీకరించాలని, అందుకోసం నేరుగా నగదు బదిలీ పథకమే ఆచరణీయమైన పద్ధతిగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పెద్దఎత్తున సబ్సిడీలు కొనసాగిస్తున్నాయన్నారు. ఆ దేశాలు 2013లో వ్యవసాయ సబ్సిడీల కోసం 258 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంట రుణాలు ఎక్కువగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. అందుకోసం గ్రామీణ బ్యాంకు బ్రాంచీలను బలోపేతం చేయాలని చెప్పారు. దేశంలో 80 కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తుండగా, అందులో పావు వంతు మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్నారు. మేకిన్ ఇండియా తరహాలో సామాజిక ఆర్థిక నిర్మాణానికి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ‘గ్రో ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకురావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. అందుకోసం రాజకీయ తపన, విస్తృత రాజ కీయ ఏకాభిప్రాయం అవసరమన్నారు. సామాజిక అంతరాలు, విభజనలున్నంత కాలం ఎన్ని నిధులు కేటాయించినా ప్రయోజనం ఉండదన్నారు. కులం, ఇతరత్రా అడ్డంకులను ఎదుర్కోవాలన్నారు. సదస్సులో జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్, అధ్యక్షులు ప్రమోద్ పాండా, దేవేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం సాక్షి, హైదరాబాద్: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 2 రోజుల పర్యటనలో భాగంగా శని వారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చందూలాల్, లక్ష్మారెడ్డి, ఎంపీలు కేశవరావు, వి.హనుమంత రావు, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేం దర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి నగరానికి వచ్చిన సందర్భంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి సీఎం కేసీఆర్ రాత్రి విందు ఇచ్చారు.